Thursday, December 28, 2023

కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూత: తెలుపుపై నలుపు విజయం - Captain Vijaykanth no more: Dark Victory over white

 కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూత: తెలుపుపై నలుపు విజయం


తమిళ సినీ నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijaykanth) ఈ రోజు కన్నుమూశారు (Vijayakanth dead). అనారోగ్య సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఆయన చెన్నైలోని మియాట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కెప్టెన్‌ విజయకాంత్‌గా ప్రసిద్ధి పొందారు. ఆయన నటించిన వందో చిత్రం కెప్టెన్‌ ప్రభాకర్‌ (Captain Prbhakar) ఘన విజయం సాధించింది. దీంతో ఆప్పటి నుంచి అభిమానులు ఆయనను కెప్టెన్‌ విజయకాంత్‌గా పిలువడం ప్రారంభమైంది. తన 27 ఏళ్ల వయస్సులో సినీరంగంలోకి ప్రవేశించిన ఆయన మాస్‌ హీరోగా ఎదిగారు. 

Photo Courtesy: Thentamil

సినీ పరిశ్రమలో ఆయన విజయాన్ని తెలుపుపై నలుపు విజయంగా చెప్పవచ్చు. నలుపు రంగులో ఉండే విజయకాంత్‌ హీరోగా విశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. విజయకాంత్‌ను పవిత్ర హృదయుడైన నల్ల వజ్రంగా డికె ప్రెసిడెంట్‌ వీరమణి ప్రశంసించారు. ఆయనను గొప్ప మానవతావాదిగా కూడా అభివర్ణించారు. విజయకాంత్‌ 1979లో సినీరంగ ప్రవేశం చేశారు. 2015 వరకు అవిశ్రాంతంగా నటించారు. ఆయన మూడు షిప్టుల్లో పనిచేసేవారని చెబుతారు. విజయకాంత్‌ 150కి పైగా చిత్రాల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. దాదాపు 20 చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారు. 

విజయకాంత్‌ 1952 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగరుస్వామి. ఆయనకు భార్య ప్రేమలత (Premalatha), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లోకి డబ్‌ అయి విజయం సాధించాయి. శివప్పు మల్లి, జగిక్కొరు నీధి వంటి చిత్రాల్లో నటించారు. ఇందులో శివప్పు మల్లి ఎర్రమల్లెలు సినిమాకు రీమేక్‌. దాంతో ఆయనను పురట్చి కలైంగర్‌ అని అనడం కూడా ఉంది. పురట్చి కలైంగర్‌ అంటూ విప్లవ కళాకారుడు అని అర్థం. 

తమిళనాడు రాజకీయాల్లో కూడా విజయకాంత్‌ తన ముద్రను వేశారు. 2005లో డిఎండికె (DMDK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2006లోనూ 2011లోనూ ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 2016లో ఓటమి పాలయ్యారు. తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు. డిఎండికె స్థాపన ద్వారా ఆయన జయలలిత (Jayalalithaa), కరుణానిధి (Karuna Nidhi) వంటి రాజకీయ దిగ్గజాలకు సవాల్‌ విసిరారు. 2006లో ఆయన పార్టీ శాసనసభ ఎన్నికల్లో 8.38 శాతం ఓట్లను సాధించింది.

జయలలితకు విజయకాంత్‌తో సరైన సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆమె నాయకత్వంలోని అన్నాడియంకె డిఎండికె పార్టీతో 2011 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. శశికళ, తుగ్లక్‌ పత్రిక ఎడిటర్‌ చో రామస్వామి జయలలితను పొత్తుకు ఒప్పించారని అంటారు. ఆ ఎన్నికల్లో విజయకాంత్‌ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారింది. విజయకాంత్‌ నాయకత్వంలోని డిఎండికె పొత్తులో భాగంగా 41 సీట్లకు పోటీ చేయగా 29 స్థానాలు గెలిచింది. అన్నాడియంకె కూటమి విజయం సాధించింది. తద్వారా జయలలిత డిఎంకెను ఓడిరచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జయలలితకు, విజయకాంత్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్లాయి. విజయకాంత్‌ అన్నాడియంకెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీతో పొత్తు లేకుంటే అన్నాడియంకె అధికారంలోకి వచ్చి ఉండేది కాదని కూడా ఆయన అన్నారు. విజయకాంత్‌పై అన్నాడియంకె దాదాపు 40 పరువు నష్టం కేసులు వేసింది. వాటిని చివరకు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

విజయకాంత్‌ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. నిజానికి విజయకాంత్‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంతకు ముందు కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.

- కాసుల ప్రతాపరెడ్డి


Wednesday, December 27, 2023

హాట్‌ టాపిక్‌: రాహుల్‌ ముఖ్యమంత్రిని ప్రశ్నించాడు, ఎవరీయన?- Hindu Rahul questions Telangana CM Revanth Reddy

 హాట్‌ టాపిక్‌: రాహుల్‌ ముఖ్యమంత్రిని ప్రశ్నించాడు, ఎవరీయన?


తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మీడియా సమావేశం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. రేవంత్‌ రెడ్డి ఈ రోజు డిసెంబర్‌ 27వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివిధ విషయాలపై మాట్లాడారు. తన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై ఆయన వివరించారు. చివరగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వడం కూడా కొత్త విషయంగానే చర్చకు వచ్చింది. అంతేకాకుండా రాహుల్‌ (Hindu Rahul) ముఖ్యమంత్రికి ప్రశ్న వేశాడనేది వైరల్‌గా మారింది. దీనికి కారణమేమిటని ప్రశ్నించుకుంటే కాస్తా వెనక్కి వెళ్లాలి. ఈ రోజు రాహుల్‌ ప్రశ్న వేయడానికి లేవగానే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాహుల్‌ అని సంబోధించారు. వెంటనే మీడియా సమావేశంలో పెద్ద పెట్టున ధ్వనులు పుట్టాయి. రాహుల్‌ చెప్పిన విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని రేవంత్‌ రెడ్డి చెప్పారు.



బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. వారిని హేళన కూడా చేశాడు. ఈ విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌ అనే జర్నలిస్టు హిందూ దినపత్రికలో పనిచేస్తున్నాడు. ఆయన జర్నలిజంలో సీనియర్‌ కూడా. అటువంటి జర్నలిస్టును కేసీఆర్‌ గతంలో హేళన చేశాడు. 

రాహుల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి (Kiran Kumar Reddy) క్లాస్‌మేట్‌ అని చెబుతారు. దాంతో ఆయన కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఓసారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మురికివాడలో పర్యటిస్తున్నప్పుడు అధికారులు రాహుల్‌ను ఆపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాన్ని గమనించి కిరణ్‌ కుమార్‌ రాహుల్‌ను ఆపవద్దని, ఆయన తనకు చాలా ముఖ్యమైనవాడని చెప్పినట్లు సమాచారం.

అదే సమయంలో కేసీఆర్‌ (KCR) ఓసారి హిందూ కార్యాలయం వద్ద కారు ఆపి, రాహుల్‌ను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడానికి ప్రయత్నించారని, అయితే తనకు పని ఉందని చెబుతూ రాహుల్‌ కేసీఆర్‌ కారులో ఎక్కడానికి నిరాకరించాడని కూడా చెబుతారు. ఇది ఎంత వరకు నిజమనేది నిర్ధారణ కాలేదు. 

అయితే, మీడియా సమావేశంలో రాహుల్‌ ప్రశ్నలు వేసినప్పుడల్లా కేసీఆర్‌ ఏదో పుల్లవిరుపు మాట అనేవారు. రాహుల్‌ గమ్మతైతున్నడు ఈ మధ్య అని కేసీఆర్‌ గతంలో వ్యాఖ్యానించారు. రాహుల్‌ ఎక్‌స్ట్రాలెందుకయ్యా అని ఎత్తిపొడిచారు. రాహుల్‌, ఇది బాధ్యతారహితమైంది, నీ ప్రవర్తన మార్చుకోవాలి అని కూడా అన్నారు. ఇంకా మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరో సందర్భంలో రాహుల్‌ను ఉద్దేశించి మరో వ్యాఖ్య చేశారు. లుంగీ కట్టుకుని ఉత్తరప్రదేశ్‌ నుంచి ఓ ముఖ్యమంత్రి వస్తాడు, ఆయన ఉపన్యాసం ఇస్తారు అని కేసీఆర్‌ అంటూ ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ తలసరి ఆదాయం గురించి చెప్పి, మన రాష్ట్రం పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌లో ఉత్తరప్రదేశ్‌ పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌ 4 శాతం ఎక్కువగా ఉందని అంటూ బాగా లేదా రాహుల్‌ అంటూ లిమిట్‌ ఉండాలి, రాహుల్‌ అని అన్నారు. చైనావాడు మన భూభాగం గుంజుకుంటున్నాడని చెప్తే తాను దేశద్రోహి అవుతానా అని కేసీఆర్‌ అంటూ రాహుల్‌, ఈ వార్త నువ్వు ఇంగ్లీషులో బాగా రాయాలని మరో సందర్భంలో కేసీఆర్‌ అన్నారు.

రాహుల్‌ అని రేవంత్‌ రెడ్డి సంబోధించగానే మీడియా ప్రతినిధులు కూడా రాహుల్‌ వైపు తిరిగి నవ్వారు. రాహుల్‌ చెప్పిన విషయం తమ దృష్టిలో ఉందని, అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో (Lok sbha Elections 2024) కాంగ్రెస్‌ వ్యూహంపై ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు రేవంత్‌ రెడ్డి సమాధానమిస్తూ ` రాజకీయాలు గాంధీభవన్‌లో మాట్లాడుతామని చెప్పారు. గాంధీభవన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం. రేవంత్‌ రెడ్డి తన మీడియా సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏమిటో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని అనుకున్నారా అని ఆయన అన్నారు. సచివాలయంలో మీడియా సెంటర్‌ ఉంటుందని ఆయన చెబుతూ మంత్రులూ అధికారులూ అందుబాటులో ఉంటారని చెప్పారు. సచివాలయంలోని మీడియా సెంటర్‌ కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో మూతపడిరది. జర్నలిస్టులను కూడా సచివాలయంలోకి అనుమతించేవారు కాదు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలోని అవినీతిని బయటపెట్టి తిన్నదంతా కక్కిస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు. వారు రక్తం కూడు తిన్నారని వ్యాఖ్యానించారు. మొత్తం మీద హిందూ రాహుల్‌ సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌ అయ్యారు.

- కాసుల ప్రతాపరెడ్డి 




గుమ్మడి నర్సయ్యకే ధరణి టోకరా: కేసీఆర్‌ పారదర్శకత ఇదీ...- Gummadi Narsaiah problems with Dharani in Telangana

గుమ్మడి నర్సయ్యకే ధరణి టోకరా: కేసీఆర్‌ పారదర్శకత ఇదీ...


ధరణి (Dharani)ని అత్యంత విశిష్టమైన విషయంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర్‌ రావు K Chandrasekhar Rao) చెబుకున్నారు. అవతకవతలను నివారించడానికి అత్యంత పారదర్శకమైందని ఆయన ధరణిని ప్రశంసించారు. ధరణిని తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయాలని ఆయన ఎన్నికలకు ముందు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు కేసీఆర్‌ (KCR) పిలుపునకు వ్యతిరేకంగా ఓటేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిరచారు. తాజాగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య (Gummadi Narsaiah) కూడా ధరణి బాధితుడేనని తెలిసింది. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వచ్చాక ఆయన ఆ విషయాన్ని వెల్లడిరచారు. కేసీఆర్‌ మాటల్లోని డొల్లతనం ఎంతో గుమ్మడి నర్సయ్య ఉదంతం ద్వారా అర్థం చేసుకోవచ్చు.



గుమ్మడి నర్సయ్య జీవనశైలి దృష్ట్యా అత్యంత సామాన్యుడు. కానీ ఐదుసార్లు ఎమ్యెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన బస్సులోనే ప్రయాణించేవారు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. అలాంటి నాయకుడిని కూడా ధరణి ముప్పు తిప్పలు పెట్టింది. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. ధరణి పుణ్యమా అని అది కాస్తా మాయమైంది. ధరణిలో తన రెండెకరాల భూమి కనిపించకపోవడంపై రెండేళ్లుగా తాను అధికారుల చుట్టూ తిరుతున్నానని, ఎక్కడికి వెళ్లినా పరిష్కారం దొరకలేదని ఆయన ఇటీవల వెలుగుతో చెప్పారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భూమి సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి చెప్పుకోవడానికి ఆయన సచివాలయానికి వచ్చారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత బహుశా ఆయనకు ఓ ఆశ కలిగి ఉంటుంది. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ధరణి అక్రమాలపై, ధరణి తప్పులపై మాట్లాడితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎదురు తిరుగుతూ వచ్చారు. అత్యంత పారదర్శకమైందని బుకాయిస్తూ వచ్చారు. మాజీ ఎమ్యెల్యే భూమికే గతి లేదంటే సామాన్యుల పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందరి భూములు ధరణిలో మాయమయ్యాయని తెలియదు.

దానికితోడు, ప్రభుత్వ భూముల కబ్జా కూడా జరిగి ఉంటుంది. ఇటీవల ధరణిపై ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. దరణి తప్పుల తడక అని, గత ప్రభుత్వ హయాంలో భూముల గోల్‌మాల్‌ జరిగిందని ఆయన అంటూ దానిపై సీరియస్‌ అయ్యారు. ధరణి స్థానంలో భూమాత (Bhu Matha) తీసుకుని వస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. కేసీఆర్‌ చెప్పినట్లు ధరణి వల్ల ఎవరి భూములు వారికి ఉంటాయని, వారి భూములు సురక్షితంగా ఉంటాయని అవకతవకలు జరగడానికి వీలు లేదని అన్నారు. ఎందుకు ఇన్ని రెవెన్యూ సమస్యలు ముందుకు వస్తున్నాయనేది ప్రశ్న. ప్రభుత్వ భూములు కబ్జా అయి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్ల మీద ధరణిలో చేరాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల చెప్పారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్దలు క్రమబద్దీకరించుకున్న విషయం కూడా రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చకు వచ్చింది.

ఇప్పుటికప్పుడు ధరణిలోని అవకతవకలను సరిచేస్తామని, ఆ తర్వాత భూమాత పోర్టల్‌ను తీసుకుని వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, క్రమబద్దీకరించుకున్నారని, అందుకు ధరణి పోర్టల్‌ను దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లూటీ చేసిన భూములను స్వాదీనం చేసుకుంటామని, అసలైన యజమానులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. 

ధరణి విషయంలో కేసీఆర్‌ గానీ, ఆయన మనుషులు గానీ చెప్పిందంతా అబద్దమని గుమ్మడి నర్సయ్య ఉదంతం ద్వారా తెలిసిపోతున్నది. ప్రభుత్వ పెద్దలు ధరణిని తమకు అనుకూలంగా వాడుకుని ఉండవచ్చు. తెలంగాణలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో సంపాదనకు అవి సులవైన సరుకులుగా వారాయి. దీంతో అందరూ వాటిపైనే కన్నేశారు. భూమాత ద్వారానైనా ఎవరి భూములు వారికి దక్కుతాయని, ప్రభుత్వ భూములు తిరిగి వస్తాయని ఆశిద్దాం.

- కాసుల ప్రతాపరెడ్డి

Tuesday, December 26, 2023

అసలు రంగు బయటపెట్టిన కల్వకుంట్ల కవిత - Kalvakuntla Kavitha speaks on Sanathana Dharma, why?

 అసలు రంగు బయటపెట్టిన కల్వకుంట్ల కవిత


తమ తండ్రి కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) పరాజయం పాలైన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), ఎమ్యెల్యే కేటీఆర్‌ (KTR) తమ అసలు రంగును బయటపెట్టారు. కవిత హిందూ మతాన్ని (Hinduism) కౌగలించుకున్నారు. దానికన్నా ముందే కేటీఆర్‌కు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇటాలియన్‌ అనే విషయం గుర్తుకు వచ్చింది. కాంగ్రెస్‌ (Congress) డిఎన్‌ఎలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని, సనాతన ధర్మాన్ని అవమానిస్తే రాహుల్‌ గాంధీ (Rahul Gndhi) స్పందించలేదని, డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత మాటలు నిజానికి చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఆ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ చూసే మనకు ఆ విషయం అర్థమవుతుంది. 



అకస్మాత్తుగా సనాతన ధర్మం, హిందూ మతం కవితకు వస్తువు కావడం ఆశ్చర్యమే. సనాతన ధర్మం Sanathana Dharma), హిందూ మతం మనుస్మృతి (Manusmriti)ని ఆధారం చేసుకుంటాయి. మహిళలను, శూద్రులను, దళితులను ఎలాంటి చట్రంలో బిగించదలుచుకుంటాయో మనకు చాలా మందికే తెలుసు. కవిత ఆ చట్రంలో ఉండిపోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించాల్సిన పనేం లేదు గానీ ఆ చట్రంలో ఉంటే ఆమెకు ప్రజా జీవితం ఉండేది కాదు. ఈ విషయం కవితకు తెలియదని అనలేం. 

కానీ, ఇప్పుడే ఆమె ఆ మాటలు ఎందుకున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. కొద్ది నెలల్లో లోకసభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బిజెపి (BJP)తో బహిరంగ స్నేహం చేయడానికి సిద్ధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ను ఢీకొంటుందా, సమరం కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య జరిగి బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోతుందా అనే చర్చ సాగుతున్నది. శాసనసభ ఎన్నికల్లో బిజెపి అనూహ్యమైన ఫలితాలనే సాధించింది. దాదాపు 19 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. దాని ఓట్ల శాతం కూడా పెరిగింది. పైగా, లోకసభ ఎన్నికలు జాతీయ స్థాయి అంశాలపై ఆధారపడి జరుగుతాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు అంతగా వీలుండదు. బీఆర్‌ఎస్‌ శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది కావచ్చు. కానీ ఓటమి వల్ల లోకసభ ఎన్నికల్లో అది సత్తా చాటే పరిస్థితి ఉండకపోవచ్చు. 

బిజెపి వ్యూహం కూడా మారవచ్చు. బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారడానికి అవసరమైన వ్యూహాన్ని అనుసరించవచ్చు. అప్పుడు బీఆర్‌ఎస్‌ తీవ్రంగా నష్టపోతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, శాసనసభ ఎన్నికల్లో బిజెపి, బీఆర్‌ఎస్‌ రహస్య అవగాహనతో పనిచేశాయనే ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే నమ్మారు. బిజెపితో అవగాహన కారణంగానే హైదరాబాద్‌, హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఫలితాలు గ్రామీణ నియోజకవర్గాల ఫలితాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు.

సరే అదంతా ఒక్క వాదన. మరో విషయం ఏమిటంటే కవిత చాలా సులువుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోయినట్టున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధానాంశాలపై ఉద్యమం నడిచింది. నీళ్ల సంగతి మేడిగడ్డ (Medigadda) పరిస్థితి పట్టిస్తూనే ఉంది. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారింది. నియామకాల సంగతి టిఎస్‌పిఎస్‌సీ పరీక్షల (TSPSC Exams) తంతు తెలియజేస్తూనే ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆకాంక్షలకు భిన్నంగా నడిచిందని అర్థమవుతున్నది. కవిత ఈ విషయాలను  ఇక పట్టించుకోరనేది అర్థమవుతున్నది. హిందూ మతాన్ని ఎజెండాగా మార్చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే సంకల్పంతో ఉన్నట్లు అర్థమవుతున్నది.

ఇక అత్యంత ప్రధానమైన విషయం. హైదరాబాద్‌ ఫలితాలు కేసీఆర్‌ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేసిందనే విషయాన్ని పట్టిస్తున్నాయి. సీమాంధ్ర పెత్తందార్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నడిచింది. హైదరాబాద్‌ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా కేసీఆర్‌ ప్రభుత్వం నడిచిందనే విషయం అర్థమవుతుంది. వివిధ కాంట్రాక్టులు ఎవరికి వెళ్లాయనే విషయాన్ని లోతుగా పరిశీలించినా ఆ విషయం బయపడవచ్చు. 

ఓటమికి కారణాలను కనిపెట్టడానికి సరైన దిశలో ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, తమకు ఎప్పుడు ఏది అవసరమనిపిస్తే అది మాట్లాడడం బీఆర్‌ఎస్‌ నేతలకు అలవాటుగా మారింది. అలవాటు, ఆధిపత్య ధోరణి, అణచివేత, నిరంకుశత్వం బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఓడిరచాయి. అది గ్రహిస్తే ఇప్పటికైనా మంచిది.

నోట్‌: ఢల్లీి లిక్కర్‌ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడానికి బిజెపితో కేసీఆర్‌ అవగాహనకు రావడమే కారణమనే ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆయన మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి

కొద్దిగా పర్సనల్‌: కులవిద్వేషంతో కంపు కొట్టిన దేశపతి, అల్లం నారాయణ - Deshapthi, Allam Narayan caste politics in Telangana

 కొద్దిగా పర్సనల్‌: కులవిద్వేషంతో కంపు కొట్టిన దేశపతి, అల్లం నారాయణ


కొంచెం పర్సనల్‌గానే రాద్దామని అనిపించింది. తెలంగాణ బుద్ధిజీవులుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అల్లం నారాయణ (Allam Narayana), దేశపతి శ్రీనివాస్‌ (Deshapthi Srinivas), వి. ప్రకాశ్‌ (V Prakash) మాటలను మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు అలా అనిపించింది. తెలుగు సమాజంలో దళిత, బహుజన, మైనారిటీ వాదాలు ముందుకు వచ్చినప్పుడు వాటిని బలపరిచినవారు ఎవరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ వంతు పాత్ర వహించినవాళ్లలో రెడ్డి సామాజిక వర్గం (Reddy caste) లేదా అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణాధిక్యత మీద భావజాల రంగంలో పనిచేసినవారెవరు? దళిత సాహిత్యం (Dalith Literature) మీద రాసి పేరు తెచ్చుకుంటున్నావని ఓ మహా రచయిత నన్ను ఎత్తిపొడిచాడు. ఆయనకు హామీ ఇచ్చి అప్పటి నుంచి దళిత సాహిత్యం గురించి రాయడం మానేశాను. ఎందుకంటే దళితుల గురించి దళితులే రాసుకోవాలనే అర్థం ఆ రచయిత మాటల ద్వారా అర్థమైంది. ఇక నా కథల పుస్తకానికి ఎల్లమ్మ, ఇతర కథలు (Yellamma & other stories) అనే పేరు పెట్టాను. ఎల్లమ్మ పేరు పెట్టుకోవడానికి వీడెవడు అని కూడా ఆ మహా రచయిత అన్నాడు. రెడ్లు సమాజంలో శూద్రులు. వారికి కూడా గ్రామ దేవతలున్నారు. ఎల్లమ్మ, మైసమ్మలాంటి గ్రామదేవతలనే వాళ్లు కొలిచారు. ఆ మహా రచయిత మాటలకు నేనేమీ సమాధానం ఇవ్వలేదు. కానీ సమాజం అన్నీ చూస్తుంటుంది, ఎవరేమిటో కూడా నిర్ధారణకు వస్తుంది. 



కేవలం రెడ్డి సామాజికవర్గం వ్యతిరేకత మీద ఇంత కాలం కేసీఆర్‌ ప్రభుత్వం నడిచిందని అనుకోవాలా? అలా నడవడంలో తప్పేమీ లేదు. కానీ, అధిక సంఖ్యాకులైన నిమ్న కులాలవారికి (నిమ్న అని పదం వాడడం సరైంది కాదు. కానీ మరో పదం దొరకలేదు) కేసీఆర్‌ (KCR) ప్రభుత్వాన్ని ఇవాళ తిప్పికొట్టిందెవరు? రెడ్డి సామాజికవర్గం మీద వ్యతిరేకతతోనే కావచ్చు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratap Reddy) పేరు పెడుతానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ దాన్ని దాటవేస్తూ వచ్చారు.

అనుకోకుండా నందిని సిధారెడ్డి (nandini Sidha Reddy), సుంకిరెడ్డి నారాయణరెడ్డి (Sunkireddy Narayana Reddy)లతో కలిసి నేను కేసీఆర్‌ కలవాల్సి వచ్చింది. ఆ సమయంలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతామని ఇచ్చిన హామీని నేను గుర్తు చేశాను. చెప్పిన కదా, పెడుతామని కేసీఆర్‌ అన్నారు. తొలిసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటన అది. రెండోసారి కూడా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దాని ఊసు ఎత్తలేదు. తెలుగు విశ్వవిద్యాలయం కోస్తాంధ్రకు చెందిన మహానుభావుడి పేరును కొనసాగించడానికే ఇష్టపడ్డారు తప్ప రెడ్డి కావడం వల్ల సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి ఇష్టపడలేదని అనుకోవాల్సి ఉంటుంది.

దాన్ని కాసేపు పక్కన పెడితే, వి. ప్రకాశ్‌, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్‌ ఓ టీవీ చర్చ చాలా పాతది. అయితే, చర్చలో రెడ్లపై కక్కిన విద్వేషపూరితమైన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతున్నది. కంపు అనే పదానికి సువాసన అనే అర్థం ఉండేది. ఆ పదం అర్థన్యూనతకు గురై దుర్వాసన అనే అర్థంలో స్థిరపడిపోయింది. అ ముగ్గురు బుద్ధిజీవులు కూడా గౌరవాన్ని, సంస్కారాన్ని కోల్పోయారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, అగ్రకుల రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ, ముఖ్యంగా వారి మాటల్లో విద్వేషం కొట్టిచ్చినట్లు కనిపించడం అత్యంత దారుణమైంది. 

కోదండరామ్‌ (Kodandaram)ను వ్యతిరేకిస్తూ వారి మాటలన్నీ సాగాయి. కోదండరామ్‌ను వారు వ్యతిరేకించవచ్చు. కానీ, అంతగా విద్వేషాన్ని వెళ్లగక్కాలా అనేది ప్రశ్న. వెలమల ఆధిక్యతను నిలబెట్టడానికి అంతగా తాపత్రయపడాలా అనేది కూడా ప్రశ్న. సమాజం మొదట్లో కేసీఆర్‌ నాయకత్వాన్ని కులంతో బేరీజు వేయలేదు. పాలన సాగుతూ వస్తున్న క్రమంలో ఆయన కుల ప్రాధాన్యంపై చర్చ జరుగుతూ వచ్చింది. అయితే, 2.5 శాతం రెడ్లు అధికారంలో ఉండాలా, 1.5 శాతం వెలమలు ఉండకూడదా అనే ప్రశ్నను వారు లేవనెత్తారు. కానీ ఉండకూడదని ఎవరూ అనలేదు. దాన్ని వారే ఆపాదించారు. తెలంగాణ సమాజంలో చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో వారు ఆ ప్రశ్న లేవనెత్తి ఉండవచ్చు. అలాంటి ప్రశ్న వేసే హక్కు కూడా వారికి ఉంది. దాన్ని కాదనలేం. కానీ, దేశపతి శ్రీనివాస్‌, అల్లం నారాయణ మాటల్లో వ్యక్తమైన వ్యంగ్యం విద్వేష స్థాయికి వెళ్లింది. 

దేశపతి శ్రీనివాస్‌ ఏదో అంటే, అల్లం నారాయణ 2.5 అనే మాటను పలికిన తీరు చూస్తే విద్వేషం ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజ్యం రావాలి, రేవంత్‌ రెడ్డి రాజ్యం రావాలి, జానారెడ్డి రాజ్యం రావాలి. నాగం జనార్దన్‌ రెడ్డి రాజ్యం రావాలి. జైపాల్‌ రెడ్డి రాజ్యం రావాలి, కోదండరామ్‌ రెడ్డి రాజ్యం రావాలి అని దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడిన తీరు సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయిలో ఇంది. రెడ్డి అనే పదాన్ని ఆయన సహజ సామాజికవర్గం వ్యంగ్యంతో ఒత్తి పలికిన తీరును గమనించాల్సే ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గాన్ని అధికారంలోకి రాకుండా నిలువరించే హక్కు కూడా ఉంది. కానీ, ఆ చర్చను సంస్కారవంతంగా సాగించాల్సి ఉండిరది. మళ్లీ ఒక్కసారి పర్సనల్‌ విషయమే మాట్లాడుతాను. దళిత వాదాన్ని బలపరిచే సమయంలో నేను కూడా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి విమర్శ చేసినవాడినే. కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం గురించి కూడా మాట్లాడాను. కమ్మ సామాజికవర్గం గురించి అంత విద్వేషపూరితంగా మాట్లాడలేదు. మిగతా రెడ్డి బుద్దిజీవులు కూడా అలా మాట్లాడలేదు.

మరో ప్రధానమైన విషయం చెప్పుకోవాలి. చరిత్ర కొన్నాళ్లు మరుగున పడిపోతుందేమో గానీ తిరిగి ముందుకు వస్తుంది. ముగ్గురు వి. ప్రకాశ్‌, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్‌ విప్లవ భావజాలం నుంచి వచ్చినవాళ్లు, విప్లవోద్యమాల నేపథ్యం వారికి ఉంది. తెలంగాణ సాయుధపోరాటం (Telangana Armed Struggle)లో కేవలం రెడ్డి దొరలు మాత్రమే అధికారం, ఆధిపత్యం చెలాయించలేదు. వారిలో వెలమ (Velama) దొరలు మాత్రమే కాకుండా ముస్లిం దొరలు కూడా ఉంన్నారు. అయితే విసునూరి రామచంద్రారెడ్డి కారణంగా రెడ్డి దొరల దౌర్జన్యాలు పెద్ద యెత్తున ముందుకు వచ్చాయి. బండెనక బండి కట్టి అనే పాట ప్రతాపరెడ్డి దొరకు వ్యతిరేకంగా సాగింది. ఆ రెడ్లను ఇతర రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు గంపగుత్తగా బలపరచలేదు. వారి వెనుక ఇతర కులాలవాళ్లు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలకు నాయకత్వం వహించి త్యాగాలు చేసినవారిలో రెడ్లు ఉన్నారు. రావి నారాయణరెడ్డి (Ravi Narayan Reddy), బిఎన్‌ రెడ్డి (BN Reddy), ఆరుట్ల రామచంద్రారెడ్డి (Arutla Ramachandra Reddy), మల్లు స్వరాస్యం (Mallu Swarajyam), ఆరుట్ల కమలాదేవి (Arutla Kamaladevi) వంటివారు ఎవరి పక్షం వహించారు? అలాగే నక్సలైట్‌ ఉద్యమంలో ఎన్‌కౌంటర్‌ అయిన నల్లా ఆదిరెడ్డి (Nalla Adireddy), మహేష్‌ (Mahesh)


ఎవరు? అల్లం, దేశపతి, ప్రకాశ్‌ త్రయం ఆ ఉద్యమాల నుంచి వచ్చినవారే. కులాధిక్యతను ఏ రకంగా వ్యతిరేకించాలి, ఎవరి కోసం వ్యతిరేకించాలనే విచక్షణతో మాట్లాడితే అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. కోదండరామ్‌ను వ్యతిరేకించడానికి మొత్తం రెడ్డి సామాజికవర్గాన్ని ఆ గాటనే కట్టేసే ఆధిపత్య ధోరణి వారికి ఎక్కడి నుంచి వచ్చింది. ఓ అగ్రకుల పాలనలో పొందిన భద్రత, జీవనోపాధి, పదవులు వారిని ఆ స్థాయికి దిగజార్చాయని చెప్పకతప్పదు.

నేను రెడ్డిగానే ఈ వ్యాసం రాశానని అనుకోవచ్చు. కానీ నా సామాజిక నేపథ్యం వేరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బొందుగుల గ్రామంలో నేను కూడా దొరల ఆధిపత్యం కింద నలిగిపోయినవాడినే. వారిని ప్రశ్నించడానికి నా సామాజిక నేపథ్యం, ఇంత కాలంగా నేను నడిచిన తొవ్వ హక్కు ఇచ్చిందనే అభిప్రాయం నాకు ఉంది. 

- కాసుల ప్రతాపరెడ్డి

Friday, December 22, 2023

తిరుపతి వ్యూహం: పవన్‌ కల్యాణ్‌ చందబ్రాబు అస్త్రం - Tirupati strategy: TDP chief Chandrababu may use Pawan Kalyan to fight YS Jagan

 తిరుపతి వ్యూహం: పవన్‌ కల్యాణ్‌ చందబ్రాబు అస్త్రం 


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు (Andhra Pradesh Assembly Election 2024) కొద్ది నెలల్లో రానున్నాయి. గడువు కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతున్నది. ముందుగానే ఎన్నికలు రావచ్చునని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) చెప్పారు కూడా. ఆయన తన పార్టీని ఎన్నికల కోసం తన పార్టీని సమాయత్తం చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయనకు తోడుగా జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కల్యాణ్‌ Pawan Kalyan) ఉన్నారు. ఇరువురి మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా సాగుతున్నాయి. ఎపి శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు జగన్‌పైకి పవన్‌ కల్యాణ్‌ను ఓ అస్త్రంగా ప్రయోగించబోతున్నారు.



గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈసారి తాను శాసనసభలోకి అడుగు పెట్టాలని అనుకోవడమే కాకుండా తన పార్టీ నుంచి సాధ్యమైనంత మందిని గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో జగన్‌ నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీని ఓడిరచాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబుతో చేతులు కలిపారు.

జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారు, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని సీట్లు అడుగుతారు అనే విషయాలను పక్కన పెడితే, పవన్‌ కల్యాణ్‌ను రాయలసీమ (Rayalaseema) నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. తిరుపతి (Tirupati) నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసేలా చూడాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా పవన్‌ కల్యాణ్‌కు తిరుపతి సురక్షితమైన స్థానం కూడా. గతంలో ప్రజారాజ్యం (Praja rajyam) పార్టీ నుంచి పోటీ చేసి చిరంజీవి (Chiranjeevi) విజయం సాధించారు. పాలకొల్లులో ఆయన ఓటమిపాలైనప్పటికీ తిరుపతి (Tirupathi) ఆయనను శాసనసభకు పంపించింది. తిరుపతి నియోజకవర్గంలో బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. జయాపజయాలను వారు నిర్ణయించే పరిస్థితి ఉంది. అది పవన్‌ కల్యాణ్‌కు సంబంధించి సానుకూలమైన అంశం.

చంద్రబాబు వ్యూహం మాత్రం జగన్‌ను టార్గెట్‌ చేయడానికి, రాయలసీమలో జగన్‌ ప్రాబల్యానికి గండి కొట్డడానికి వపన్‌ కల్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక సీటు నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడం కన్నా తిరుపతి నుంచి పోటీ చేస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతున్నది. తిరుపతి నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తే టిడిపి, జనసేన కూటమి (TDP, Jana Sena alliance)కి ఒక ఊపు వస్తుందనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 

గత ఎన్నికల్లో టిడిపి రాయలసీమలోని 52 స్థానాల్లో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ (nandamuri Balakrishna), ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ (Payyavula Kesav) విజయం సాధించారు. ఈసారి రాయలసీమలో వైసిపి ఓట్లకు గండి కొట్టి సాధ్యమైనన్ని సీట్లను సాధించుకోకపోతే విజయం సాధించడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, పవన్‌ కల్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించారు.

పవన్‌ కల్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతారా, లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోవచ్చు. ఆయన అందుకు సిద్ధపడితే చంద్రబాబు పాచిక పారినట్లేనని అనుకోవచ్చు. 

- కాసుల ప్రతాపరెడ్డి

Wednesday, December 20, 2023

చంద్రబాబు, కేసీఆర్‌ ఒక్కటే: అందుకే వారిద్దరికీ అదే చేదు అనుభవం - KCR, Chandrababu same to same in Telangana and AP

 చంద్రబాబు, కేసీఆర్‌ ఒక్కటే: అందుకే వారిద్దరికీ అదే చేదు అనుభవం


తెలంగాణ రాష్ట్రంలో (Telangana state) కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) ఓటమి పాలు కావడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపి (TDP) పరాజయం పాలు కావడానికి కారణం ఒక్కటే అనిపిస్తుంది. వారిద్దరి పాలనలో ఉన్న సారూప్యత ఉంది. వారి రాజకీయ వ్యక్తిత్వంలోనూ సారూప్యత ఉంది. బీఆర్‌ఎస్‌, టిడిపి రెండు కూడా ప్రాంతీయ పార్టీలే. రాష్ట్ర విభజన తర్వాత టిడిపిని చంద్రబాబు జాతీయ పార్టీగా చెప్పిన్పటికీ అది ప్రాంతీయ పార్టీగానే పరిగణనలోకి వస్తుంది. తెలంగాణలో కూడా టిడిపి ఉంది కాబట్టి పేరుకు అది జాతీయ పార్టీ అవుతుంది. కానీ, దానికి ప్రాంతీయ పార్టీ లక్షణాలు పోలేదు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి ప్రాధాన్యంతో నడుస్తాయి. టిడిపిలో చంద్రబాబు చెప్పిందే శిలా శాసనం. బీఆర్‌ఎస్‌ సంగతి చెప్పాల్సిన పని లేదు. అది కేసీఆర్‌ కనుసన్నల్లోనే నడుస్తుంది. పార్టీ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఈ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్లు పైకి కనిపిస్తుంది. అది నేతిబీర కాయలో నేయి వంటిదే. 



ఈ పరిస్థితిలో జయాపజయాలకు కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణలో రెండు విడతలు కేసీఆర్‌ అధికారంలో ఉన్నారు. చంద్రబాబు మాత్రం ఒకే విడత అధికారంలో ఉన్నారు. దానికి కారణాలున్నాయి. తెలంగాణలో రెండో విడత ఎన్నికల్లో కేసీఆర్‌ విజయం సాధించడానికి పరోక్షంగా చంద్రబాబు సహకరించారు. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని టిడిపితో పొత్తు పెట్టుకోవడం అప్పటి టీఆర్‌ఎస్‌కు, ఇప్పటి బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. తెలంగాణ సెంటిమెంటు (Telangana sentiment)ను కేసీఆర్‌ బలంగా ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబే తెలంగాణలోనూ పాలన చేస్తారని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించడం, చంద్రబాబు ఆధిపత్యం పట్ల తెలంగాణ ప్రజలకు వ్యతిరేక ఉండడం వంటి అంశాల కారణంగా బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చంద్రబాబుతో కలిసి ఉండకపోతే అప్పుడే కాంగ్రెస్‌ బొటాబొటీ మెజారిటీతోనైనా కాంగ్రెస్‌ గెలిచి ఉండేదని అప్పట్లో అంచనాలు సాగాయి. 

చంద్రబాబు రెండో విడత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండిరది. వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ టిడిపికి బలమైన పోటీ ఇచ్చే స్థితిలో ఉంది. తెలంగాణ విడిపోయిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేదు. దాంతో పాటు మరిన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగుంటుందని అక్కడి ప్రజలు భావించారు. దానికి రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయి. బిజెపి (BJP), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నాయకత్వంలోని జనసేన (Jana Sena) టిడిపికి మద్దతు ప్రకటించాయి. పైగా జనసేన పోటీ కూడా చేయలేదు. ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ (Narendra Modi), పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీకి అప్పటికే దేశంలో సానుకూల వాతావరణం ఏర్పడి ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కూడా ప్రజలు భావించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని, దానివల్ల హైదరాబాద్‌ (Hyderabad)ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలు జరుగుతుందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు భావించారు. దాంతో ప్రజలు టిడిపీ వైపు మొగ్గు చూపారు.

అయితే, ఐదేళ్ల కాలంలోనే చంద్రబాబు పాలన ఏమిటో తేలిపోయింది. అమరావతి (Amaravati) రాజధాని పేర జరిగిన వ్యవహారాలు బెడిసికొట్టాయి. పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణం పెద్దగా ముందుకు సాగలేదు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు ఒక నిర్మాణాత్మకమైన మేలును ప్రజల ముందు పెట్టలేకపోయారు. ఆ రెండిరటిలో ఏది ఒక్కటయినా టిడిపి పట్ల సానుకూలత ఏర్పడి ఉండేది. పైగా, వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు కొత్త ఆశలు కల్పించారు. రెండో సారి ఎన్నికల్లో జనసేన, బిజెపి చంద్రబాబుతో కలిసి రాలేదు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాననే విధంగా చంద్రబాబు సందడి చేశారు. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తో వేదికలను పంచుకున్నారు. అది బెడిసికొట్టింది. చంద్రబాబు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. చంద్రబాబు ఏకపక్ష ధోరణి, వైఎస్‌ జగన్‌ మీద చేసిన వ్యక్తిగత దూషణ తప్ప రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు కొత్తగా ఆశలు కల్పించలేకపోయారు. శాసనసభలో అప్పుడు టిడిపి వ్యవహరించిన తీరు కూడా వ్యతిరేకంగానే పనిచేసింది. 

కేసీఆర్‌ విషయానికి వస్తే, ఉద్యమ నాయకుడు అధికారంలో ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నేరువేరుతాయని తెలంగాణ ప్రజలు విశ్వసించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ఆచరణలో సాధ్యం కాని హామీలు కూడా ఉన్నాయి. అధికారం చేపట్టిన కొత్తలో చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరించారు. వివిధ వర్గాలకు నగదు రూపేణా మేలు చేసే విధంగా వ్యవహరించారు. వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. నిపుణుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ తానే అన్నీ అయి వ్యవహరించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అన్నీ తానే అయి వ్యవహరించారు. ప్రగతి భవన్‌, సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్ర నిర్మాణానికి ఇవ్వలేకపోయారు. ప్రజలకు వివిధ పథకాల పేరు మీద నగదు పంపిణీ చేస్తే చాలు, తన వద్ద పడి ఉంటారని ఆయన భావించారు.

రాష్ట్రాన్ని నిర్మించడం పోయి పునర్నిర్మాణం పేరు ఎత్తుకున్నారు. ఈ విషయంలో ఆయన రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం పునర్నిర్మాణానికి ఇవ్వలేదు. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసే వ్యూహాలను పన్ని అమలు చేస్తూ వచ్చారు. తన వ్యూహంలో భాగంగా టిడిపిని తుడిచిపెట్టేశారు. తర్వాత మిగిలింది కాంగ్రెస్‌ ఒక్కటే. రెండుసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను తుడిచిపెట్టే ప్రయత్నాలు చేశారు. అందులో కొంత మేరకు ఆయన విజయం సాధించినట్లే కనిపించారు. కానీ, కాంగ్రెస్‌లాంటి పార్టీ, అదీ జాతీయ పార్టీని తుడిచిపెట్టడం సాధ్యం కాదనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు. బిజెపిని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టాలని చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. దానికి కారణాలున్నాయి. దాన్ని మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.

ఇక, నిరంకుశత్వం, అణచివేత, ఏకపక్ష ధోరణి తెలంగాణవ్యాప్తంగా అమలవుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకులను, వ్యక్తులను కూడా ఆయన ఏమీ కాకుండా చేసే పనికి ఒడిగట్టారు. కోదండరామ్‌ (Kodandaram) పట్ల ఆయన వ్యవహరించిన తీరు అందుకు ఉదాహరణ.  నిరసనలను సహించలేదు. ధర్నాచౌక్‌కు నామరూపాలు లేకుండా చేశారు. ప్రజల గొంతును వినే వారే ప్రభుత్వంలో కరువయ్యారు. మంత్రులపై, శాసనసభ్యులపై నియంత్రణ లేదు. వారికి కేసీఆర్‌ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, వారిని నియంత్రించలేదు. దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా భూముల వ్యవహారం వారు వ్యవహరించిన తీరు స్థానికంగా బీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకతకు కారణమైంది. ఇసుక తవ్వకాల వంటి చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాలంటే, ప్రజలను గాలికి వదిలేశారు.

రెండోసారి పాలనలో కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ (KTR) ఆధిపత్యంలోకి వచ్చారు. కేసీఆర్‌ చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కేటీఆర్‌ ప్రాబల్యంలోకి వచ్చారు. అనుభవరాహిత్యం, ఆధిపత్య ధోరణి వంటి లక్షణాలతో కేటీఆర్‌ వ్యవహరించారు. పార్టీ నాయకుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు అందుకు ఉదాహరణ. కొండా విశ్వేశ్వర రెడ్డితో మొదలు పెట్టి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వరకు వారిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎంత ఆధిపత్య ధోరణితో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్‌ను సానుకూలం చేసుకుంటే చాలు, తాము ఏమైనా చేయవచ్చునని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు భావించి స్థానికంగా విచ్చలవిడిగా వ్యవహరించారు. 

ఇక మంత్రులకు గొంతు లేకుండా పోయింది, తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా మంత్రులకు లేదు. ఏదైనా కేటీఆర్‌ నుంచి రావాల్సిందే. హైదరాబాద్‌లో వరదలు (Hyderabad floods) వస్తే అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ మాత్రమే ఏదైనా ప్రకటించాల్సిన పరిస్థితి. వారే ఏదైనా చేయాలి. ప్రజలకు అనేకన్నా, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులకు ప్రభుత్వం అందుబాటులో లేకుండా పోయింది. తమ గోడును వినిపించుకునే నాథుడే రాష్ట్రంలో లేకుండా పోయాడు. 

చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ఈసారి గెలుస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. కానీ బీఆర్‌ఎస్‌ ఆశలు మాత్రం నెరవేరవని కచ్చితంగానే చెప్పలేం. కేసీఆర్‌ మరో ఆరు నెలల్లోనో, ఏడాదిలోనో తిరిగి అధికారంలోకి వస్తారని ప్రచారం చేస్తున్న బ్యాచ్‌ ఒక్కటి ఉంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని నమ్మిన బ్యాచ్‌ ఒక్కటి ఉంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ఆ బ్యాచ్‌ అదే నమ్మకంతో వ్యవహరించింది. బీఆర్‌ఎస్‌ ఈ ఐదేళ్ల లోపే తిరిగి అధికారంలోకి వస్తుందనేది కల్ల మాత్రమే. ఒకవేళ్ల పరిస్థితులు ఏర్పడినా బిజెపి దానికి అడ్డం పడే రాజకీయాలు మాత్రమే నడుస్తాయి.

నోట్‌: చంద్రబాబుకు కేసీఆర్‌కు ఒక్క తేడా మాత్రం ఉంది. చంద్రబాబు ఇతరుల సలహాలు తీసుకుంటారు. కేసీఆర్‌కు అది కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇచ్చే, సూచనలు చేసే పెద్దలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అది కూడా ఏమీ ఆశించకుండా. వారిని కూడా కేసీఆర్‌ పట్టించుకోలేదు.

- కాసుల ప్రతాపరెడ్డి

Monday, December 18, 2023

కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల: ఏపి రాజకీయాల్లోకి అడుగు, వైఎస్‌ జగన్‌ టార్గెట్‌? - YS Sharmila may challenge YS Jagan in AP assembly elections from Congress

 కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల: ఏపి రాజకీయాల్లోకి అడుగు, వైఎస్‌ జగన్‌ టార్గెట్‌?


వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్‌ జగన్‌ (YS Jagan) సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. వచ్చే ఏడాది జనవరిలో ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని అంటున్నారు. కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) ఆమె కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు నగరాల్లో జరిగే ప్రచార సభల్లో ఆమె పాల్గొంటారని చెబుతున్నారు. విశాఖపట్నం (Viasakhapatnam), విజయవాడ (Vijayawada) నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఆమెతో పాటు ప్రియాంక గాంధీ (priyanka Gandhi) కూడా ఈ సభల్లో పాలు పంచుకుంటారు. 



తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతుగా వైఎస్‌ షర్మిల పోటీ నుంచి తప్పుకున్నారు. పాలేరు నుంచి ఆమె శాసనసభకు పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాల కారణంగా ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు (Telangana Assembly Elections 2023) ముగిసి, తమ ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్‌ పెద్దలు షర్మిలతో చర్చలను పునరుద్ధరించారు. ఏపి ఎన్నికల ప్రచార సభల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను షర్మిల ఎదుర్కుంటారా చూడాలి. ఆయన ప్రభుత్వంపై ఆమె ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరమైన విషయం. 

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే సంభవించే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తుడిచిపెట్టుకుని పోయింది. పార్టీకి జవజీవాలు పోసే నాయకులు లేకుండా పోయారు. కాంగ్రెస్‌ స్థానాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆక్రమించి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీకి విజయం చేకూర్చి పెట్టడానికి వైఎస్‌ జగన్‌ అన్ని హంగులూ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

వచ్చే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపి (TDP), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం చర్చలు కూడా సాగుతున్నాయి. ఆదివారంనాడు చంద్రబాబు నాయుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలతో బిజెపి (BJP) కలిసి వస్తుందా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటివరకైతే కాంగ్రెస్‌ పార్టీ ఊసులోనే లేదు. కానీ, షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) వేలు పెడితే మాత్రం పరిస్థితులు మారుతాయి. కాంగ్రెస్‌ పార్టీ చర్చలోకి వస్తుంది. కాంగ్రెస్‌ నాయకుల్లోనూ శ్రేణుల్లోనూ ఉత్సాహం చోటు చేసుకుంటుంది. 

ఆంధ్ర ప్రాంతంలోని రెండు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొనడానికి సిద్ధపడినట్లు తెలిసింది. రాయలసీమ (Rayalaseema)లో కూడా ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పెద్దలు ఆమెను అడుగుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె అందుకు నిరాకరిస్తున్నారు. రాయలసీమలో తన సోదరుడు వైఎస్‌ జగన్‌కు నష్టం చేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల ప్రవేశం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం చేస్తుందనేది ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురిగా వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తన పాత్ర నిర్వహిస్తారు. దాని వల్ల వైఎస్‌ జగన్‌కు ఏ మేరకు నష్టం జరుగుతుందనేది చూడాల్సిందే. కాగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జనసేన, టిడిపి కూటమిని దెబ్బ తీస్తుందా అనేది కూడా చూడాల్సిందే. రాయలసీమ ప్రాంతం జగన్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆమె రాయలసీమలో రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేరు. దానివల్ల కాంగ్రెస్‌లోకి ఆమె రావడం ద్వారా ప్రతిపక్షాల ఓట్లు చీల్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఏమైనా ఆ విషయాలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేం.

ఇకపోతే, వైఎస్‌ షర్మిలను ఎఐసిసి (AICC) ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయి. ఆమెను పార్లమెంటుకు పంపించాలని కూడా కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం సీటు నుంచి ఆమెను పోటీ దించాలా, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలా అనే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి


Sunday, December 17, 2023

గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌ సుద్దులు: అందెశ్రీ పాటపై రేవంత్‌ రెడ్డికేదీ జవాబు? - Andesri song: Revanth Reddy retaliates Desapathi, Goratai Venkanna loses credibility

గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌ సుద్దులు: అందెశ్రీ పాటపై రేవంత్‌ రెడ్డికేదీ జవాబు? 


తెలంగాణ వాగ్గేయకారులుగా పిలుచుకుంటున్న గోరటి వెంకన్న (Gorati Venkanna), దేశపతి శ్రీనివాస్‌ (Desapthi srinivas)ల గొంతుల ఈ రోజు వింటే మతిపోయే విధంగానే ఉంది. నిజానికి వాగ్గేయకారులనేది పెద్ద మాట. ఉద్యమకాలంలో కొన్ని Over tones ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోని ఓవర్‌ టోన్‌ వాగ్గేయకారులనేది. అయితే, దానికి సాధారణమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. పాటలు రాసి, వాటిని ఆలపించేవాళ్లను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. ఈ పరిమితి తెలంగాణ ఉద్యమకాలంలోని పాట కవులకు ఉంటుంది. వారిద్దరు కూడా తెలంగాణ సమాజం (Telangana society) నుంచి విశేషమైన గౌరవాభిమానాలను పొందినవారు. కానీ ఈ రోజు వారి మాటలు వింటే మనలను మనమే కించపరుచుకుంటున్నట్లుంది. 



గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వారిద్దరు మాట్లాడారు. గోరటి వెంకన్న సన్నాయి నొక్కులు నొక్కితే, దేశపతి శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అందెశ్రీ రాసిన పాటను ఉటంకించడాన్ని తప్పు పట్టారు. దేశపతి శ్రీనివాస్‌ భాష గురించి, సంస్కారం గురించి మాట్లాడడం కొంచెం వింతగానే ఉంటుంది. ఇన్నాళ్లు కలుగులో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన మాట్లాడినట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన నిర్బంధాల గురించి మాట్లాడారు. కేసీఆర్‌ (KCR) ప్రభుత్వ పాలనలోని నిరంకుశత్వాన్ని, నిర్బంధాన్ని అణచివేతను చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దాని గురించి మాట్లాడారు. శాసనసభలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలైన నిర్బంధాన్ని, అన్యాయాన్ని బీఆర్‌ఎస్‌ సభ్యుడొకరు ఎత్తిచూపారు. అధికార కాంగ్రెస్‌ పక్షం నుంచి దానికి సమాధానం వచ్చింది. అందుకే కదా, మేం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందనేది మేం మాట్లాడుతున్నాం అని మంత్రి ఒకరు అన్నారు. కేసీఆర్‌ పాలనలో అమలైన అణచివేతకు, నిర్బంధానికి, నిరంకుశత్వానికి బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే సమాధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (United Andhra Pradesh) రాష్ట్రంలో అమలైనవాటిని ఎత్తిచూపడం సమాధానం కాదనే ఎరుక కూడా కవి అయిన దేశపతి శ్రీనివాస్‌ లేకుండా పోయిందంటే ఆయన గొంతు ఎలా వంకర్లు పోయిందో అర్థం చేసుకోవచ్చు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్‌, ఆయన పక్కన ఉన్న తాము మాత్రమే పోరాటం చేశామని, మిగతా తెలంగాణ వాళ్లకు సంబంధం లేదని దేశపతి శ్రీనివాస్‌ మాటల్లోని ఆంతర్యంగా అర్థం చేసుకోవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న నిజాయితీగల బుద్ధిజీవులను, రచయితలను, కవులను, కళాకారులను విస్మరించడం అనేకన్నా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఎలా ఉండాలని ఆశించారో అలా లేకపోవడం వల్లనే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మట్టికరిచిందనే ఎరుక ఇప్పటికీ రాకపోవడం విచిత్రమే. కేసీఆర్‌ మాత్రమే కాదు, కేసీఆర్‌ పక్కన ఉన్న రచయితలు, కవులు, బుద్ధిజీవులు కూడా ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నట్లు లేదు.

దేశపతి శ్రీనివాస్‌ ఈ రోజు భాష గురించి, సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి Revanth Reddy) అందెశ్రీ (Andesri) రాసిన పాటను ఉటంకించారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలన తీరుపై అందెశ్రీ ఆ పాట రాశారు. దానిలోని భాషను, సంస్కారాన్ని దేశపతి తప్పు పట్టారు. ముఖ్యమంత్రికి ఆయన సుద్దులు చెప్పారు.

ముఖ్యమంత్రి స్థాయి గంభీరమైందని దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. అలా అంటూ ముఖ్యమంత్రి ఉటంకించే కవిత ఉదాత్తంగా, గంభీరంగా ఉండాలని ఆయన సూచించారు. అందులోని భాష సంస్కారవంతంగా ఉండాలని కూడా అన్నారు. రంకెలేస్తున్నవేందిరా, పొంకనాలేందిరా అనే భాష ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ కవికి సంబంధించిన పాటనే ఉటంకించాలనుకుంటే ఉదాత్తమైనవి ఉన్నాయని అంటూ జయ జయహే తెలంగాణ (Jaya Jayahe Telangana) పాటను ప్రస్తావించారు. 

దేశపతి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గంభీరంగానూ ఉదాత్తంగానూ సమాధానం ఇస్తూ ఓ ప్రశ్న వేశారు. అందెశ్రీ తెలంగాణ ఆకాంక్షను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కవి అని అన్నారు. జయ జయహే తెలంగాణను జాతీయ గీతంగా ప్రకటిస్తామని చెప్పి ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా ఆ పాటను ఆలపింపజేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను బట్టి దేన్నయినా ఉటంకిస్తామని, సమయమూ సందర్భాన్ని బట్టి అది ఉంటుందని, ఇతరులు రాసినదాన్ని తనదిగా చెప్పుకోవడం సరి కాదని, అందుకే తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతున్న ఆ కవితను ఉటంకించానని రేవంత్‌ రెడ్డి వివరించారు. 

జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ ఎందుకు అమలు చేయలేకపోయారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కేసీఆర్‌కు అన్ని వర్గాల పట్ల, అందరి పట్ల సమదృష్టి లేదని, కేసీఆర్‌ చెప్పిన మాటలకు చేసిన చేతలకు పొంతన లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే.

ఒక గోరటి వెంకన్న విషయానికి వస్తే ` ఆయన రైతుబంధు (Rythu Bandhu) గురించి మాట్లాడారు. పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు ఉండాలని ఆయన అన్నారు. తాను ఈ విషయం చెప్పానని కూడా అన్నారు. అంతేకాదు, సినీ నటులకు, వందలాది ఎకరాలున్నవారికి, ఐఎఎస్‌లకు, ఐపీఎస్‌లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని కూడా చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ చెప్పారో తెలియదు. చెప్పే ఉండవచ్చు. కాస్తా గొంత పెద్దది చేసి చెప్పి వుంటే అందరికీ అది వినిపించేది. గోరటి వెంకన్నకు ఉన్న పాపులారిటీ చిన్నదేం కాదు ఎల్లలు దాటిన పాపులారిటీ. ఆయన ఆ మాట చెప్పి ఉంటే ప్రధానమైన వార్త అయి ఉండేది. ప్రజలకు వెంటనే చేరి ఉండేది. సరే, ఇప్పటికైతే ఆయన ఎవరి చెవిలోనైనా ఊది ఉంటారని సరిపుచ్చుకుందాం.



కేసీఆర్‌ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిన తీరుపై మాట్లాడుతూ తనదైన భాష్యం చెప్పారు. కోదండరామ్‌ (Kodandaram) ఇంటి తలుపులు బద్దలు కొట్టడం, హరగోపాల్‌ (haragopal)పై ఉపా ప్రయోగించడం వంటివి అధికారులు కావాలనే చేశారని ఆయన అన్నారు. అధికారులు కావాలని చేసినప్పుడు వాటిని నిలువరించే శక్తి గానీ, వాటిని సరిదిద్దే విచక్షణ గానీ కేసీఆర్‌కు లేకుండా పోయిందా అనేది ప్రశ్న. కేసీఆర్‌ను తాత్వికుడిగానూ దార్శనికుడిగానూ ఆయన అభివర్ణించారు. అది నిజమే కావచ్చు. కానీ పాలనలో ఆయన చేసిన నిర్వాకాలేమిటనేది ప్రశ్నించుకోవాల్సిందే.

ఒక రకంగా దేశపతి శ్రీనివాస్‌, గోరటి వెంకన్న తమ చరిత్రలను తామే రద్దు చేసుకుంటున్నారు. ఉద్యమ చరిత్రలో వారికి దక్కిన ప్రతిష్టపై వాళ్లే బురద చల్లుకుంటున్నారు. దానికి మనం ఏమీ చేయలేం.

- కాసుల ప్రతాపరెడ్డి

Friday, December 15, 2023

పవన్‌ కల్యాణ్‌ను వదిలేసిన బిజెపి: ఇక కేసీఆర్‌కు బిజెపి చుక్కలే - BJP parts away from Pawan Kalyan in Telangana, Why?

 పవన్‌ కల్యాణ్‌ను వదిలేసిన బిజెపి: ఇక కేసీఆర్‌కు బిజెపి చుక్కలే


మన అవసరం ఉందని అనుకుని మనతో బిజెపి (BJP) తెలంగాణలో పొత్తు పెట్టుకుందని, బిజెపి నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శ్రేణులతో చెప్పారు. ఇప్పుడు బిజెపి పవన్‌ కల్యాణ్‌ అవసరం లేదని భావిస్తున్నట్టుంది. పవన్‌ కల్యాణ్‌ను వదిలేసింది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు (Telangana BJP), కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy) తేల్చేశారు. తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ ద్వారా నెరవేర్చాలకున్న బిజెపి లక్ష్యం దెబ్బ తిన్నది. కాంగ్రెస్‌ తమకు ప్రథమ రాజకీయ శత్రువు కాబట్టి కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) గెలిస్తే మంచిదని బిజెపి భావించింది. అందుకు పవన్‌ కల్యాణ్‌ను కూడా వాడుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 8 చోట్ల పోటీ చేశారు. వారికి నామమాత్రం ఓట్లు కూడా పడలేదు. బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు తెలంగాణలో రాలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఎగతాళి చేశారు. 



తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులకు తగినన్ని ఓట్లు రాకపోయినా పవన్‌ కల్యాణ్‌ నష్టపోయేదేమీ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఆయన సత్తా చాటాల్సే ఉంటుంది. అందుకు ఆయన నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP)తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి ఆ రెండు పార్టీలతో కలిసి నడుస్తుందా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ బిజెపిని తనతో తీసుకుని వస్తానని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కాస్తా పక్కకు నెట్టి తెలంగాణ రాజకీయాలకు వద్దాం.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ (Telangana Congress) ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించలేదని, కేసీఆర్‌ కొద్ది నెలల్లోనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం చేయడమే కాదు, ఆ విషయాన్ని నమ్ముతున్నాయి. అయితే, ఆ పరిస్థితి వస్తుందా అనే పెద్ద ప్రశ్న. ప్రశ్న మాత్రమే కాదు, సందేహం కూడా. బిజెపి ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణలో పొత్తు ఉండదని కిషన్‌ రెడ్డి ప్రకటించడంతోనే బిజెపి వ్యూహం ఏమిటో అర్థమవుతున్నది. కాంగ్రెస్‌ను తెలంగాణలో నిలువరించలేకపోయిన బిజెపి వచ్చే లోకసభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు అనిపిస్తున్నది.

లోకసభ ఎన్నికల్లో పోటీ తమకు, కాంగ్రెస్‌కు మాత్రమే ఉండేలా వ్యూహరచన చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి ముందుకు రావడం ఆ వ్యూహంగా చెప్పవచ్చు. కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి వస్తారని భావిస్తున్న బీఆర్‌ఎస్‌కు బిజెపి చుక్కలు చూపించవచ్చు. లోకసభ ఎన్నికలు జాతీయ అంశాల మీద ఆధారపడి జరుగుతాయి. జాతీయ నాయకత్వాలనే ఓటర్లు చూస్తారు. అధికారంలో వుంటే వేరు గానీ, అధికారం కోల్పోయిన తర్వాత జాతీయ రాజకీయాలపై ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపడం కష్టం. దానివల్ల కేసీఆర్‌ తిరిగి పుంజుకుని బీఆర్‌ఎస్‌కు జవజీవాలు పోసి లోకసభ ఎన్నికల్లో సత్తా చాటుతారని అనుకోలేం. గత లోకసభ ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్‌ దెబ్బ తిన్నది. అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలో లేని ప్రస్తుత తరుణంలో లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నెగ్గుకు రావడం కత్తి మీద సామే అవుతుంది.



ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిజెపి కాంగ్రెస్‌ను తెలంగాణలో ఎదుర్కోవడానికి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అనిపించుకోవడానికి బీఆర్‌ఎస్‌ దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి బిజెపి ఊపు మీద ఉంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి పావులు కదుపుతున్నది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా (INDIA) కూటమి ఎన్నికలకు అంతగా సిద్ధపడినట్లు లేదు. ఉత్తరాదిన తమకు సత్తా చాటుతామని బిజెపి నాయకత్వం విశ్వాసంతో ఉన్నప్పటికీ దక్షిణాది అంత సానుకూలంగా లేదు. కర్ణాటక (karnataka)లో అధికారాన్ని కోల్పోయింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కుని అత్యధికంగా లోకసభ సీట్లు సాధిస్తామనే నమ్మకం లేదు. దాంతో తెలంగాణపై బీజెపి దృష్టి పడిరది. కేసీఆర్‌ను వెనక్కి నెట్టడం ద్వారా లేదా బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా బిజెపి కదలికలు ఉంటాయి. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా బిజెపి శాసనసభ స్థానాలను సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాగా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకుంది. కామారెడ్డిలో కేసీఆర్‌పై బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Katipalli Venkataramana Reddy) విజయం సాధించారు. మరింతగా బిజెపి తెలంగాణలో పుంజుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుందని అనుకోవచ్చు. అందులో భాగంగానే పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణలో పొత్తు ఉండదని కిషన్‌ రెడ్డి భావించి వుండవచ్చు. తెలంగాణ సెంటిమెంటు (Telangana Sentiment) ప్రచారం కాకుండా చూడడానికే పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణలో దూరం చేసుకుంటున్నట్లు భావించవచ్చు. ఏమైనా కేసీఆర్‌కు ఇక గడ్డు కాలమే.

- కాసుల ప్రతాపరెడ్డి

కేసీఆర్‌కు చేదు అనుభవం: వైఎస్‌ జగన్‌ సీరియస్‌ కసరత్తు - YS Jagan takes corrective measures after KCR failure

 కేసీఆర్‌కు చేదు అనుభవం: వైఎస్‌ జగన్‌ సీరియస్‌ కసరత్తు


కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (Andhra Pradesh assembly Elections 2023)కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) అనుభవాన్ని దృష్టిలో పెట్టుకని ఆయన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించినట్లు అర్థమవుతున్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana assembly election results 2023) కేసీఆర్‌ చేసిన పొరపాటు తాను చేయకూడదని జగన్‌ అనుకుంటున్నట్లు అర్థమవుతున్నది. పనితీరు బాగాలేని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను మార్చేందుకు వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు.



తెలంగాణలో దాదాపు 40 మంది సిట్టింగ్‌ ఎమ్యెల్యేల పనితీరు బాగా లేదని, వారిని మారిస్తే విజయావకాశాలు మెరుగుపడుతాయని కేసీఆర్‌ తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలినట్లు చెబుతారు. అయితే, కేసీఆర్‌ అందుకు సిద్ధపడలేదు. అతి విశ్వాసంతో వెళ్లారు. బీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణాల్లో అది ఒకటి. సిట్టింగ్‌లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచి ఉండేదనే వాదన బలంగానే ఉంది. సిట్టింగులను మార్చి కొత్తవారికి టికెట్లు ఇచ్చిన చోట్ల బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి (Palla Rejeswar Reddy), స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి విజయం సాధించడాన్ని ఉదాహరణగా చూపవచ్చు.

పొరుగు రాష్ట్రం పరిణామాలతో తమకు సంబంధం లేదని, రాష్ట్రంలోని 175 సీట్లను గెలుచుకునే లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని వైసీపి నేత సుబ్బారెడ్డి అన్నారు. కొన్ని చోట్ల సిట్టింగు ఎమ్యెల్యేలను మార్చక తప్పదని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గం టికెట్‌ను గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy)కి టికెట్‌ నిరాకరిస్తున్నారు. ఆ దిశలో నియోజకవర్గాల ఇంచార్జీలను జగన్‌ మారుస్తున్నారు. గాజువాక (Gajuwaka)లో నియోజకవర్గం ఇంచార్జీని మార్చారు. దీన్ని బట్టి ఎమ్యెల్యే నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కదని అర్థమవుతున్నది. గత ఎన్నికల్లో ఆయన జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై విజయం సాధించారు. గాజువాక ఇంచార్జీగా ఆయన కుమారుడు దేవన్‌ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. దేవన్‌ రెడ్డి స్థానంలో కొత్త ఇంచార్జీని నియమించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన దేవన్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించింది. దాంతో వెనక్కి తగ్గారు. ఆయనకు ఏ విధమైన హామీలు ఇచ్చారనేది తెలియదు.

ఇప్పటికే దాదాపు 11 నియోజకవర్గాల ఇంచార్జీలను వైసీపి నాయకత్వం మార్చింది. మరిన్ని నియోజకవర్గాల ఇంచార్జీలను కూడా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. దాదాపు 65 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వైసీపి నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అభ్యర్థుల మార్పు ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్నికలు సమీపించిన తర్వాత సాధారణంగా ఫిరాయింపులు ఉంటాయి. తెలుగుదేశం (TDP), జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. టిడిపి, జనసేన పొత్తు కనీసం పదేళ్ల పాటు కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జగన్‌ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పదేళ్లు పడుతుందని ఆయన అన్నారు. టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడకపోయినా తాను సీట్ల సర్దుబాటులో టిడిపి ఇబ్బంది లేకుండా చూస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. 

అధికారికంగా బిజెపి (BJP)తో టిడిపి పొత్తు లేకపోయినప్పటికీ మూడు పార్టీలు ఓ కూటమిగానే జగన్‌ను ఎదుర్కుంటాయని అర్థమవుతున్నది. జనసేన, టిడిపి మధ్య అధికారికంగా పొత్తు ఉంది. బిజెపిని తన దారిలోకి తేవడానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి (daggubati Purandheswari) నియామకం అందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. 

- కాసుల ప్రతాపరెడ్డి 

Thursday, December 14, 2023

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు ఇదే... Telangana CM Revanth Reddy's team

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు ఇదే...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) తన కార్యాలయంలో సమర్థులైన అధికారులను నియమించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వి. శేషాద్రి (V. Seshadri) కార్యదర్శిగా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో చేరారు. తన కార్యాలయంలో మరింత మంది అధికారులను నియమించుకునేందుకు రేవంత్‌ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. రెండు, మూడు రోజుల్లో సిఎంఓలో చేరే అధికారులు ఖరారయ్యే అవకాశం ఉంది. 



శేషాద్రికి జనవరిలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. క్యాడర్‌, సీనియారిటీ సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు ప్రమోషన్‌ ఇవ్వనున్నారు. 2003 బ్యాచ్‌ ఆఫీసర్‌ లోకేష్‌ కుమార్‌ (Lokesh Kumar)ను సిఎంఓలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమకు సమాచారం ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది. ప్రస్తుతం ఆయన భారత ఎన్నికల కమీషన్‌ (ECI))లో అదనపు సిఈవోగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో నాలుగేళ్ల పాటు జిహెచ్‌ఎంసి (GHMC) కమీషనర్‌గా పనిచేశారు. 

2010 బ్యాచ్‌ ఆఫీసర్‌ ఆమ్రపాలి (Amrapali) ని కూడా రేవంత్‌ రెడ్డి సిఎంవోలో నియమించుకునే అవకాశం ఉంది. ఆమె అక్టోబర్‌ వరకు ప్రధాని కార్యాలయం (పిఎంవో)లో డిప్యూటీ సెక్రటరిగా పనిచేశారు. మూడేళ్ల పాటు కేంద్రంలో డిప్యూటేషన్‌ మీద పనిచేసిన తర్వాత ఆమె తెలంగాణకు వచ్చేశారు. ఆమె ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఆమె సిఎంఓలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మల్టీజోన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సహనవాజ్‌ను రేవంత్‌ రెడ్డి తన కార్యదర్శిగా నియమించుకున్నారు. గతంలో ఆయన మైనారిటీ సంక్షేమ శాఖ కమీషనర్‌గా పనిచేశారు. మూడేళ్లకు పైగా వక్ఫ్‌ బోర్డు (Wakf Board) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. వక్ఫ్‌ బోర్డు అస్తులను పరిరక్షించడానికి ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. సిఇవోగా ఆయనను తొలగిస్తూ, కొత్త సిఈవోను నియమిస్తూ వక్ఫ్‌ బోర్డు తీర్మానం చేసింది.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం... బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను కూడా రేవంత్‌ రెడ్డి తన జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోడ్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ దానకిశోర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖకు వెళ్లే అవకాశం ఉంది. 1992 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి సంజయ్‌ జాజు ఐటి, పరిశ్రమల శాఖలో జయేష్‌ రంజన్‌ స్థానంలో నియమితులయ్యే అవకాశం ఉంది. 

- కాసుల ప్రతాపరెడ్డి

Tuesday, December 12, 2023

కేసీఆర్‌ తప్పుల్లో ఇదొకటి: టిఎస్‌పిఎస్‌సీ చైర్మన్‌ రాజీనామాలో ట్విస్ట్‌ - KCR failure in TSPSC exams, Janardhan Reddy resigned

 కేసీఆర్‌ తప్పుల్లో ఇదొకటి: టిఎస్‌పిఎస్‌సీ చైర్మన్‌ రాజీనామాలో ట్విస్ట్‌


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రధానంగా మూడు అంశాలపై జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆ మూడు అంశాలను ప్రధానం చేసుకుని, ఈ రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఉద్యమం ఎగిసిపడిరది. నీళ్లు, నిధుల మాట అలా ఉంచితే, నియామకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. తెలంగాణ నిరుద్యోగ యువత ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి) నియామకాలపై పెద్దగా ఆశ పెట్టుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఆ ఆశలను గల్లంతు చేసింది. టిఎస్‌పిఎస్‌సీ (TSPSC) పరీక్షల నిర్వహణకు సిద్ధపడి నోటిఫికేషన్లు జారీ చేసి తర్వాత ఏదో ఒక అవాంతరం వచ్చి పడిరది. పరీక్షల నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి వ్యవహరించిన తీరును తప్పు పడుతూ కొందరు కోర్టుకు ఎక్కడం, పరీక్షలు వాయిదా పడుతూ రావడం ఆనవాయితీగా వచ్చింది. చివరకు ప్రశ్న పత్రాల లీకేజీ (TSPSC question papers leakage) వ్వవహారం పెద్ద దెబ్బ వేసింది.



లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులకు టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఉద్యోగాలు (Jobs) కల్పించడం అసాధ్యమని, వాటిపైనే యువత ఆశలు పెట్టుకోవడం సరి కాదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తూ వచ్చాయి. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పదేళ్ల కాలంలో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు (TSPSC exams) కొన్నయినా సక్రమంగా నిర్వహించి వుంటే ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత ఏర్పడి ఉండేది కాదనే ఇంగితాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించింది. ప్రైవేట్‌ రంగంలో యువతకు ఏ విధమైన ఉద్యోగావకాశాలు కల్పించారనే విషయంపై స్పష్టత లేదు. కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ అధికారం కోల్పోవడానికి యువతలో పేరుకుపోయిన నిరాశ కూడా ఓ కారణం. తమ కాంగ్రెస్‌ పార్టీ విజయం వెనుక 30 లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల ఉందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. 

ఆ కారణంగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) టిఎస్‌పిఎస్‌సీ ప్రక్షాళణపై దృష్టి పెట్టారు. టిఎస్‌పిఎస్‌సీపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను రీషెడ్యూల చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ (Job Calender)కు అనుగుణంగా వాటిని ప్రభుత్వం షెడ్యూల్‌ చేయనుంది. రేవంత్‌ రెడ్డి సమీక్షకు పూనుకోవడానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ బి. జనార్దన్‌ రెడ్డి (B Janardhan Reddy) రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదించలేదు. ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యులెవరో తేల్చే వరకు రాజీనామాను ఆమోదించేది లేదని ఆమె తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఆమె సంబంధిత శాఖకు ఓ లేఖ కూడా రాశారు. నిజానికి బి. జనార్దన్‌ రెడ్డికి మంచి పేరు ఉంది. కానీ, ఆయన హయాంలో ప్రశ్న పత్రాల లీకేజీ జరగడం విచిత్రంగానే ఉంది.

గ్రూప్‌`1 ప్రిలిమనరీ (Group-1 preliminary), అసిస్టెంట్‌ ఇంజనీంర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. దాంతో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఈ కేసులో వంద మందికిపైగా అరెస్టయ్యారు. ఒక చైన్‌లాగా లీకయిన ప్రశ్న పత్రాలు ఒకరి నుంచి ఒకరికి అమ్ముడవుతూ వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌ `1 ప్రిలిమనరీ పరీక్ష కూడా రద్దయింది. పరీక్ష నిర్వహణలో ఘోరమైన వైఫల్యం కారణంగా ఆ పరీక్షన తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. 

ప్రశ్న పత్రాల లీకేజీలో ప్రభుత్వ బాధ్యత ఉండదనే వాదన వినిపించింది. అది టిఎస్‌పిఎస్‌సీ వైఫల్యమే తప్ప ప్రభుత్వ వైఫల్యం కాదనేది ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన వాదన. అందులోని సాంకేతిక అంశం ఏమైనప్పటికీ ప్రభుత్వం మీదనే దాని ప్రభావం పడుతుందనే కనీస విషయాన్ని కూడా పట్టించుకోలేదు. పదేళ్ల కాలంలో ఆ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వ నిస్సహాయత స్పష్టంగానే కనబడుతున్నది. ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్‌ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పట్టించుకోలేదు. దాని ఫలితం బీఆర్‌ఎస్‌ అనుభవించింది.


- కాసుల ప్రతాపరెడ్డి

ఆర్కే పట్ల వైఎస్‌ జగన్‌ తీరు: చంద్రబాబు మాటలను గుర్తు చేసుకోవాల్సిందే- RK is insulted, Chandrababu words relevant

ఆర్కే పట్ల వైఎస్‌ జగన్‌ తీరు: చంద్రబాబు మాటలను గుర్తు చేసుకోవాల్సిందే


తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్‌ జగన్‌ (YS Jagan) కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. టిడిపి (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)పై పోటీ చేసి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినవాడు. అత్యంత సాధారణ జీవితం గడిపేవాడు. ఇప్పటికీ వ్యవసాయం చేసేవాడు. మంచి పేరున్నవాడు. ఆయనే ఆర్కే (RK)గా పిలుచుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డి Alla Ramakrishna Reddy). ఆయనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎందుకు శీతకన్ను వేశారనే ఆశ్చర్యపరిచే విషయమే. 

చంద్రబాబు (Chandrababu Naidu)కు వ్యతిరేకంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిత్యం పోరాడుతూ వచ్చారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు, సదావర్తి భూములు తదితర విషయాలపై చంద్రబాబుపై కేసులు వేశారు. అమరావతి అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారాలపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఆ కేసును తెలంగాణ ఎసిబీ నుంచి తప్పించి సిబిఐకి అప్పగించాలని కూడా ఆర్కే కేసు వేశారు. ఆయన వేసిన కేసులు, చేసిన ఫిర్యాదుల కారణంగానే చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. వాటిని ఆధారం చేసుకునే చంద్రబాబుపై కేసులు పెట్టి, జైలుకు పంపించారు. అంతగా సహకరించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని జగన్‌ పక్కన పెట్టడమేమిటనే ప్రశ్న ఉదయిస్తున్నది.



రెండు దఫాలు ఎమ్యెల్యేగా పనిచేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైఎస్‌ జగన్‌ పొగ పెట్టారని అంటున్నారు. పొమ్మనలేక పొగపెట్టడమేనని కూడా భావించవచ్చు. మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసిపిలో ఓ వ్యతిరేక వర్గం తయారైంది. గంజి చిరంజీవి Ganji Chiranjeevi)కి ప్రాధాన్యం పెరిగింది. టిడిపిలో ఉన్న గంజి చిరంజీవిని వైసిపిలోకి తెచ్చింది కూడా ఆర్కేనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత గంజి చిరంజీవి వైసిపిలో చేరారు. మంగళగిరి నుంచి తానే పోటీ చేస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు కూడా. ఆయనను మంగళగిరి పార్టీ ఇంచార్జీగా నియమించారు. ఆప్కో చైర్మన్‌ కూడా ఆయనే. ఆర్కేను సంప్రదించకుండా వేమారెడ్డిని మంగళగిరి ` తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ పరిణామాలతో ఆర్కే తీవ్రంగా కలత చెందారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. 

ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2019లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్‌ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో కూడా ఆయనను జగన్‌ పక్కన పెట్టారు. సామాజిక సమీకరణాల్లో ఆర్కేకు మంత్రి పదవి ఇవ్వడం కుదరలేదని పార్టీ నాయకులు ఇప్పుడు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం, ముఖ్యంగా జగన్‌ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర అసంతృప్తికి గురైన ఆర్కే గడప గడపకు సమీక్షా కార్యక్రమాలకు హాజరు కాలేదు. తన కుమారుడి వివాహానికి ఆర్కే జగన్‌ను ఆహ్వానించలేదు. దీన్నిబట్టి ఆర్కే ఎంతగా కలత చెందారో అర్థం చేసుకోవచ్చు. 

ఆర్కేను జగన్‌ పక్కన పెట్టడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna ReddY), పార్టీ ఎంపి అయోధ్యారెడ్డి సమర్థిస్తున్నారు. మంగళగిరి (Mangalagiri) సీటు బీసీలకు, ముఖ్యంగా పద్మశాలీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అయోధ్యారెడ్డి (Ayodhya Reddy) చెప్పారు. ఆళ్లకు సముచిత స్థానం కల్పిస్తామని సజ్జల చెప్పారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి పోటీకి దించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. మంగళగిరిలో పద్మశాలీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. గంజి చిరంజీవిని ఎంపిక చేయడం వెనక ప్రధాన కారణం అదేనని చెప్పవచ్చు. 

అయితే, పార్టీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆళ్లతో మాట్లాడాల్సి ఉండిరది. ఆయనతో ఎవరైనా మాట్లాడారా, ఆయనకు నచ్చజెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేశారా, ఆయనకు పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ కల్పించే స్థానంపై హామీ ఇచ్చారా తెలియదు. జగన్‌ చాలా విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడుతారు. అందువల్లనే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పట్ల ఏకపక్షంగా వ్యవహరించారని భావించవచ్చు. కానీ రాజకీయాల్లో ఇటువంటి వ్యవహారాలు దెబ్బ తీస్తాయి. తెలంగాణ కేసీఆర్‌ ఎదుర్కున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. జగన్‌కు కూడా ఆ పరిస్థితి వస్తుందా, రాదా అనేది ఇప్పుడే అంచనా వేయలేం. ఆయితే, చంద్రబాబు మాటలను మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అహంకారంతో వెళ్తే తెలంగాణలో ఏమైందో చూశామని ఆయన అన్నారు.

- కాసుల ప్రతాపరెడ్డి

Sunday, December 10, 2023

కేసీఆర్‌ సకల రంగాల నిపుణుడు: ఈ సలహాదారుల సంత ఎందుకు?- Why KCR appointed so many advisors?

 కేసీఆర్‌ సకల రంగాల నిపుణుడు: ఈ సలహాదారుల సంత ఎందుకు?


తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వం ఏడుగురు సలహాదారుల నియమాకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర్‌ రావు (K Chandrasekhar Rao) ప్రభుత్వంలో సలహాదారుల (Government advisors) నియామకాలు పెద్ద యెత్తునే జరిగాయి. తనకు నమ్మకమైన, తనకు సహకరించిన పెద్దలను ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ వెళ్లారు. అయితే, వారి ప్రతిభను తక్కువ అంచనా వేయడం కాదు గానీ వారు ప్రభుత్వంలో ఏ విధమైన పాత్ర నిర్వహించారనేది ప్రశ్నార్థకమే. కేసీఆర్‌ వారి సేవలను వినియోగించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి.

కేసీఆర్‌ (KCR) దాదాపు 12 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నారు. వారిలో ఏడుగురి నియమాకాలన రద్దు చేస్తూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారు రాజీవ్‌ శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు). అనురాగ్‌ శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఎకే ఖాన్‌ (మైనారిటీ సంక్షేమం), జీఆర్‌ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్‌. శోభ (అటవీ సలహాదారు), సోమేష్‌ కుమార్‌ (Somesh Kumar) (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు). సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే రాజీనామా చేశారు. ఎన్నికలకు కాస్తా ముందు చెన్నమనేని రమేష్‌ను వ్యవసాయ సలహాదారుగా నియమించారు.



చెన్నమనేని రమేష్‌ (Chennamaneni Ramesh) నియామకాన్ని పరిశీలిస్తే మిగతా వారి నియామకాలు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. రమేష్‌ గతంలో వేములవాడ నుంచి బీఆర్‌ఎస్‌ శాసనసభ్యునిగా ఉన్నారు. పౌరసత్వం సమస్యతో ఆయన సతమవుతూ వచ్చారు. ఈ సమస్య కారణంగా ఆయనకు తిరిగి వేములవాడ నుంచి టికెట్‌ ఇవ్వలేదు. పౌరసత్వ సమస్య కారణంగా ఆయన వేములవాడ నుంచి పోటీ చేయలేకపోయారు. వేములవాడ బీఆర్‌ఎస్‌ టికెట్‌ వేరే నేతకు ఇచ్చే క్రమంలో చెన్నమనేని రమేష్‌ను కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మిగతా వారంతా దాదాపుగా పదవీ విరమణ చేయగానే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనవారే.

ఇక సోమేష్‌ కుమార్‌ విషయానికి వస్తే, హైకోర్టు తీర్పుతో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తనకు సముచిత స్థానం లభించలేదని ఆయన ఆవేదన చెందారు. దాంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆయనను కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సోమేష్‌ కుమార్‌పై గతంలో రేవంత్‌ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు సోమేష్‌ కుమార్‌ గండి కొట్టారని ఆరోపించారు, దరణి పోర్టల్‌ (Dharani Portal) రూపకల్పనలో సోమేష్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. వాస్తు సలహాదారును కూడా కేసీఆర్‌ నియమించుకున్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) సోదరుడు సుద్దాల సుధాకర్‌ తేజను కేసీఆర్‌ వాస్తు సలహాదారుగా నియమించారు. ఆయన పదవీకాలం ముగిసినట్లు తెలుస్తున్నది. 

సాంస్కృతిక సలహాదారుగా ఉన్న కెవీ రమణాచారి (KV Ramanachary) సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదైన శైలిని కనబరుస్తూ వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సాంస్కృతిక విధానాన్ని రూపుకల్పన చేయాల్సి ఉండిరది. అందుకు ప్రయత్నాలు జరిగిన సూచనలేవీ లేవు. 

ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైనవారిని తప్పు పట్టాల్సిన అవసరమేమీ లేదు. కానీ కేసీఆర్‌ వారి సేవలను ఏ మేరకు వాడుకున్నారనేది ప్రశ్న. వారిని ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే నిలబెట్టారనే విమర్శ ఉంది. ఉదాహరణకు మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కేసీఆర్‌ ఎస్‌కె జోషీ సలహాలు తీసుకున్నట్లు లేదు. అలాగే, నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కూడా ఆయన పాత్ర లేదని సమాచారం. మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఉన్న ఎకె ఖాన్‌ (AK Khan) రంజాన్‌, క్రిస్టమస్‌ పండుగల సందర్భాల్లో మాత్రమే కనిపించేవారు. ప్రభుత్వ సలహాదారులకు కేసీఆర్‌ ప్రభుత్వంలో అసలు ఏ విధమైన క్రియాశీలక పాత్ర లేదు. అయితే, కేసీఆర్‌ ఇంత మంది సలహాదారులను ఎందుకు నియమించుకున్నారనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. 

నిజానికి, కేసీఆర్‌ అన్ని రంగాలకు సంబంధించిన నిపుణుడిగా వ్యవహరించేవారు. అన్నీ తనకు తెలుసుననే విధంగా ఆయన వ్యవహారశైలి ఉంటూ వచ్చింది. అటువంటి సందర్భంలో విడిగా సలహాదారులు ఎందుకు అనేది ప్రశ్న. వారిని వినియోగించుకోలేనప్పుడు వారి అవసరం ఏమిటనేది కూడా ప్రశ్న. సీనియర్‌ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) సలహాదారుగా నియమించుకున్నారు. అక్కడ చేయడానికి పనేం లేదనే ఉద్దేశంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోని సలహాదారులు అలా రాజీనామాలు చేసిన సందర్భాలు  లేవు. ఏమైనా కేసీఆర్‌ ప్రభుత్వంలో సలహాదారు ప్రత్యేక సంత ఏర్పడిరది.

- కాసుల ప్రతాపరెడ్డి

Saturday, December 9, 2023

కేసీఆర్‌ నిర్మాణం ఇదీ: విద్యుత్తు రంగమే నిదర్శనం, రఘును విని ఉంటే.. - KCR ignored experts, Power sector collapsed in Telangana

 కేసీఆర్‌ నిర్మాణం ఇదీ: విద్యుత్తు రంగమే నిదర్శనం, రఘును విని ఉంటే..


మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao) దూరదృష్టి లేదని చెప్పడానికి విద్యుత్తు సంస్థల వ్యవహారమే నిదర్శనం. తెలంగాణ నిర్మాణంపై ఆయనకు పెద్దగా శ్రద్ధ లేదని చెప్పడానికి విద్యుత్తు సంస్థల తీరుతెన్నులు ఓ తార్కాణం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని సంస్థలు కూడా విధ్వంసం దిశగా ప్రయాణం చేయడానికి కేసీఆర్‌కు నిర్దిష్టమై, నిర్దుష్టమైన ప్రణాళికలేవీ లేవని అర్థం చేసుకోవచ్చు. చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆ విషయాన్ని పట్టిస్తుంది. ఆయన ప్రభుత్వం చాలా వరకు మౌత్‌ పబ్లిసిటీ మీద నడిచింది. 

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో దాదాపు రెండు గంటలు కరెంట్‌ పోయింది. కేసీఆర్‌ (KCR) కాబట్టి రోజుకు 24 గంటలు కరెంట్‌ ఇచ్చారు, కాంగ్రెస్‌ రాగానే కరెంట్‌ కోతలు ప్రారంభమయ్యాయని కేసీఆర్‌ భక్తులు ప్రచారం ప్రారంభించారు. ఆ రెండు గంటలు హైదరాబాద్‌ అంతటా కరెంట్‌ లేకపోవడానికి కారణాలేమిటో తెలుసుకోకుండానే ఆ ప్రచారం ప్రారంభించారు.  విద్యుత్తు విషయంలో కుట్ర జరుగుతున్నదని రేవంత్‌ రెడ్డి  (Revanth Reddy) చెప్పిన విషయం తెలిసిందే. 



తెలంగాణలో ఉత్పాదక రంగాలపై కేసీఆర్‌ పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో మిగులుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. విద్యుత్తు రంగాన్నే తీసుకుంటే నాలుగు సంస్థలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయని తెలిసిపోతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో ఆ విషయాలు బయటపడ్డాయి. విద్యుత్తు రంగంలో ఉత్పత్తిని పెంచడానికి కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన కృషి చాలా తక్కువ. విద్యుత్తు కొనుగోలుకు పెట్టిన ఖర్చు ఎక్కువ.

రెండు డిస్కంలకు, ట్రాన్స్‌కో, జెన్‌కోలకు కలిపి ప్రస్తుతం 81,516 కోట్ల అప్పులున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2014 ` 2015లో అప్పులు 22,423 కోట్లు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో అప్పులు ఏ స్థాయిలో పెరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు నెలసరి ఆదాయం 3,758 కోట్లు మాత్రమే. 

దీన్ని బట్టి ఇతర రంగాల్లో ఏం జరిగిందో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోని ఆశయాలు, ఆకాంక్షలు గాలికి కొట్టుకుపోయాయి. తెలంగాణ ఉద్యమంలో అన్ని రంగాలకు చెందిన నిపుణులు పాలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వారు లెక్కలతో సహా తెలియజేశారు. సమైక్యాంధ్రవాదుల వాదనలను తిప్పికొట్టడానికి వారు గణాంకాలతో చెప్పిన విధానం ఉద్యమానికి చాలా మేలు చేసింది. అలాంటి నిపుణుల్లో రఘు (Raghu) ఒక్కరు. ఆయన విద్యుత్తు రంగానికి సంబంధించి శాస్త్రీయమైన విధానాలను ముందు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కావాల్సిన విషయాలను మాత్రమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేయవచ్చునో కూడా ఆయన వివరించారు. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఊసు లేదు. ఆయన సేవలను వినియోగించుకోవాలనే విషయాన్ని కేసీఆర్‌ విస్మరించారు. ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదు. 

తెలంగాణలో వివిధ రంగాల విషయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చిన మేధావులను, నిపుణులను ప్రతి ఒక్కరినీ కేసీఆర్‌ విస్మరించారు. బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతో రాజకీయాలను నడిపారు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇతర రాజకీయ పార్టీలను తుదముట్టించి ఎల్లకాలం రాజ్యం చేద్దామని ఆయన భావించారు. తొలుత టిడిపిని నాశనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను లేవకుండా దెబ్బ తీయాలని ప్రయత్నించారు. 

ప్రజలకు తాయిలాలు పడేస్తే చాలు, వారంతా తన వెంటే ఉంటారని కేసీఆర్‌ భావించారు. కేసీఆర్‌ అమలు చేసిన చాలా పథకాలకు శాస్త్రీయత లేదు. పేద ప్రజల సంక్షేమ దృష్టి పేరుతో సంపన్న వర్గాలకు అందించిందే ఎక్కువ. కేసీఆర్‌ విధానాల వల్ల అన్ని వ్యవస్థలు పతన దిశగా ప్రయాణం సాగించాయి. వాటిని గాడిలో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పెద్ద సవాల్‌.

- కాసుల ప్రతాపరెడ్డి

Thursday, December 7, 2023

ఇదేం తెలంగాణ సంప్రదాయం: ముఖం చాటేసిన కేసీఆర్‌ - KCR attitude towards Revanth Reddy deplored

ఇదేం తెలంగాణ సంప్రదాయం: ముఖం చాటేసిన కేసీఆర్‌


తెలంగాణ సంప్రదాయం గురించి, మర్యాదమన్ననల గురించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao) చాలా మాట్లాడుతుండేవారు. అయితే, ఆయనే దాన్ని పాటించకపోవడం విచిత్రమే కాదు, ఆయన అహంకారపూరిత వైఖరిని తెలియజేస్తున్నది. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌ (KCR) హుందాగా వ్యవహరించలేకపోయారు. కనీస మర్యాదను కూడా పాటించలేదు. ప్రజలకు ముఖం చాటేశారు. ఆయన కుమారుడు కెటీఆర్‌ (KTR) మాట్లాడారు. ఓటమిని అంగీకరిస్తూ ఆయన ఓ ప్రకటన చేశారు. కానీ కేసీఆర్‌ మాత్రం అత్యంత అమర్యాదకరంగా వ్యవహరించారు.



బీఆర్‌ఎస్‌ ఓడిపోయి, కాంగ్రెస్‌ విజయం సాధించగానే కేసీఆర్‌ తన రాజీనామా లేఖను దూత ద్వారా గవర్నర్‌ తమిళిసైకి పంపించారు. చివరగా గవర్నర్‌ను కలవాలనే మర్యాదను ఆయన పాటించలేకపోయారు. ఆ తర్వాత వెంటనే ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. పదేండ్ల పాటు తనకు అధికారం చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేయలేదు. విజయం సాధించిన కాంగ్రెస్‌కు నోటిమాటగానైనా శుభాకాంక్షలు తెలియజేయలేదు. బహుశా, రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మీసం మెలేసి, సవాల్‌ విసిరిన దృశ్యమే కేసీఆర్‌ మదిలో మెదిలి ఉంటుంది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఉంటే కేసీఆర్‌ గౌరవం ఇనుమడిరచి ఉండేది. ఆయన ఆ పని చేయకపోవడం వింతగానే ఉంది. ఫామ్‌హౌస్‌కు వచ్చినవారిని మాత్రం కేసీఆర్‌ కలుస్తున్నారు.

రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడం కేటీఆర్‌కు ఇష్టం లేనట్లు అనిపిస్తున్నది. ఏమైనా కేసీఆర్‌ వ్యవహరించిన తీరు మాత్రం తెలంగాణ ప్రజలను కూడా అవమానించడమే. ప్రజల తీర్పు పట్ల ఆయన కినుక వహించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి సహకరిస్తానని కూడా చెప్పారు. మోడీ మాదిరిగా హుందాతనాన్ని కేసీఆర్‌ ప్రదర్శించలేకపోయారు. కాంగ్రెస్‌ తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ మోడీ మర్యాద పాటించి గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. రేవంత్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సోదరభావం సాగుతుందని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. రేవంత్‌ రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, టిడీపి (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఎమ్యెల్యే బాలకృష్ణ (Balakrishna) కూడా రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

-  కాసుల ప్రతాపరెడ్డి 

మార్పు ప్రారంభమైంది: కంచెలు తొలిగాయి - Revanth Reddy as CM: Change begins in Telangana

 మార్పు ప్రారంభమైంది: కంచెలు తొలిగాయి


ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మార్పు ప్రారంభమైంది. కంచెలు ఒక్కొటొక్కటే తొలుగుతున్నాయి. ప్రగతిభవన్‌ ఇనుపకంచెలను బద్దలు కొట్టారు. దానికి జోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా నామకరణం చేశారు. సచివాలయం లోనికి వెళ్లడానికి కూడా మార్గం సుగమమైంది. జర్నలిస్టులను కూడా లోనికి అనుమతించని విధానం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు స్వేచ్ఛగా సచివాలయానికి వెళ్లడానికి వీలు ఏర్పడిరది. ఎప్పుడో గానీ ముఖ్యమంత్రి సచివాలయంలోకి అడుగు పెట్టేవారు కాదు, ఇప్పుడు పాలన సచివాలయం నుంచే జరగనుంది.



ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము పాలకులం కాదు, సేవకులమని ప్రకటించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు నీరజకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇదంతా జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క (Seethakka), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌ బాబు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. హోం శాఖను ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, మున్సిపల్‌ శాఖను కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy)కి, ఆర్థిక శాఖను శ్రీధర్‌ బాబుకు, నీటిపారుదల శాఖను పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి, మహిళా సంక్షేమ శాఖను కొండా సురేఖకు, రెవెన్యూ శాఖను భట్టి విక్రమార్కకు, వైద్య ఆరోగ్య శాఖను దామోదర రాజనరసింహకు, పౌర సరఫరాల శాఖను జూపల్లి కృష్ణా రావుకు, బీసీ సంక్షేమ శాఖను పొన్నం ప్రభాకర్‌కు, గిరిజన సంక్షేమ శాఖను సీతక్కకు, రోడ్లు భవనాల శాఖను తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించారు.

రేవంత్‌ రెడ్డి చాలా వేగంగా మార్పునకు శ్రీకారం చుట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపు ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ (Praja Darbar) నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ప్రజలు తమ అభిప్రాయాలను అక్కడ తెలియజేయడానికి వీలు కల్పించారు. ప్రజలకు ఈ రోజు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఆయన అన్నారు. తన తొలి ప్రసంగంలో తన పాలన ఎలా ఉండబోతుందనే సూచన ఇచ్చారు.



ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుపకంచెలను గ్యాస్‌ కట్టర్లతో తొలగించారు. రోడ్డు పక్కన ఉన్న షెడ్డును, గ్రిల్స్‌ను తొలగించారు. ప్రజాస్వామ్యబద్దమైన పాలన ఉంటుందని చెప్పడానికి దీన్ని సంకేతంగా తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధారణ ప్రజానీకం సరే, మంత్రులకూ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండేవారు కాదు. ఎవరైనా కలుసుకోవాలంటే సాధ్యమయ్యేది కాదు. విన్నపాలు చేసుకోవడానికి ప్రభుత్వంలో ఒక మార్గమంటూ లేకుండాపోయింది. తాను చేసేదే చేస్తా, చెప్పేదే చెప్తా అనే పద్ధతిలో వ్యవహరిస్తూ వచ్చారు. గడీల పాలనగా కేసీఆర్‌ పాలన పేరు పొందింది. దాన్ని బద్దలు కొడుతానని రేవంత్‌ రెడ్డి చెబుతూ వచ్చారు. అదే పని ఆయన చేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతున్నది. 

రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌, ఎఐసీసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు హాజరయ్యారు. ఇంటలిజెన్స్‌ ఐజీగా బి. శశిధర్‌ రెడ్డి నియమితులయ్యారు. సిఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియమితులయ్యారు.

- కాసుల ప్రతాపరెడ్డి


అవమానాలు మోయలేదీ తెలంగాణ: అందుకే కేసీఆర్‌కు పరాభవం - Telangana results revenge for KCR Insults

 అవమానాలు మోయలేదీ తెలంగాణ: అందుకే కేసీఆర్‌కు పరాభవం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం (Telangana Movement)లో ప్రధానాంశం ఆత్మగౌరవం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తామంతా ఆత్మగౌరవంతో జీవిస్తామని ప్రజలు ఆశించారు. ఇది సామాన్య ప్రజానీకానికి మాత్రమే కాదు, కేసీఆర్‌ (KCR) పార్టీ బీఆర్‌ఎస్‌ (BRS) నేతల ఆత్మగౌరవం కూడా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరులో కొన్ని అహంభావ లక్షణాలున్నా ప్రజలు సర్దుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రదర్శించిన అహంభావం ఎదురు తిరిగింది. తమకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా చాటుకున్నారు. అదే ప్రధానంగా కేసీఆర్‌ను దెబ్బ తీసింది. 

తెలంగాణ ఉద్యమంలో తొలిసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భువనగిరి ప్రాంతంలో ఎంపిటీసి, జడ్‌పిటీసి ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ చాలా సీట్లు గెలుచుకుంది. అలా గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న మేధావులను, ప్రభావశీలురను కూడా అవమానించారు. ఈ విషయంపై బియ్యాల జనార్దన్‌ రావు (Biyyala Janardhan Rao) ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పటి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం తలకెక్కి ప్రజలను ఆవమానించడం ప్రారంభించారు, వారిని వేధించడం మొదలు పెట్టారు. క్షేత్ర పరిశోధన చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.



తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌ కూడా అదే పంథా అనుసరించారు. ఆయన తనయుడు కేటీఆర్‌ (KTR) ఏమీ తీసిపోలేదు. బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఇదే అయింది. మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి అందుకే పార్టీని వీడారు. తన పట్ల కేటీఆర్‌ అనుసరించిన వైఖరికి ఆయన తీవ్రమైన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే, కొండా విశ్వేశ్వర రెడ్డి (Konda Visweshwar Reddy)తో ఏమవుతుందిలే అని కేసీఆర్‌కు గానీ కేటీఆర్‌కు గానీ అనుకుని ఉండవచ్చు. కానీ, అది పెరిగి పెరిగి పెద్దదై ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపించింది.

కామారెడ్డి (Kamareddy) నుంచి బిజెపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) అన్న మాటలను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు ఆయన బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. వెంకటరమణారెడ్డి ఎవరో తెలియదన్నట్లుగా కేటీఆర్‌ ఆయనెవరో ఉన్నాడు కదా అనే పద్ధతిలో మాట్లాడారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వెంకటరమణారెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌ జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా చేస్తానని చెప్పారు. వెంకటరమణా రెడ్డి అదే చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిరచారు.

సీనియర్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswar Rao) ఉదంతాలను కూడా గుర్తు చేసుకోవాలి. వారు బీఆర్‌ఎస్‌ నుంచి ఎందుకు వెళ్లిపోయారనే విషయాన్ని గమనిస్తే అది స్పష్టంగానే అర్థమవుతుంది. కేవలం ఆత్మగౌరవం కోసం వారు పార్టీని వీడారు. తుమ్మల నాగేశ్వర రావు పట్ల కేసీఆర్‌, పొంగులేటి పట్ల కేటీఆర్‌ వ్యవహరించిన తీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ను చావుదెబ్బ తీసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాలుగైదు సీట్లలో ప్రభావం చూపగలరని తెలిసినా కేటీఆర్‌ ఆయనను అవమానించారు. 

తెలంగాణ ప్రజలకు తాము తప్ప మరో గతిలేదనే పద్ధతిలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు (KCR Family) వ్యవహరించారు. నాయకులను, మేధావులను, కళాకారులను ఒక్కరొక్కరినే వారు దూరం చేసుకున్నారు. చివరకు ప్రజలను కూడా దూరం చేసుకున్నారు. ఇది కేసీఆర్‌, కేటీఆర్‌లకు మాత్రమే వర్తించదు, వారి ప్రాపకంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరి ప్రాపకంతో స్థానిక ప్రజా ప్రతినిధులు అహంకారపూరితంగా, అందరినీ దూరం చేసుకుంటూ వెళ్లారు. దాని ఫలితాన్ని అనుభవించారు. 

పెద్దగా ఆర్భాటాలు చేయని, అహంకార ప్రదర్శన చేయని బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ప్రజలు తిరిగి గెలిపించారు. దీన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. 

-కాసుల ప్రతాపరెడ్డి

Wednesday, December 6, 2023

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు ఇవీ... Reasons behind selecting Revanth Reddy as Telangana CM

 ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు ఇవీ...


తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు అంటే 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM)గా రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేయడం వెనుక పలు ఆసక్తిరమైన అంశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన కన్నా సీనియర్లు, వయస్సులో ఆయన పెద్దవాళ్లు పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ రేవంత్‌ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సిఎల్‌పి నేతగా రేవంత్‌ రెడ్డి ఎంపికైనట్లు ప్రకటన చేసిన సందర్భంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ (KC Venugopal) ఓ మాట అన్నారు. రేవంత్‌ రెడ్డిని డైనమిక్‌ లీడర్‌గా అభివర్ణించారు. ఆయన కన్నా పార్టీలో సీనియర్లు, వయస్సులో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అది ప్రధాన కారణం. 



నిజానికి, 2014లోనే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సి ఉండిరదనేది రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఇతర సీనియర్‌ నాయకులు అనుకుంటున్నారు. ఈ స్థితిలో రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వచ్చి, తెలంగాణ పిసిసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఓ ఊపును తీసుకుని వచ్చారు. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం వెనక 2024లో జరిగే లోకసభ ఎన్నికలను Lok Sabha Elections 2024) దృష్టిలో పెట్టుకోవడం ఉంది.

నిజానికి రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ధైర్యంతో కూడుకున్న పనే. రేవంత్‌ రెడ్డి 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2021లో పిసీసీ అధ్యక్షుడయ్యారు. ఇలా చూస్తే పార్టీలో ఆయన జూనియర్‌. అయితే, పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన దూకుడు ప్రదర్శించారు. అంతే కాకుండా సీనియర్లతో వ్యవహరించిన తీరు కూడా ప్రశంసణీయంగా ఉంది. సీనియర్లతో ఆయన తన సంబంధాలను మెరుగుపరుచుకుంటూ వచ్చారు. నిజానికి, దాదాపు 8 నెలల క్రితమే ఆయన ఈ పని ప్రారంభించారు. 

ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకుని వచ్చిన విషయంలో ఆయన చూపిన చొరవ, ప్రదర్శించిన దూకుడు పార్టీకి కలిసి వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి హనుమంతరావు బిజెపిలోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ, దానికి బ్రేకులు పడిన వెంటనే రేవంత్‌ రెడ్డి చురుగ్గా వ్యవహరించారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడంతో కాంగ్రెస్‌ అంచనాలు పెరిగాయి. కాంగ్రెస్‌ పట్ల ఓ సానుకూల వాతావరణం ఏర్పడిరది. 

బీఆర్‌ఎస్‌ నేత మైనంపల్లి హనుమంతరావును పార్టీలోకి తేవడం కూడా రేవంత్‌ రెడ్డి నాయకత్వ లక్షణాన్ని బయటపెట్టింది. తన కుమారుడు రోహిత్‌ రావుకు, తనకు కూడా అసెంబ్లీ స్థానాలు కావాలని మైనంపల్లి పెట్టిన డిమాండ్‌కు అంగీకరించడమే కాకుండా అందుకు అధిష్టానాన్ని ఒప్పించారు. అయితే మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయినప్పటికీ ఆయన కుమారుడు విజయం సాధించారు. అదే వేరే విషయం. మైనంపల్లి హనుమంతరావు రావడం కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చింది. 

కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత పలు ఊహాగానాలు చెలరేగాయి. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం దక్కదనే ప్రచారం సాగింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy), మల్లుభట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌ బాబు వంటి సీనియర్లు ఆయనకు అడ్డం పడుతారని భావించారు. దానివల్ల కాంగ్రెస్‌ అంటే ప్రజల్లో వ్యతిరేక భావన ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ వ్యవహారం అంతా అందుకు భిన్నంగా జరిగింది.

హైదరాబాదులో ఎల్లా హోటల్‌లో ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. డికె శివకుమార్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. 20 నుంచి 25 మంది రేవంత్‌ రెడ్డి పేరు సూచించినట్లు తెలుస్తున్నది. మరో 15 నుంచి 20 మంది అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. నలుగురైదుగురు మాత్రమే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, భట్టికి మద్దతు పలికారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో డికె శివకుమార్‌ అధిష్టానానికి ఓ నివేదిక సమర్పించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, మల్లుభట్టి విక్రమార్కను హస్తినకు పలిపించుకుని మాట్లాడారు. వారికి నచ్చ జెప్పారు. దళిత ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించాలనే వాదనకు బలం ఉన్నప్పటికీ అంతగా దూకుడు చూపలేని, చొరవ ప్రదర్శింలేని ఆయనకు అవకాశం ఇవ్వడం అధిష్టానానికి ఇష్టం లేదు. అలాగే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా. ఆయన చాలాకాలం పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, ఆయన పార్టీ శ్రేణులను కదలించడంలో, వారికి విశ్వాసం కలుగజేయడంలో విఫలమయ్యారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు వంటి సీనియర్లకు తగిన గౌరవం ఉండేలా రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తారనే ప్రాతిపదికను అధిష్టానం తయారు చేసింది. వారికి ఆ నమ్మకం కలిగించింది. ప్రభుత్వం వన్‌ మ్యాన్‌ షో కాదని, జట్టుగా ముందుకు సాగుతుందని కేసీ వేణుగోపాల్‌ చెప్పడంలోని ఆంతర్యం అదే. ఏమైనా రేవంత్‌ రెడ్డికి అన్నీ కలిసి రావడమే కాకుండా గమ్యం చేరుకోవగానికి పట్టుదలతో పనిచేశారు. పార్టీలో ఎవరినీ నొప్పించకుండా వ్యవహరించారు. తగిన బలాన్ని పార్టీకి సమకూర్చి పెట్టారు.

- కాసుల ప్రతాపరెడ్డి

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...