Thursday, February 22, 2024

చంద్రబాబుతో కాదు, యుద్ధం రామోజీరావు, జగన్‌లకు మధ్యనే... - AP Assembly Elections 2024: Ramoji fights with YS Jagan, not Chandrababu

 చంద్రబాబుతో కాదు, యుద్ధం రామోజీరావు, జగన్‌లకు మధ్యనే...


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024) కూడా జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలను పక్కన పెడితే ఏపీ శాసనసభ ఎన్నికలే ప్రధానం కానున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేస్తూ యుద్ధరంగంలోకి దిగారు. ఇప్పటికే పలు విడతలుగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించి మూడు సిద్ధం సభల్లో పాల్గొన్నారు. 




టీడీపీ, జనసేన కూటమి (TDP- Jana Sena alliance) బిజెపి (BJP)తో పొత్తు కోసం ఇంకా ఎదురు చూస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో చేరే విషయాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం తేల్చడం లేదు. ఒక రకంగా ప్రతిష్టంభన ఏర్పడిరది. బిజెపి తమతో కలిసి వస్తుందని చెప్పుతూ ఆ రెండు పార్టీలు కొద్ది సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ, వారు ఇంకా యుద్ధరంగంలోకి అడుగుపెట్టనట్లే లెక్క. యుద్ధరంగంలోకి దిగడానికి ఆ రెండు పార్టీలు ఇంకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన జనసేన, టీడీపి కలిసి తాడేపల్లిగూడెంలో నిర్వహించే సభతో యుద్ధరంగంలోకి దిగవచ్చు. 

అయితే, ఈసారి ఏపి ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఎన్నికలు టీడీపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)కి, వైఎస్‌ జగన్‌కు మధ్య జరుగుతున్నట్లు అనిపించడం లేదు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawn Kalyan) వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పుతున్నప్పటికీ, ఆ కూల్చే పనిని ఈనాడు (Eenadu) అధినేత రామోజీరావు (Ramoji rao) భుజాల మీదికి ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు, రామోజీరావుకు మధ్య జరుగుతున్న వార్‌ మాదిరిగా ఈ ఎన్నికల చిత్రం రూపుకడుతోంది. 

రామోజీరావు తెలుగుదేశం పార్టీ (Telugu Desam)కి అనుకూలంగా వ్యవహరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి మాదిరిగా ఆయన వ్యవహరించేవారు కాదు, ఇప్పటి మాదిరిగా తన ఈనాడు పత్రికను వాడలేదు. అందరికీ చెందిన పత్రిక లాగా ఈనాడు కనిపించేది. వార్తాకథనాల్లో లాజిక్‌ ఉండేది. తటస్థులు కూడా నమ్మడానికి వీలైన రీతిలో వార్తాకథనాలు ఉండేవి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు ఈనాడు దినపత్రిక అలా కనిపించడం లేదు. పూర్తిగా అన్నీ వదిలేసి జగన్‌ను ఓడిరచేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది. చంద్రబాబు కన్నా, పవన్‌ కల్యాణ్‌ కన్నా ఎక్కువగా ఎక్కువగా జగన్‌ను ఓడిరచే బాధ్యతను రామోజీరావు మోస్తున్నట్లు కనిపిస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం ఒక్కటో, రెండో వార్తాకథనాలను ఈనాడు దినపత్రిక ప్రచురిస్తున్నది. జగన్‌ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక వార్తాకథనాలను రాయడం సులభమే అవుతుంది. కానీ, ఆ వార్తాకథనాల్లో ఏ మాత్రం సత్యం ఉండడడం లేదని, వాస్తవాలను మరుగు పరిచి రామోజీరావు దుమ్మెత్తిపోస్తున్నారని, ఈనాడులో వచ్చేవన్నీ కట్టుకథలేనని వైఎస్‌ జగన్‌ వర్గం, వైసీపీ నాయకత్వం భావిస్తున్నది. అందుకు విరుగుడుగా సాక్షి మీడియా (Sakshi Media)ను వాడుతున్నారు.

ఫ్యాక్ట్‌ చెక్‌ (Fact Check) పేరు మీద ఈనాడు వార్తాకథనాలను ఖండిరచడమే పనిగా సాక్షి మీడియా పనిచేస్తున్నది. రామోజీరావు ఈనాడులో ప్రచురితమైన వార్తాకథనాలు ఎంత అబద్ధమో చెప్పుతూ సాక్షి దినపత్రిక వార్తాకథనాలను ప్రచురిస్తున్నది. అటు ఈనాడు వంత పాడుతున్న తెలుగుదేశం పార్టీ హార్డ్‌కోర్‌ భక్తులు ఎంత మంది ఉన్నారో, వైఎస్‌ జగన్‌ను బలపరిచే హార్డ్‌కోర్‌ భక్తులు అంతే ఉన్నారు. వారు తమకు నచ్చినదాన్ని చదువుతారు. వాటినే నమ్ముతారు. కానీ తటస్థులైన పాఠకుల సంగతి ఏమిటనేది ప్రశ్న. వాస్తవాలను వారు ఎక్కడ వెతుక్కోవాలనేది సమస్య. 

దాన్ని అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మనబడి నాడు.. నేడు (Mana Badi Nadu - Nedu) అనే పథకాన్ని ఉదాహరణగా తీసుకుందాం. రాష్ట్రంలోని పాఠశాలలను ప్రభుత్వం విడతలవారీగా ఆధునీకరిస్తూ, వాటిలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ఆ పథకం అమలు ఇంకా కొనసాగుతున్నది. ఓ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను వేసి ఈనాడు వార్తాకథనం రాసింది. పాఠశాలల దుస్థితి ఇలా ఉందనేది ఆ వార్తాకథనం సారాంశం. అయితే, పాఠశాలను పునరుద్ధరించే కార్యక్రమం అమలు కొనసాగుతున్నది. అందుకు గాను పిల్లలను బయట కూర్చోబెట్టి భవన నిర్మాణం జరుతున్నదని, దాన్ని పట్టించుకోకుండా ఈనాడు కావాలని అబద్ధం రాతలు రాసిందని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనం రాసింది. 

మరో తాజా సంఘటననే తీసుకుందాం... కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (katasani Rambhupal Reddy)పై ఈనాడు ఓ వార్తాకథనం ప్రచురించింది. వంద కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించారనేది ఆ వార్తాకథనం ముఖ్యాంశం. అయితే, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై ఈనాడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, రామోజీరావుకు సవాల్‌ కూడా విసిరారు. నిజానికి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఇచ్చిన సమాధానాన్ని ఈనాడు ప్రచురించాలి. లేదా తాను రాసిన వార్తాకథనం వాస్తవమే అయితే, ఆధారాలను చూపిస్తూ ఆయనకు జవాబు ఇవ్వాలి. ఆ పని ఈనాడు చేసిందా?

ఇదిలావుంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేవారు. అయితే, ఆయన హయాంలో ఈ పత్రికలు ఇంతగా యుద్ధం ప్రకటించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పత్రికలు రాసే వార్తాకథనాల్లో కొంత హేతుబద్ధత, లాజిక్‌ కనిపించేవి. కానీ, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాస్తున్న రాతల్లో అవి కూడా కనిపించడం లేదు. అంటే, పూర్తిగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పోరాటాన్ని అలా ఉంచి, సొంతంగా వైఎస్‌ జగన్‌ మీద ఆ పత్రికలు యుద్ధం ప్రకటించాయని చెప్పాలి. 

సాక్షి మీడియా రాక ముందు ఈనాడుకు తిరుగు ఉండేది కాదు. కానీ, సాక్షి వచ్చిన తర్వాత ఈనాడు ఏదో కొంత మేరకు కళ్లెం పడుతూ వస్తున్నది. సాక్షి మీడియా వైఎస్‌ జగన్‌ది కాబట్టి ఆయనకు, ఆయన పార్టీకి వంత పాడుతుందనే అభిప్రాయం ఉండడం సహజం. 

ఈనాడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ పత్రిక కాదు. దానివల్ల దానికి ఒకింత తటస్థ మీడియా అనే పేరు ఉంటూ వచ్చింది. వార్తాకథనాల్లో హేతుబద్ధత ఉంటుందనే అభిప్రాయం ఉంటూ వచ్చింది. కానీ, ఈ ఎన్నికల వేడి ప్రారంభమైన తర్వాత ఈనాడుకు ఆ విలువ నశించింది. పూర్తిగా చంద్రబాబు పత్రికగా మారిపోయింది. దీన్ని పాఠకులు గమనించకపోరు. అది బహుశా రామోజీరావుకు పట్టించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆయన వైఎస్‌ జగన్‌ను పరాజయం పాలు చేయడమే ముఖ్య కార్యక్రమంగా, తన బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి. ఈనాడు పూర్తిగా విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నది. పత్రిక పట్ల రామోజీరావు తన నిబద్ధతను వదిలేసినట్లు కనిపిస్తున్నారు. 

ఏమైనా, తెలుగు మీడియా అనేది ప్రస్తుతం రంగులు పులుముకుని, ఏదో ఒక పార్టీకి బాకాగా మారిపోయింది. అందువల్ల వాస్తవాలు ప్రజలకు చేరి వేసి, వారికి సరైన మార్గనిర్దేశం చేసే పరిస్థితిని కోల్పోయాయి. ప్రజలు వాస్తవాలను, సత్యాలను మరో చోట వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిరది. జగన్‌ ప్రభుత్వం బాగుందా, బాగా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. చంద్రబాబు, జనసేన కూటమిని గెలిపించాలా, వద్దా అనేది వారు తేల్చుకుంటారు. జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నామని భావించే ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారు. లేదంటే ప్రతిపక్షంవైపు మొగ్గు చూపుతారు. ఈ స్థితిలో రామోజీరావు ఈనాడు దినపత్రిక మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని వార్తాకథనాలను రాస్తున్నట్లు కనిపిస్తున్నది. వారి మద్దతును జగన్‌ కోల్పోయే పరిస్థితిని తీసుకురావాలనేది రామోజీ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు చంద్రబాబుకు, జగన్‌కు మధ్య జరగడం లేదని, రామోజీరావుకూ జగన్‌కూ మధ్య జరుగుతున్నవని అనిపిస్తున్నది. 

- కాసుల ప్రతాపరెడ్డి

Wednesday, February 21, 2024

‘ఈనాడు’ రామోజీరావును ఉతికి ఆరేసిన కాటసాని రాంభూపాల్‌ రెడ్డి - Katasani Rambhupal Reddy retaliates Eenadu Ramoji Rao

 ‘ఈనాడు’ రామోజీరావును ఉతికి ఆరేసిన కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

తనకు వంద కోట్ల ఆస్తి ఉంటుందంటూ రామోజీరావుకు చెందిన ఈనాడు (Eenadu)లో వచ్చిన వార్తాకథనంపై వైసీపీ ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (Katasani Rambhupal Reddy) తీవ్రంగా ప్రతిస్పందించారు. ఒక రకంగా రామోజీరావు (Ramoji Rao)ను ఉతికి ఆరేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈనాడులో నిత్యం వైఎస్‌ జగన్‌ (YS jagan)కు వ్యతిరేకంగా, ఆయన అమలు చేస్తున్న పథకాలకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాస్తున్నారు. వీలైతే వైసీపీకి చెందిన నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని వార్తలు రాస్తున్నారు. తాజాగా కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడుతోందంటూ వార్తాకథనం రాశారు. దానిపై కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రామోజీరావుకు సవాల్‌ విసిరారు.



తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏమన్నారంటే..

తెలుగుదేశం కరపత్రం ఈనాడు

ఈనాడు దినపత్రికలో మేమేదో కబ్జాలకు పాల్పడుతున్నామని..  భూములు ఆక్రమించుకుంటున్నానని తాటికాయంత అక్షరాలతో రామోజీ కథనం రాసుకున్నారు. రాజకీయంగా నేనున్నాను గనుక నన్ను టార్గెట్‌ చేసి నామీద అవాస్తవాలు రాసినా పెద్దగా ఫీల్‌ కాలేదు. అయితే, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నా కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుడు రాతలు రాయడం చాలా బాధాకరం. నాకు తెలిసినంత వరకు నేనేరోజూ ఈనాడును ఒక దినపత్రికగా గుర్తించ లేదు. తెలుగుదేశం (Telugu Desam) కరపత్రంగా దాన్ని గుర్తిస్తాను.

నీ భార్య, కోడలు గురించి దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటావా రామోజీ..?

ఒక రాజకీయ పార్టీకి సపోర్టు చేసేవిధంగా వార్తలు రాయడమనేది ఒక పత్రికగా ఈనాడుకు ఎంతవరకు సబబనేది ఆలోచన చేయాలి. ఈనాడు సంస్థ అధినేత రామోజీరావును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ భార్యకో.. కోడలికో.. సంబంధం లేని విషయాల్ని అంటగట్టి దుష్ప్రచారం చేస్తే.. మీరు చూస్తూ ఊరుకోగలరా..? అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఆనాటి నుంచి ఈనాటి వరకూ నా భార్య బయటకొచ్చి రాజకీయంగా మాట్లాడటం.. ఇన్వాల్వ్‌ అవడం మీరెవరైనా చూశారా..? కేవలం, ఎన్నికల సమయంలోనే ఇంటింటి ప్రచారం తప్ప ఆమె ఏనాడూ రాజకీయ ప్రస్తావనల్లో తలదూర్చలేదు. అలాంటి గృహిణిగా ఉన్న నా భార్య గురించి సెటిల్‌మెంట్‌లు చేస్తున్నట్లు మీ పత్రికలో ఎలా రాస్తారు..? మీకు దమ్ముంటే మీరు రాసిన వార్తాకథనానికి సంబంధించిన ఆధారాలతో చర్చించేందుకు ముందుకు రండి. 

ఆధారాలు ఉంటే రుజువు చేయ్ రామోజీ..?

నిజానిజాల్ని వదిలేసి మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోవడమే పత్రికా స్వేచ్ఛకు అర్ధమా..? ఒక పత్రికను అడ్డంపెట్టుకుని .. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వారిపై కక్ష తీర్చుకోవడమనేది జర్నలిజం కాదు గదా..? రియల్‌ఎస్టేట్‌దార్లు వెంచర్లు వేసినప్పుడల్లా 10 శాతం కమీషన్‌ నాకిస్తున్నట్లు మీరు రాశారు గదా..? ఎవరికీ తెలియని కొత్త సంస్కృతిని మీరు నేర్పుతున్నారా..? నిజంగా, మీ దగ్గర నాకు కమీషన్లు ఇచ్చినట్లు ఆధారాలున్నా.. వాటిని బయటపెట్టడం గానీ.. లేదంటే, కమీషన్లు ఇచ్చామని చెప్పే రియల్టర్లను గానీ మా ముందుకు తెచ్చి రుజువు చేయించగలరా..? ఇలాంటి ఆరోపణలతోనే నామీద గతంలోనూ రెండు సార్లు అవాస్తవాల్ని ప్రచారం చేశారు. నన్ను టార్గెట్‌ చేయడంలో నేనేమీ బాధపడను. నా కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయాల్లోకి లాగి తెలుగుదేశం పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని ఈనాడు దినపత్రిక అనుకుంటే.. అది ప్రజాస్వామ్యం కాదంటున్నాను. వాస్తవ దూరంగా కథనాల్ని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందడమనేది రాజకీయాల్లో చాలా తప్పు అని చెబుతున్నాను. 

నిరసన తెలిపితే.. దాడి ఎలా అవుతుంది..?

ఈనాడు కార్యాలయంపై నిజంగా దాడి జరిగితే.. దాన్ని మేమూ సమర్ధించబోము. నిన్న గడివేములలో జరిగిన వాలంటీర్‌ వందనం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన సమయంలో మా కార్యకర్తలు కర్నూలు ఈనాడు కార్యాలయం ముందు నిరసన ధర్నా చేశారంట. వారి నాయకుడి మీద .. ఆ నాయకుని కుటుంబం మీద లేనిపోని అబద్ధాలు అల్లి వార్తలు వచ్చినప్పుడు ఆమాత్రం ‘నిరసన చేసే హక్కు’ కూడా వారికి లేదనుకుంటారా..? దాన్ని దాడిగా ఎలా చిత్రీకరిస్తున్నారు..? 

తప్పు చేయకపోతే తాళాలు వేసుకుని ఎందుకు పారిపోతారు..?

ఒకరిద్దరు ఈనాడు కార్యాలయ వాకిలి దగ్గరకెళ్లి .. మా నాయకుడిపై రాసిన వార్తకు ఆధారాలేమున్నాయంటూ ప్రశ్నించారు. ఒక ప్రతికను అడ్డం పెట్టుకుని మీరైతే ఇష్టానుసారంగా గుడ్డ కాల్చి మామీద వేయొచ్చు.. మురికి కాలువలో బురద తెచ్చి మామీద జల్లి కడుక్కోవాలంటారు గానీ.. మీరు చేసిన ధైర్యం మావోళ్లు చేసి ప్రశ్నిస్తే మాత్రం మీకు తప్పవుతుంది..? ధైర్యంగా మా మీద అబద్ధాలు రాసినప్పుడు.. మేము అడిగినప్పుడు కూడా ధైర్యంగానే సమాధానం చెప్పడానికి నిలబడాలి. అయితే, ఈనాడు కార్యాలయం తలుపులకు తాళాలు వేసుకుని దొంగల్లా ఎందుకు పారిపోయినట్లు..? మీ దగ్గర నిజం లేనట్టే గదా..? ఏదిఏమైనా ఈనాడు యాజమాన్యం ఒక పేపర్‌ను అడ్డంపెట్టుకుని, మీరు మోస్తున్న తెలుగుదేశం పార్టీకి ఫేవర్‌ చేయడం మాత్రం చాలా తప్పు.. ఇదే విషయంలో ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5ల వైఖరిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను.

వక్ఫ్‌భూములపై రైతులకు న్యాయం చేయమనడం నేరమా..?

2014 నుంచి 2019 వరకు బినామీ పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఏమేం చేశారో.. మాకు తెలుసు. మా దగ్గర అన్నీ ఆధారాలున్నాయి. నేను 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక.. పూడ్చర్లలో ఎవరెవరి బినామీల పేర్ల కింద ఎంత భూమి ఉందో.. వాటన్నింటినీ గుర్తించాలని ముఖ్యమంత్రి గారికి కూడా జాబితా ఇవ్వడం జరిగింది. 1999లో నాకు సంబంధం లేకుండానే నేనేదో తప్పు చేసినట్లు ఒక నింద వచ్చింది. ఆ రోజు నుంచి రైతులకు సంబంధించి ఏ విషయంలోనూ పెద్దగా జోక్యం చేసుకోలేదు. పాణ్యం మండలంలోని వక్ఫ్‌బోర్డు భూములకు సంబంధించి రైతులొచ్చి నన్ను అడిగితే.. ఆ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి .. వాళ్లకు న్యాయం చేయండని చెప్పాను తప్ప.. ఆ భూములతో నాకెలాంటి సంబంధంలేదు. వక్ఫ్‌బోర్డు భూమి మొత్తం కలిపి 250 ఎకరాలుంటే.. ఈనాడు మాత్రం 500 ఎకరాలని రాసింది. మిగతా భూమిని రామోజీరావు ఎక్కడ చూపెడతాడు..? కాలబుగ్గలో నా కొడుకు పేరిట ఉన్నది కేవలం 4.5 ఎకరాల భూమి మాత్రమే.. అక్కడ అంతకంటే ఎక్కువ ఉందని అంటే అదంతా రామోజీరావుకే రాసిస్తాను. తీసుకోమనండి. 

మార్గదర్శి పేరుతో ఎంతమందిని ముంచావు రామోజీ..?

ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మనమెంత నిజాయితీపరులమో చూసుకోవాలి. మార్గదర్శి (Margadarshi) సంస్థతో నువ్వు చేసేదేంటి..? స్వయంగా రిజర్వు బ్యాంకు (RBI) నిన్ను మార్గదర్శి ద్వారా డిపాజిట్లు సేకరించరాదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? నీ సంస్థ చిట్‌ఫండ్‌ వ్యాపారంతో ఎంత మందిని నిలువునా ముంచావో చెప్పు..? నా 40 ఏళ్లు రాజకీయ జీవితంలో నీలాంటి కుసంస్కారిని ఎన్నడూ చూడలేదు. ఒక రాజకీయ పార్టీని అంటిపెట్టుకుని దాన్ని సపోర్టు చేసే పత్రికను జర్నలిజం అనడం నేనెక్కడా చూడలేదు. 

కబ్జా చేశామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

రాజకీయాల్లో ఉన్నవారి మీద వ్యతిరేక కథనాలు రాయొద్దని నేనాడూ చెప్పలేదు. చెప్పను కూడా.. కానీ, వాస్తవాల్ని తెలుసుకుని మాత్రమే రాయమని నేను పత్రికా సోదరులందర్నీ కోరుతున్నాను. నిజంగా, నేను గానీ నా కుటుంబ సభ్యులు గానీ తప్పులు చేస్తే పత్రికా విలేకరులుగా మీరు ఎత్తి చూపండి.. మాకెలాంటి అభ్యంతరం లేదు. అంతేగానీ.. సంబంధంలేనివి మాకు అంటగట్టి విషప్రచారం మాత్రం చేయొద్దని మనవి చేస్తున్నాను. పిన్నాపురం, కందికాయపల్లెలో గానీ ఏ ఒక్కచోటైనా ఒక సెంటు భూమిని మేము కబ్జా చేశామని నిరూపిస్తే.. మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధమే. ఇదే విషయాన్ని ఇప్పటికే నాలుగైదు సార్లు బహిరంగంగా చెప్పాను. మరోమారు చెబుతున్నాను. 

నిరూపిస్తే.. నా ఆస్తులు రాసిస్తా.. ఇదే నా ఛాలెంజ్

నేను గానీ.. నా కుటుంబ సభ్యులు గానీ ఎక్కడైనా సెంటు భూమిని కబ్జా చేశామన్నా.. ఎవరి ఆస్తినైనా అక్రమంగా ఆక్రమించుకున్నామని మీరు ఆధారాలతో నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా .. ఇదే నా ఛాలెంజ్‌. ఈనాడు పత్రిక కథనం రాయడం.. దాన్ని పట్టుకుని నిజమని నమ్మించేలా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్న నాయకులకూ మరోమారు ఛాలెంజ్‌ విసురుతున్నాను. రాజకీయంగా ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. అంతేగానీ.. ఈనాడునో.. ఆంధ్రజ్యోతినో.. ఏబీఎన్‌నో.. టీవీ5తోనో దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం మేమూరుకునేదిలేదు. ఈనాడు పత్రిక రాసిన కథనాన్ని నిజమని నిరూపిస్తే .. ఆ వెయ్యికోట్ల విలువైన ఆస్తులన్నీ రామోజీరావుకో... ఆయన పత్రికా సంస్థకో రాసివ్వడానికి నేను సిద్ధం. నా సవాల్‌ను స్వీకరించే దమ్మూధైర్యం రామోజీరావుకు ఉందా..? అని నిలదీస్తున్నాను. 

Wednesday, February 14, 2024

విడదల రజనీపై టీడీపి నుంచి లక్ష్మీ శ్యామల: ఇంతకీ ఎవరీమె? - Laxmi Shyamala may be TDP candidate against Vidudala Rajini

 విడదల రజనీపై టీడీపి నుంచి లక్ష్మీ శ్యామల: ఇంతకీ ఎవరీమె?


తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సిట్టింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 23 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ (YCP) కండువా కప్పుకున్నారు. మిగిలిన 19 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావును బరిలో దింపనున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతివ్వడంతో... ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు దిశగా... టీడీపీ పావులు కదుపుతోంది. 



గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ inchargeగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ (Vidudala Rajani) కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు ధీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని ఓ మహిళా పారిశ్రామిక వేత్తను టీడీపీ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల  (Sri Laxmi Shyamala)ను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జీర్ణోద్దారణలో ఉన్న పలు ఆలయాలను పునర్నించారు కూడా. ఆధ్యాత్మిక రంగంలో సైతం శ్రీ లక్ష్మీ శ్యామల విశేష కృషి చేశారు. డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు. 


 

గతేడాది నవంబర్ నెలలో చంద్రబాబు శ్రీ  పెరంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మి శ్యామల సైతం రామానుజుల వారిని దర్శించుకున్నారు. సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి విడుదల రజినిని ఇంఛార్జ్ గా నియమించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళను పోటీలో నిలబెడితే... గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఎవరో తెలియాలంటే... పార్టీ ప్రకటన వరకు ఆగాల్సిందే.

- కాసుల ప్రతాపరెడ్డి

Sunday, February 11, 2024

కేసీఆర్‌ రైతు బంధు నిర్వాకం ఇదీ... అసలేం జరిగింది? - KCR Rythu Bandhu failed to help real farmers

 కేసీఆర్‌ రైతు బంధు నిర్వాకం ఇదీ... అసలేం జరిగింది?


బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కే. చంద్రశేఖర్‌ రావు (K Chandrasekhar Rao) అమలు చేసిన రైతు బంధు (Rythu Bandhu) పథకం సంపన్నవర్గాలకు మేలు చేసింది. పది శాతం మంది వ్యక్తులకు 45 శాతం రైతు బంధులు నిధులు అందించిన కేసీఆర్‌ KCR) ఏ రైతు ప్రయోజనం ఆశించి దాన్ని అమలు చేశారనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు. బీడు భూములకు, ఫామ్‌ హౌస్‌లకు, కొండలకూ గుట్టలకూ కేసీఆర్‌ రైతు బంధు నిధులను విడుదల చేశారు. ప్రాజెక్టు కాలువలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు కూడా రైతుబంధు అమలైంది. పేరుకేమో సాగు పెట్టుబడి. సాగు చేయని భూములకు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు కూడా పెట్టుబడి కింద నిధులను అందించారు. దీనివల్ల జరిగిన అనర్థం చాలానే ఉంది. 



బడా వ్యాపారులు, సంపన్నులు వ్యాపారాల్లోనూ, ఇతరేతర రంగాల్లోనూ పెట్టుబడులను పెట్టడం మానుకుని భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టారు. దానివల్ల స్థిరాస్తికి స్థిరాస్తి ఉండిపోతుంది, పడావు పెట్టినా కూడా రైతు బంధు అనాయసంగా డబ్బులు వస్తాయి. దీంతో పల్లెల్లో పెద్ద యెత్తున భూముల క్రయవిక్రయాలు జరిగాయి. భూముల రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి. దీంతో మామూలు వ్యక్తులు భూములు కొనుక్కోలేని స్థితికి దిగజారే పరిస్థితి వచ్చింది. ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగి సమాజం విధ్వంసం అయ్యేందుకు పునాదులు పడ్డాయి.

వందలాది ఎకరాలను కొద్ది మంది వ్యక్తులు ఎలా తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారనేది ప్రశ్న. భూసంస్కరణల చట్టం (Land reforms act) పరిధిలోకి రాకుండా వారు చేసిన మాయ ఏమిటి? భూసంస్కరణల చట్టాన్ని తుంగలో తొక్కారా? అది అసలు అమలులో ఉందా? భూసంస్కరణల చట్టంలో ఫామ్‌హౌస్‌ల వంటి కొన్నింటికి మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులున్న భూములు వ్యవసాయ భూముల కిందికి రావు. మరి రైతుబంధు పథకం వారికి ఎలా అమలైందనేది ప్రశ్న. భూసంస్కరణల చట్టం రద్దయిందా, అమలులో ఉందా అనేది తెలియదు. 

ఆ విషయాన్ని పక్కనపెడితే... గత వర్షాకాలం లెక్కల ప్రకారం... 68.99 లక్షల మంది చేతుల్లో ఉన్న 1.52 కోట్ల ఎకరాల భూమికి రైతుబంధు నిధులు అందాయి. రైతుబంధు పథకం కింద ప్రయోజనం పొందినవారిలో ఎకరం భూమి లోపు భూమి ఉన్నవారు 22.55 లక్షల మంది రైతులు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది రైతులు. దాదాపుగా కోటి ఎకరాల భూమి వీరి చేతుల్లో ఉంది. అంటే, గుంట నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 90.36 శాతం మంది. ఐదు ఎకరాలకు పైబడి భూమి ఉన్నవారు 6.65 శాతం మంది. వీరి చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరికే రైతు బంధు పథకం కింద దాదాపు 45 శాతం నిధులు వెళ్తున్నాయి. 

సాగు చేయని భూములకు ఎన్ని నిధులు వెళ్తున్నాయో తెలుసుకోవచ్చు. ధరణి పోర్టల్‌ (Dharani Portal) ప్రకారమే... 151 ఎకరాలు వ్యవసాయ భూముల ఖాతాలో ఉన్నాయి. ఇందులో 132 లక్షల ఎకరాలు సాగులో సాగులో ఉన్నాయి. 19 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యంగా లేని భూములు. ఇలా చూస్తే సాగుకు యోగ్యంగా లేని భూములకు పెట్టుబడి సాయం ఏమిటనేది ప్రశ్న. ఈ లెక్కన రైతుబంధు పథకం కింద  ఎన్ని నిధులు ప్రయోజనరహితంగా కొంత మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు.

గుట్టలకూ కొండలకూ రైతుబంధు (దాన్నే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) అంటోంది) ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సాధారణంగా అన్నట్లే ఉంది గానీ రైతుబంధు ఎలా దుర్వినియోగమైందనే విషయాన్ని ఆయన వ్యంగ్యంగా చెప్పారని అనుకోవచ్చు. సెలబ్రిటీలను, బడా రైతులను, తదితరులను మినహాయించి చిన్న, సన్నకారు రైతులకు, సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించగలిగితే అది తెలంగాణ సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.  

- కాసుల ప్రతాపరెడ్డి

Friday, February 9, 2024

చంద్రబాబు, జగన్‌...ఇద్దరినీ ఉతికి ఆరేసిన వైఎస్సార్‌ ఆత్మ - KVP Ramachandar Rao makes verbal attack on YS Jagan, Chandrababu

 చంద్రబాబు, జగన్‌...ఇద్దరినీ ఉతికి ఆరేసిన వైఎస్సార్‌ ఆత్మ


టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)ని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్‌ జగన్‌ (YS Jagan)ను... ఇద్దరినీ వైఎస్సార్‌ ఆత్మగా పేరు పొందిన కాంగ్రెస్‌ నాయకుడు కేవీపీ రామచందర్‌ రావు (KVP Ramachandar Rao) ఉతికి ఆరేశారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దయాదాక్షిణ్యాల కోసం వారు ప్రయత్నిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ పాదాల కోసం ఇద్దరూ ప్రయత్నించడం వల్ల జరిగేదేం లేదని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీ (YCP) ప్రభుత్వాలను మోడీ ఏటీఎంలుగా వాడుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.



చంద్రబాబును మోడీ పర్సనల్‌గా కలవాలని అనుకోలేదని అనిపిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల దేశ రాజధాని హస్తిన (Delhi)లో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda)లతో సమావేశమయ్యారు. మోడీని కలవలేకపోయారు. దీన్ని ఉద్దేశించి కేవీపీ (KVP) ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. మోడీ కలవకపోయినా సంతృప్తి చెంది వచ్చేశారు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు అవసమైతే తప్ప గుర్తు రావని ఆయన విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం, అధికారం కోసం చంద్రబాబు హస్తిన వెళ్లారా? ఆని ప్రశ్నిస్తూ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మోడీ సన్నిధికి చేరుకోలేకపోయారని, జగన్‌ చేరుకోగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీతో జగన్‌ ఈ నెల 9వ తేదీన సమావేశమైన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.

హోం మంత్రి అమిత్‌ షా మీద తిరుపతి (Tirupathi)లో చంద్రబాబు రాళ్లు వేయించారని, 2019లో విద్రోహదినం నిర్వహించారని, రాజకీయ చతురుడినని చంద్రబాబు ఆయనను ఆయనే అనుకుంటారని కేవీపీ దెప్పి పొడిచారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ (United Andhra Pradesh) రాష్ట్రానికి చంద్రబాబు సుదీర్ఘ ముఖ్యమంత్రి అని, అదే రాష్ట్రానికి సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడని ఆయన అన్నారు. 

బిజెపి (BJP)ని కూడా ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. 2019లోనూ, 2024లోనూ ఏపీకి బిజెపి కల్పించిన ప్రయోజనాలేమిటని ఆయన అడిగారు. 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని మోడీ చెప్పారని, పదేళ్లపాటు ప్రత్యేక హోదా (Special Category Status) ఇస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అమరావతి (Amaravati)కి మోడీ పవిత్ర జలాలకు బదులు కలుషిత జలాలు తెచ్చారని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఈ అంశాల మీద మోడీని ఎవరూ ప్రశ్నించలేదని ఆన్నారు.

మహా కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్‌ (Pawan Kalyan), మోడీ కలిసి 2014ల వరాల తుఫాను కురిపించారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తమపై రాళ్లు విసిరారని, 2018లో చంద్రబాబు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో వేదికను పంచుకున్నారని, చంద్రబాబు నితీష్‌ కుమార్‌ (Nitish Kumar) రికార్డును బద్దలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో మద్యం, ఇసుకల్లో వచ్చే ప్రయోజనాల్లో బిజెపి వాటా లేకుండా ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల నాయకులు అరెస్టవుతారు గానీ ఏపీ నాయకులు అరెస్టు కారని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత బిజెపి వస్తే మమత కూడా జైలుకు వెళ్లవచ్చునని ఆయన అన్నారు. బిజెపి దృష్టిలో ఏపీ చాలా క్లీన్‌ అని, ఈడీ దృష్టిలో కూడా క్లీన్‌ అని ఉందా అని ఆయన అడిగారు. సిఎం వెళ్లినప్పుడల్లా ఏపీ ఆణిముత్యం అని కేంద్రం సర్టిఫికెట్‌ ఇస్తుందని ఆయన అన్నారు. సీట్లు, స్వీట్ల పంపకం తప్ప మరేవీ వాళ్లు మాట్లాడుకోలేని ఆయన అన్నారు. మోడీ, జగన్‌ మధ్య జరిగిన భేటీపై ఆయన ఆ విధంగా అన్నారు. 

తల్లిని, సోదరిని ప్రతి కొడుకు, సోదరుడు గౌరవించాలని, సొంత తల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచినవారిపై చర్యలు తీసుకోని అసమర్థ ప్రభుత్వం అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 

-కాసుల ప్రతాపరెడ్డి

Monday, February 5, 2024

చంద్రబాబు చదరంగంలో పవన్‌ కల్యాణ్‌ పావు? - Chandrababu may ditch Pawn Kalyan in AP politics

 చంద్రబాబు చదరంగంలో పవన్‌ కల్యాణ్‌ పావు?


టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) రాజకీయ చదరంగంలో జనసేన (jana Sena అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పావు కాబోతున్నారా? పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) సంధించిన బహిరంగ లేఖ అవుననే సమాధానం ఇస్తోంది. చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను వాడుకుని రాజ్యాధికారం సంపాదించుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. జనసేన మద్దతు లేకుండా టీడీపీ విజయం సాధించలేదని 2019 ఎన్నికలు నిరూపిస్తున్నాయని ఆయన అంటున్నారు. కాపు (Kapu)లకు రాజ్యాధికారం కావాలంటే సీట్ల సర్దుబాటులో జనసేనకు తగినన్ని సీట్లు కేటాయించే విధంగా పట్టుబట్టాల్సిందే అనేది ఆయన అభిమతం. అంతకన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనేది ఆయన అభిప్రాయం.



జనసేనకు 30 సీట్లు కేటాయించినట్లు, 27 సీట్లు కేటాయించినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఈ వార్తలకు జనసేన నుంచి ఏ విధమైన ఖండన కూడా లేదు. దీంతో అందుకు పవన్‌ కల్యాణ్‌ సమ్మతించినట్లు ప్రజలు అర్థం చేసుకునే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో వాటా పంచుకోవాలంటే జనసేన 40 నుంచి 60 సీట్ల మధ్య పోటీ చేయాల్సి ఉంటుందని, కనీసం 50 సీట్లను కేటాయించే విధంగా చూసుకోవాలని హరిరామ జోగయ్య అన్నారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు రాజ్యాధికారం అప్పగించడానికి కాదని ఆయన అన్నారు. సీట్లు తక్కువ ఇచ్చినా రెండున్నరేళ్ల పాటు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రిగా ఉంటారని చంద్రబాబు చేత ప్రకటన చేయించగలరా అని ఆయన ప్రశ్నించారు. హరిరామ జోగయ్య నేరుగా ఈ ప్రశ్నను పవన్‌ కల్యాణ్‌కు సంధించారు. 

గతంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చాయనే విశ్లేషణ ఈ సందర్బంలో జరుగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు (సిపిఐ, సిపిఎం) ఇప్పుడు ఒక్క సీటు కోసం, రెండు సీట్ల కోసం బేరసారాలు నడిపే స్థితికి చేరుకున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బిజెపి కూడా బలహీనపడిరది. ఇప్పుడు జనసేనతో టీడీపీ పొత్తు (Janasena - TDP alliance) పెట్టుకుంది. అయితే, సీట్ల పంపకం (Seat Sharing) వద్ద చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌కు అంగీకరించే పరిస్థితి లేదు.


 

ఒక వేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే జనసేనను తొక్కేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు షరతులకు అంగీకరించి టీడీపీని అధికారంలోకి తెస్తే జనసేన తన గొంతు కోయించుకోవడానికి కత్తి ఇచ్చినట్లేనని అంటున్నారు. కాగా, బిజెపిని కూటమిలోకి తేవాల్సిన బాధ్యతను కూడా చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ మీదనే పెట్టినట్లు తెలుస్తోంది. బిజెపి కూటమిలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

తాజా పరిణామాల పట్ల పవన్‌ కల్యాణ్‌ను బలపరుస్తున్న ఒక వర్గం కాపులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు హరిరామ జోగయ్య లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య చర్చలు జరిగినప్పటికీ సీట్ల పంపకం ఒక కొలిక్కి రాలేదు. జనసేనకు ఏయే సీట్లు కేటాయించాలనే విషయంపై స్పష్టత రాలేదు. చివరి నిమిషంలో చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను తప్పించుకోలేని పరిస్థితిలో పడేసే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు కేటాయించిన సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే సీట్ల సర్దుబాటులో జాప్యం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏకపక్షంగా ప్రకటించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA)లో కొనసాగుతూనే ఆయన టీడీపితో పొత్తును కొనసాగిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందని బిజెపి నాయకులు  ఓ వైపు ప్రకటిస్తున్నారు. బిజెపి, జనసేన పొత్తు వచ్చే ఎన్నికల్లో ఎలా కొనసాగుతుందనేది చెప్పలేని పరిస్థితి. మొత్తంగా పవన్‌ కల్యాణ్‌ అపరిక్వమైన రాజకీయాలను నడుపుతున్నారా అనే సందేహం కలుగుతోంది.

-కాసుల ప్రతాపరెడ్డి

Sunday, February 4, 2024

అప్పుడు కేసీఆర్‌ కాళ్లు మొక్కి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించి... Dr Gadala Srinivas Rao seeks Khammam Lok Sabha seat from Congress

 అప్పుడు కేసీఆర్‌ కాళ్లు మొక్కి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించి...


తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు (Gadala Srinivas Rao) అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన రాజకీయాల్లో తన జాతకాన్ని పరీక్షించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కొత్తగూడెం శాసనసభ (Kothagudem assembly seat) సీటును ఆశించి భంగపడ్డారు. అప్పట్లో ఆయన కేసీఆర్‌ (KCR) కాళ్లు మొక్కడం వివాదంగా మారింది. ఈ మాజీ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. లోకసభ టికెట్‌ కోసం ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ (Congress)ను ఆశ్రయించారు. 



తనకు ఖమ్మం (Khammam) లేదా సికింద్రాబాద్‌ (Secunderabad) లోకసభ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అనుచరులు ఈ దరఖాస్తును కాంగ్రెస్‌ పార్టీకి సమర్పించారు. ఖమ్మం సీటును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) సతీమణి నందిని (Nandini), సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వి. హనుమంతరావు ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Choudhary) కూడా ఖమ్మం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ స్థితిలో ఆయనకు కాంగ్రెస్‌ ఖమ్మం సీటు ఇస్తుందా అనేది అనుమానమే.

సర్వీసులో ఉంటూ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించడంపై శ్రీనివాస్‌ రావు అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధితో మాట్లాడారు. తాను ప్రజాజీవితంలో ఉండాలని ఎల్లవేళలా కోరుకున్నానని, అందువల్ల ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించానని ఆయన నిజాయితీగానే చెప్పుకున్నారు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు.

తన స్వస్థలం కొత్తగూడెం అని, ప్రస్తుతం సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి వచ్చే దోమలగుడాలో నివాసం ఉంటున్నానని ఆయన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో చెప్పారు. శ్రీనివాస్‌ రావు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. తనకు కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పారు. టికెట్‌ లభించకపోతే తిరిగి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు.  

-కాసుల ప్రతాపరెడ్డి

Saturday, February 3, 2024

తాజా సర్వే: పవన్‌తో చంద్రబాబు జత కట్టినా జగన్‌కే జై - Latest pre-poll survey predicts YS jagan win AP Assembly elections

తాజా సర్వే: పవన్‌తో చంద్రబాబు జత కట్టినా జగన్‌కే జై


పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా వచ్చే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) చంద్రబాబు (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపికి అధికారం దక్కే సూచనలు కనిపించడం లేదు. సీట్లు తగ్గినప్పటికీ వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) అధికారంలోకి వస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎలెక్‌సెన్స్‌ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ప్రీ పోల్‌ సర్వే నిర్వహించింది. 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీకి 122 శాసనసభ స్థానాలు వస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీకి 49.14 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. 



జనసేన, టీడిపి కూటమికి 44.34 శాతం ఓట్లు వస్తాయని, బిజెపికి 0.56 శాతం ఓట్లు పోలవుతాయని, కాంగ్రెస్‌కు 1.21 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 4.75 శాతం ఓట్లు వస్తాయని ఆ సమగ్ర సర్వే తెలిపింది. 2023 డిసెంబర్‌ 1, 2024 జనవరి 12 తేదీల మధ్య ఎలెక్‌సెన్స్‌ (ELECSENSE) ఈ సర్వే నిర్వహించింది. 88,700 శాంపిల్‌ సైజుతో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో సర్వే జరిగింది. ఈ సంస్థ ప్రతినిధులు ఓటర్లను నేరుగా కలిసి వివరాలు సేకరించారు. సందేహంగా అనిపించిన 10-15 శాతం శాంపిల్స్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై, శాంతిభద్రతలపై, వర్తమాన సంఘటనలపై, టిడీపి`జనసేన పొత్తు (TDP-Jana Sena Alliance)పై, ఉపాధిఉద్యోగావకాశాలపై తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలను రూపొందించి సమాధానాలు రాబట్టారు. కులపరమైన అంశాన్ని కూడా సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.

సర్వే ప్రకారం... వైసీపికి 122 సీట్లు, టిడిపీ-జనసేన కూటమికి 53 సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌ (Congress), బిజెపీ (BJP)లకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌కు 53.7 శాతం మంది జైకొట్టారు. మహిళల్లో (Women Voters) అత్యధికులు వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. వైసిపికి అనుకూలంగా ఉన్నారు. మహిళల్లో 54.77 శాతం మంది వైసీపిని, 41.12 శాతం మంది టిడీపి, జనసేన కూటమిని, 0.32 శాతం మంది బిజెపిని, 0.66 శాతం మంది కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు. 

పురుషుల్లో మాత్రం ఎక్కువ శాతం మంది టీడీపి, జనసేన కూటమివైపు మొగ్గుచూపారు. 49.67 శాతం మంది టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా ఉండగా, 45.68 శాతం మంది వైసీపీ (YCP)కి అనుకూలంగా ఉన్నారు. వయస్సు రీత్యా చూస్తే 60 ఏళ్లకు పైబడినవారిలో 55.07 శాతం మంది వైసీపికి అనుకూలంగా ఉన్నారు. 45-60 ఏళ్ల మధ్య వయస్సు గలవారిలో 55 శాతం మంది, 30-45 ఏళ్ల మధ్య వయస్సుగలవారిలో 50.72  శాతం మంది,  18-30 ఏళ్ల మధ్య వయస్సుగలవారిలో 43.04 శాతం మంది వైసీపీని కోరుకుంటున్నారు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 18-30 ఏళ్ల వయస్సుగలవారిలో 53.03 మంది టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. 30-45 ఏళ్ల మధ్య వయస్సుగలవారు 45.56 శాతం మంది, 45-


60 ఏళ్ల మధ్య వయస్సుగలవారు 41.95 శాతం మంది, 60 ఏళ్లు పైబడినవారు 40.51 శాతం మంది టీడీపీకి మద్దతు పలికారు.

మొత్తం మీద, వైఎస్‌ జగన్‌ మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి వస్తారని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. మహిళల మద్దతులో ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. 

-కాసుల ప్రతాపరెడ్డి

Thursday, February 1, 2024

రేవంత్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ: కేసీఆర్‌ అప్రమత్తం, పరోక్ష హెచ్చరిక - BRS chief KCR warns MLAs indirectly

రేవంత్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ: కేసీఆర్‌ అప్రమత్తం, పరోక్ష హెచ్చరిక


కొంత మంది పార్టీ ఎమ్యెల్యేలు ఆ మధ్య ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy)తో భేటీ కావడంతో బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandra sekhar Rao) అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. ఆయన గురువారంనాడు (ఫిబ్రవరి 1వ తేదీన) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతోనూ పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. తుంటి గాయానికి చికిత్స పొందిన కేసీఆర్‌ (KCR) పూర్తిగా కోలుకున్నారు. తాను కోలుకున్న తర్వాత జరిగిన సమావేశంలో ఆయన ఎమ్యెల్యేలకు పరోక్ష హెచ్చరిక చేశారు. ఎమ్యెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది.



కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. మంచి ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్నవారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని, అయితే వాటిని ప్రజల సమక్షంలోనే ఇవ్వాలని ఆయన చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. లోకసభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు సిద్ధం కావాలని ఆయన చెప్పారు.

తాను చురుగ్గా లేకపోతే పార్టీ ఎమ్యెల్యేలు, నాయకులు ఇతర పార్టీలకు వెళ్లే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన నేరుగా ముందుకు వచ్చినట్లు కనిపిస్తున్నది. కొద్ది నెలల్లో లోకసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాల్సిన అనివార్యత ఉంది. లోకసభ ఎన్నికల్లో డీలా పడిపోతే పార్టీ ఉనికికే ప్రమాదం వాటిల్లవచ్చు. పార్టీ నిర్మాణం కింది స్థాయి నుంచి క్రమపద్దతిలోనూ సమర్థంగానూ జరగలేదు. ప్రజలు తమను తప్ప మరొకరిని ఎంచుకోరని గట్టిగా విశ్వసిస్తున్న సమయంలో శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. దాంతో కేసీఆర్‌ నమ్మకం సడలింది. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజెపి (BJP) బీఆర్‌ఎస్‌ను వెనక్కి తోసే అవకాశం ఉందనే అంచనాలు కూడా సాగుతున్నాయి. జాతీయ స్థాయి అంశాలపై ఆధారపడి ఆ ఎన్నికలు జరుగుతాయి. అయోధ్య (Ayodhya)లో రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గ్రాఫ్‌ పెరిగిందని భావిస్తున్నారు. దానివల్ల లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్యనే ప్రధానమైన పోటీ ఉండవచ్చు. ఆ పరిస్థితి రాకూడదంటే కేసీఆర్‌ మరింతగా జాగ్రత్తలు తీసుకుని, పార్టీ నాయకులకూ కార్యకర్తలకూ భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ రంగం మీదికి వచ్చారని అంటున్నారు. ఏమైనా వచ్చే లోకసభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అగ్నిపరీక్షనే.

- కాసుల ప్రతాపరెడ్డి 

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...