Saturday, December 9, 2023

కేసీఆర్‌ నిర్మాణం ఇదీ: విద్యుత్తు రంగమే నిదర్శనం, రఘును విని ఉంటే.. - KCR ignored experts, Power sector collapsed in Telangana

 కేసీఆర్‌ నిర్మాణం ఇదీ: విద్యుత్తు రంగమే నిదర్శనం, రఘును విని ఉంటే..


మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao) దూరదృష్టి లేదని చెప్పడానికి విద్యుత్తు సంస్థల వ్యవహారమే నిదర్శనం. తెలంగాణ నిర్మాణంపై ఆయనకు పెద్దగా శ్రద్ధ లేదని చెప్పడానికి విద్యుత్తు సంస్థల తీరుతెన్నులు ఓ తార్కాణం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని సంస్థలు కూడా విధ్వంసం దిశగా ప్రయాణం చేయడానికి కేసీఆర్‌కు నిర్దిష్టమై, నిర్దుష్టమైన ప్రణాళికలేవీ లేవని అర్థం చేసుకోవచ్చు. చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆ విషయాన్ని పట్టిస్తుంది. ఆయన ప్రభుత్వం చాలా వరకు మౌత్‌ పబ్లిసిటీ మీద నడిచింది. 

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో దాదాపు రెండు గంటలు కరెంట్‌ పోయింది. కేసీఆర్‌ (KCR) కాబట్టి రోజుకు 24 గంటలు కరెంట్‌ ఇచ్చారు, కాంగ్రెస్‌ రాగానే కరెంట్‌ కోతలు ప్రారంభమయ్యాయని కేసీఆర్‌ భక్తులు ప్రచారం ప్రారంభించారు. ఆ రెండు గంటలు హైదరాబాద్‌ అంతటా కరెంట్‌ లేకపోవడానికి కారణాలేమిటో తెలుసుకోకుండానే ఆ ప్రచారం ప్రారంభించారు.  విద్యుత్తు విషయంలో కుట్ర జరుగుతున్నదని రేవంత్‌ రెడ్డి  (Revanth Reddy) చెప్పిన విషయం తెలిసిందే. 



తెలంగాణలో ఉత్పాదక రంగాలపై కేసీఆర్‌ పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో మిగులుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. విద్యుత్తు రంగాన్నే తీసుకుంటే నాలుగు సంస్థలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయని తెలిసిపోతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో ఆ విషయాలు బయటపడ్డాయి. విద్యుత్తు రంగంలో ఉత్పత్తిని పెంచడానికి కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన కృషి చాలా తక్కువ. విద్యుత్తు కొనుగోలుకు పెట్టిన ఖర్చు ఎక్కువ.

రెండు డిస్కంలకు, ట్రాన్స్‌కో, జెన్‌కోలకు కలిపి ప్రస్తుతం 81,516 కోట్ల అప్పులున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2014 ` 2015లో అప్పులు 22,423 కోట్లు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో అప్పులు ఏ స్థాయిలో పెరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు నెలసరి ఆదాయం 3,758 కోట్లు మాత్రమే. 

దీన్ని బట్టి ఇతర రంగాల్లో ఏం జరిగిందో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోని ఆశయాలు, ఆకాంక్షలు గాలికి కొట్టుకుపోయాయి. తెలంగాణ ఉద్యమంలో అన్ని రంగాలకు చెందిన నిపుణులు పాలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వారు లెక్కలతో సహా తెలియజేశారు. సమైక్యాంధ్రవాదుల వాదనలను తిప్పికొట్టడానికి వారు గణాంకాలతో చెప్పిన విధానం ఉద్యమానికి చాలా మేలు చేసింది. అలాంటి నిపుణుల్లో రఘు (Raghu) ఒక్కరు. ఆయన విద్యుత్తు రంగానికి సంబంధించి శాస్త్రీయమైన విధానాలను ముందు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కావాల్సిన విషయాలను మాత్రమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేయవచ్చునో కూడా ఆయన వివరించారు. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఊసు లేదు. ఆయన సేవలను వినియోగించుకోవాలనే విషయాన్ని కేసీఆర్‌ విస్మరించారు. ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదు. 

తెలంగాణలో వివిధ రంగాల విషయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చిన మేధావులను, నిపుణులను ప్రతి ఒక్కరినీ కేసీఆర్‌ విస్మరించారు. బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతో రాజకీయాలను నడిపారు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇతర రాజకీయ పార్టీలను తుదముట్టించి ఎల్లకాలం రాజ్యం చేద్దామని ఆయన భావించారు. తొలుత టిడిపిని నాశనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను లేవకుండా దెబ్బ తీయాలని ప్రయత్నించారు. 

ప్రజలకు తాయిలాలు పడేస్తే చాలు, వారంతా తన వెంటే ఉంటారని కేసీఆర్‌ భావించారు. కేసీఆర్‌ అమలు చేసిన చాలా పథకాలకు శాస్త్రీయత లేదు. పేద ప్రజల సంక్షేమ దృష్టి పేరుతో సంపన్న వర్గాలకు అందించిందే ఎక్కువ. కేసీఆర్‌ విధానాల వల్ల అన్ని వ్యవస్థలు పతన దిశగా ప్రయాణం సాగించాయి. వాటిని గాడిలో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పెద్ద సవాల్‌.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...