Sunday, April 14, 2024

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

 చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం...


చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు (KT Rama Rao) వ్యవహారం చూస్తుంటే ఆ సామెత గుర్తుకు వస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కేటీఆర్ (KTR) వ్యవహారశైలి మారలేదు, ఆయనలోని అహంకారం తగ్గలేదు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఆయన తీరు మారలేదు. తెలంగాణ ప్రజలపై ఆయన తెలివితక్కువ వాళ్లు అనే ముద్ర వేశారు. ఈ వ్యాఖ్య చేయడంలో ఆయన ఆంధ్ర పెత్తందార్లను, రాజకీయ నాయకులను మించి ఆలోచన చేయలేకపోయారు. తెలంగాణపై అదే భావనతో ఆంధ్ర సంపన్నవర్గాలకు చెందినవారు పెత్తనం చేస్తూ వచ్చారు. దాన్ని వదిలించుకోవడానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టారు. తెలంగాణను తానే సాధించానని గొప్పలు చెబుకుంటున్న కేసీఆర్ ను ప్రజలు ఒక ఆలంబనగానే చేసుకున్నారు తప్ప ఒక్కడుగా ఆయన సాధించిందేమీ లేదు. అదీ కేసీఆర్ కలిసి వచ్చింది. 



తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ ను, కేటీఆర్ ను ఓపికతో తెలంగాణ ప్రజలు భరించారు. ఎందుకు భరించాల్సి వచ్చిందనేది వేరే చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు దఫాలు అధికారం చెలాయించిన కేసీఆర్ అనుసరించిన విధానాలు ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి, ఏ విధంగా నవ్వుల పాలు చేశాయనేది మరో చర్చ. వీటి లోతుల్లోకి వెళ్తే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ అన్నీ తానే అయి వ్యవహరించిన కేటీఆర్ నిర్వాకం కూడా పెద్ద చర్చనే. 

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఆశించింది వేరు కేసీఆర్ (KCR) చేసింది వేరనే విషయాన్ని కేటీఆర్ గ్రహించడానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుని వెళ్లడానికి కేసీఆర్ ఏ రోజు కూడా ప్రయత్నించలేదు. టీఆర్ఎస్ ను, ఆ తర్వాత బీఆర్ఎస్ ను ఫక్తు రాజకీయ పార్టీగానే నడిపారు. తెలంగాణ తత్వాన్నే కాదు, తెలంగాణ వాదాన్ని కూడా కేసీఆర్ వదిలేశారు. కేటీఆర్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

కేసీఆర్ చుట్టు అనాలో, కేటీఆర్ చుట్టు అనాలో తెలియదు గానీ వారి చుట్టూ ఆంధ్ర పెత్తందార్లు, ఆంధ్ర వ్యాపారవేత్తలు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర సినిమా ప్రముఖులు చేరారు. వారి ప్రయోజనాలే తెలంగాణ ప్రయోజనాలుగా నెరవేర్చారు. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో వారి పెత్తనమే నడిచింది. 

తెలంగాణ పునర్నిర్మాణం పేర ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ అంటే ఏమిటో తెలియనివారంతా అన్ని రంగాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. కానీ తెలంగాణ పునర్నిర్మాణం జరిగింది ఎక్కడ? తెలంగాణ ప్రజలు ఆశించిన కార్యాచరణ ఏది? చుట్టూ వందిమాగధులను చేర్చుకుని తదుపరి ముఖ్యమంత్రిని నేనే అంటూ బాకాలు ఊదించుకున్నారు. కేటీఆర్ కోటరీ గురించి విశ్లేషిస్తే అదో పెద్ద కథ అవుతుంది. అందువల్ల తెలంగాణలో రాష్ట్రం భ్రష్టు పట్టడంలో కేటీఆర్ పాత్ర అత్యంత ముఖ్యమైంది. 

తెలంగాణలో భూదందాలు జరిగిన తీరుపై అధ్యయనం చేస్తే అసలు గుట్టు అంతా బయటపడుతుంది. ధరణి (Dharani) పేరు మీద జరిగిన మోసాలు ఎన్నో, ఏ పాటివో, ఎటువంటివో కేటీఆర్ ఏనాడైనా ఆలోచించారా? లేదు. భూతల స్వర్గం చూపిస్తామని నమ్మించి తెలంగాణను గాలికి వదిలేసిన పాపం కేటీఆర్ ది కాదా? 

ఐదేళ్ల కేసీఆర్ పాలనను, ఐదేళ్ల కేటీఆర్ పాలనను చూసి ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు. ప్రజలు తమంత తాముగా ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోలేరు కాబట్టి ఉన్నదాంట్లో ప్రత్యామ్నాయన్ని చూసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు తెలివిగానే వ్యవహరించారు. పదేళ్ల పాటు తెలివితక్కువగా వ్యవహరించింది కేసీఆర్, కేటీఆర్. మొత్తం వారి నాయకత్వంలోని పార్టీకి ఆ తెలివితక్కువ తనాన్ని అంటగట్టడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే, ఎవరికీ రాష్ట్రంలో ఏ విధమైన హక్కులు లేవు. స్వేచ్ఛ లేదు. వారి మాటనే, వారి ఆచరణే తెలంగాణలో చెల్లుబాటు అయింది. 

- కాసుల ప్రతాపరెడ్డి


చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...