Monday, November 27, 2023

బౌద్ధిక శూన్యంలోకి తెలంగాణ-Telangana into the intellectual void

 

బౌద్ధిక శూన్యంలోకి తెలంగాణ

రాష్ట్ర విభజన వల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ఫలితం ఏదీ ఉండదని జయప్రకాశ్ నారాయణ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. ఆయనను తప్పు పట్టిన సందర్భం కూడా అది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పులు ఉంటాయని నాతో పాటు చాలా మంది భావించారు, చెప్పారు కూడా. కానీ ఈ పదేళ్ల కాలాన్ని తిరగదోడుకుంటే ఏం మిగిలింది, అంతా శూన్యం, మసక చీకటి. తెలంగాణలో బౌద్ధిక శూన్యం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్(kcr) ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఉద్యమ కాలంలో వ్యక్తమైన ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కేసీఆర్ చెప్పిన మాటలు ఆ విశ్వాసాన్ని మరింత పెంచాయి.


తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన శక్తులు రాజకీయ క్రీడలో అవమానాలను దిగమింగాల్సిన పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర(telangana state) ఏర్పాటు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు ప్రాబల్యంలోకి వచ్చాయి. ఈ శక్తులకు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మాటలు ఉత్తి డొల్లగా కనిపిస్తాయి. బంగారు తెలంగాణ కోసమే అన్ని శక్తులను ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్ చెబుతూ వచ్చారు. బంగారు తెలంగాణ నినాదం కొద్ది రోజుల్లోనే తెరమరుగు అయింది. తెలంగాణ క్షీణ దశకు పాదులు పడ్డాయి. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం పూర్తిగా మంట కలిసిపోయింది.
తలెత్తుకు తిరగాల్సిన శక్తులు, అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శక్తులు చేతలుడిగి, కక్కలేక మింగలేక కునారిల్లుతున్నాయి. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమో, అమలైనా అస్తవ్యస్తంగా మారడమో జరిగింది. విద్యావ్యవస్థ మొత్తం కుప్పకూలిన పరిస్థితి. సాహిత్య, సామాజిక రంగాల్లో పనిచేసే సంస్థలు దిష్టిబొమ్మలుగా మారిపోయాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటివాటిని అందుకు ఉదాహరణగా చూపవచ్చు.
24 గంటలు కరెంట్, సంక్షేమ పథకాలు తప్ప జరిగిన ప్రగతి ఏమీ లేదని చెప్పాల్సి వస్తున్నందుకు కాస్తా బాధగానే ఉంటుంది. ప్రజలను యాచకులుగా మార్చే ప్రక్రియ చాలా వేగవంతంగా సాగింది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని మెరుగు పరిచి సమాజం కోసం ఉపయోగపడే శక్తులకు స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో వ్యవహారాలు నడిపేవారు అగ్రస్థానంలోకి వచ్చారు. సారం లేని ఓ వ్యవస్థ లేదా సమాజం చాలా వేగంగా రూపుదిద్దుకుంటున్నది.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధానాంశాలపై సాగిన తెలంగాణ ఉద్యమం ఇప్పుడు వాటిని మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీళ్ల విషయానికి వస్తే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పనులను అధికార పార్టీ చూపుతోంది. నిధుల పరిస్థితి ఘోరంగానే ఉంది. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందని పరిస్థితి. పదో తారీఖున, పదిహేనో తారీఖున ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ వల్ల అది జరుగుతుందని, జీతాలైతే ముడుతున్నాయి కదా అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటున్నారు.
నియామకాలది పెద్ద కథే. యువత మొత్తం టిఎస్ పిఎస్సీ నియామకాలపై ఆశలు పెట్టకుంది. అందరికీ ఉద్యోగాలు దక్కకపోవచ్చు గానీ దాని ద్వారా నియామకాలు జరిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేక ఉండేది కాదు. టిఎస్ పిఎస్సీ పరీక్షలు నెగ్గలేనివాళ్లు మరో దారి చూసుకుని ఉండేవారు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకుని ఉండేవారు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లలు చాలా మంది ఇప్పుడు ఓటర్లుగా ముందుకు వచ్చారు. అప్పటి టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు కోసం ఏం చేసిందనేది వారికి పెద్దగా పట్టకపోవచ్చు. కానీ తమకు ఉద్యోగాలు రావడం లేదనే నిరసనను ఎన్నికల్లో వ్యక్తం చేసే అవకాశం ఉంది.
నిజానికి, తెలంగాణ రాష్ట్రంలో ఏయే రంగాలు ఎలా ప్రగతి సాధిస్తాయనే అవగాహన ఉన్న వ్యక్తులకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బ్రోకర్ల వ్యవస్థ ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఉత్పాదక రంగాలు దెబ్బ తిని అనుత్పాదక వ్యవస్థ పెద్ద రాజ్యమేలుతోంది. ఎమ్మెల్యే, స్థానిక నాయకత్వాలు ప్రజల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఆ నాయకత్వాల వల్ల తెలంగాణ మేధో వర్గం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తంగా, ఈ పదేళ్ల కాలంలో జరిగిన పనులను లోతుగా అధ్యయనం చేయాల్సిందే. చాలా వరకు క్షేత్ర పర్యటనలు కూడా అవసరం.
- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...