Thursday, November 30, 2023

కామారెడ్డిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓటమి బాట - Telangana exit poll results 2023 - KCR may be defeated at Kamareddy

 కామారెడ్డిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓటమి బాట


తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana assembly elections 2023) కామారెడ్డి (Kamareddy)నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు (K Chandrasekhar rao) ఓటమి పాలవుతారని ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆరా సంస్థ మస్తాన్‌ చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌ రెండో స్థానంలో నిలుస్తారని తెలియజేసింది. కామారెడ్డిలో కేసీఆర్‌ (KCR) ఓటమికి ప్రధాన కారణం భూమి సమస్యగానే చెప్పవచ్చు. కామారెడ్డి నియోజకవర్గంలోని భూములపై కేసీఆర్‌ కన్ను పడిరదని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ప్రతిపక్షాలు మొదటి నుంచీ విమర్శిస్తూ వస్తున్నాయి. ఇక్కడ బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారనే అంచనాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (revanth Reddy) కూడా పోటీ చేశారు. అయితే, ఆయన ఓటమి పాలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు.

గజ్వెల్‌ నియోజకవర్గంలో మాత్రం కేసీఆర్‌ స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశాలున్నట్లు ఆరా సంస్థ వెల్లడిరచింది. మల్లన్నసాగర్‌ (Mallanna Sagar) నిర్వాసితుల సమస్య కేసీఆర్‌కు ఈ నియోజకవర్గంలో పెద్ద సమస్యగా మారింది. నియోజకవర్గంలోని రెండు గ్రామాలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో కేసీఆర్‌ మెజారిటీ చాలా తగ్వే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కాగా, కేసీఆర్‌పై బిజెపి (BJP) అభ్యర్థిగా ఈటెల రాజేందర్‌ (Etela Rajender) పోటీ చేశారు. ఈటెల రాజేందర్‌ కేసీఆర్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడు, మంత్రి తన్నీరు హరీష్‌ రావు (Harish Rao) రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనాలు సాగుతున్నాయి. సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్‌ రావు గట్టి పట్టు సాధించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో తన పలుకుబడి తగ్గకుండా ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ (BRS)లో ఆయన ట్రబుల్‌ షూటర్‌గా కూడా పేరు పొందారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో సానుకూల ప్రతిస్పందన ఉందని చెబుతూనే కేసీఆర్‌ కుటుంబ వ్యవహారంపై వ్యతిరేకత ఉందని ఆరా సంస్థ ప్రతినిధి అంటున్నారు. దళితబంధు, రైతుబంధు పథకాల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని కూడా తేలిందని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌, ఇప్పటి బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ 88 సీట్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం అధికారానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు (Exit poll results 2023) ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి.



అయితే, తెలంగాణ మంత్రి, కేసీఆర్‌ తనయుడు కెటిఆర్‌ (KTR) మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. తమకు 70కి పైగా స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే మీడియా సంస్థలు క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన అన్నారు.

తమ పార్టీ శ్రేణులు ఈ రోజు నుంచే సంబరాలు చేసుకోవచ్చునని రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ సీట్లు 25కు మించవని ఆయన అన్నారు. ఎగ్టిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు వాస్తవమైతే కేటీఆర్‌ క్షమాపణ చెబుతారా అని ఆయన అడిగారు, రేవంత్‌ రెడ్డి కామారెడ్డిలోనే కాకుండా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా పోటీ చేశారు. కామారెడ్డిలో ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంది. 

కొల్లాపూర్‌ Kodangal) నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన శిరీష అలియాస్‌ బర్రెలక్క (Barrelakka)కు 15 వేల ఓట్లు రావచ్చునని ఆరా మస్తాన్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే రావచ్చు. కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. శాసనసభలో తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి

Telangana exit poll results 2023: తెలంగాణలో స్వీప్‌ లేదు, కానీ కాంగ్రెస్‌దే ఆధిక్యం - Telangana exit poll results 2023: Congress gets majority seats

 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (telangana assembly elections 2023) కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేస్తుందనే ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. కానీ కాంగ్రెస్‌ పవనాలు గానీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక  పవనాలు గానీ వీయలేదని వివిధ సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి,. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలను వివిధ సంస్థలు వెల్లడిరచాయి. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. బిజెపి తన బలాన్ని పెంచుకునే స్థితి కనిపిస్తున్నది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఆరా సంస్థ వెల్లడిరచిన ఫలితాల ఇలా ఉన్నాయి...

బిఆర్‌ఎస్‌  22 నుంచి 31, కాంగ్రెస్‌ 58 నుంచి 67, బిజెపి 5 నుంచి 7, మజ్లీన 7, ఇతరులు 2


రేస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి,,,

బిఆర్‌ఎస్‌ 48కి పైగా, మైనస్‌ 3 కూడా

కాంగ్రెస్‌  62 ప్లస్‌, లేదా మైనస్‌ 5

బిజెపి 3 ప్లస్‌, లేదా మైనస్‌ 5

ఎంఐఎం 6 ప్లస్‌, మైనస్‌ 1

ఇతరులు 1 ప్లస్‌ లేదా మైనస్‌ 2


పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి


బీఆర్‌ఎస్‌ 35 నుంచి 46

కాంగ్రెస్‌ 62 నుంచి 72

బిజెపి 3 నుంచి 8 

ఎంఐఎం 6 నుంచి 7

ఇతరులు 1 నుంచి 2


సిఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

బిఆర్‌ఎస్‌ 48

కాంగ్రెస్‌ 56

బిజెపి 10

ఎంఐఎం 5


జన్‌ కీ బాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి

బీఆర్‌ఎస్‌ 40 నుంచి 55

కాంగ్రెస్‌ 48 నుంచి 64

బిజెపి 7 నుంచి 13

ఎంఐఎం 4 నుంచి 7


చాణక్య ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు

బిఆర్‌ఎస్‌ 21 నుంచి 31

కాంగ్రెస్‌ 67 నుంచి 78

బిజెపి 6 నుంచి 7


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కోదండరామ్‌ చేసిన పని: Kodandaram played a key role in Telangana

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కోదండరామ్‌ చేసిన పని 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ జనసమితి (Telangana Jana Samithi) అధ్యక్షుడు కోదండరామ్‌ (Kodandaram) కీలకమైన భూమికనే పోషించారు. ఆయన కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మద్దతును ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం కూడా నిర్వహించారు. అంతకుమించి ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్నారు. సీట్ల బేరానికి దిగలేదు. ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ గద్దె దించడమే లక్ష్యంగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలోకి దిగారు. తెలంగాణ జెఎసిలో (Telangana JAC) కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కోదండరామ్‌ దాదాపుగా కేసీఆర్‌కు సమాన స్థాయిలో ఎదిగారు. ఆయన పాత్ర కూడా ఆ మేరకు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అప్పుడప్పుడు పొరపొచ్చాలు వచ్చినప్పటికీ కేసీఆర్‌ను బలపరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ కోదండరామ్‌ను దూరం పెడుతూ వచ్చారు. కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ అనుచరుడిగా కాకుండా కొంత స్వతంత్రంగా వ్యవహరించారు. అది కేసీఆర్‌కు నచ్చలేదు. ఆయన వెంట నడిచిన శ్రేణులను కేసీఆర్‌ తన వైపు తిప్పుకుంటూ వచ్చారు. తద్వారా సైన్యం లేని సేనాధిపతిగా ఆయనను తయారు చేయాలనే సంకల్పంలో కేసీఆర్‌ చాలా వరకు కృతకృత్యులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్‌ నిరాశ చెంది, కార్యాచరణ నుంచి విరామం తీసుకున్న ప్రతిసారీ కోదండరామ్‌ ఉద్యమాన్ని లేపడానికి కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చారు. ఆయన చేపట్టిన సాగరహారం (Sagara Haram) కార్యక్రమం అందుకు ఒక ఉదాహరణ. ఆయన చేపట్టిన సాగరహారం కార్యమ్రానికి తెలంగాణ ప్రజలు పెద్దయెత్తున హాజరయ్యారు. కొంత విధ్వంసం కూడా జరిగింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ మీద ఉన్న కొన్ని ఆంధ్రుల విగ్రహాలను ఉద్యమకారులు ధ్వంసం చేశారు కూడా. 

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన తెలంగాణ ప్రజల కోసం ఉద్యమాలు కూడా చేపట్టారు. ఒక సందర్భంలో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు కూడా. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే పనిని పెట్టుకుంది. తనకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలను కేసీఆర్‌ ఏ మాత్రం సహించలేదు. కోదండరామ్‌ తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. వివిధ వర్గాల అసంతృప్తికి ప్రభుత్వం నుంచి స్పందనను ఆశించారు. కానీ అటువైపు నుంచి ఏ విధమైన సానుకూల స్పందన కనిపించలేదు. అప్పటి టిఆర్‌ఎస్‌ (TRS)కు ఇప్పటి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆయన వివిధ ఎన్నికల్లో పోటీకి కూడా దిగారు.

రేవంత్‌ రెడ్డి (revanth Reddy) పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ చురుగ్గా పనిచేయడం సాగించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి తగిన వ్యూహాన్ని కూడా రచించింది. ఈ తరుణంలో కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయన సీట్ల కోసం బేరాలు పెట్టకుండా పోటీ నుంచే విరమించుకున్నారు. తన పార్టీ తరఫున అభ్యర్థులను కూడా దించలేదు.

కోదండరామ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం విశ్వాసంలోకి తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఆయనకు తగిన స్థానం కల్పించడానికి కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ముందుకు రావచ్చు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే మాత్రం ఆయనకు సముచిత స్థానం లభిస్తుందనే భావిస్తున్నారు.

పౌర హక్కుల సంఘంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్‌ ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాలు పంచుకున్నట్లు ఆయన చెబుతుంటారు.


- కాసుల ప్రతాపరెడ్డి


Wednesday, November 29, 2023

సినీ తారలు ఓటేసెదిక్కడే: వారి ఓట్లు ఎవరికి? - Chiranjeevi and other celebrities will vote in Jubilee Hills

 సినీ తారలు ఓటేసెదిక్కడే: వారి ఓట్లు ఎవరికి?


తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana assembly elections 2023) పోలింగ్‌ రేపు గురువారం జరగనుంది. రాష్ట్రవాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో మొత్తం 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి.  మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలోనూ గజ్వెల్‌లోనూ ఆయన పోటీకి దిగారు. కామారెడ్డి (Kamareddy)లో కేసీఆర్‌ ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. గజ్వెల్‌ (Gajwel)లో మాత్రం కష్టంగా బయటపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డిలోనూ కొడంగల్‌ లోనూ పోటీకి దిగారు. అలాగే. బిజెపి నేత ఈటల రాజేందర్‌ (Etela Rajender) హుజూరాబాద్‌లోనూ గజ్వెల్‌లోనూ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డికి, బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డికి మధ్య హోరాహోరీ పోరు ఉందని అంచనా. గజ్వెల్‌లో మాత్రం కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్య పోటీ జరుగుతున్నది. 

ఇదిలావుంటే, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చాలా మంది సినీతారలు ఓటేయనున్నారు. వారంతా జూబిలీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నట్లు అర్థమవుతున్నది. చాలా మంది ఆంధ్ర మూలాలున్నవారే. జూబిలీహిల్స్‌ (Jubilee hills) నియోజకవర్గంలో అనూహ్యంగా భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మొహమ్మద్‌ అజరుద్దీన్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్నారు. ఈ స్థితిలో సినీతారలు ఎవరికి ఓటేస్తారనే ఉత్సుకత నెలకొని ఉంది. 

జూబిలీహిల్స్‌ క్లబ్‌లో చిరంజీవి (Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తేజ (Ram Charan Tej), ఆయన సతీమణి ఉపాసన, హీరో నితిన్‌ ఓటేయనున్నారు. నితిన్‌ తెలంగాణకు చెందారు. రామ్‌చరణ్‌ తేజ గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్‌ నుంచి ఓటేయడానికి హైదరాబాద్‌ వచ్చారు. ఎఫ్‌ఎన్‌సిసిలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌, దగ్గుబాటి రానా (Daggubati Rana), సురేష్‌ బాబు, విశ్వక్‌ సేన్‌ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 

వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్‌లో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni), ఆయన సతీమణి అమల, ఆయన కుమారుడు నాగచైతన్య (Naga Chaitanya), మరో కుమారుడు అఖిల్‌ ఓటేస్తారు. రవితేజ మాత్రం ఎంపి, ఎమ్యెల్యే కాలనీలోని కేంద్రంలో ఓటేస్తారు, ప్రభాస్‌ (Prabhas), అనుష్క (Anushka), వెంకటేశ్‌, బ్రహ్మానందం మణికొండలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు.  అల్లరి నరేష్‌ జూబిలీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లోని ఆర్థిక సహకార సంస్థలో ఓటేస్తారు, జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR), ఆయన సతీమణి ప్రణతి ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూలులో ఓటేస్తారు. జూబిలీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ ఓటేస్తారు. దేవరకొండ సోదరులు తెలంగాణకు చెందినవారు.

రేపు గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. 35 వేల 655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 వేల మందికి పైగా పోలీసులు ఎన్నికల బందోబస్తులో ఉన్నారు. 375 కేంద్ర బలగాలు ఎన్నికల పర్యవేక్షణలో ఉన్నాయి. మొత్తం 4,400 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు హేమాహేమీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి, ముఖ్యమంత్రి కెసీఆర్‌తో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సిఎల్‌పి (CLP) నేత మల్లు భట్టివిక్రమార్కల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy) మాత్రం పోటీ చేయడం లేదు. బిజెపి ఎంపీలు అరవింద్‌, బండి సంజయ్‌ బరిలో ఉన్నారు. మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ భవిష్యత్తును కూడా ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. మొత్తంగా, బీఆర్‌ఎస్‌ (BRS) భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి. డిసెంబర్‌ 3వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

- కాసుల ప్రతాపరెడ్డి

కేసీఆర్‌ వ్యవహారశైలి కొంప ముంచుతుందా? - KCR working style may hit BRS in Telanganna Assembly elections 2023

 

కేసీఆర్‌ వ్యవహారశైలి కొంప ముంచుతుందా


తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కే. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao) మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ జాతిపితగా పిలిపించుకోవడం ఆయన అత్యంత ఇష్టమైన విషయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన వల్ల మాత్రమే సాధ్యమైందని, ఇతరేతర శక్తుల పాత్ర గానీ, ఇతర పార్టీల ప్రమేయం ఉందని గానీ ఆయన విశ్వసించరు. విశ్వసించడం మాట అటుంచితే ఎవరైనా కాంగ్రెస్‌ పాత్రనో, బిజెపి పాత్రనో ఉందని అంటే వారి మీద ఆయన తీవ్రమైన ఆగ్రహం కూడా వస్తుంది. తెలంగాణలోని వివిధ శక్తుల, వ్యక్తుల పాత్ర ఉందని మాట కూడా ఆయన చెవిన సోకకూడదు. జాతిపిత అని పదేపదే ప్రశంసిస్తూ వ్యాసాలు రాసినవారికి, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినవారికి ఆయన సముచిత స్థానాలు కల్పించారు. బీఆర్‌ఎస్‌ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ తనను పొగడుతూ వ్యాసపరంపరలు గుప్పించినవారికి ఆయన పదవులు ఇచ్చారు. అర్షతలు, అనర్హతలు ఆయన ఆలోచించలేదు. తనను ప్రశంసించడమే అర్హతగా భావించారు. దానివల్ల వివిధ సంస్థలు నిర్వీర్యమయ్యాయి. 

తెలంగాణలో తాను తప్ప అంతా మిథ్య అనేది కేసీఆర్‌ (KCR) విశ్వాసంగా కూడా మనం చెప్పవచ్చు. బీఆర్‌ఎస్‌కు చెందినవారు ఎన్నికల్లో గెలిస్తే అది తన వల్ల మాత్రమే తప్ప అభ్యర్థుల కృషి, శ్రమల వల్ల కాదు. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో అంతా తానై వ్యవహరించారు. మంత్రులకు, శాసనసభ్యులకు నోరు లేదు. మంత్రులు తమకు సంబంధించిన శాఖల గురించి కూడా మాట్లాడకూడదు. ఆ శాఖలను చూసుకునే బాధ్యత వారికి ఏ మాత్రం లేదు. వాటిని తాను పర్యవేక్షించాలి లేదా తన తనయుడు కేటీఆర్‌ చూసుకోవాలి. తనకు ఇష్టమైతే తప్ప ఆయన మంత్రులను, శాసనసభ్యులను కలవరు. తాను పిలిస్తే రావాల్సిందే తప్ప తమ సమస్యలను చెప్పుకోవడానికి వారు వచ్చినా ప్రగతిభవన్‌ గేట్లు తెరుచుకోవు. ఇది బహిరంగ రహస్యమే. 

వివిధ రంగాలకు చెందినవారికి నగదు రూపేణా ప్రయోజనం చేకూరిస్తే చాలునని ఆయన అనుకున్నారు. అందుకే దళిత బంధు (Dalith Bandhu), రైతుబంధు (Rythu Bandhu), షాదీ ముబారక్‌ (Shadi Mubarak) వంటి పలు సంక్షేమ పథకాలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. పచ్చిగా చెప్పాలంటే, ఓట్లను ముందుగానే కొనుక్కోవడం. అయితే, వివిధ వ్యవస్థల ద్వారా ప్రజలు తమంత తాముగా జీవితాలను బాగుపరుచుకోవడానికి ఆయన అవకాశం కల్పించలేదు. అటువంటి సంస్థలను నిర్వీర్యం చేశారు. తెలంగాణలోని వ్యవస్థలన్నీ దాదాపుగా ధ్వంసమయ్యాయి. దళితులకు దళితబంధు అనే నగదు లబ్ధి కల్పించేకన్నా తాను హామీ ఇచ్చినట్లుగా మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే, స్థిరాస్తి ఉండేది. దానికి రైతుబంధు కూడా వచ్చి ఉండేది. అటువంటి నిర్మాణాత్మకమైన పనులను ఆయన చేపట్టలేదు.

ప్రజల గొంతును వినిపించడానికి ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం లేకుండా పోయింది. మేధోవర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఆయనకు దూరమయ్యారు. రాజకీయాలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పని మీద లేదా తన వ్యతిరేక ఓటును చీల్చే పని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకు గాను, చిన్నా చితక పార్టీలను రంగం మీదికి తెచ్చారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను చీల్చే పని పెట్టుకున్నారు. తొలుత ఆయన టిడీపీ (TDP)ని నామరూపాలు లేకుండా చేశారు. కానీ, ఆ పార్టీ నుంచి వచ్చిన పచ్చి తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. ఒక రకంగా బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ టిడీపి అనే అభిప్రాయం ఏర్పడిరది.

ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేయాలని భావించారు. తనకు అవసరం లేకున్నా కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని (CLPని) చీల్చి 12 మంది శాసనసభ్యులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నిజానికి ఆయన ఆ ఎమ్మెల్యేల అవసరం కూడా లేదు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 88 స్థానాలు గెలుచుకుంది. స్ధిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి ఆ సంఖ్య చాలు. కానీ కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి ఆయన 12 మంది ఎమ్యెల్యేలను తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి వంటివారికి మంత్రి పదవులు ఇచ్చారు. 

ప్రస్తుత ఎన్నికల్లో కూడా తన వైఖరి విజయం, తన సంక్షేమ పథకాలు విజయం సాధించి పెడతాయని ఆయన విశ్వసించారని అనుకోవాలి. అయితే, ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తయన కుమారుడు కెటీఆర్‌ (KTR) ఆధిపత్యం పెరిగింది. కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఆయన ముద్ర వేయించుకున్నారు. బహుశా, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏం జరుగుతుందనే విషయం కేసీఆర్‌కు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు కూడా. కేటీఆర్‌ చుట్టూ ఉన్న బృందం సర్వత్రా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. 

క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది కూడా కేసీఆర్‌కు అవగాహన ఉండి ఉండదు. ఎమ్యెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు భూమిని కేంద్రంగా చేసుకుని సంపాదన మార్గంలో పడ్డారు. భూవివాదాల్లో తలదూర్చడం, కావాలంటే భూవివాదాలు సృష్టించడం వంటి పనులకు పాల్పడుతూ వచ్చారు. సంపాదన తప్ప మరో వ్యవహారం వారు చేపట్టిన దాఖలాలు కూడా లేవు. గ్రామీణ స్థాయిలో మద్యం వినియోగం పెరిగింది. యువతకు పనిలేకపోవడం, అయాచితంగా డబ్బులు రావడం, సెటిల్‌మెంట్లకు వైన్‌ షాపులే కేంద్రాలు కావడమనేది చూడవచ్చు.

తెలంగాణ శాసనసభ  ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) బీఆర్‌ఎస్‌ అపజయం పాలవుతుందని ఇప్పుడే నిర్ధారించలేం కానీ గాలి మాత్రం బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వీస్తున్నది. బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోతే బాధ్యత కేసీఆర్‌ది మాత్రమే తప్ప వేరెవరిదీ కాదు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మంత్రులు, శాసనసభ్యుల పాత్ర శూన్యం. వారు చేసిన పనులకు, వారి మీది వ్యతిరేకతకు కూడా కేసీఆర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

రేవంత్‌ రెడ్డి గెలిచారు: వైఎస్‌ షర్మిల తగ్గారు - Revanth Reddy issue: Why YS Sharmila supported Congress in Telangana

 రేవంత్‌ రెడ్డి గెలిచారు: వైఎస్‌ షర్మిల తగ్గారు


తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), బిఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao)పై అసమ్మతి గూడు కట్టుకని ఉందనే విషయం చాలా నెమ్మదిగా బయటపడుతూ వచ్చింది. కెసీఆర్‌ తన విధానాలను గానీ, చర్యలను గానీ సమీక్షించుకున్న దాఖలాలు లేవు. తాను చేసిందే న్యాయం, తాను చేసిందే సరైందనే పద్ధతిలో ఆయన కొనసాగినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గొంతు లేకుండా పోయింది. కేసీఆర్‌ (KCR) కాకపోతే ఆయన కుమారుడు, మంత్రి కెటీఆర్‌ మాట్లాడాల్సిందే తప్ప మరొకరు మాట్లాడడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితిలో ఆయన వ్యతిరేక శక్తులు ఒక్కటయ్యే అవసరం ఏర్పడిరది. 

తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయడానికి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌ టిపి)ని స్థాపించి తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. పాదయాత్ర చేశారు, ప్రజల్లో తిరిగారు. కానీ, అంతగా ఆమెకు ఆదరణ లభించలేదు. బిజెపి మద్దతుతోనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆమె వెనక ఉన్నారని అందరూ భావించారు. తెలంగాణలో ప్రతిపక్షాల ఓట్లు చీల్పడానికి ఆమె పనిముట్టుగా ఉపయోగపడతారని కూడా భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఓట్లకు ఆమె గండి కొడుతారని ఒక అంచనా ఉండేది. కానీ, పరిస్థితులు తారుమారయ్యాయి. 

క్షేత్రస్థాయి పరిస్థితులు తొలుత షర్మిలకు అర్థం కాలేదని అనుకోవాలి. క్రమంగా ఆమె పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు, పార్టీ విలీనానికి సిద్ధపడ్డారు. తనకు పాలేరు అసెంబ్లీ సీటు కావాలని పట్టుబట్టారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి. శివకుమార్‌ (Shivakumar) వైఎస్‌ఆర్‌ కుటుంబానికి సన్నిహితుడు. ఆయన ద్వారా ఆమె కాంగ్రెస్‌తో నెయ్యానికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పెద్దలు సోనియా గాంధీని, రాహుల్‌ గాంధీ (rahul Gandhi)ని కూడా కలిశారు. కానీ ఆమె ప్రయత్నాలు నెరవేరలేదు. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మరికొంత మంది షర్మిలను చేర్చుకోవాలని భావించారు. వైఎస్‌ఆర్‌ ద్వారానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాల్లో ఎదిగారు.

అయితే, వైఎస్‌ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే ప్రతిపాదనను, ఆమెకు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా వ్యతిరేకించారు. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి) (Telugu Desam, TDP)తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్న అనుభవాన్ని ఆయన కాంగ్రెస్‌ అధిష్టానానికి వివరించారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న మరుక్షణమే కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంటును రాజేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పెత్తందార్ల పాలన, చంద్రబాబు పాలన వస్తుందని అప్పటి టిఆర్‌ఎస్‌ (TRS) నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా తెలంగాణ తటస్థ మేధావులు కూడా ప్రచారం చేశారు. దాంతో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు దెబ్బ తిన్నాయి. వైఎస్‌ షర్మిలతో దోస్తీ కడితే ఎదురయ్యే ప్రమాదాన్ని అధిష్టానం గుర్తించి, ఆమె షరతులకు ఆంగీకరించలేదు.

చివరగా, ఆమె బేషరతుగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. పార్టీ అభ్యర్థులను పోటీకి దింపలేదు. తన కోరిక పాలేరు పోటీని నుంచి వెనక్కి తగ్గారు. షర్మిల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోను ఉపయోగపడవచ్చు. కానీ ఆమె పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు మేలు చేశారనే చెప్పవచ్చు.

ఇది ఎలా జరిగిందంటే, శివకుమార్‌, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌ ద్వారానే. తెలంగాణలో కాంగ్రెస్‌ (telangana Congress) పార్టీ గెలిస్తే షర్మిల రాజ్యసభ సభ్యురాలు అయ్యే అవకాశాలు లేకపోలేదు.

- కాసుల ప్రతాపరెడ్డి

Tuesday, November 28, 2023

కేసీఆర్‌పై ఫైట్‌: బిజెపి చేసిన తప్పిదం ఇదీ.. - Fight against KCR: BJP strategical mistakes in Telangana

 కేసీఆర్‌పై ఫైట్‌: బిజెపి చేసిన తప్పిదం ఇదీ..



తెలంగాణలో ఒకప్పుడు బిజెపికి మంచి ఊపు వచ్చింది. బండి సంజయ్‌ (Bandi Sanajay)ని తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), బిఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Raoను ఎదుర్కునే ధీటైన ప్రతిపక్ష నాయకుడు దొరికాడనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. బండి సంజయ్‌ ఒక రకంగా కేసీఆర్‌ (KCR)కు ప్రత్యామ్నాయంగా కనిపించారు. బండి సంజయ్‌ ప్రదర్శించిన దూకుడు, చూపిన తెగువ తెలంగాణలో బిజెపికి ఒక ఊపును ఇచ్చింది. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించడం, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద యెత్తున సీట్లను సాధించడం కూడా కలిసి వచ్చింది. బిఆర్‌ఎస్‌కు బిజెపి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం నాటుకునే రాజకీయ వాతావరణం ఏర్పడిరది. అయితే, మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. దాంతో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి గాలి తగ్గుతూ వచ్చింది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పు మరింత బిజెపి పరిస్థితి దిగజార్చింది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela Rajender) ఫిర్యాదు వల్లనే బండి సంజయ్‌ని అగ్రనాయకత్వం మార్చిందనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, తాను అలా ఫిర్యాదు చేసే వ్యక్తిని కాదని, మామూలుగా బండి సంజయ్‌ని అధిష్టానం మార్చిందని, బండి సంజయ్‌ పదవీకాలం ముగిసిందని, తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ అధ్యక్షులు మారారని ఈటల రాజేందర్‌ ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలు చెప్పారు. బండి సంజయ్‌ స్థానంలో అగ్రనాయకత్వం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy)ని నియమించింది. అయితే, తనపై వ్యవహరించినట్లు పార్టీ నాయకులు వ్యవహరించకూడదని, కిషన్‌ రెడ్డిని పనిచేసుకోనివ్వాలని బండి సంజయ్‌ అన్నారు. దీన్ని బట్టి బండి సంజయ్‌ మీద కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయనే అభిప్రాయం బలపడిరది. ఈ పరిణామం తర్వాత బిజెపి తెలంగాణలో మరింతగా పడిపోయింది.

కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇది వాస్తవమని చెప్పలేం గానీ ఆ ప్రచారం పనిచేసినట్లే కనిపిస్తున్నది. దాంతో కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌లపై ఎంతగా విమర్శలు చేసినా పెద్దగా ప్రతిస్పందనలు రాలేదు. బండి సంజయ్‌కి లభించిన ఆదరణ కిషన్‌ రెడ్డికి లభించలేదు. ఇదే సమయంలో పిసిసి తెలంగాణ అధ్యక్షుడిగా అనుముల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) నియామకం కాంగ్రెస్‌కు ఒక ఊపునిచ్చింది. కేసీఆర్‌ వ్యతిరేక వైఖరి విషయంలో మొదటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్న రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష (PCC Telangana chief) పదవిని చేపట్టిన తర్వాత మరింతగా దూకుడు పెంచారు. ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ల నుంచి చెప్పుకోదగిన రీతిలో వ్యతిరేకత ఎదురైంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు రేవంత్‌ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించారు. దాన్ని రేవంత్‌ రెడ్డి తట్టుకుంటూనే తనదైన వర్గాన్ని పెంచకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆయనకు బాసటగా నిలించింది. సీనియర్‌ నాయకులను బుజ్జగించింది. నిజానికి, రేవంత్‌ రెడ్డికి కర్ణాటకకు చెందిన కెసీ వేణుగోపాల్‌, శివకుమార్‌ అండదండలున్నాయి. కర్ణాటకలో శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనతను దక్కించుకున్నారు. కర్ణాటక విజయం కాంగ్రెస్‌కు తెలంగాణలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ఊపును కూడా ఇచ్చింది.

కాంగ్రెస్‌ పార్టీ ఓ వైపు తన శక్తులను కూడగట్టుకుని కేసీఆర్‌ను ఎదుర్కునే శక్తిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే బిజెపి బలహీనపడుతూ వచ్చింది. దానికితోడు బిజెపి, బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే వాతావరణం కూడా ఏర్పడిరది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), అమిత్‌ షా (Amit Shah), జెపి నడ్డా వంటి దిగ్గజ నాయకులు తెలంగాణలో ప్రచారం నిర్వహించినప్పటికీ బిజెపి పుంజుకునే స్థితికి రాలేదు. ఢల్లీ లిక్కర్‌ కుంభకోణం Delhi liquor scam) కేసులో కేసీఆర్‌ కూతురు, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalavakuntla Kavitha) అరెస్టు కాకపోవడంతో బిజెపితో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారనే వాతావరణం ఏర్పడిరది. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొంత మంది నాయకులు బాహాటంగానే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

నిజానికి, స్థానిక నాయకత్వం తీరు ఎలా ఉన్నప్పటికీ బిజెపి అగ్రనాయకత్వానికి తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మిక ఉన్నట్లు లేదు. దానివల్ల తెలంగాణలో కేసీఆర్‌ (KCR) తిరిగి అధికారంలోకి రావడమే వారికి అవసరంగా మారింది. అది వచ్చే లోకసభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే లోకసభ  ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గణనీయమైన ప్రభావం చూపవచ్చు, బిజెపి కేంద్ర నాయకత్వానికి ఢల్లీ అధికారం ముఖ్యం. దాంతో అది కేసీఆర్‌ గెలుపునే కోరుకుందని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా కాంగ్రెస్‌కు అనుకూలించే వాతావరణం ఏర్పడిరది.

మరో వైపు, తెలంగాణ ముస్లిం సమాజం (Muslim society) బిజెపికి వ్యతిరేకంగా ఉంది. అయితే, ఆ ముస్లిం సమాజాన్ని మజ్లీస్‌ (MIM) అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ (Asaduddin Owaisi) తన పార్టీకి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కి అనుకూలంగా సమీకరిస్తారని భావించారు. కానీ ముస్లిం సమాజంలో కొంత మేరకు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రతిష్ట కూడా దిగజారింది. బిజెపికి అనుకూలంగానే ఆయన ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని పోటీకి దింపారని, దానివల్లనే బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఓ అంచనా, ప్రచారం ఉంది. దాంతో తెలంగాణలోని ముస్లిం సమాజం ఆయనను పూర్తిస్థాయిలో విశ్వసించే పరిస్థితి లేదు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి షాదీ ముబారక్‌ వంటి కొన్ని సంక్షేమ పథకాలు ముస్లింలకు అందుతున్నాయి. కానీ, రైతుబంధు (Rythu Bandhu) వంటి ప్రధానమైన పథకాలు వారికి అందుబాటులో లేవు. చెప్పాలంటే, మెజారిటీ ముస్లింలకు వ్యవసాయ భూములు లేవు. అది కూడా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు వ్యవహరించడానికి కారణమవుతున్నది. బిజెపి వల్ల ముస్లిం సమాజం ముప్పును కూడా పసిగడుతున్నది. బిజెపి బలం పుంజుకుంటే తమకు ప్రమాదమనే భావనతో ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇది కాంగ్రెస్‌కు మంచి అవకాశాన్ని ఇచ్చింది.

కేసీఆర్‌ను ఎదుర్కునే దమ్మున్న ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌ రెడ్డి బలంగా ముందుకు వచ్చారు. దాంతో రేవంత్‌ రెడ్డి ఒక రకంగా తిరుగులేని నాయకుడిగా అవతరించారనే చెప్పవచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి

రైతుబంధు: ఎదురుతిరిగిన కేసీఆర్‌ వ్యూహం- Rythu Bandhu: KCR strategy in Telangana failed

 రైతుబంధు: ఎదురుతిరిగిన కేసీఆర్‌ వ్యూహం


తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), బిఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao)ది మొదటి నుంచీ భిన్నమైన ఆలోచన. ఆయనది వ్యూహరచనలోనూ ఆలోచనలోనూ మిగతా రాజకీయ నాయకులకు భిన్నమైన వ్యక్తిత్వం. బహుశా, ఆయన అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిలా కనిపిస్తున్నది. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తాను చేసిన పొరపాట్లు ఏమిటో అర్థం కావచ్చు. కానీ ఆయనకు అటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. తెలంగాణ సమాజం కోసం ఏమి చేయాలనే విషయాన్ని ఆయనే ఆలోచించి ఆచరణలో పెట్టారు. మరొకరి మాట ఆయన విన్నట్లు లేదు. ప్రజలు తనను అనుసరించాలే తప్ప ప్రశ్నించకూడదనే తత్వం కూడా ఆయనలో ఇమిడి ఉన్నట్లు అనిపిస్తున్నది. తెలంగాణ వచ్చే వరక ఒక రకంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకంగానూ ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ఆయన అందరి మాటా విన్నట్లు కనిపించారు. నిపుణులు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకుని వాటిని ప్రజల ముందు పెట్టి, వారిని ఒప్పించడంలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను ఆ ప్రక్రియకు స్వస్తి చెప్పారు. మరొకరి మాట వినడం ఆపేశారు. అంతా తానే అయి వ్యవహరించారు.

నిజానికి, ఏ రంగం ప్రజల ఆకాంక్షలను, కోరికలను ఆయన పట్టించుకోలేదని అర్థమవుతున్నది. ఉచితాలను గణనీయంగా పెంచారు. వాటి వల్ల ప్రజలంతా ఎల్లవేళలా తన వైపు ఉంటారని ఆయన భావించి ఉండవచ్చు. నిజానికి, ఆ ఉచితాలే ఆయనను ఈ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) గెలిపిస్తాయని భావించేవారు కూడా ఉన్నారు. కానీ, పరిస్థితి ఎదురు తిరిగినట్లు సంకేతాలు అందుతున్నాయి. బిఆర్‌ఎస్‌ ఈసారి అధికారం కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దే. ఆయనే ఈ ఓటమి బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. గెలుపు కీర్తిని రెండుసార్లు ఆయనే అనుభవించారు. కేసీఆర్‌ను మించిన ఎన్నికల వ్యూహకర్త లేరని కూడా అనిపించుకున్నారు. అయితే, ఈసారి ఆయన వ్యూహాలేవీ ఫలించేట్లు లేవు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత చోటు చేసుకుంది. చాలా వర్గాలు ఆయనకు దూరమయ్యాయి. యువత, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, చేనేత కార్మికులు.. ఇలా ఒక్కో వర్గమే ఆయనకు దూరమవుతూ వచ్చినట్లు తెలిసిపోతూనే ఉన్నది.

ముందు చెప్పినట్లు కేసీఆర్‌ (KCR) ఆలోచన తెలంగాణ విషయంలో భిన్నమైందే. తెలంగాణలో ఓ బలమైన సంపన్న వర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావించినట్లు అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్రలో ఆయన బలమైన వర్గమే నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నది. ఆ వర్గం రెండుగా చీలి వుండవచ్చు గాక, అటు వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందుకు రెడ్డి సామాజిక వర్గం నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ, మరో వైపు కమ్మ సామాజిక వర్గం నాయకత్వంలోని తెలుగుదేశం (TDP). అధికారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ రెండు మాత్రమే అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి. దీన్ని గమనించిన కేసీఆర్‌ తెలంగాణలో తనదైన సంపన్న వర్గాన్ని తయారు చేసి, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. అందులో ప్రధానమైన అంశం రైతుబంధు. ఈ పథకాన్ని యజమానులకు మాత్రమే వర్తింపజేస్తూ కౌలురైతులను పక్కన పెట్టేశారు. రైతుబంధు (Rythu Bandhu) పథకం ద్వారా పేద రైతులకు మాత్రమే సంపన్నవర్గానికి చెందిన రైతులకు కూడా పెట్టుబడి పేరున నగదు ముడుతూ వచ్చింది. ఇందులో అధిక మొత్తం సంపన్నవర్గాలకు చేరుతూ వస్తున్నది. భూమి సాగు చేసినా చేయకున్నా ఈ పథకం వర్తిస్తుంది. దాదాపు 40 శాతానికి పైగా రైతుబంధు సొమ్ము ధనికులకు, ఎన్నారైలకు అందుతుందనేది ఓ అంచనా. 

రైతుబంధు పథకం అమలు కారణంగా తెలంగాణలో ఓ విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. చాలా మంది తన వద్ద నిలువ ఉన్న నగదు ద్వారా మరింత సంపాదించడానికి వివిధ మార్గాలను ఇంతకు ముందు వెతుక్కునేవారు. వడ్డీలకు తిప్పడం, అర్బన్‌ ఏరియాలో ఇళ్లూ లేదా వాణిజ్య సముదాయాలు కొని కిరాయికి ఇవ్వడం, ఇంకా వివిధ రకాల వ్యవహారాలు నడపేవారు. అయితే, రైతుబంధు అమలులోకి రాగానే భూములు కొనడం ప్రారంభించారు, అదీ వ్యవసాయ భూములు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనడం సాగించారు. దీనివల్ల రైతుబంధు డబ్బులు రావడమే కాకుండా స్థిరాస్తి ఉండిపోతుంది. ధనికవర్గానికి ఇదొక మంచి అవకాశంగా కనిపించింది. ఈ వర్గాన్ని వివిధ రంగాల్లో పెంచాలనేది కేసీఆర్‌ ఆలోచనగా కనిపిస్తున్నది. ఆ వర్గం తన వెంట ఉంటుందని, ప్రజలను ప్రభావితం చేస్తుందని, దానివల్ల తన అధికారం సుస్థిరం అవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. కానీ, ఇది కూడా వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. చిన్నరైతులు తమకు రైతుబంధు అమలు కావడంతో సంతోషంగా ఉన్నప్పటికీ, వ్యవసాయం చేయని సంపన్న రైతులను ఆ పథకం నుంచి మినహాయించాలని భావిస్తున్నారు. కౌలు రైతులు ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. 

వివిధ వర్గాలను విస్మరించడం వల్ల, సంపన్నవర్గానికి మాత్రమే అండగా నిలుస్తుండడం వల్ల కేసీఆర్‌ ఈసారి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి కేసీఆర్‌ సిద్ధపడాల్సే ఉంది.


- కాసుల ప్రతాపరెడ్డి 

Monday, November 27, 2023

ప్రభావశీలత కోల్పోయిన కేసీఆర్‌ మేధావులు - Telangana intellectuals with KCR lost credibility

ప్రభావశీలత కోల్పోయిన కేసీఆర్‌ మేధావులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనకు, తన పార్టీకి సహకరించిన మేధావులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (K. Chandrasekhar Rao) నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చారు. తమ తమ రంగాల్లో వీరు ఉద్యమ కాలంలో క్రౌడ్‌ పుల్లర్స్‌గా పనిచేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని రంగాలకు చెందిన మేధావులు, ప్రభావశీలురు (Telangana influencers) పనిచేశారు. అయితే, తనకు అత్యంత సన్నిహితులైనవారికి మాత్రమే ఆయన పదవులు ఇచ్చారు. వారు ఉద్యమ కాలంలో మాదిరిగానే తనకు మద్దతుగా ఆయా రంగాలకు చెందినవారిని సమీకరిస్తారని ఆయన భావించి ఉండవచ్చు కానీ అది సాధ్యం కావడం లేదని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. 

తన పార్టీకి, తనకు కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో, నిబద్దతతో పనిచేసిన ప్రభావశీలురను ఆయన వదిలేశారు. తమను కూడా కేసీఆర్‌ (KCR) గుర్తిస్తారని, ఏదో ఒక రకమైన గౌరవ స్థాయి కల్పిస్తారని ఈ పదేళ్ల కాలం వారు వేచి చూశారనే చెప్పాలి. కానీ అది జరగలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోని అస్తవ్యస్త విధానాల వల్ల ఈ రంగం కూడా ప్రగతిపథాన సాగలేకపోయాయి. ఒకరకంగా అన్ని సంస్థలను కేసీఆర్‌ గాలికి వదిలేశారు. అలాగే పదవులైతే ఇచ్చారు గానీ వారు సక్రమంగా పనిచేయడానికి తగిన అవకాశాలు కల్పించలేదు.

కేసీఆర్‌ వైఖరి వల్ల పదవులు పొందిన తెలంగాణ ప్రభావశీలురు తమ స్థాయి, మర్యాదను, ప్రతిష్టను కోల్పోతూ వచ్చారు. తమ తమ వ్యవస్థల కిందికి వచ్చే వర్గాలకు వారు ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయారు. అలా తమ వ్యక్తిగత ప్రతిష్టను కోల్పోయినవారిలో టిఎస్‌పిఎస్సీ (TSPSC) మాజీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani), తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ప్రకాశ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న (Gorati Venkanna), ఇంకా కొంత మంది ఉన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఒక విడత పనిచేసిన నందిని సిధారెడ్డి మాత్రం ఆ జాబితా నుంచి చాలా త్వరగా బయటపడ్డారు. టిఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి నియమితులైనప్పుడు యువతరం పెద్దపెట్టున హర్షించింది. అయితే, టిఎస్‌పిఎస్సీ నియామకాలు ఎప్పటికప్పుడు ఆగిపోతుండడంతో గత పదేళ్ల కాలంలో పోస్టుల భర్తీ కాలేదు. దాంతో చక్రపాణి ప్రతిష్ట దెబ్బ తిన్నది. సోషల్‌ మీడియాలో బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా పెడుతున్న పోస్టులపై వ్యక్తమవుతున్న నిరసన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తాయి. 

ఇక తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌కు జర్నలిస్టులకు స్థలాలు కేటాయించే విధి ఏ మేరకు ఉందో, అది ఆయన పరిధిలోకి వస్తుందో రాదో తెలియదు. కానీ అల్లం నారాయణపై  జర్నలిస్టుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయం కూడా బలంగా నాటుకుపోయింది.  ఇవి ఉదాహరణలు మాత్రమే. వారు పనిచేయలేని ఓ నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ తీరు వల్ల వెల్లిపోయారు. అది వారి తప్పు కూడా కాదు. ఆ భారాన్ని మాత్రం మోయాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ మీద, బీఆర్‌ఎస్‌ మీద వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

కాగా, బి. నరసింగరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె. శ్రీనివాస్‌, సురేంద్రరాజు ప్రభుత్వ పదవులకు దూరంగా ఉన్నారు. అయితే, ఇటీవలి కాలం దాకా అంటే, గత ఎన్నికల వరకు కూడా కేసీఆర్‌ పట్ల, అప్పటి టిఆర్‌ఎస్‌ పట్ల సానుకూలవైఖరితోనూ ఉన్నట్లు భావించవచ్చు. కానీ ప్రస్తుత ఎన్నికల నాటికి వారు కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు భావించవచ్చు. ఇది వ్యక్తిగతమైంది కాదు, తెలంగాణ సంభవించిన పరిణామాల పట్ల, కేసీఆర్‌ వైఖరి పట్ల అసంతృప్తి మాత్రమే. ఈ ఎన్నికల్లో వారిలాంటి వ్యతిరేకతే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. అది ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సిందే.


` కాసుల ప్రతాపరెడ్డి

దెబ్బ కొట్టిన కేసీఆర్‌ శత్రుపూరిత వైఖరి-Blow to KCR's strategy on BJP

 

దెబ్బ కొట్టిన కేసీఆర్‌ శత్రుపూరిత వైఖరి


తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) కాస్తా భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)గా మారడం కేసిఆర్‌కు తొలి దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించానని చెబుకుంటూ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నెపంతో కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చారు. బిజెపికి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తూ జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని కేసిఆర్‌ ప్రకటించారు. జోతీయ రాజకీయాల పేరుతో పెద్ద హడావిడియే చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలను కలిశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తదితర నాయకులను కలిశారు. వారంతా బయటకు కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు గానీ కాంగ్రెస్‌ లేని జాతీయ కూటమిని ఇష్టపడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పారు. కేసిఆర్‌తో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో నితీష్‌ కుమార్‌ వ్యవహరించిన తీరు కూడా కేసిఆర్‌కు వ్యతిరేకంగానే కనిపించింది. ఆయన మీడియా సమావేశంలో తన అసహనాన్ని ప్రదర్శించారు. కేసిఆర్‌ వ్యవహారశైలి దేశంలోని బిజెపి వ్యతిరేక పార్టీలకు నచ్చలేదు. కేసిఆర్‌ను విశ్వసించి, ఆయన వెంట నడిచిన జెడిఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎటూ కాకుండా పోయారు. కర్ణాటక ప్రజలు ఆయనను తిరస్కరించారు. 


కేసిఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో మహారాష్ట్రలో సందడి చేశారు. కొంత మంది నాయకులను బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పంజాబ్‌ రైతులను తనకు అనుకూలంగా కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ చేయి పెట్టారు. బిజెపికి వ్యతిరేకంగా మాటల ముల్లె విప్పారు. బిజెపి వ్యతిరేక వైఖరిని దూకుడుగానే ప్రదర్శించారు. కేసీఆర్‌ బిజెపి వ్యతిరేక వైఖరిని ఇతర రాష్ట్రాల నేతలు నమ్మలేదు  సరే, ప్రజలు కూడా నమ్మలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. బిజెపి వ్యతిరేక వైఖరి  పట్ల కేసీఆర్‌ నిబద్ధతను సందేహిస్తూనే వచ్చారు. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ విషయంలో కేసీఆర్‌ బిజెపి వ్యతిరేక వైఖరి మరింత సందేహాస్పదంగా మారింది. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఆ కేసులో అరెస్టు కాకపోవడాన్ని రాజకీయ నాయకులు కూడా  బాహాటంగా ప్రశ్నిస్తూ  వచ్చారు. బిజెపితో కేసీఆర్‌కున్న సాన్నిహిత్యం కారణంగానే ఆమె అరెస్టు నుంచి తప్పించుకున్నారనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. కేసీఆర్‌ మనసాకర్మణా ప్రధాని నరేంద్ర మోడీ మిత్రుడనే భావన బలపడుతూ వచ్చింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల నాటికి అది ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధక్షుడిగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌ రెడ్డిని నియమించడం వెనక కేసీఆర్‌కు మేలు చేయడమే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.


కెసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన అంటకాగి, పదవులు అనుభవిస్తున్న మేధావులు చంకలు గుద్దుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడని, ఉండబోడని వారు నిజంగానే నమ్మారో లేదో తెలియదు గానీ బయటకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాగానే జాతీయ రాజకీయాల ప్రస్తావనను కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారు. ప్రజల ఆకాంక్షలను ప్రాంతీయ పార్టీలు మాత్రమే తీర్చగలవని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ అన్నారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలకు స్వస్తి పలికినట్లేనని భావించవచ్చు. కేవలం బిజెపికి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే అందుకు అవసరమైన బలాన్ని సమీకరించడమే కేసీఆర్‌ లక్ష్యంగా ఆయన పనిచేయాలని భావించినట్లు, అందుకు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకుల మద్దతును కూడగట్టడమే ఆయన వ్యూహమని అనుకోవడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు.


బిజెపి వ్యతిరేక వైఖరి లేదా శత్రు వైఖరిలోని కేసీఆర్‌ ఆంతర్యం బయటపడుతున్న కొద్దీ ఆయన మిత్రుడు అసదుద్దీన్‌ వైఖరి పట్ల అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. చివరగా వారిద్దరు కూడా కొన్ని వర్గాలకు దూరమయ్యారు. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చినందువల్ల తెలంగాణ ప్రజల సెంటిమెంటు దెబ్బ తినడమే కాకుండా బిజెపికి కేసీఆర్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడడం అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపుతుందని చెప్పడంలో సందేహం లేదు.


-కాసుల ప్రతాపరెడ్డి 

బౌద్ధిక శూన్యంలోకి తెలంగాణ-Telangana into the intellectual void

 

బౌద్ధిక శూన్యంలోకి తెలంగాణ

రాష్ట్ర విభజన వల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ఫలితం ఏదీ ఉండదని జయప్రకాశ్ నారాయణ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. ఆయనను తప్పు పట్టిన సందర్భం కూడా అది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పులు ఉంటాయని నాతో పాటు చాలా మంది భావించారు, చెప్పారు కూడా. కానీ ఈ పదేళ్ల కాలాన్ని తిరగదోడుకుంటే ఏం మిగిలింది, అంతా శూన్యం, మసక చీకటి. తెలంగాణలో బౌద్ధిక శూన్యం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్(kcr) ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఉద్యమ కాలంలో వ్యక్తమైన ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కేసీఆర్ చెప్పిన మాటలు ఆ విశ్వాసాన్ని మరింత పెంచాయి.


తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన శక్తులు రాజకీయ క్రీడలో అవమానాలను దిగమింగాల్సిన పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర(telangana state) ఏర్పాటు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు ప్రాబల్యంలోకి వచ్చాయి. ఈ శక్తులకు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మాటలు ఉత్తి డొల్లగా కనిపిస్తాయి. బంగారు తెలంగాణ కోసమే అన్ని శక్తులను ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్ చెబుతూ వచ్చారు. బంగారు తెలంగాణ నినాదం కొద్ది రోజుల్లోనే తెరమరుగు అయింది. తెలంగాణ క్షీణ దశకు పాదులు పడ్డాయి. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం పూర్తిగా మంట కలిసిపోయింది.
తలెత్తుకు తిరగాల్సిన శక్తులు, అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శక్తులు చేతలుడిగి, కక్కలేక మింగలేక కునారిల్లుతున్నాయి. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమో, అమలైనా అస్తవ్యస్తంగా మారడమో జరిగింది. విద్యావ్యవస్థ మొత్తం కుప్పకూలిన పరిస్థితి. సాహిత్య, సామాజిక రంగాల్లో పనిచేసే సంస్థలు దిష్టిబొమ్మలుగా మారిపోయాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటివాటిని అందుకు ఉదాహరణగా చూపవచ్చు.
24 గంటలు కరెంట్, సంక్షేమ పథకాలు తప్ప జరిగిన ప్రగతి ఏమీ లేదని చెప్పాల్సి వస్తున్నందుకు కాస్తా బాధగానే ఉంటుంది. ప్రజలను యాచకులుగా మార్చే ప్రక్రియ చాలా వేగవంతంగా సాగింది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని మెరుగు పరిచి సమాజం కోసం ఉపయోగపడే శక్తులకు స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో వ్యవహారాలు నడిపేవారు అగ్రస్థానంలోకి వచ్చారు. సారం లేని ఓ వ్యవస్థ లేదా సమాజం చాలా వేగంగా రూపుదిద్దుకుంటున్నది.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధానాంశాలపై సాగిన తెలంగాణ ఉద్యమం ఇప్పుడు వాటిని మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీళ్ల విషయానికి వస్తే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పనులను అధికార పార్టీ చూపుతోంది. నిధుల పరిస్థితి ఘోరంగానే ఉంది. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందని పరిస్థితి. పదో తారీఖున, పదిహేనో తారీఖున ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ వల్ల అది జరుగుతుందని, జీతాలైతే ముడుతున్నాయి కదా అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటున్నారు.
నియామకాలది పెద్ద కథే. యువత మొత్తం టిఎస్ పిఎస్సీ నియామకాలపై ఆశలు పెట్టకుంది. అందరికీ ఉద్యోగాలు దక్కకపోవచ్చు గానీ దాని ద్వారా నియామకాలు జరిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేక ఉండేది కాదు. టిఎస్ పిఎస్సీ పరీక్షలు నెగ్గలేనివాళ్లు మరో దారి చూసుకుని ఉండేవారు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకుని ఉండేవారు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లలు చాలా మంది ఇప్పుడు ఓటర్లుగా ముందుకు వచ్చారు. అప్పటి టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు కోసం ఏం చేసిందనేది వారికి పెద్దగా పట్టకపోవచ్చు. కానీ తమకు ఉద్యోగాలు రావడం లేదనే నిరసనను ఎన్నికల్లో వ్యక్తం చేసే అవకాశం ఉంది.
నిజానికి, తెలంగాణ రాష్ట్రంలో ఏయే రంగాలు ఎలా ప్రగతి సాధిస్తాయనే అవగాహన ఉన్న వ్యక్తులకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బ్రోకర్ల వ్యవస్థ ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఉత్పాదక రంగాలు దెబ్బ తిని అనుత్పాదక వ్యవస్థ పెద్ద రాజ్యమేలుతోంది. ఎమ్మెల్యే, స్థానిక నాయకత్వాలు ప్రజల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఆ నాయకత్వాల వల్ల తెలంగాణ మేధో వర్గం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తంగా, ఈ పదేళ్ల కాలంలో జరిగిన పనులను లోతుగా అధ్యయనం చేయాల్సిందే. చాలా వరకు క్షేత్ర పర్యటనలు కూడా అవసరం.
- కాసుల ప్రతాపరెడ్డి

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...