Wednesday, December 27, 2023

హాట్‌ టాపిక్‌: రాహుల్‌ ముఖ్యమంత్రిని ప్రశ్నించాడు, ఎవరీయన?- Hindu Rahul questions Telangana CM Revanth Reddy

 హాట్‌ టాపిక్‌: రాహుల్‌ ముఖ్యమంత్రిని ప్రశ్నించాడు, ఎవరీయన?


తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మీడియా సమావేశం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. రేవంత్‌ రెడ్డి ఈ రోజు డిసెంబర్‌ 27వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివిధ విషయాలపై మాట్లాడారు. తన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై ఆయన వివరించారు. చివరగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వడం కూడా కొత్త విషయంగానే చర్చకు వచ్చింది. అంతేకాకుండా రాహుల్‌ (Hindu Rahul) ముఖ్యమంత్రికి ప్రశ్న వేశాడనేది వైరల్‌గా మారింది. దీనికి కారణమేమిటని ప్రశ్నించుకుంటే కాస్తా వెనక్కి వెళ్లాలి. ఈ రోజు రాహుల్‌ ప్రశ్న వేయడానికి లేవగానే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాహుల్‌ అని సంబోధించారు. వెంటనే మీడియా సమావేశంలో పెద్ద పెట్టున ధ్వనులు పుట్టాయి. రాహుల్‌ చెప్పిన విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని రేవంత్‌ రెడ్డి చెప్పారు.



బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. వారిని హేళన కూడా చేశాడు. ఈ విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌ అనే జర్నలిస్టు హిందూ దినపత్రికలో పనిచేస్తున్నాడు. ఆయన జర్నలిజంలో సీనియర్‌ కూడా. అటువంటి జర్నలిస్టును కేసీఆర్‌ గతంలో హేళన చేశాడు. 

రాహుల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి (Kiran Kumar Reddy) క్లాస్‌మేట్‌ అని చెబుతారు. దాంతో ఆయన కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఓసారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మురికివాడలో పర్యటిస్తున్నప్పుడు అధికారులు రాహుల్‌ను ఆపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాన్ని గమనించి కిరణ్‌ కుమార్‌ రాహుల్‌ను ఆపవద్దని, ఆయన తనకు చాలా ముఖ్యమైనవాడని చెప్పినట్లు సమాచారం.

అదే సమయంలో కేసీఆర్‌ (KCR) ఓసారి హిందూ కార్యాలయం వద్ద కారు ఆపి, రాహుల్‌ను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడానికి ప్రయత్నించారని, అయితే తనకు పని ఉందని చెబుతూ రాహుల్‌ కేసీఆర్‌ కారులో ఎక్కడానికి నిరాకరించాడని కూడా చెబుతారు. ఇది ఎంత వరకు నిజమనేది నిర్ధారణ కాలేదు. 

అయితే, మీడియా సమావేశంలో రాహుల్‌ ప్రశ్నలు వేసినప్పుడల్లా కేసీఆర్‌ ఏదో పుల్లవిరుపు మాట అనేవారు. రాహుల్‌ గమ్మతైతున్నడు ఈ మధ్య అని కేసీఆర్‌ గతంలో వ్యాఖ్యానించారు. రాహుల్‌ ఎక్‌స్ట్రాలెందుకయ్యా అని ఎత్తిపొడిచారు. రాహుల్‌, ఇది బాధ్యతారహితమైంది, నీ ప్రవర్తన మార్చుకోవాలి అని కూడా అన్నారు. ఇంకా మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరో సందర్భంలో రాహుల్‌ను ఉద్దేశించి మరో వ్యాఖ్య చేశారు. లుంగీ కట్టుకుని ఉత్తరప్రదేశ్‌ నుంచి ఓ ముఖ్యమంత్రి వస్తాడు, ఆయన ఉపన్యాసం ఇస్తారు అని కేసీఆర్‌ అంటూ ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ తలసరి ఆదాయం గురించి చెప్పి, మన రాష్ట్రం పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌లో ఉత్తరప్రదేశ్‌ పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌ 4 శాతం ఎక్కువగా ఉందని అంటూ బాగా లేదా రాహుల్‌ అంటూ లిమిట్‌ ఉండాలి, రాహుల్‌ అని అన్నారు. చైనావాడు మన భూభాగం గుంజుకుంటున్నాడని చెప్తే తాను దేశద్రోహి అవుతానా అని కేసీఆర్‌ అంటూ రాహుల్‌, ఈ వార్త నువ్వు ఇంగ్లీషులో బాగా రాయాలని మరో సందర్భంలో కేసీఆర్‌ అన్నారు.

రాహుల్‌ అని రేవంత్‌ రెడ్డి సంబోధించగానే మీడియా ప్రతినిధులు కూడా రాహుల్‌ వైపు తిరిగి నవ్వారు. రాహుల్‌ చెప్పిన విషయం తమ దృష్టిలో ఉందని, అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో (Lok sbha Elections 2024) కాంగ్రెస్‌ వ్యూహంపై ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు రేవంత్‌ రెడ్డి సమాధానమిస్తూ ` రాజకీయాలు గాంధీభవన్‌లో మాట్లాడుతామని చెప్పారు. గాంధీభవన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం. రేవంత్‌ రెడ్డి తన మీడియా సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏమిటో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని అనుకున్నారా అని ఆయన అన్నారు. సచివాలయంలో మీడియా సెంటర్‌ ఉంటుందని ఆయన చెబుతూ మంత్రులూ అధికారులూ అందుబాటులో ఉంటారని చెప్పారు. సచివాలయంలోని మీడియా సెంటర్‌ కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో మూతపడిరది. జర్నలిస్టులను కూడా సచివాలయంలోకి అనుమతించేవారు కాదు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలోని అవినీతిని బయటపెట్టి తిన్నదంతా కక్కిస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు. వారు రక్తం కూడు తిన్నారని వ్యాఖ్యానించారు. మొత్తం మీద హిందూ రాహుల్‌ సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌ అయ్యారు.

- కాసుల ప్రతాపరెడ్డి 




No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...