Tuesday, December 26, 2023

అసలు రంగు బయటపెట్టిన కల్వకుంట్ల కవిత - Kalvakuntla Kavitha speaks on Sanathana Dharma, why?

 అసలు రంగు బయటపెట్టిన కల్వకుంట్ల కవిత


తమ తండ్రి కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) పరాజయం పాలైన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), ఎమ్యెల్యే కేటీఆర్‌ (KTR) తమ అసలు రంగును బయటపెట్టారు. కవిత హిందూ మతాన్ని (Hinduism) కౌగలించుకున్నారు. దానికన్నా ముందే కేటీఆర్‌కు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇటాలియన్‌ అనే విషయం గుర్తుకు వచ్చింది. కాంగ్రెస్‌ (Congress) డిఎన్‌ఎలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని, సనాతన ధర్మాన్ని అవమానిస్తే రాహుల్‌ గాంధీ (Rahul Gndhi) స్పందించలేదని, డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత మాటలు నిజానికి చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఆ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ చూసే మనకు ఆ విషయం అర్థమవుతుంది. 



అకస్మాత్తుగా సనాతన ధర్మం, హిందూ మతం కవితకు వస్తువు కావడం ఆశ్చర్యమే. సనాతన ధర్మం Sanathana Dharma), హిందూ మతం మనుస్మృతి (Manusmriti)ని ఆధారం చేసుకుంటాయి. మహిళలను, శూద్రులను, దళితులను ఎలాంటి చట్రంలో బిగించదలుచుకుంటాయో మనకు చాలా మందికే తెలుసు. కవిత ఆ చట్రంలో ఉండిపోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించాల్సిన పనేం లేదు గానీ ఆ చట్రంలో ఉంటే ఆమెకు ప్రజా జీవితం ఉండేది కాదు. ఈ విషయం కవితకు తెలియదని అనలేం. 

కానీ, ఇప్పుడే ఆమె ఆ మాటలు ఎందుకున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. కొద్ది నెలల్లో లోకసభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బిజెపి (BJP)తో బహిరంగ స్నేహం చేయడానికి సిద్ధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ను ఢీకొంటుందా, సమరం కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య జరిగి బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోతుందా అనే చర్చ సాగుతున్నది. శాసనసభ ఎన్నికల్లో బిజెపి అనూహ్యమైన ఫలితాలనే సాధించింది. దాదాపు 19 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. దాని ఓట్ల శాతం కూడా పెరిగింది. పైగా, లోకసభ ఎన్నికలు జాతీయ స్థాయి అంశాలపై ఆధారపడి జరుగుతాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు అంతగా వీలుండదు. బీఆర్‌ఎస్‌ శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది కావచ్చు. కానీ ఓటమి వల్ల లోకసభ ఎన్నికల్లో అది సత్తా చాటే పరిస్థితి ఉండకపోవచ్చు. 

బిజెపి వ్యూహం కూడా మారవచ్చు. బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారడానికి అవసరమైన వ్యూహాన్ని అనుసరించవచ్చు. అప్పుడు బీఆర్‌ఎస్‌ తీవ్రంగా నష్టపోతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, శాసనసభ ఎన్నికల్లో బిజెపి, బీఆర్‌ఎస్‌ రహస్య అవగాహనతో పనిచేశాయనే ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే నమ్మారు. బిజెపితో అవగాహన కారణంగానే హైదరాబాద్‌, హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఫలితాలు గ్రామీణ నియోజకవర్గాల ఫలితాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు.

సరే అదంతా ఒక్క వాదన. మరో విషయం ఏమిటంటే కవిత చాలా సులువుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోయినట్టున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధానాంశాలపై ఉద్యమం నడిచింది. నీళ్ల సంగతి మేడిగడ్డ (Medigadda) పరిస్థితి పట్టిస్తూనే ఉంది. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారింది. నియామకాల సంగతి టిఎస్‌పిఎస్‌సీ పరీక్షల (TSPSC Exams) తంతు తెలియజేస్తూనే ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆకాంక్షలకు భిన్నంగా నడిచిందని అర్థమవుతున్నది. కవిత ఈ విషయాలను  ఇక పట్టించుకోరనేది అర్థమవుతున్నది. హిందూ మతాన్ని ఎజెండాగా మార్చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే సంకల్పంతో ఉన్నట్లు అర్థమవుతున్నది.

ఇక అత్యంత ప్రధానమైన విషయం. హైదరాబాద్‌ ఫలితాలు కేసీఆర్‌ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేసిందనే విషయాన్ని పట్టిస్తున్నాయి. సీమాంధ్ర పెత్తందార్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నడిచింది. హైదరాబాద్‌ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా కేసీఆర్‌ ప్రభుత్వం నడిచిందనే విషయం అర్థమవుతుంది. వివిధ కాంట్రాక్టులు ఎవరికి వెళ్లాయనే విషయాన్ని లోతుగా పరిశీలించినా ఆ విషయం బయపడవచ్చు. 

ఓటమికి కారణాలను కనిపెట్టడానికి సరైన దిశలో ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, తమకు ఎప్పుడు ఏది అవసరమనిపిస్తే అది మాట్లాడడం బీఆర్‌ఎస్‌ నేతలకు అలవాటుగా మారింది. అలవాటు, ఆధిపత్య ధోరణి, అణచివేత, నిరంకుశత్వం బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఓడిరచాయి. అది గ్రహిస్తే ఇప్పటికైనా మంచిది.

నోట్‌: ఢల్లీి లిక్కర్‌ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడానికి బిజెపితో కేసీఆర్‌ అవగాహనకు రావడమే కారణమనే ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆయన మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి

2 comments:

  1. నిజానికి, కేసీఆర్, కేటీఆర్ కూడా ఒకరకమైన లొంగుబాటుకు సిద్దపడ్డారేమో అనిపిస్తోంది. రేవంత్ రివేంజ్ ఎలా తీర్చుకుంటాడో అనే భయం ఉన్నట్టుంది.

    ReplyDelete

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...