Tuesday, December 26, 2023

కొద్దిగా పర్సనల్‌: కులవిద్వేషంతో కంపు కొట్టిన దేశపతి, అల్లం నారాయణ - Deshapthi, Allam Narayan caste politics in Telangana

 కొద్దిగా పర్సనల్‌: కులవిద్వేషంతో కంపు కొట్టిన దేశపతి, అల్లం నారాయణ


కొంచెం పర్సనల్‌గానే రాద్దామని అనిపించింది. తెలంగాణ బుద్ధిజీవులుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అల్లం నారాయణ (Allam Narayana), దేశపతి శ్రీనివాస్‌ (Deshapthi Srinivas), వి. ప్రకాశ్‌ (V Prakash) మాటలను మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు అలా అనిపించింది. తెలుగు సమాజంలో దళిత, బహుజన, మైనారిటీ వాదాలు ముందుకు వచ్చినప్పుడు వాటిని బలపరిచినవారు ఎవరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ వంతు పాత్ర వహించినవాళ్లలో రెడ్డి సామాజిక వర్గం (Reddy caste) లేదా అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణాధిక్యత మీద భావజాల రంగంలో పనిచేసినవారెవరు? దళిత సాహిత్యం (Dalith Literature) మీద రాసి పేరు తెచ్చుకుంటున్నావని ఓ మహా రచయిత నన్ను ఎత్తిపొడిచాడు. ఆయనకు హామీ ఇచ్చి అప్పటి నుంచి దళిత సాహిత్యం గురించి రాయడం మానేశాను. ఎందుకంటే దళితుల గురించి దళితులే రాసుకోవాలనే అర్థం ఆ రచయిత మాటల ద్వారా అర్థమైంది. ఇక నా కథల పుస్తకానికి ఎల్లమ్మ, ఇతర కథలు (Yellamma & other stories) అనే పేరు పెట్టాను. ఎల్లమ్మ పేరు పెట్టుకోవడానికి వీడెవడు అని కూడా ఆ మహా రచయిత అన్నాడు. రెడ్లు సమాజంలో శూద్రులు. వారికి కూడా గ్రామ దేవతలున్నారు. ఎల్లమ్మ, మైసమ్మలాంటి గ్రామదేవతలనే వాళ్లు కొలిచారు. ఆ మహా రచయిత మాటలకు నేనేమీ సమాధానం ఇవ్వలేదు. కానీ సమాజం అన్నీ చూస్తుంటుంది, ఎవరేమిటో కూడా నిర్ధారణకు వస్తుంది. 



కేవలం రెడ్డి సామాజికవర్గం వ్యతిరేకత మీద ఇంత కాలం కేసీఆర్‌ ప్రభుత్వం నడిచిందని అనుకోవాలా? అలా నడవడంలో తప్పేమీ లేదు. కానీ, అధిక సంఖ్యాకులైన నిమ్న కులాలవారికి (నిమ్న అని పదం వాడడం సరైంది కాదు. కానీ మరో పదం దొరకలేదు) కేసీఆర్‌ (KCR) ప్రభుత్వాన్ని ఇవాళ తిప్పికొట్టిందెవరు? రెడ్డి సామాజికవర్గం మీద వ్యతిరేకతతోనే కావచ్చు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratap Reddy) పేరు పెడుతానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ దాన్ని దాటవేస్తూ వచ్చారు.

అనుకోకుండా నందిని సిధారెడ్డి (nandini Sidha Reddy), సుంకిరెడ్డి నారాయణరెడ్డి (Sunkireddy Narayana Reddy)లతో కలిసి నేను కేసీఆర్‌ కలవాల్సి వచ్చింది. ఆ సమయంలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతామని ఇచ్చిన హామీని నేను గుర్తు చేశాను. చెప్పిన కదా, పెడుతామని కేసీఆర్‌ అన్నారు. తొలిసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటన అది. రెండోసారి కూడా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దాని ఊసు ఎత్తలేదు. తెలుగు విశ్వవిద్యాలయం కోస్తాంధ్రకు చెందిన మహానుభావుడి పేరును కొనసాగించడానికే ఇష్టపడ్డారు తప్ప రెడ్డి కావడం వల్ల సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి ఇష్టపడలేదని అనుకోవాల్సి ఉంటుంది.

దాన్ని కాసేపు పక్కన పెడితే, వి. ప్రకాశ్‌, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్‌ ఓ టీవీ చర్చ చాలా పాతది. అయితే, చర్చలో రెడ్లపై కక్కిన విద్వేషపూరితమైన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతున్నది. కంపు అనే పదానికి సువాసన అనే అర్థం ఉండేది. ఆ పదం అర్థన్యూనతకు గురై దుర్వాసన అనే అర్థంలో స్థిరపడిపోయింది. అ ముగ్గురు బుద్ధిజీవులు కూడా గౌరవాన్ని, సంస్కారాన్ని కోల్పోయారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, అగ్రకుల రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ, ముఖ్యంగా వారి మాటల్లో విద్వేషం కొట్టిచ్చినట్లు కనిపించడం అత్యంత దారుణమైంది. 

కోదండరామ్‌ (Kodandaram)ను వ్యతిరేకిస్తూ వారి మాటలన్నీ సాగాయి. కోదండరామ్‌ను వారు వ్యతిరేకించవచ్చు. కానీ, అంతగా విద్వేషాన్ని వెళ్లగక్కాలా అనేది ప్రశ్న. వెలమల ఆధిక్యతను నిలబెట్టడానికి అంతగా తాపత్రయపడాలా అనేది కూడా ప్రశ్న. సమాజం మొదట్లో కేసీఆర్‌ నాయకత్వాన్ని కులంతో బేరీజు వేయలేదు. పాలన సాగుతూ వస్తున్న క్రమంలో ఆయన కుల ప్రాధాన్యంపై చర్చ జరుగుతూ వచ్చింది. అయితే, 2.5 శాతం రెడ్లు అధికారంలో ఉండాలా, 1.5 శాతం వెలమలు ఉండకూడదా అనే ప్రశ్నను వారు లేవనెత్తారు. కానీ ఉండకూడదని ఎవరూ అనలేదు. దాన్ని వారే ఆపాదించారు. తెలంగాణ సమాజంలో చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో వారు ఆ ప్రశ్న లేవనెత్తి ఉండవచ్చు. అలాంటి ప్రశ్న వేసే హక్కు కూడా వారికి ఉంది. దాన్ని కాదనలేం. కానీ, దేశపతి శ్రీనివాస్‌, అల్లం నారాయణ మాటల్లో వ్యక్తమైన వ్యంగ్యం విద్వేష స్థాయికి వెళ్లింది. 

దేశపతి శ్రీనివాస్‌ ఏదో అంటే, అల్లం నారాయణ 2.5 అనే మాటను పలికిన తీరు చూస్తే విద్వేషం ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజ్యం రావాలి, రేవంత్‌ రెడ్డి రాజ్యం రావాలి, జానారెడ్డి రాజ్యం రావాలి. నాగం జనార్దన్‌ రెడ్డి రాజ్యం రావాలి. జైపాల్‌ రెడ్డి రాజ్యం రావాలి, కోదండరామ్‌ రెడ్డి రాజ్యం రావాలి అని దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడిన తీరు సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయిలో ఇంది. రెడ్డి అనే పదాన్ని ఆయన సహజ సామాజికవర్గం వ్యంగ్యంతో ఒత్తి పలికిన తీరును గమనించాల్సే ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గాన్ని అధికారంలోకి రాకుండా నిలువరించే హక్కు కూడా ఉంది. కానీ, ఆ చర్చను సంస్కారవంతంగా సాగించాల్సి ఉండిరది. మళ్లీ ఒక్కసారి పర్సనల్‌ విషయమే మాట్లాడుతాను. దళిత వాదాన్ని బలపరిచే సమయంలో నేను కూడా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి విమర్శ చేసినవాడినే. కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం గురించి కూడా మాట్లాడాను. కమ్మ సామాజికవర్గం గురించి అంత విద్వేషపూరితంగా మాట్లాడలేదు. మిగతా రెడ్డి బుద్దిజీవులు కూడా అలా మాట్లాడలేదు.

మరో ప్రధానమైన విషయం చెప్పుకోవాలి. చరిత్ర కొన్నాళ్లు మరుగున పడిపోతుందేమో గానీ తిరిగి ముందుకు వస్తుంది. ముగ్గురు వి. ప్రకాశ్‌, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్‌ విప్లవ భావజాలం నుంచి వచ్చినవాళ్లు, విప్లవోద్యమాల నేపథ్యం వారికి ఉంది. తెలంగాణ సాయుధపోరాటం (Telangana Armed Struggle)లో కేవలం రెడ్డి దొరలు మాత్రమే అధికారం, ఆధిపత్యం చెలాయించలేదు. వారిలో వెలమ (Velama) దొరలు మాత్రమే కాకుండా ముస్లిం దొరలు కూడా ఉంన్నారు. అయితే విసునూరి రామచంద్రారెడ్డి కారణంగా రెడ్డి దొరల దౌర్జన్యాలు పెద్ద యెత్తున ముందుకు వచ్చాయి. బండెనక బండి కట్టి అనే పాట ప్రతాపరెడ్డి దొరకు వ్యతిరేకంగా సాగింది. ఆ రెడ్లను ఇతర రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు గంపగుత్తగా బలపరచలేదు. వారి వెనుక ఇతర కులాలవాళ్లు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలకు నాయకత్వం వహించి త్యాగాలు చేసినవారిలో రెడ్లు ఉన్నారు. రావి నారాయణరెడ్డి (Ravi Narayan Reddy), బిఎన్‌ రెడ్డి (BN Reddy), ఆరుట్ల రామచంద్రారెడ్డి (Arutla Ramachandra Reddy), మల్లు స్వరాస్యం (Mallu Swarajyam), ఆరుట్ల కమలాదేవి (Arutla Kamaladevi) వంటివారు ఎవరి పక్షం వహించారు? అలాగే నక్సలైట్‌ ఉద్యమంలో ఎన్‌కౌంటర్‌ అయిన నల్లా ఆదిరెడ్డి (Nalla Adireddy), మహేష్‌ (Mahesh)


ఎవరు? అల్లం, దేశపతి, ప్రకాశ్‌ త్రయం ఆ ఉద్యమాల నుంచి వచ్చినవారే. కులాధిక్యతను ఏ రకంగా వ్యతిరేకించాలి, ఎవరి కోసం వ్యతిరేకించాలనే విచక్షణతో మాట్లాడితే అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. కోదండరామ్‌ను వ్యతిరేకించడానికి మొత్తం రెడ్డి సామాజికవర్గాన్ని ఆ గాటనే కట్టేసే ఆధిపత్య ధోరణి వారికి ఎక్కడి నుంచి వచ్చింది. ఓ అగ్రకుల పాలనలో పొందిన భద్రత, జీవనోపాధి, పదవులు వారిని ఆ స్థాయికి దిగజార్చాయని చెప్పకతప్పదు.

నేను రెడ్డిగానే ఈ వ్యాసం రాశానని అనుకోవచ్చు. కానీ నా సామాజిక నేపథ్యం వేరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బొందుగుల గ్రామంలో నేను కూడా దొరల ఆధిపత్యం కింద నలిగిపోయినవాడినే. వారిని ప్రశ్నించడానికి నా సామాజిక నేపథ్యం, ఇంత కాలంగా నేను నడిచిన తొవ్వ హక్కు ఇచ్చిందనే అభిప్రాయం నాకు ఉంది. 

- కాసుల ప్రతాపరెడ్డి

1 comment:

  1. మీ వాదన సమంజసమే.. కానీ అక్కడ తమనాయకుడి కనుసన్నల్లో మెలగటానికి పడిన తాపత్రయంలో హద్దు దాటారనుకోవాలి

    ReplyDelete

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...