Friday, January 12, 2024

వాస్తవాలు గ్రహించని కేటీఆర్‌: ఓటమికి కారణాలపై పొల్లు మాటలు - KTR not in a position to find reasons for BRS defeat

వాస్తవాలు గ్రహించని కేటీఆర్‌: ఓటమికి కారణాలపై పొల్లు మాటలు


బీఆర్‌ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటి రామారావు (KT Rama rao) ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అనిపిస్తున్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) బీఆర్‌ఎస్‌ ఓటమికి గల కారణాలను విశ్లేషించి, అసలైన కారణాలను గ్రహించలేకపోతున్నారు. ఓసారి యూట్యూబర్లు తమ ఓటమికి కారణమని అంటారు. మరోసారి తమ కార్యక్రమాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని అంటారు. కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారాలు చేసిందని అంటారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ అలవి కాని హామీలను ఇచ్చిందని అంటారు. ఎన్నికల్లో జయాపజయాలు ఉంటాయనే ఎరుక ఆయనకు తెలియంది కాదు. కానీ విజయం సాధించినప్పుడు దానికి గల కారణాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చిన హామీలను గుర్తు పెట్టుకుని వాటిని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సి ఉంటుంది. ఓటమి చెందినప్పుడు అందుకు గల వాస్తవ కారణాలను తెలుసుకోవడానికి విశ్లేషణ జరపాల్సి ఉంటుంది. 


Photo Courtesy: X (Twitter)


మేం చెబుతాం, మీరు వినండి అనే గత పద్ధతినే ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పదే పదే అంటున్నారు. రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే దాటింది. అప్పుడే హామీలపై విమర్శలు చేయడం సమంజసమేనా అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలులోకి తెచ్చింది. మిగతా హామీలకు కాంగ్రెస్‌ ఇచ్చిన గడువును కేటీఆర్‌ పరిగణనలోకి తీసుకోవడం లేదు. 

వాస్తవానికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా హామీల వర్షం కురిపిస్తూ వెళ్లారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్‌ ఎన్ని హామీలు ఇచ్చారు, వాటిలో ఎన్ని అమలుకు నోచుకున్నాయనే లెక్కలు తీయాల్సి ఉంది. దళితులకు మూడెకరాల భూమి, జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళిత నేత వంటివి కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో కొన్నే. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొత్త పథకాలను ముందుకు తెచ్చారు. రైతు బంధు, దళిత బంధు వంటివి కొన్ని. వాటి వల్ల ప్రజలకు ఏ మేరకు మేలు జరిగిందనేది సమీక్షించుకోవాల్సిన అవసరం కేటీఆర్‌ KTR)కు లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 

మరో ప్రధాన కారణం... తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం కొరవడడం. తమ సమస్యలను చెప్పుకోవడానికి ఏ వర్గానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆందోళనలను సహించని నియంతృత్వ ధోరణిని అమలు చేశారు. సమస్యలను వింటే కదా ఆందోళనలకు గల అసలు కారణాలేమిటో తెలిసేది. సమస్యలను పరిష్కరించడం సరే, కనీసం వాటిని విని ఉంటే బీఆర్‌ఎస్‌కు ఎంతో కొంత మేలు జరిగి ఉండేది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఐదేళ్ల పాలనలోనూ కేసీఆర్‌కు అన్ని వర్గాలు అండగా నిలిచాయి. అప్పుడెందుకు అన్ని వర్గాలు అండగా నిలిచాయి, తర్వాతి కాలంలో ఒక్కో వర్గం ఎందుకు దూరమవుతూ వచ్చిందనే విశ్లేషణ అవసరం లేదా?

రెండో దఫా కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు కేసీఆర్‌తో సహా బిఆర్‌ఎస్‌ నాయకులంతా ఎలా వ్యవహరించారు, ప్రజలకు ఎలా దూరమయ్యారు అనే ప్రశ్నలకు జవాబులు వెతక్కపోతే బీఆర్‌ఎస్‌ వచ్చే కాలంలో మరిన్ని పరాజయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

- కాసుల ప్రతాపరెడ్డి 


 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...