Wednesday, February 21, 2024

‘ఈనాడు’ రామోజీరావును ఉతికి ఆరేసిన కాటసాని రాంభూపాల్‌ రెడ్డి - Katasani Rambhupal Reddy retaliates Eenadu Ramoji Rao

 ‘ఈనాడు’ రామోజీరావును ఉతికి ఆరేసిన కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

తనకు వంద కోట్ల ఆస్తి ఉంటుందంటూ రామోజీరావుకు చెందిన ఈనాడు (Eenadu)లో వచ్చిన వార్తాకథనంపై వైసీపీ ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (Katasani Rambhupal Reddy) తీవ్రంగా ప్రతిస్పందించారు. ఒక రకంగా రామోజీరావు (Ramoji Rao)ను ఉతికి ఆరేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈనాడులో నిత్యం వైఎస్‌ జగన్‌ (YS jagan)కు వ్యతిరేకంగా, ఆయన అమలు చేస్తున్న పథకాలకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాస్తున్నారు. వీలైతే వైసీపీకి చెందిన నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని వార్తలు రాస్తున్నారు. తాజాగా కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడుతోందంటూ వార్తాకథనం రాశారు. దానిపై కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రామోజీరావుకు సవాల్‌ విసిరారు.



తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏమన్నారంటే..

తెలుగుదేశం కరపత్రం ఈనాడు

ఈనాడు దినపత్రికలో మేమేదో కబ్జాలకు పాల్పడుతున్నామని..  భూములు ఆక్రమించుకుంటున్నానని తాటికాయంత అక్షరాలతో రామోజీ కథనం రాసుకున్నారు. రాజకీయంగా నేనున్నాను గనుక నన్ను టార్గెట్‌ చేసి నామీద అవాస్తవాలు రాసినా పెద్దగా ఫీల్‌ కాలేదు. అయితే, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నా కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుడు రాతలు రాయడం చాలా బాధాకరం. నాకు తెలిసినంత వరకు నేనేరోజూ ఈనాడును ఒక దినపత్రికగా గుర్తించ లేదు. తెలుగుదేశం (Telugu Desam) కరపత్రంగా దాన్ని గుర్తిస్తాను.

నీ భార్య, కోడలు గురించి దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటావా రామోజీ..?

ఒక రాజకీయ పార్టీకి సపోర్టు చేసేవిధంగా వార్తలు రాయడమనేది ఒక పత్రికగా ఈనాడుకు ఎంతవరకు సబబనేది ఆలోచన చేయాలి. ఈనాడు సంస్థ అధినేత రామోజీరావును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ భార్యకో.. కోడలికో.. సంబంధం లేని విషయాల్ని అంటగట్టి దుష్ప్రచారం చేస్తే.. మీరు చూస్తూ ఊరుకోగలరా..? అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఆనాటి నుంచి ఈనాటి వరకూ నా భార్య బయటకొచ్చి రాజకీయంగా మాట్లాడటం.. ఇన్వాల్వ్‌ అవడం మీరెవరైనా చూశారా..? కేవలం, ఎన్నికల సమయంలోనే ఇంటింటి ప్రచారం తప్ప ఆమె ఏనాడూ రాజకీయ ప్రస్తావనల్లో తలదూర్చలేదు. అలాంటి గృహిణిగా ఉన్న నా భార్య గురించి సెటిల్‌మెంట్‌లు చేస్తున్నట్లు మీ పత్రికలో ఎలా రాస్తారు..? మీకు దమ్ముంటే మీరు రాసిన వార్తాకథనానికి సంబంధించిన ఆధారాలతో చర్చించేందుకు ముందుకు రండి. 

ఆధారాలు ఉంటే రుజువు చేయ్ రామోజీ..?

నిజానిజాల్ని వదిలేసి మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోవడమే పత్రికా స్వేచ్ఛకు అర్ధమా..? ఒక పత్రికను అడ్డంపెట్టుకుని .. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వారిపై కక్ష తీర్చుకోవడమనేది జర్నలిజం కాదు గదా..? రియల్‌ఎస్టేట్‌దార్లు వెంచర్లు వేసినప్పుడల్లా 10 శాతం కమీషన్‌ నాకిస్తున్నట్లు మీరు రాశారు గదా..? ఎవరికీ తెలియని కొత్త సంస్కృతిని మీరు నేర్పుతున్నారా..? నిజంగా, మీ దగ్గర నాకు కమీషన్లు ఇచ్చినట్లు ఆధారాలున్నా.. వాటిని బయటపెట్టడం గానీ.. లేదంటే, కమీషన్లు ఇచ్చామని చెప్పే రియల్టర్లను గానీ మా ముందుకు తెచ్చి రుజువు చేయించగలరా..? ఇలాంటి ఆరోపణలతోనే నామీద గతంలోనూ రెండు సార్లు అవాస్తవాల్ని ప్రచారం చేశారు. నన్ను టార్గెట్‌ చేయడంలో నేనేమీ బాధపడను. నా కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయాల్లోకి లాగి తెలుగుదేశం పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని ఈనాడు దినపత్రిక అనుకుంటే.. అది ప్రజాస్వామ్యం కాదంటున్నాను. వాస్తవ దూరంగా కథనాల్ని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందడమనేది రాజకీయాల్లో చాలా తప్పు అని చెబుతున్నాను. 

నిరసన తెలిపితే.. దాడి ఎలా అవుతుంది..?

ఈనాడు కార్యాలయంపై నిజంగా దాడి జరిగితే.. దాన్ని మేమూ సమర్ధించబోము. నిన్న గడివేములలో జరిగిన వాలంటీర్‌ వందనం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన సమయంలో మా కార్యకర్తలు కర్నూలు ఈనాడు కార్యాలయం ముందు నిరసన ధర్నా చేశారంట. వారి నాయకుడి మీద .. ఆ నాయకుని కుటుంబం మీద లేనిపోని అబద్ధాలు అల్లి వార్తలు వచ్చినప్పుడు ఆమాత్రం ‘నిరసన చేసే హక్కు’ కూడా వారికి లేదనుకుంటారా..? దాన్ని దాడిగా ఎలా చిత్రీకరిస్తున్నారు..? 

తప్పు చేయకపోతే తాళాలు వేసుకుని ఎందుకు పారిపోతారు..?

ఒకరిద్దరు ఈనాడు కార్యాలయ వాకిలి దగ్గరకెళ్లి .. మా నాయకుడిపై రాసిన వార్తకు ఆధారాలేమున్నాయంటూ ప్రశ్నించారు. ఒక ప్రతికను అడ్డం పెట్టుకుని మీరైతే ఇష్టానుసారంగా గుడ్డ కాల్చి మామీద వేయొచ్చు.. మురికి కాలువలో బురద తెచ్చి మామీద జల్లి కడుక్కోవాలంటారు గానీ.. మీరు చేసిన ధైర్యం మావోళ్లు చేసి ప్రశ్నిస్తే మాత్రం మీకు తప్పవుతుంది..? ధైర్యంగా మా మీద అబద్ధాలు రాసినప్పుడు.. మేము అడిగినప్పుడు కూడా ధైర్యంగానే సమాధానం చెప్పడానికి నిలబడాలి. అయితే, ఈనాడు కార్యాలయం తలుపులకు తాళాలు వేసుకుని దొంగల్లా ఎందుకు పారిపోయినట్లు..? మీ దగ్గర నిజం లేనట్టే గదా..? ఏదిఏమైనా ఈనాడు యాజమాన్యం ఒక పేపర్‌ను అడ్డంపెట్టుకుని, మీరు మోస్తున్న తెలుగుదేశం పార్టీకి ఫేవర్‌ చేయడం మాత్రం చాలా తప్పు.. ఇదే విషయంలో ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5ల వైఖరిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను.

వక్ఫ్‌భూములపై రైతులకు న్యాయం చేయమనడం నేరమా..?

2014 నుంచి 2019 వరకు బినామీ పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఏమేం చేశారో.. మాకు తెలుసు. మా దగ్గర అన్నీ ఆధారాలున్నాయి. నేను 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక.. పూడ్చర్లలో ఎవరెవరి బినామీల పేర్ల కింద ఎంత భూమి ఉందో.. వాటన్నింటినీ గుర్తించాలని ముఖ్యమంత్రి గారికి కూడా జాబితా ఇవ్వడం జరిగింది. 1999లో నాకు సంబంధం లేకుండానే నేనేదో తప్పు చేసినట్లు ఒక నింద వచ్చింది. ఆ రోజు నుంచి రైతులకు సంబంధించి ఏ విషయంలోనూ పెద్దగా జోక్యం చేసుకోలేదు. పాణ్యం మండలంలోని వక్ఫ్‌బోర్డు భూములకు సంబంధించి రైతులొచ్చి నన్ను అడిగితే.. ఆ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి .. వాళ్లకు న్యాయం చేయండని చెప్పాను తప్ప.. ఆ భూములతో నాకెలాంటి సంబంధంలేదు. వక్ఫ్‌బోర్డు భూమి మొత్తం కలిపి 250 ఎకరాలుంటే.. ఈనాడు మాత్రం 500 ఎకరాలని రాసింది. మిగతా భూమిని రామోజీరావు ఎక్కడ చూపెడతాడు..? కాలబుగ్గలో నా కొడుకు పేరిట ఉన్నది కేవలం 4.5 ఎకరాల భూమి మాత్రమే.. అక్కడ అంతకంటే ఎక్కువ ఉందని అంటే అదంతా రామోజీరావుకే రాసిస్తాను. తీసుకోమనండి. 

మార్గదర్శి పేరుతో ఎంతమందిని ముంచావు రామోజీ..?

ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మనమెంత నిజాయితీపరులమో చూసుకోవాలి. మార్గదర్శి (Margadarshi) సంస్థతో నువ్వు చేసేదేంటి..? స్వయంగా రిజర్వు బ్యాంకు (RBI) నిన్ను మార్గదర్శి ద్వారా డిపాజిట్లు సేకరించరాదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? నీ సంస్థ చిట్‌ఫండ్‌ వ్యాపారంతో ఎంత మందిని నిలువునా ముంచావో చెప్పు..? నా 40 ఏళ్లు రాజకీయ జీవితంలో నీలాంటి కుసంస్కారిని ఎన్నడూ చూడలేదు. ఒక రాజకీయ పార్టీని అంటిపెట్టుకుని దాన్ని సపోర్టు చేసే పత్రికను జర్నలిజం అనడం నేనెక్కడా చూడలేదు. 

కబ్జా చేశామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

రాజకీయాల్లో ఉన్నవారి మీద వ్యతిరేక కథనాలు రాయొద్దని నేనాడూ చెప్పలేదు. చెప్పను కూడా.. కానీ, వాస్తవాల్ని తెలుసుకుని మాత్రమే రాయమని నేను పత్రికా సోదరులందర్నీ కోరుతున్నాను. నిజంగా, నేను గానీ నా కుటుంబ సభ్యులు గానీ తప్పులు చేస్తే పత్రికా విలేకరులుగా మీరు ఎత్తి చూపండి.. మాకెలాంటి అభ్యంతరం లేదు. అంతేగానీ.. సంబంధంలేనివి మాకు అంటగట్టి విషప్రచారం మాత్రం చేయొద్దని మనవి చేస్తున్నాను. పిన్నాపురం, కందికాయపల్లెలో గానీ ఏ ఒక్కచోటైనా ఒక సెంటు భూమిని మేము కబ్జా చేశామని నిరూపిస్తే.. మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధమే. ఇదే విషయాన్ని ఇప్పటికే నాలుగైదు సార్లు బహిరంగంగా చెప్పాను. మరోమారు చెబుతున్నాను. 

నిరూపిస్తే.. నా ఆస్తులు రాసిస్తా.. ఇదే నా ఛాలెంజ్

నేను గానీ.. నా కుటుంబ సభ్యులు గానీ ఎక్కడైనా సెంటు భూమిని కబ్జా చేశామన్నా.. ఎవరి ఆస్తినైనా అక్రమంగా ఆక్రమించుకున్నామని మీరు ఆధారాలతో నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా .. ఇదే నా ఛాలెంజ్‌. ఈనాడు పత్రిక కథనం రాయడం.. దాన్ని పట్టుకుని నిజమని నమ్మించేలా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్న నాయకులకూ మరోమారు ఛాలెంజ్‌ విసురుతున్నాను. రాజకీయంగా ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. అంతేగానీ.. ఈనాడునో.. ఆంధ్రజ్యోతినో.. ఏబీఎన్‌నో.. టీవీ5తోనో దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం మేమూరుకునేదిలేదు. ఈనాడు పత్రిక రాసిన కథనాన్ని నిజమని నిరూపిస్తే .. ఆ వెయ్యికోట్ల విలువైన ఆస్తులన్నీ రామోజీరావుకో... ఆయన పత్రికా సంస్థకో రాసివ్వడానికి నేను సిద్ధం. నా సవాల్‌ను స్వీకరించే దమ్మూధైర్యం రామోజీరావుకు ఉందా..? అని నిలదీస్తున్నాను. 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...