Tuesday, January 30, 2024

దూకుడు పెంచిన కాంగ్రెస్‌: ఎన్నికల సమరానికి అస్త్రాలు ఇవే... - AP Congress manifesto will consists Special category status

 దూకుడు పెంచిన కాంగ్రెస్‌: ఎన్నికల సమరానికి అస్త్రాలు ఇవే...


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల (AP Assembly Elections 2024)తో పాటు లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ (Andhra Ratna Bhavan)లో పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ సమావేశమైంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే మ్యానిఫెస్టోను విడుదల చేయాలని పిసిసి (AP PCC) భావిస్తున్నది. ప్రత్యేక హోదా (Speciala Category Status), విభజన హామీలు, సిపిఎస్‌ (CPS) రద్దు, విశాఖ ఉక్కు కర్మాగారం (Visakha steel plant) ప్రైవేటీకరణ నిలిపివేత వంటి అస్త్రాలను సంధించి ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నది. వాటితో పాటు కొన్ని సంక్షేమ పథకాలను కూడా మ్యానిఫెస్టోలో చేర్చే విషయంపై కసరత్తు సాగుతున్నది.



కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మాదిరిగా ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. నిరుద్యోగులు, విద్యార్తులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను కలిసి మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై వినతులు చేశారు. 

కమిటీ నివేదికను షర్మిల (YS Sharmila) పరిశీలించిన తర్వాత మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత నివేదికను ఎఐసిసి (AICC)కి సమర్పిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోగానే మ్యానిఫెస్టోకు తుదిరూపు ఇవ్వడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేత మ్యానిఫెస్టోను విడుదల చేయించి, హామీలను ఇప్పించే అవకాశాలున్నాయి. 

ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నామని పల్లంరాజు (Pallam Raju) చెప్పారు. జాతీయ స్థాయిలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం (P. Chidambaram) అధ్యక్షతన మ్యానిఫెస్టో తయారవుతుందని ఆయన తెలిపారు. వేరొకరు చేయలేనివి కాంగ్రెస్‌ చేయగలిగినవి ఏపి పునర్నిర్మాణంలో ఉంటాయని మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం చెప్పారు. మ్యానిఫెస్టో తయారీ మాత్రమే కాకుండా డిక్లరేషన్‌, గ్యారంటీలు కూడా ఉంటాయని సిడబ్ల్యుసి సభ్యుడు కొప్పుల రాజు అన్నారు.

- కాసుల ప్రతాపరెడ్డి

  

Monday, January 29, 2024

వైఎస్‌ షర్మిలతో పాత కాపులు కలిసి వస్తారా? - Will seniors will work with YS Sharmila?

వైఎస్‌ షర్మిలతో పాత కాపులు కలిసి వస్తారా?


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పార్టీకి ఊపిరి పోయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) హయాంలో చురుగ్గా వ్యవహరిస్తూ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్న సీనియర్‌ నేతలను కలుస్తూ, వారి మద్దతు పొందడానికి మాత్రమే కాకుండా వారిని పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రా రెడ్డి (DL Ravindra Reddy)ని కలిశారు. ఆయన గతంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచారు. రాష్ట్ర విభజన జరిగి, వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలం పుంజుకున్న తర్వాత రాజకీయాల నుంచి వెనక్కి తగ్గారు. ఆయన షర్మిలతో కలిసి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. కాంగ్రెస్‌లో పని చేయడానికి ఆయన ఏ మాత్రం ఉత్సుకత చూపుతారనేది కూడా చెప్పలేం. 



అంతకు ముందు వైఎస్‌ షర్మిల మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ (Undavalli Arun Kumar)ను కలిశారు. ఆయన కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించడానికి అంత ఇష్టం చూపుతున్న సూచనలు కనిపించడం లేదు. తాను రాజకీయాల నుంచి స్వచ్ఛంద విరమణ చేశానని ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి తన ఇంటికి వచ్చి షర్మిల పలకరించారని ఆయన అన్నారు.

తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మిత్రుడు దుట్టా రామచందర్‌ రావు (Dutta Ramachandar Rao)ను కూడా ఆమె ఇటీవల కలిశారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌ (Congress)లో చేరుతారని షర్మిల ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపంచడం లేదు. షర్మిలతో భేటీపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన వైసిపిలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల దుట్టా కాంగ్రెస్‌లో చేరే సమయం దగ్గరలో ఉందని అన్నారని చెప్పవచ్చు. అయితే, దుట్టా ఆలోచన మరో విధంగా ఉన్నట్లు అనిపిస్తున్నది.

తాము 40 ఏళ్ల నుంచి రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చామని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని ఆయన అన్నారు. ఏ పార్టీ అనేది సమయాన్ని బట్టి ఆలోచిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ కొనసాగడం లేదని, డాక్టర్‌గా తన వృద్ధి ధర్మం పాటిస్తున్నానని చెప్పారు. మరో మాట కూడా అన్నారు. మున్ముందు రాజకీయాల్లో ఉండే అవకాశాలు తక్కువ అని, తన వరకు ప్రాక్టీస్‌ చేసుకుంటానని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్‌లో చేరే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల వెంట ప్రస్తుతం తులసిరెడ్డి, రఘువీరారెడ్డి వంటి కొంత మంది సీనియర్లు ఉన్నారు. వీరు చురుగ్గా పని చేసే అవకాశాలున్నాయి. కానీ వారి సాయంతో షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోయగలరా అనేది అనుమానమే.

- కాసుల ప్రతాపరెడ్డి

Thursday, January 25, 2024

రాజధాని: దశాబ్దాలుగా తెగని ఆంధ్ర సమస్య - AP Capital issue as Assembly election agenda

 రాజధాని: దశాబ్దాలుగా తెగని ఆంధ్ర సమస్య


ఆంధ్ర రాజకీయ నాయకుల దూరదృష్టి లోపం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన (Andhra Pradesh bifurcation) తర్వాత ముఖమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన టీడిపి (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అమరావతి (amaravati) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింగపూర్‌ తరహాలో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాలన నిర్వహణకు తాత్కాలిక నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. అయితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణం పెద్దగా ముందుకు కదలలేదు.



ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) మూడు రాజధానుల (Three capitals) విధానాన్ని ముందుకు తెచ్చారు. అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాలకు అధికారాన్ని వికేంద్రీకరిస్తానని చెప్పారు. విశాఖ (Viskha)కు రాజధానిని తరలించే ప్రక్రియ కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. తిరిగి ఎన్నికలు సమీపించాయి. రాజధాని సమస్య మాత్రం తీరలేదు. తాను అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. ఆయనకు టిడిపి మిత్రపక్షం జనసేన (jana Sena) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మద్దతు పలుకుతున్నారు. 

మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని సమస్య వెంటాడుతూనే ఉంది. అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. మద్రాసు (Madras)ను తమకు ఇవ్వాలని పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వంటి వారు డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు వెతకడంలో విఫలమయ్యారు. చివరకు కర్నూలు తాత్కాలిక రాజధానిగా 1953 అక్టోబర్‌ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిరది. అప్పుడు కర్నూలు (Kurnool)లో రాజధానికి ఉండాల్సిన హుంగులేవీ లేవు. ఆ తర్వాత 1956 నవంబర్‌ 1వ తేదీన తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిరది. దాంతో అప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం దానికి రాజధానిగా ఆయాచితంగానే లభించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ కాలం సీమాంధ్ర నాయకులు, ముఖ్యంగా రాయలసీమ నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారెవరు కూడా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupathi) వంటి నగరాలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్‌ (Hyderabad)లోనే ఇతర ప్రాంతాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడా బ్యాపారాలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకున్నారు. 1969 ఉద్యమం తర్వాతనైనా వాళ్లు కళ్లు తెరవలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా విడిపోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, హైదరాబాద్‌ తమకు కాకుండా పోతుందని వారు అనుకోలేదు. వారి అంచనాలకు విరుద్దంగా, వారి ప్రయత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలిసిన తర్వాత కూడా సీమాంధ్ర నాయకులు తమకు హైదరాబాద్‌ కావాలనే పట్టుదలతోనే వ్యవహరించారు. హైదరాబాద్‌ తమకు కావాలంటూ పట్టుబట్టారు. చివరకు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగానైనా చేయించాలని ప్రయత్నాలు సాగించారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఏర్పడడం సాధ్యం కాదని, అందుకు తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని వారు గ్రహించలేకపోయారు.

చివరకు రాష్ట్రం చీలిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఆ తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండేలా రాష్ట్ర విభజన జరిగింది. అయితే, ఈలోగానే చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ, దాన్ని అభివృద్ధి చేయడానికి 33 వేల ఎకరాల భూమి సేకరించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమరావతిని నామమాత్రం చేస్తూ మూడు రాజధానుల విధానాన్ని ముందుకు తెచ్చింది. అమరావతిని సచివాలయ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి జగన్‌ ప్రయత్నాలు సాగించారు. అయితే, కోర్టు కేసుల కారణంగా ఆ ప్రయత్నాలు ముందు సాగలేదు. 

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఇక కొద్ది నెలలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడానికి ఎన్నో రోజులు లేవు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్య తీరేట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజధాని సమస్య కూడా ఎన్నికల ఎజెండాగా మారింది.

- కాసుల ప్రతాపరెడ్డి


 


Sunday, January 21, 2024

కేసీఆర్‌ ఓటమిని ప్రస్తావించిన వైఎస్‌ షర్మిల: జగన్‌కు పరోక్ష హెచ్చరిక - YS Sharmila gives indirect warning to YS Jagan

 కేసీఆర్‌ ఓటమిని ప్రస్తావించిన వైఎస్‌ షర్మిల: జగన్‌కు పరోక్ష హెచ్చరిక


ఆంధ్రప్రదేశ్‌ పిసీసీ (AP PCC) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల (YS Sharmila) తన ఎజెండాను ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) ఓటమిని ప్రస్తావించారు. దాన్ని బట్టి ఆమె తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan)కు పరోక్ష హెచ్చరిక చేశారు. తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించానని ఆమె అన్నారు. రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) బిడ్డ తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దింపిందని షర్మిల అన్నారు. దీన్ని బట్టి ఏపిలో కూడా వైఎస్‌ జగన్‌ను అధికారం నుంచి దింపుతానని ఆమె హెచ్చరిక చేసినట్లయింది. తాను స్వార్థం చూసుకోలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ తన పుట్టిల్లు అని, తెలంగదాణ మెట్టిన ఇల్లు అని ఆమె చెబుకున్నారు. 



తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే తాను కాంగ్రెస్‌ (Congress)లో చేరినట్లు ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనకు ముఖ్యమని కూడా ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు, తాను ఈ నెల 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు జిల్లాల్లో చేరికలు ఉంటాయని చెప్పారు. 24 నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. 

బిజెపి (BJP)పై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ (Manipur) సంఘటనను ప్రస్తావిస్తూ అటువంటి బిజెపి దేశానికి అవసరం లేదని చెప్పారు. పోలవరం (Polavaram), అమరావతి రాజధాని (Amaravati Capital), విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (Visakha steel plant) లాంటి అన్ని విషయాల్లో బిజెపి ఏపికి అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. వైసిపి, టిడిపి రెండు కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీలు కూడా బిజేపి వాళ్లేనని ఆమె వ్యాఖ్యానించారు. 

తాను ఎవరూ వదిలిన బాణం కాదని, మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని షర్మిల అన్నారు.తన వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని ఆమె అన్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని వైఎస్‌ షర్మిల అన్నారు.

- కాసుల ప్రతాపరెడ్డి

క్లియర్‌: వైఎస్‌ జగన్‌నూ టార్గెట్‌ చేసిన సోదరి షర్మిల - YS Sharmila targets not only Chandrababu and YS Jagan Also

క్లియర్‌: వైఎస్‌ జగన్‌నూ టార్గెట్‌ చేసిన సోదరి షర్మిల


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) అయిన తన సోదరుడు వైఎస్‌ జగన్‌ (YS jagan) పట్ల వైఎస్‌ షర్మిల (YS Sharmiala) వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతూ వచ్చింది. నేటితో అంటే జగనవరి 21వ తేదీ ప్రసంగంతో ఆ విషయం తేటతెల్లమైంది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu)నే కాదు, జగన్‌ను ఆమె టార్గెట్‌ చేయడానికి సిద్ధపడ్దారని అర్థమవుతున్నది. వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ పిసిసి (AP PCC) అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆమె జగన్‌పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ముందు కూడా ఆమె జగన్‌ను ఉపేక్షించబోరని నేటి ప్రసంగంతో అర్థమవుతున్నది.



గత ఐదేళ్లుగా వైసిపి (YCP) అధికారంలో ఉందని, అంతకు ముందు ఐదేళ్లు టిడిపి (TDP) అధికారంలో ఉందని, ఈ పదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే సమాధానం లేదని షర్మిల అన్నారు. రాష్ట్రం ఏర్పడిననాటికి లక్ష కోట్ల అప్పులున్నాయని, చంద్రబాబు తన పాలనతో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే జగన్‌ రెడ్డి (Jagan Reddy) మూడు మూడు లక్షల కోట్లు చేశారని, ఇప్పుడు ఏపి మీద పది లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ఆమె అన్నారు.

పదేళ్లు గడిచినా రాష్ట్రానికి రాజధాని ఉందా అని ప్రశ్నిస్తూ రాజధానిని కట్టడానికి డబ్బులు కూడా లేవని అన్నారు. ఒక్క మెట్రో అయినా ఉందా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి పది పెద్ద పరిశ్రమలు కూడా రాలేదని ఆమె తప్పు పట్టారు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఆమె విమర్శించారు. దళితులపై దాడులు వందకు వంద శాతం పెరిగాయని ఆమె అన్నారు. ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియాలు దోచుకోవడం దాచుకోవడమేనని ఆమె అన్నారు.



ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేశారని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారైన నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Category Status) రాకపోవడానికి చంద్రబాబు, జగన్‌ కారణమని ఆమె అన్నారు. రాజధాని అంటే చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని ఆమె అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నాడని, ఒక్క రాజధాని కూడా లేదని అన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasekhar Reddy) మరణం తర్వాత పోలవరం (polavaram) ముందుకు కదలలేదని, బిజెపితో దోస్తీ కోసం చంద్రబాబు, జగన్‌ తాకట్టు పెట్టారని అన్నారు. ఎంపీలు బిజెపి తొత్తులుగా మారారని, బిజెపి ఏం చెప్తే ఎంపీలు దంగిరెద్దుల్లా తలలూపుతారని ఆమె వ్యాఖ్యానించారు.జగన్‌ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్‌ మీద మాట్లాడలేదని ఆమె అన్నారు. వైసిపీ, టిడిపి బిజెపికి మద్దతు ఇచ్చాయని అన్నారు. వైసిపికి, టిడిపికి ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు.

- కాసుల ప్రతాపరెడ్డి


వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆత్మ మంత్రాంగం: వైఎస్‌ షర్మిల యాక్షన్‌ - KVP Ramachandar Rao will backbone for YS Sharmila politics in AP

 వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆత్మ మంత్రాంగం: వైఎస్‌ షర్మిల యాక్షన్‌


కేవీపీ రామచందర్‌ రావు (KVP Ramachandar Rao)ను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) ఆత్మగా చెబుతుంటారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్ల పాటు ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటూ వచ్చారు. రాజకీయంగా ఆయన క్రియారహితుడు అయ్యారని అందరూ అనుకున్నారు. కానీ, కాంగ్రెస్‌కు జీవం పోయడానికి ఆయన మంత్రాంగం నడుపుతూనే ఉన్నారని ఇటీవలి పరిణామాన్ని బట్టి అర్థమవుతున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ పిసిసి (AP PCC President) అధ్యక్షుడిగా ఉంటూ వచ్చిన గిడుగు రుద్రరాజు (Gidugu Rudra raju) కేవీపి రామచందర్‌ రావుకు సన్నిహితుడు. 

తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టబోతున్నారు. షర్మిలకు మార్గం సుగమం చేయడానికి పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి ముందు జనవరి 20 తేదీన షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయ (Idupulapaya)కు వెళ్లిన ఆమెతో కేవీపి రామచందర్‌ రావు కూడా ప్రయాణం చేశారు. అంటే, వెనక నుంచి కాంగ్రెస్‌ పార్టీని కేవీపి రామచందర్‌ రావు నడపబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.



వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా చురుగ్గా వ్యవహరించనున్నారనేది దీన్నిబట్టి అర్థమవుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరిపోస్తారా అనేది వేచి చూడాలి. ఆమె పిసిసి అధ్యక్షురాలిగా నియమితులవుతారనే విషయం ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచే కొంత కదలిక ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దెబ్బ తీయడానికే కాంగ్రెస్‌ ఆమెను ఏపి రాజకీయాల్లోకి దించారనే అభిప్రాయం వైసిపి నుంచి వినిపిస్తున్నది. కానీ, ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా టిడిపి - జనసేన కూటమి (TDP - Jana Sena alliance)ని దెబ్బ తీసే అవకాశం కూడా ఉంది. 

ఆమె ప్రభావం ఏపి రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది, ఏ పార్టీలకు ఆమె ప్రమాదం కాగలరనేది కొద్ది కాలంలోనే తెలుస్తుంది. కాంగ్రెస్‌ మాత్రం ఎపిలో తిరిగి పుంజుకోవాలనే ప్రయత్నంలో ఉంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని షర్మిల సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతారనేది స్పష్టం. ఆయితే, తన అన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పట్ల ఆమె వైఖరి ఎలా ఉంటుందనేది, ఆయనపై ఆమె విమర్శలు గుప్పిస్తారా అనే ప్రశ్నలకు కొద్ది రోజుల్లో సమాధానాలు దొరుకుతాయి.

- కాసుల ప్రతాపరెడ్డి






Friday, January 19, 2024

వైస్‌ జగన్‌ ధైర్యం: చంద్రబాబు ఆశలు గల్లంతు - YS Sharmial may damage Chandrababu's plan

 వైస్‌ జగన్‌ ధైర్యం: చంద్రబాబు ఆశలు గల్లంతు


వచ్చే శాసనసభ (AP Assembly Elections 2024), లోకసభ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) సాహసోపేత చర్యకు ఒడిగట్టారు. పాదయాత్ర చేసి ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా జగన్‌ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసుకున్నారు. సర్వేలు చేయించుకున్నారు. దాని ఆధారంగా కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి నిర్ణయాన్ని అమలులో పెట్టే సమయంలో పార్టీలో కొంత కలకలం రేగడం సహజం. అదే సమయంలో టికెట్‌ దక్కని నేతలు అసంతృప్తికి గురై పక్కచూపులు చూడడం కూడా కాదనలేని పరిణామం. తమ తమ నియోజకవర్గాల్లో తమ తమ విజయావకాశాలు తగ్గిపోయినప్పటికీ మళ్లీ పోటీ చేయడానికి నాయకులు పట్టుబడుతుంటారు. అటువంటి స్థితిలో పార్టీ అధినేతగా పార్టీని గెలుపు దారిలో నడిపించాల్సిన బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది. జగన్‌ అదే పనిచేస్తున్నారు. 



టికెట్లు దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తుంటారు. ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ జరిగేదే. పార్టీల ఫిరాయింపులు సర్వసాధారణం. అయితే, వైసిపి (YCP) అసమ్మతి నేతలకు ప్రత్యామ్నాయ పార్టీలుగా తెలుగుదేశం, జనసేన (jan Sena) ఉండేవి. కానీ, ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం వచ్చింది. జగన్‌ సోదరి పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల (YS Sharmila) నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసమ్మతి నేతలు కాంగ్రెస్‌ వైపు చూసే అవకాశం ఉంది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు (Chandrababu)ను నమ్ముకునే పరిస్థితి ఉండదని వారికి తెలుసు. చంద్రబాబును నమ్ముకున్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి పరిస్థితి టిడిపిలో అగమ్యగోచరంగా మారింది. తాము కోరుకున్న సీట్లను చంద్రబాబు కేటాయిస్తారా, లేదా అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. ఈ స్థితిలో వైసిపి అసమ్మతి నేతలు తమ పార్టీలోకి వస్తారనే చంద్రబాబు ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సిద్ధపడినట్లు సమాచారం. ఆయన ఎఐసిసి సభ్యుడు రఘువీరా రెడ్డిని కలిశారు. వారి మధ్య కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్‌ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు, కాపు రామచంద్రారెడ్డికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తున్నది. ఎపిలో ఉనికి కూడా లేని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎవరూ వచ్చినా ఆబగా అందుకుంటుందని చెప్పాల్సి  ఉంటుంది.



వైసిపి అసమ్మతి నేతలే కాకుండా టిడిపి అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌ వైపు చూసే అవకాశాలున్నాయి. వారిలో కొంత మంది వైసిపి వైపు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గణనీయమైన ప్రభావం చూపగల విజయవాడ ఎంపి కేశినేని నాని వైసిపిలోకి వచ్చారు. అలాగే మరికొంత మంది కూడా రావచ్చు. టిడిపి అభ్యర్థుల జాబితా వెలువడితే దానిపై స్పష్టత వస్తుంది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎలాగూ విజయం సాధించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది వైఎస్‌ జగన్‌కు మేలు చేసే విషయమే. ఆ పార్టీల్లోకి వెళ్లే నాయకులపై ఇదివరకే ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వైసిపి అభ్యర్థులకు కలిసి వస్తుంది. అదే సమయంలో కొత్తవారిని బరిలోకి దింపడం వల్ల వైసిపి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలుంటాయి. 

కొత్త చేరికలతో కాంగ్రెస్‌ కాస్తా బలం పుంజుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌, టిడిపి కూటమి మధ్య చీలిపోయే అవకాశాలుంటాయి. మరో వైపు బిజెపి కూడా పోటీలో ఉంటుంది. దీనివల్ల వైసిపికి మేలు జరిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. దానికి తోడు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు వైసిపికి అనుకూలంగా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు ఆశలు వచ్చే ఎన్నికల్లో ఫలించే పరిస్థితి లేదు.

-కాసుల ప్రతాపరెడ్డి

అమరావతిపై పవన్‌ కల్యాణ్‌ యూటర్న్‌: అప్పుడో మాట ఇప్పుడో మాట - Jana Sena chief Pawan Kalyan takes u turn on Amaravati

 అమరావతిపై పవన్‌ కల్యాణ్‌ యూటర్న్‌: అప్పుడో మాట ఇప్పుడో మాట


రాజకీయాల్లో నిలకడ అవసరం. అదే విధంగా ప్రధానాంశాలపై ఒక విధానం ఉండాలి. విధానాలపై స్థిరమైన నిర్ణయాలు ఉండాలి. కానీ జనసేన (Jana Sena) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు అవన్నీ ఉన్నట్లు కనిపించడం లేదు. జనసేనను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన నిలకడగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. అలాగే అమరావతి వంటి ప్రధానాంశాలపై ఆయన స్థిరమైన విధానం లేదు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. జనవరి 14వ తేదీన టిడిపి (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu)తో కలిసి బోగీ మంటల సంబరాల్లో పాల్గొని ప్రసంగించారు. అమరావతి (amaravati)ని బంగారు రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తమ నినాదం జై అమరావతి (Jai Amaravati), జై ఆంధ్ర అని ఆయన చెప్పారు. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వివిధ అంశాలపై స్థిరమైన నిర్ణయాలను తీసుకున్న దాఖలాలు లేవు. అమరావతి విషయంలోనూ పవన్‌ కల్యాణ్‌ మాట మార్చారు.



అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు అనుసరించిన విధానాన్ని పవన్‌ కల్యాణ్‌ 2018లో వ్యతిరేకించారు. అమరావతి టిడిపి రాజధానియా, ఆంధ్రప్రదేశ్‌ రాజధానియా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణను ఆపకపోతే అమరావతిని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. 2014 ఎన్నికలకు ముందు రాజధాని నిర్మాణానికి 1800 ఎకరాలు సరిపోతుందని చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చాక 33 వేల ఎకరాలు సేకరించడానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. భూసేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని తప్పు పట్టారు. వివిధ ప్రాజెక్టులకు మితిమీరిన భూసేకరణకు పాల్పడి రైతులు, ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆయన చంద్రబాబును దుయ్యబట్టారు. రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారా, వారి మద్దతు పొందారా అని కూడా ప్రశ్నించారు.

రాజధాని అమరావతికి సింగపూర్‌ మోడల్‌ (Singapore Model)ను తీసుకోవడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. రైతుల కన్నీరు పెడితే మంచిది కాదని ఆయన అన్నారు. ఈ విషయాలు ఆయన 2020లో చెప్పారు. రాజకీయ అవసరాల కోసం పవన్‌ కల్యాణ్‌ మాట మార్చి, మరో రకంగా మాట్లాడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ నిలకడ లేని తనాన్ని ఇది పట్టిస్తున్నది. అన్ని విషయాల్లోనూ పవన్‌ కల్యాణ్‌ ఇదే ధోరణి అనుసరిస్తారని అనుకోవడంలో తప్పులేదు.

-కాసుల ప్రతాపరెడ్డి

Thursday, January 18, 2024

రసకందాయంలో నెలూరు జిల్లా రాజకీయాలు: ముందు వరుసలో మల్లికార్జున్‌ రావు - Mallikarjun Rao in race for Udayagiri TDP ticket

రసకందాయంలో నెలూరు జిల్లా రాజకీయాలు: ముందు వరుసలో మల్లికార్జున్‌ రావు


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024) కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతూ వస్తున్నది. అయితే ఈసారి పార్టీల అధినాయకులు బీసీల వైపు చూస్తున్నారు. ప్రధానంగదా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం Udayagiri assembly segment) అభ్యర్థుల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి (Mekapati Rajagopal Reddy) పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. 



తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సరైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డికి టికెట్‌ దక్కే అవకాశాలు లేనట్లు సమాచారం. బీసీ నేతను రంగంలోకి దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన బీద రవిచంద్ర (Beeda Ravichandra) వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. అయితే, తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ స్థితిలో టిడిపి (TDP) టికెట్‌ కోసం ఇద్దరి మధ్య పోటీ నెకొంది. చంచల్ బాబు యాదవ్, డాక్టర్‌ మల్లికార్జున్‌ రావు (Dr Mallikarjun Rao) టిడిపి టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే, చంచల్ బాబు యాదవ్ కి తగిన అర్థబలం, అంగబలం లేదని అంటున్నారు. దీంతో మేకపాటి రాజగోపాల్‌ రెడ్డికి సరితూగే అభ్యర్థిగా డాక్టర్‌ మల్లికార్జున్‌ రావు రేసులో ముందున్నారు. 



మల్లికార్జున్‌ రావు ప్రభుత్వ వైద్యుడిగదా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నెల్లూరులో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఉదయగిరి ప్రజలకు చిరపరిచితులు. ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనకు తన యాదవసామాజికవర్గంలో మంచి పట్టు ఉండడంతో పాటు ప్రజల్లో మంచి పేరు ఉంది. 

అయితే, వైసిపి గానీ టిడిపి గానీ నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూనే బీసీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నాయి. జిల్లాలో ఈసారి రెండు నుంచి మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని చూస్తున్నాయి. ఇందుకు తీవ్రమైన కసరత్తు కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మల్లికార్జున్‌ రావు పేరు టిడిపి వైపు నుంచి తెర మీదికి వచ్చింది.  

-కాసుల ప్రతాపరెడ్డి 

మరోసారి గురి తప్పిన కేటీఆర్‌: దానికి బాధ్యులెవరో... - KTR blames Revanth Reddy Govt KCR failure

 మరోసారి గురి తప్పిన కేటీఆర్‌: దానికి బాధ్యులెవరో...


బీఆర్‌ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు (KT Rama Rao) గురి మరోసారి తప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. చేయాలి కూడా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీల అమలుపై, కాంగ్రెస్‌ చేసిన ఎన్నికల వాగ్దానాల అమలుపై ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలోనే ఆయన చాలా తొందరపడుతున్నారనుకుంటే, తమ తప్పులను ఆయనే స్వయంగా బయట వేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.



తాజాగా కేటీఆర్‌ (KTR) సర్పంచ్‌లకు చెల్లించే జీతాల బకాయిలపై ప్రభుత్వానికి ఓ డిమాండ్‌ పెట్టారు. నాలుగేళ్లుగా ఉన్న బకాయిలను చెల్లించాలని, వాటిని చెల్లించకపోతే పోరాటం చేస్తానని ఆయన అన్నారు. కేటీఆర్‌ ప్రకటనకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి. నాలుగేళ్లుగా సర్పంచ్‌లకు సొమ్ములు చెల్లించకుండా కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రశ్న. ఎనుమల రేవంత్‌ రెడ్డి (revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులవుతున్నది ఆయనకు తెలియదా? కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లకు బాకీ పడ్డారా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. అత్యంత ధనిక రాష్ట్రం అని చెబుకున్న కేసీఆర్‌ సర్పంచ్‌లకు ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లించడంలో ఎందుకు విఫలమయ్యారనేది మరో ప్రశ్న.

నిజమే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు, పడిన బకాయిలకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనేది నిరంతరాయ ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆటంకం లేకుండా కొనసాగే విషయం. సర్పంచ్‌ల బాకీలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిందే. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్దుకుంటున్నది. ఆ మాట అలా ఉంచితే, తాము చేసిన తప్పులకు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమనే పద్ధతిలో కేటీఆర్‌ మాట్లాడడం తన అనుభవరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమే. 

కేటీఆర్‌ తీరును రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర చైర్మన్‌ రాచమల్ల సిద్ధేశ్వర్‌ తప్పు పట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంత మంది సర్పంచ్‌లు ఆస్తులు అమ్ముకున్నారని, కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. దీనికి కేటీఆర్‌ ఏం సమాధానం చెప్తారు?

-కాసుల ప్రతాపరెడ్డి

Friday, January 12, 2024

వాస్తవాలు గ్రహించని కేటీఆర్‌: ఓటమికి కారణాలపై పొల్లు మాటలు - KTR not in a position to find reasons for BRS defeat

వాస్తవాలు గ్రహించని కేటీఆర్‌: ఓటమికి కారణాలపై పొల్లు మాటలు


బీఆర్‌ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటి రామారావు (KT Rama rao) ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అనిపిస్తున్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) బీఆర్‌ఎస్‌ ఓటమికి గల కారణాలను విశ్లేషించి, అసలైన కారణాలను గ్రహించలేకపోతున్నారు. ఓసారి యూట్యూబర్లు తమ ఓటమికి కారణమని అంటారు. మరోసారి తమ కార్యక్రమాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని అంటారు. కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారాలు చేసిందని అంటారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ అలవి కాని హామీలను ఇచ్చిందని అంటారు. ఎన్నికల్లో జయాపజయాలు ఉంటాయనే ఎరుక ఆయనకు తెలియంది కాదు. కానీ విజయం సాధించినప్పుడు దానికి గల కారణాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చిన హామీలను గుర్తు పెట్టుకుని వాటిని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సి ఉంటుంది. ఓటమి చెందినప్పుడు అందుకు గల వాస్తవ కారణాలను తెలుసుకోవడానికి విశ్లేషణ జరపాల్సి ఉంటుంది. 


Photo Courtesy: X (Twitter)


మేం చెబుతాం, మీరు వినండి అనే గత పద్ధతినే ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పదే పదే అంటున్నారు. రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే దాటింది. అప్పుడే హామీలపై విమర్శలు చేయడం సమంజసమేనా అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలులోకి తెచ్చింది. మిగతా హామీలకు కాంగ్రెస్‌ ఇచ్చిన గడువును కేటీఆర్‌ పరిగణనలోకి తీసుకోవడం లేదు. 

వాస్తవానికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా హామీల వర్షం కురిపిస్తూ వెళ్లారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్‌ ఎన్ని హామీలు ఇచ్చారు, వాటిలో ఎన్ని అమలుకు నోచుకున్నాయనే లెక్కలు తీయాల్సి ఉంది. దళితులకు మూడెకరాల భూమి, జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళిత నేత వంటివి కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో కొన్నే. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొత్త పథకాలను ముందుకు తెచ్చారు. రైతు బంధు, దళిత బంధు వంటివి కొన్ని. వాటి వల్ల ప్రజలకు ఏ మేరకు మేలు జరిగిందనేది సమీక్షించుకోవాల్సిన అవసరం కేటీఆర్‌ KTR)కు లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 

మరో ప్రధాన కారణం... తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం కొరవడడం. తమ సమస్యలను చెప్పుకోవడానికి ఏ వర్గానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆందోళనలను సహించని నియంతృత్వ ధోరణిని అమలు చేశారు. సమస్యలను వింటే కదా ఆందోళనలకు గల అసలు కారణాలేమిటో తెలిసేది. సమస్యలను పరిష్కరించడం సరే, కనీసం వాటిని విని ఉంటే బీఆర్‌ఎస్‌కు ఎంతో కొంత మేలు జరిగి ఉండేది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఐదేళ్ల పాలనలోనూ కేసీఆర్‌కు అన్ని వర్గాలు అండగా నిలిచాయి. అప్పుడెందుకు అన్ని వర్గాలు అండగా నిలిచాయి, తర్వాతి కాలంలో ఒక్కో వర్గం ఎందుకు దూరమవుతూ వచ్చిందనే విశ్లేషణ అవసరం లేదా?

రెండో దఫా కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు కేసీఆర్‌తో సహా బిఆర్‌ఎస్‌ నాయకులంతా ఎలా వ్యవహరించారు, ప్రజలకు ఎలా దూరమయ్యారు అనే ప్రశ్నలకు జవాబులు వెతక్కపోతే బీఆర్‌ఎస్‌ వచ్చే కాలంలో మరిన్ని పరాజయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

- కాసుల ప్రతాపరెడ్డి 


 

Wednesday, January 10, 2024

జనసేనలోకి అంబటి రాయుడు: జగన్‌కు రెండు వైపుల నుంచీ షాక్‌ - Amabati rayudu may join in Pawan Kalyan's Jana Sena

 జనసేనలోకి అంబటి రాయుడు: జగన్‌కు రెండు వైపుల నుంచీ షాక్‌


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jaganmohan Reddy)కి రెండు వైపుల నుంచి షాక్‌ తగిలింది. పది రోజుల క్రితం వైసిపి (YCP)ని వీడిన క్రికెటర్‌ Indian Cricketer) అంబటి రాయుడు (Ambati Rayudu) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నాయకత్వంలోని జనసేన (Jana Sena)లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంబటి రాయుడు గత డిసెంబర్‌ 28వ తేదీన జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. ఆ తర్వాత పది రోజులకే రాజీనామా చేశారు. అయితే, చాలా కాలం క్రితం అంబటి రాయుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. అప్పుడే ఆయన వైసిపిలో చేరడం ఖాయమైంది. అప్పుడే ఆయనకు గుంటూరు లోకసభ (Guntur Lok Sabha seat) సీటు ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దాంతో గత ఆరు నెలల పాటు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. తనకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకున్నారు. ఈ స్థితిలో వైఎస్‌ జగన్‌ మనసు మార్చుకున్నారు.

Photo Courtesy: X (Twitter)

గుంటూరు లోకసభ సీటు నుంచి పోటీ చేయాలని జగన్‌ నర్సారావుపేట లోకసభ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల (Lavu Srikrishna devarayalu)కు సూచించారు. మచిలీపట్నం నుంచి పోటీ చేయలని ఆయన అంబటి రాయుడికి సూచించినట్లు తెలుస్తున్నది. దాంతో అలక వహించిన అంబటి రాయుడు వైసిపి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని, భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అంబటి రాయుడు ఆ తర్వాత మరో ట్వీట్‌ చేశారు. తాను దుబాయ్‌లో జరిగే ఐఎల్‌టి 2ట్వంటీ (ILT T20) టోర్నమెంటు ఆడబోతున్నట్లు చెప్పారు. దాంతో క్రికెట్‌ టోర్నమెంటు కోసం ఆయన వైసిపి రాజీనామా చేసినట్లు అందరూ భావించారు. అయితే, అకస్మాత్తుగా ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

అంబటి రాయుడిని వదులుకున్న వైఎస్‌ జగన్‌ (YS Jagan) లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి కూడా అసమ్మతిని ఎదుర్కుంటున్నారు. తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని, నర్సారావుపేట నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. దీంతో జగన్‌కు రెండు వైపుల నుంచి కూడా షాక్‌ తగలినట్లయింది. ఈ క్రమంలోనే అంబటి రాయుడితో జనసేన నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. పలువురు జనసేన నేతలు ఆయనకు టచ్‌లోకి వచ్చారని చెబుతున్నారు. అంబటి రాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కూడా కలవబోతున్నారు. ఆయన ఈ సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ను కలిసి పార్టీలో చేరుతారని సమాచారం.

కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు జనసేనలో చేరుతుండడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జనసేన ఆయనకు ఏమి ఆఫర్‌ ఇస్తుందనేది వేచి చూడాలి.

- కాసుల ప్రతాపరెడ్డి

పురుగుల మందు తాగిన దంపతులు: ఆస్పత్రిలో భర్త (వీడియో)- Couple attempt suicide at Vijayawada: Pratap Kumar in Hospital (Video)

 పురుగుల మందు తాగిన దంపతులు: ఆస్పత్రిలో భర్త (వీడియో)





విషం తాగిన దంపతులు: పిల్లల ముందే తల్లి మృతి, ఆస్పత్రిలో తండ్రి - Couple commits suicide at VIjayawada in Andhra Pradesh

 విషం తాగిన దంపతులు: పిల్లల ముందే తల్లి మృతి, ఆస్పత్రిలో తండ్రి




విజయవాడ: పిల్లల ముందే విషం తాగి దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంలోని విజయవాడ (Vijayawada) శాంతినగర్‌లో జనవరి 9వ తేదీన చోటు చేసుకుంది. పిల్లలకు విషం ఇవ్వడానికి మనసొప్పక దంపతులు ఇరువురు సేవించారు. పిల్లల ముందే మహిళ విలవిలలాడుతూ మరణించింది. తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయికన్య, ప్రతాప్‌ కుమార్‌ దంపతులు చీటీలో పేరుతో 20 లక్షల రూపాయల మేరకు అప్పుల పాలయ్యారు. దాంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందామనే ఉద్దేశంతో నిన్న సాయం్తం పురుగుల మందు తెచ్చుకున్నారు. ప్రతాప్‌ కుమార్‌ వాటిని నాలుగు గ్లాసుల్లో పోశాడు. 



పురుగుల మందు పోసిన రెండు గ్లాసుల్లో పల్పీ ఆరెంజ్‌ పోసి ప్రతాప్‌ కుమార్‌ పిల్లలను పిలిచాడు. వారికి అది ఇచ్చి చెరో గ్లాసు తాగాలని దంపతులు నిర్ణయించుకున్నారు. పిల్లలను చంపడానికి మనసొప్పక వారికి ఇవ్వాలనుకున్న గ్లాసుల్లోని ద్రవాన్ని కూడా సాయికన్య తాగేసింది. పాయిజన్‌ డోస్‌ ఎక్కువ కావడంతో ఆమె విలవిలలాడుతూ పిల్లల ముందే మరణించింది. ప్రతాప్‌ కుమార్‌ మాత్రం ఒక్క గ్లాసు పురుగుల మందు తాగాడు. దాంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పిల్లలు చుట్టుపక్కలవారిని పిలిచారు. వారు ప్రతాప్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళకరంగా ఉంది.

https://kasulapratapreddytalks.blogspot.com/2024/01/couple-attempt-suicide-at-vijayawada.html



















Saturday, January 6, 2024

జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య ఇదే: బిజెపితో పొత్తుపై చంద్రబాబు పునరాలోచన - Chandrababu not interested on alliance with BJP

 జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య ఇదే: బిజెపితో పొత్తుపై చంద్రబాబు పునరాలోచన


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకునే విషయం మీద తెలుగుదేశం పార్టీ (టిడిపి) (Telugu Desam Party) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. పవన్‌ కల్యాణ్‌ (pawan Kalyan) నాయకత్వంలోని జనసేన (Jana Sena)తో సీట్ల సర్దుబాటు (Seat Sharing) దాదాపుగా కొలిక్కి వచ్చింది. జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి ఎక్కువ లోకసభ స్థానాలు ఆడుతున్నది. దీంతో పాటు మైనారిటీ ఓట్లను కోల్పోతామనే భావన కూడా టిడిపి (TDP)లో ఉంది. ఆ కారణాల వల్ల బిజెపితో పొత్తుపై చంద్రబాబు పునాలోచనలో పడినట్లు చెబుతున్నారు. 



చంద్రబాబు గతంలో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని ఉబలాట పడ్డారు. అయితే, తాజాగా ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. దీంతో బిజెపి ఆంధ్రప్రదేశ్‌ AP BJP) నాయకులు అప్రమత్తమయ్యారు. బిజెపి టిడిపితో కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు అప్రమత్తమయ్యారు. ఇటీవల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) బిజెపి ఏపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని (Daggubati Purandeswari) కలిశారు. పొత్తు విషయంపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. ఎపి బిజెపి నాయకులు మాత్రం టిడిపితో కలిసి పనిచేయాలని, దానివల్ల రాష్ట్రంలో కొన్ని సీట్లయినా సాధించుకోగలుగుతామని అంటున్నట్లు సమాచారం. అయితే, పొత్తులపై తుది నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనని అంటున్నారు. 

బిజెపి పది శాసనసభా స్థానాలు అడుతున్నట్లు సమాచారం. దాంతో పాటు అరకు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి (Tirupathi), రాజంపేట, హిందూపూర్‌ లోకసభ స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడకపోవచ్చునని సమాచారం. వైఎస్‌ షర్మిల (YS Sharmiila) కాంగ్రెస్‌లోకి వచ్చిన నేపథ్యంలో కూడా చంద్రబాబు ఆలోచన మారినట్లు చెబుతున్నారు. షర్మిల ప్రభావంతో కాంగ్రెస్‌ విజయం సాధించడం సాధ్యం కాదని, అయితే కాంగ్రెస్‌ గణనీయంగా వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైసిపి ఓట్లను గణనీయంగా చీలుస్తుందని చంద్రబాబు భావనగా చెబుతున్నారు. అందువల్ల టిడిపి విజయానికి బిజెపి అవసరం లేదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా, వైఎస్‌ జగన్‌ను బిజెపి కాపాడుతూ వచ్చిందనే భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కూడా బిజెపికి దూరంగా జరగాలనే చంద్రబాబు ఆలోచనకు కారణమని అంటున్నారు. అయితే, మైనారిటీల ప్రభావం కేవలం పది సీట్లలో మాత్రమే ఉంటుందని అంటున్నారు. మైనారిటీల పేరుతో బిజెపికి దూరంగా ఉండడం సరైంది కాదనే వాదన వినిపిస్తున్నది. 

అయితే, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన మరో విధంగా ఉంది. జనసేన, టిడిపిలు బిజెపితో కలిసి పనిచేయాలనేది ఆయన ఆలోచన. బిజెపితో పొత్తుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఆయన సూచిస్తున్నట్లు తెలుస్తున్నది. జనసేన, టిడిపి సీట్ల పంపకంపై ప్రకటన చేయడానికి ముందు చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

సంక్రాంతి పండుగ తర్వాత జనసేన, టిడిపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జనసేన పోటీ చేసే స్థానాలు కూడా దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. 

- కాసుల ప్రతాపరెడ్డి

వైఎస్‌ జగన్‌కు షర్మిల భయం: చంద్రబాబుపై సాక్షి కథనాలు ఇవీ... - YS Jagan fears of YS Sharmila, sakshi daily indicates

 వైఎస్‌ జగన్‌కు షర్మిల భయం: చంద్రబాబుపై సాక్షి కథనాలు ఇవీ...


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆమె కాంగ్రెస్‌లో చేరడం వైఎస్‌ జగన్‌కు మింగుడు పడడం లేదు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు నిర్వహించవచ్చుననే ప్రచారం బలంగానే సాగుతున్నది. షర్మిల ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చునని, షర్మిలను కూడా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఇటీవల అన్నారు. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల తమ పార్టీ ఓట్లు చీలుతాయనే వాదనను వైసిపి ఎమ్మెల్యే కొడాలి (Kodali Nani) నాని ఖండిరచారు. ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో చేరడం వల్ల టిడిపి ఓట్లు చీలాయా అని ఆయన ప్రశ్నించారు. అయితే, పైకి ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ షర్మిల భయం మాత్రం వైసిపిని పట్టుకుందని చెప్పవచ్చు. 



అదలా వుంటే, వైసిపి అధికార పత్రిక సాక్షి (Sakshi daily)లో షర్మిలకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రారంభమయ్యాయి. అయితే, నేరుగా షర్మిలపై విమర్శలు చేయకుండా కాంగ్రెస్‌, టిడిపి (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)ని తప్పు పడుతూ వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ (Kommineni Srinivas Rao) ఓ భారీ రాజకీయ వ్యాసం రాశారు. ఆయన కథనం ప్రకారం... వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ కుట్రలు చేస్తున్నది, అందుకు చంద్రబాబు సహకరిస్తున్నారు. అదే సమయంలో ఓ తెలుగు మీడియా యజమానిని కూడా ఆయన ఇందులోకి లాగారు. షర్మిల, ఆమె భర్త అనిల్‌ కుమార్‌ ఓ మీడియా యజమాని ట్రాప్‌లో పడ్డారని చెప్పారు. ఆయన పేరు చెప్పకపోయినప్పటికీ సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ జగన్‌ కుటుంబంలో అంతర్గత కలహాల నుంచి షర్మిల రాజకీయ ప్రయాణం వరకు మొదటి నుంచీ ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక (Andhrajyothi daily)లోనే వార్తాకథనాలు వస్తున్నాయి. షర్మిలను ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారని కూడా వార్త వచ్చింది. అది చాలా వరకు నిజం కావచ్చు కూడా. అది నిజం కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను ముందు తీసుకుని వెళ్లే మరో బాధ్యత కూడా అప్పగించవచ్చు. బిటెక్‌ రవి BTech Ravi), అనిల్‌ మధ్య విమానంలో మంతనాలు కూడా చంద్రబాబు కుట్రలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ రోజు అంటే జనవరి 6వ తేదీన సాక్షిలో మరో వార్తాకథనం ప్రచురితమైంది. చంద్రబాబుపై నేరుగా ఈ వార్తాకథనంలో విమర్శలు ఎక్కుపెట్టారు. సాక్షి దినపత్రిక వార్తాకథనం ప్రకారం... సిఎం రమేష్‌ను (CM Ramesh), సుజనా చౌదరిని బిజెపిలోకి పంపించి చంద్రబాబు తన అవినీతి కార్యకలాపాల నుంచి తప్పించుకనే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలను తన కుట్రలో భాగంగానే చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపించారని సాక్షి కథనం వ్యాఖ్యానించింది. 

సాక్షి వార్తాకథనం సారాంశం ఇదీ... షర్మిలకు సిఎం రమేష్‌ ప్రత్యేక విమానాన్ని సమకూర్చారు. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ని చంద్రబాబు కాంగ్రెస్‌లోకి వంపించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్‌తో చంద్రబాబు సంబంధాలు మరింత బలపడ్డాయి. షర్మిలకు ప్రత్యేక విమానాన్ని సమకూర్చడమే కాకుండా బిటెక్‌ రవిని రంగంలోకి దింపారు. 

సాక్షి వార్తాకథనంలో మరో వ్యాఖ్య కూడా ఉంది.. తన సామాజిక వర్గానికి చెందిన సునీల్‌ Suneel Kanugole)ను కాంగ్రెస్‌ తన వ్యూహకర్తగా ఎంచుకోవడం వెనక కూడా చంద్రబాబు పాత్ర ఉందనేది ఆ వ్యాఖ్య. ఆ వ్యాఖ్యకు మరో చిన్న ట్విస్ట్‌ కూడా ఇచ్చింది. సునీల్‌ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవాడనేది ఆ ట్విస్ట్‌.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో షర్మిల ప్రభావం పెద్దగా ఉండదని అంటూ మరో వైపు ఆమె పాత్రను తగ్గించే ప్రయత్నాలు కూడా వైసిపి నుంచి నడుస్తున్నాయి. వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, జగన్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్‌ ఎవరు సారథ్యం వహించినా చేసేదేమీ లేదనే విధంగా వైసిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తం మీద, షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వైఎస్‌ జగన్‌ను ఇరకాటంలో పెట్టినట్లే భావించాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ షర్మిలపై వైసిపీ ప్రత్యక్ష విమర్శలు పెరుగుతూ రావచ్చు. ఏమైనా ఇప్పటికి మాత్రం వైఎస్‌ షర్మిల ప్రభావం ద్రవరూపంలోనే ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి

Thursday, January 4, 2024

వైఎస్సార్‌ వారసత్వం హస్తగతం: వైఎస్‌ జగన్‌తో షర్మిల డైరెక్ట్‌ ఫైట్‌ - YS Sharmila may take AP CM YS Jagan and Chandrababu

 వైఎస్సార్‌ వారసత్వం హస్తగతం: వైఎస్‌ జగన్‌తో షర్మిల డైరెక్ట్‌ ఫైట్‌


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), తన సోదరుడు వైఎస్‌ జగన్‌ (YS Jagan)తో వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్లే. ఆమె తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. పూర్తి స్థాయి కాంగ్రెస్‌ నాయకురాలుగా మారిపోయారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఎఐసిసి (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసత్వం పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ చేతిలోకి వచ్చినట్లే, వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌ నాయకుడే ఆయినప్పటికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దాన్ని సొంతం చేసుకున్నారు. అయితే, రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్సార్‌ భావించారని, అందుకు తన వంతు కృషి చేస్తానని షర్మిల చెప్పారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారసత్వాన్ని సొంతం చేసుకున్నట్లే భావించాలి. లేదంటే, జగన్‌తో వైఎస్‌ వారసత్వం కోసం జగన్‌తో సమరం సాగిస్తుంది.



కాగా, వైఎస్‌ షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ (AP Congress) సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. అందుకు షర్మిల కూడా సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలే కాదు, అండమాన్‌ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని షర్మిల మీడియాతో అన్నారు. దీన్ని బట్టి ఆమె ఆంధ్రప్రదేశ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించడానికి పూర్తి అవకాశాలున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తద్వారా ఆమె వైఎస్‌ జగన్‌ను నేరుగా ఢీకొట్టడానికి సిద్ధపడినట్లు భావించాల్సి ఉంటుంది. అతి పెద్ద సెక్యులర్‌ పార్టీలో చేరినందుకు తాను సంతోషంగా ఉందని కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఆమె అన్నారు. 

షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024), లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కొద్ది నెలల్లోనే షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తారని అనుకోవచ్చు. వైఎస్‌ జగన్‌ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో కొత్తవారికి టికెట్లు ఇచ్చేందుకు వ్యూహరచన చేశారు. దానివల్ల పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వైసిపి నుంచి పోటీ చేసే అవకాశాలు లేకుండా పోతాయి. వారితో పాటు మరికొంత మంది వైసిపి (YCP) నాయకులు, కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌లోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన దారిలో మరింత నడిచే అవకాశాలను కొట్టిపారేయలేం. దానివల్ల వైసిపి ఓట్లకు కాంగ్రెస్‌ గండి కొట్టే అవకాశాలున్నాయి. 

నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపికి కూడా షర్మిల వల్ల చిక్కులు ఏర్పడవచ్చు. వైసిపి అసమ్మతి నాయకులు టిడిపి (TDP)లో చేరే అవకాశాలు తగ్గిపోతాయి. షర్మిల రాకతో కాంగ్రెస్‌ ఒక శక్తిగా మారే అవకాశాలు ఉండడంతో వారు టిడిపి వైపో, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) వైపో, బిజెపి వైపో చూడకపోవచ్చు.



వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. బిజెపితో పవన్‌ కల్యాణ్‌ పొత్తులో ఉన్నారు. ఆ విషయాన్ని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandheswari) స్వయంగా చెప్పారు. దాంతో బిజెపి కూడా టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. కాగా, తాజాగా బిజెపి ఎంపీ సిఎం రమేష్‌ (CM Ramesh) చెప్పిన మాటలు కూడా అందుకు అవకాశాలున్నట్లు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అంటూనే ఎపిలో బిజెపి కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని జగన్‌ చెప్పారు. దాన్నిబట్టి టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఎదుర్కుంటాయని భావించవచ్చు.

సిఎం రమేష్‌ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు. ఆయన విమానంలోనే ఇటీవల ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishore) నారా లోకేష్‌ (Nara Lokesh)తో కలిసి విజయవాడ వచ్చారు. ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబును కలిసి మాట్లాడారు. దానివల్ల టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయని అనుకోవచ్చు. అయితే, ఈ కూటమికి కాంగ్రెస్‌ నుంచి కూడా చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం కూడా ఉంది. రాయలసీమలో టిడిపి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీని ఏపిలో అధికారంలోకి తేవడం సాధ్యం కాకవచ్చు. కానీ, షర్మిల ఇటు వైఎస్‌ జగన్‌కు, అటు చంద్రబాబుకు సవాల్‌ విసిరే అవకాశాలున్నాయి. 

షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల వైఎస్‌ జగన్‌ మాత్రమే  కాకుండా చంద్రబాబు కూడా అప్రమత్తం కావాల్సిన రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొంటున్నాయి.

- కాసుల ప్రతాపరెడ్డి 


జగనన్న వదిలిన బాణం రివర్స్‌: వైసిపికి ఇక చిక్కులే, ఆప్పుడే ఆర్కే షిఫ్ట్‌ - YS Sharmila may create hurdles to YS Jagan in AP

 జగనన్న వదిలిన బాణం రివర్స్‌: వైసిపికి ఇక చిక్కులే, ఆప్పుడే ఆర్కే షిఫ్ట్‌


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆమె ఈ రోజు (జనవరి 4వ తేదీ) ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్‌లో చేరుతారు. తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారనే సంకేతాలు అప్పుడే అందుతున్నాయి. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramkrishna Reddy) (ఆర్కే) కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. మంగళగిరి (Mangalagiri) శాసనసనభ నియోజకవర్గం టికెట్‌ గంజి చిరంజీవి (Chiranjeeviకి ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. దీంతో అసంతృప్తికి గురైన ఆర్కే (RK) శాసనసభ సభ్యత్వానికి, వైసిపి (YCP)కి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరింత మంది కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఊపు వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదే సమయంలో ఏపిలో రాజకీయ సమీకరణాలు మారుతాయి. 



రాష్ట్ర విభజనతో (AP Bifurcation) ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు పదేళ్లు దాని ఆనవాళ్లు కూడా దాదాపుగా కనిపించలేదు. ఇప్పుడు వైఎస్‌ షర్మిల ప్రవేశంతో ప్రాణం పోసుకుంటుంది. షర్మిలను ఏపి పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఆమెను పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారా, సిడబ్ల్యుసిలోకి తీసుకుంటారా అనేది తేలాల్సి. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడితే ఆమె నేరుగా తన సోదరుడు వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఆమె సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. నిజానికి, తన ఏపి రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుడికి ఇబ్బంది కలిగించకూడదని ఆమె భావించారు. 

వైఎస్‌ జగన్‌ ఇబ్బంది పెట్టడం వల్లనే షర్మిల రాజకీయాల్లోకి వస్తుందని ఆమె భర్త అనిల్‌ కుమార్‌ (Anil Kumar) చెప్పినట్లు టిడిపి నేత బిటెక్‌ రవి (BTech Ravi) చెప్పారు. నిన్న బిటెక్‌ రవి, అనిల్‌ కుమార్‌ ఒకే విమానంలో విజయవాడకు ప్రయాణించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామంతీ జరిగింది. ఆ సమయంలో అనిల్‌ కుమార్‌ తనతో చెప్పిన మాటలను బిటెక్‌ రవి మీడియాకు వెల్లడిరచారు. దీన్ని బట్టి షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అర్థం చేసుకోవచ్చు.

షర్మిల నిర్ణయంపై వైఎస్‌ జగన్‌ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతున్నది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దానికి చంద్రబాబు కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. జగనన్న వదిలిన బాణం రివర్స్‌ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల రాష్ట్రమంతా తిరిగారని, ఇప్పుడు రివర్స్‌ అయ్యారని ఆయన అన్నారు. మీ ఇంట్లో మేం చిచ్చు పెట్టడమేమిటి? అని ప్రశ్నించారు. అది మీ కుటుంబ వ్యవహారమని, మాకేమి సంబంధమని చంద్రబాబు అన్నారు. మీ చెల్లి, మీ తల్లి... మీరు చూసుకోవాలని ఆయన జగన్‌కు సూచించారు.

షర్మిల ఏపి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తే అది కచ్చితంగా జగన్‌కు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆమె మాట్లాడే ప్రతి మాటకు ప్రతిస్పందన ఉంటుంది. షర్మిలను తిప్పికొట్టడం జగన్‌కు ఇబ్బందికరంగానే ఉంటుంది. వైసిపి నేతలు షర్మిలపై విమర్శలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. దానివల్ల టిడిపి, జనసేన కూటమి లాభపడుతుందని కూడా చెప్పవచ్చు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీల్చవచ్చు. షర్మిలను జగన్‌ ఏ విధంగా ఎదుర్కుంటారనే చూడాల్సిందే.

- కాసుల ప్రతాపరెడ్డి

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...