Wednesday, December 27, 2023

గుమ్మడి నర్సయ్యకే ధరణి టోకరా: కేసీఆర్‌ పారదర్శకత ఇదీ...- Gummadi Narsaiah problems with Dharani in Telangana

గుమ్మడి నర్సయ్యకే ధరణి టోకరా: కేసీఆర్‌ పారదర్శకత ఇదీ...


ధరణి (Dharani)ని అత్యంత విశిష్టమైన విషయంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర్‌ రావు K Chandrasekhar Rao) చెబుకున్నారు. అవతకవతలను నివారించడానికి అత్యంత పారదర్శకమైందని ఆయన ధరణిని ప్రశంసించారు. ధరణిని తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయాలని ఆయన ఎన్నికలకు ముందు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు కేసీఆర్‌ (KCR) పిలుపునకు వ్యతిరేకంగా ఓటేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిరచారు. తాజాగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య (Gummadi Narsaiah) కూడా ధరణి బాధితుడేనని తెలిసింది. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వచ్చాక ఆయన ఆ విషయాన్ని వెల్లడిరచారు. కేసీఆర్‌ మాటల్లోని డొల్లతనం ఎంతో గుమ్మడి నర్సయ్య ఉదంతం ద్వారా అర్థం చేసుకోవచ్చు.



గుమ్మడి నర్సయ్య జీవనశైలి దృష్ట్యా అత్యంత సామాన్యుడు. కానీ ఐదుసార్లు ఎమ్యెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన బస్సులోనే ప్రయాణించేవారు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. అలాంటి నాయకుడిని కూడా ధరణి ముప్పు తిప్పలు పెట్టింది. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. ధరణి పుణ్యమా అని అది కాస్తా మాయమైంది. ధరణిలో తన రెండెకరాల భూమి కనిపించకపోవడంపై రెండేళ్లుగా తాను అధికారుల చుట్టూ తిరుతున్నానని, ఎక్కడికి వెళ్లినా పరిష్కారం దొరకలేదని ఆయన ఇటీవల వెలుగుతో చెప్పారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భూమి సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి చెప్పుకోవడానికి ఆయన సచివాలయానికి వచ్చారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత బహుశా ఆయనకు ఓ ఆశ కలిగి ఉంటుంది. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ధరణి అక్రమాలపై, ధరణి తప్పులపై మాట్లాడితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎదురు తిరుగుతూ వచ్చారు. అత్యంత పారదర్శకమైందని బుకాయిస్తూ వచ్చారు. మాజీ ఎమ్యెల్యే భూమికే గతి లేదంటే సామాన్యుల పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందరి భూములు ధరణిలో మాయమయ్యాయని తెలియదు.

దానికితోడు, ప్రభుత్వ భూముల కబ్జా కూడా జరిగి ఉంటుంది. ఇటీవల ధరణిపై ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. దరణి తప్పుల తడక అని, గత ప్రభుత్వ హయాంలో భూముల గోల్‌మాల్‌ జరిగిందని ఆయన అంటూ దానిపై సీరియస్‌ అయ్యారు. ధరణి స్థానంలో భూమాత (Bhu Matha) తీసుకుని వస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. కేసీఆర్‌ చెప్పినట్లు ధరణి వల్ల ఎవరి భూములు వారికి ఉంటాయని, వారి భూములు సురక్షితంగా ఉంటాయని అవకతవకలు జరగడానికి వీలు లేదని అన్నారు. ఎందుకు ఇన్ని రెవెన్యూ సమస్యలు ముందుకు వస్తున్నాయనేది ప్రశ్న. ప్రభుత్వ భూములు కబ్జా అయి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్ల మీద ధరణిలో చేరాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల చెప్పారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్దలు క్రమబద్దీకరించుకున్న విషయం కూడా రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చకు వచ్చింది.

ఇప్పుటికప్పుడు ధరణిలోని అవకతవకలను సరిచేస్తామని, ఆ తర్వాత భూమాత పోర్టల్‌ను తీసుకుని వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, క్రమబద్దీకరించుకున్నారని, అందుకు ధరణి పోర్టల్‌ను దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లూటీ చేసిన భూములను స్వాదీనం చేసుకుంటామని, అసలైన యజమానులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. 

ధరణి విషయంలో కేసీఆర్‌ గానీ, ఆయన మనుషులు గానీ చెప్పిందంతా అబద్దమని గుమ్మడి నర్సయ్య ఉదంతం ద్వారా తెలిసిపోతున్నది. ప్రభుత్వ పెద్దలు ధరణిని తమకు అనుకూలంగా వాడుకుని ఉండవచ్చు. తెలంగాణలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో సంపాదనకు అవి సులవైన సరుకులుగా వారాయి. దీంతో అందరూ వాటిపైనే కన్నేశారు. భూమాత ద్వారానైనా ఎవరి భూములు వారికి దక్కుతాయని, ప్రభుత్వ భూములు తిరిగి వస్తాయని ఆశిద్దాం.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...