Thursday, February 22, 2024

చంద్రబాబుతో కాదు, యుద్ధం రామోజీరావు, జగన్‌లకు మధ్యనే... - AP Assembly Elections 2024: Ramoji fights with YS Jagan, not Chandrababu

 చంద్రబాబుతో కాదు, యుద్ధం రామోజీరావు, జగన్‌లకు మధ్యనే...


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024) కూడా జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలను పక్కన పెడితే ఏపీ శాసనసభ ఎన్నికలే ప్రధానం కానున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేస్తూ యుద్ధరంగంలోకి దిగారు. ఇప్పటికే పలు విడతలుగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించి మూడు సిద్ధం సభల్లో పాల్గొన్నారు. 




టీడీపీ, జనసేన కూటమి (TDP- Jana Sena alliance) బిజెపి (BJP)తో పొత్తు కోసం ఇంకా ఎదురు చూస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో చేరే విషయాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం తేల్చడం లేదు. ఒక రకంగా ప్రతిష్టంభన ఏర్పడిరది. బిజెపి తమతో కలిసి వస్తుందని చెప్పుతూ ఆ రెండు పార్టీలు కొద్ది సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ, వారు ఇంకా యుద్ధరంగంలోకి అడుగుపెట్టనట్లే లెక్క. యుద్ధరంగంలోకి దిగడానికి ఆ రెండు పార్టీలు ఇంకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన జనసేన, టీడీపి కలిసి తాడేపల్లిగూడెంలో నిర్వహించే సభతో యుద్ధరంగంలోకి దిగవచ్చు. 

అయితే, ఈసారి ఏపి ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఎన్నికలు టీడీపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)కి, వైఎస్‌ జగన్‌కు మధ్య జరుగుతున్నట్లు అనిపించడం లేదు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawn Kalyan) వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పుతున్నప్పటికీ, ఆ కూల్చే పనిని ఈనాడు (Eenadu) అధినేత రామోజీరావు (Ramoji rao) భుజాల మీదికి ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు, రామోజీరావుకు మధ్య జరుగుతున్న వార్‌ మాదిరిగా ఈ ఎన్నికల చిత్రం రూపుకడుతోంది. 

రామోజీరావు తెలుగుదేశం పార్టీ (Telugu Desam)కి అనుకూలంగా వ్యవహరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి మాదిరిగా ఆయన వ్యవహరించేవారు కాదు, ఇప్పటి మాదిరిగా తన ఈనాడు పత్రికను వాడలేదు. అందరికీ చెందిన పత్రిక లాగా ఈనాడు కనిపించేది. వార్తాకథనాల్లో లాజిక్‌ ఉండేది. తటస్థులు కూడా నమ్మడానికి వీలైన రీతిలో వార్తాకథనాలు ఉండేవి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు ఈనాడు దినపత్రిక అలా కనిపించడం లేదు. పూర్తిగా అన్నీ వదిలేసి జగన్‌ను ఓడిరచేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది. చంద్రబాబు కన్నా, పవన్‌ కల్యాణ్‌ కన్నా ఎక్కువగా ఎక్కువగా జగన్‌ను ఓడిరచే బాధ్యతను రామోజీరావు మోస్తున్నట్లు కనిపిస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం ఒక్కటో, రెండో వార్తాకథనాలను ఈనాడు దినపత్రిక ప్రచురిస్తున్నది. జగన్‌ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక వార్తాకథనాలను రాయడం సులభమే అవుతుంది. కానీ, ఆ వార్తాకథనాల్లో ఏ మాత్రం సత్యం ఉండడడం లేదని, వాస్తవాలను మరుగు పరిచి రామోజీరావు దుమ్మెత్తిపోస్తున్నారని, ఈనాడులో వచ్చేవన్నీ కట్టుకథలేనని వైఎస్‌ జగన్‌ వర్గం, వైసీపీ నాయకత్వం భావిస్తున్నది. అందుకు విరుగుడుగా సాక్షి మీడియా (Sakshi Media)ను వాడుతున్నారు.

ఫ్యాక్ట్‌ చెక్‌ (Fact Check) పేరు మీద ఈనాడు వార్తాకథనాలను ఖండిరచడమే పనిగా సాక్షి మీడియా పనిచేస్తున్నది. రామోజీరావు ఈనాడులో ప్రచురితమైన వార్తాకథనాలు ఎంత అబద్ధమో చెప్పుతూ సాక్షి దినపత్రిక వార్తాకథనాలను ప్రచురిస్తున్నది. అటు ఈనాడు వంత పాడుతున్న తెలుగుదేశం పార్టీ హార్డ్‌కోర్‌ భక్తులు ఎంత మంది ఉన్నారో, వైఎస్‌ జగన్‌ను బలపరిచే హార్డ్‌కోర్‌ భక్తులు అంతే ఉన్నారు. వారు తమకు నచ్చినదాన్ని చదువుతారు. వాటినే నమ్ముతారు. కానీ తటస్థులైన పాఠకుల సంగతి ఏమిటనేది ప్రశ్న. వాస్తవాలను వారు ఎక్కడ వెతుక్కోవాలనేది సమస్య. 

దాన్ని అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మనబడి నాడు.. నేడు (Mana Badi Nadu - Nedu) అనే పథకాన్ని ఉదాహరణగా తీసుకుందాం. రాష్ట్రంలోని పాఠశాలలను ప్రభుత్వం విడతలవారీగా ఆధునీకరిస్తూ, వాటిలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ఆ పథకం అమలు ఇంకా కొనసాగుతున్నది. ఓ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను వేసి ఈనాడు వార్తాకథనం రాసింది. పాఠశాలల దుస్థితి ఇలా ఉందనేది ఆ వార్తాకథనం సారాంశం. అయితే, పాఠశాలను పునరుద్ధరించే కార్యక్రమం అమలు కొనసాగుతున్నది. అందుకు గాను పిల్లలను బయట కూర్చోబెట్టి భవన నిర్మాణం జరుతున్నదని, దాన్ని పట్టించుకోకుండా ఈనాడు కావాలని అబద్ధం రాతలు రాసిందని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనం రాసింది. 

మరో తాజా సంఘటననే తీసుకుందాం... కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (katasani Rambhupal Reddy)పై ఈనాడు ఓ వార్తాకథనం ప్రచురించింది. వంద కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించారనేది ఆ వార్తాకథనం ముఖ్యాంశం. అయితే, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై ఈనాడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, రామోజీరావుకు సవాల్‌ కూడా విసిరారు. నిజానికి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఇచ్చిన సమాధానాన్ని ఈనాడు ప్రచురించాలి. లేదా తాను రాసిన వార్తాకథనం వాస్తవమే అయితే, ఆధారాలను చూపిస్తూ ఆయనకు జవాబు ఇవ్వాలి. ఆ పని ఈనాడు చేసిందా?

ఇదిలావుంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేవారు. అయితే, ఆయన హయాంలో ఈ పత్రికలు ఇంతగా యుద్ధం ప్రకటించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పత్రికలు రాసే వార్తాకథనాల్లో కొంత హేతుబద్ధత, లాజిక్‌ కనిపించేవి. కానీ, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాస్తున్న రాతల్లో అవి కూడా కనిపించడం లేదు. అంటే, పూర్తిగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పోరాటాన్ని అలా ఉంచి, సొంతంగా వైఎస్‌ జగన్‌ మీద ఆ పత్రికలు యుద్ధం ప్రకటించాయని చెప్పాలి. 

సాక్షి మీడియా రాక ముందు ఈనాడుకు తిరుగు ఉండేది కాదు. కానీ, సాక్షి వచ్చిన తర్వాత ఈనాడు ఏదో కొంత మేరకు కళ్లెం పడుతూ వస్తున్నది. సాక్షి మీడియా వైఎస్‌ జగన్‌ది కాబట్టి ఆయనకు, ఆయన పార్టీకి వంత పాడుతుందనే అభిప్రాయం ఉండడం సహజం. 

ఈనాడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ పత్రిక కాదు. దానివల్ల దానికి ఒకింత తటస్థ మీడియా అనే పేరు ఉంటూ వచ్చింది. వార్తాకథనాల్లో హేతుబద్ధత ఉంటుందనే అభిప్రాయం ఉంటూ వచ్చింది. కానీ, ఈ ఎన్నికల వేడి ప్రారంభమైన తర్వాత ఈనాడుకు ఆ విలువ నశించింది. పూర్తిగా చంద్రబాబు పత్రికగా మారిపోయింది. దీన్ని పాఠకులు గమనించకపోరు. అది బహుశా రామోజీరావుకు పట్టించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆయన వైఎస్‌ జగన్‌ను పరాజయం పాలు చేయడమే ముఖ్య కార్యక్రమంగా, తన బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి. ఈనాడు పూర్తిగా విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నది. పత్రిక పట్ల రామోజీరావు తన నిబద్ధతను వదిలేసినట్లు కనిపిస్తున్నారు. 

ఏమైనా, తెలుగు మీడియా అనేది ప్రస్తుతం రంగులు పులుముకుని, ఏదో ఒక పార్టీకి బాకాగా మారిపోయింది. అందువల్ల వాస్తవాలు ప్రజలకు చేరి వేసి, వారికి సరైన మార్గనిర్దేశం చేసే పరిస్థితిని కోల్పోయాయి. ప్రజలు వాస్తవాలను, సత్యాలను మరో చోట వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిరది. జగన్‌ ప్రభుత్వం బాగుందా, బాగా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. చంద్రబాబు, జనసేన కూటమిని గెలిపించాలా, వద్దా అనేది వారు తేల్చుకుంటారు. జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నామని భావించే ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారు. లేదంటే ప్రతిపక్షంవైపు మొగ్గు చూపుతారు. ఈ స్థితిలో రామోజీరావు ఈనాడు దినపత్రిక మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని వార్తాకథనాలను రాస్తున్నట్లు కనిపిస్తున్నది. వారి మద్దతును జగన్‌ కోల్పోయే పరిస్థితిని తీసుకురావాలనేది రామోజీ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు చంద్రబాబుకు, జగన్‌కు మధ్య జరగడం లేదని, రామోజీరావుకూ జగన్‌కూ మధ్య జరుగుతున్నవని అనిపిస్తున్నది. 

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...