Monday, November 27, 2023

దెబ్బ కొట్టిన కేసీఆర్‌ శత్రుపూరిత వైఖరి-Blow to KCR's strategy on BJP

 

దెబ్బ కొట్టిన కేసీఆర్‌ శత్రుపూరిత వైఖరి


తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) కాస్తా భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)గా మారడం కేసిఆర్‌కు తొలి దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించానని చెబుకుంటూ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నెపంతో కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చారు. బిజెపికి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తూ జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని కేసిఆర్‌ ప్రకటించారు. జోతీయ రాజకీయాల పేరుతో పెద్ద హడావిడియే చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలను కలిశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తదితర నాయకులను కలిశారు. వారంతా బయటకు కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు గానీ కాంగ్రెస్‌ లేని జాతీయ కూటమిని ఇష్టపడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పారు. కేసిఆర్‌తో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో నితీష్‌ కుమార్‌ వ్యవహరించిన తీరు కూడా కేసిఆర్‌కు వ్యతిరేకంగానే కనిపించింది. ఆయన మీడియా సమావేశంలో తన అసహనాన్ని ప్రదర్శించారు. కేసిఆర్‌ వ్యవహారశైలి దేశంలోని బిజెపి వ్యతిరేక పార్టీలకు నచ్చలేదు. కేసిఆర్‌ను విశ్వసించి, ఆయన వెంట నడిచిన జెడిఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎటూ కాకుండా పోయారు. కర్ణాటక ప్రజలు ఆయనను తిరస్కరించారు. 


కేసిఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో మహారాష్ట్రలో సందడి చేశారు. కొంత మంది నాయకులను బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పంజాబ్‌ రైతులను తనకు అనుకూలంగా కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ చేయి పెట్టారు. బిజెపికి వ్యతిరేకంగా మాటల ముల్లె విప్పారు. బిజెపి వ్యతిరేక వైఖరిని దూకుడుగానే ప్రదర్శించారు. కేసీఆర్‌ బిజెపి వ్యతిరేక వైఖరిని ఇతర రాష్ట్రాల నేతలు నమ్మలేదు  సరే, ప్రజలు కూడా నమ్మలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. బిజెపి వ్యతిరేక వైఖరి  పట్ల కేసీఆర్‌ నిబద్ధతను సందేహిస్తూనే వచ్చారు. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ విషయంలో కేసీఆర్‌ బిజెపి వ్యతిరేక వైఖరి మరింత సందేహాస్పదంగా మారింది. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఆ కేసులో అరెస్టు కాకపోవడాన్ని రాజకీయ నాయకులు కూడా  బాహాటంగా ప్రశ్నిస్తూ  వచ్చారు. బిజెపితో కేసీఆర్‌కున్న సాన్నిహిత్యం కారణంగానే ఆమె అరెస్టు నుంచి తప్పించుకున్నారనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. కేసీఆర్‌ మనసాకర్మణా ప్రధాని నరేంద్ర మోడీ మిత్రుడనే భావన బలపడుతూ వచ్చింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల నాటికి అది ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధక్షుడిగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌ రెడ్డిని నియమించడం వెనక కేసీఆర్‌కు మేలు చేయడమే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.


కెసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన అంటకాగి, పదవులు అనుభవిస్తున్న మేధావులు చంకలు గుద్దుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడని, ఉండబోడని వారు నిజంగానే నమ్మారో లేదో తెలియదు గానీ బయటకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాగానే జాతీయ రాజకీయాల ప్రస్తావనను కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారు. ప్రజల ఆకాంక్షలను ప్రాంతీయ పార్టీలు మాత్రమే తీర్చగలవని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ అన్నారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలకు స్వస్తి పలికినట్లేనని భావించవచ్చు. కేవలం బిజెపికి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే అందుకు అవసరమైన బలాన్ని సమీకరించడమే కేసీఆర్‌ లక్ష్యంగా ఆయన పనిచేయాలని భావించినట్లు, అందుకు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకుల మద్దతును కూడగట్టడమే ఆయన వ్యూహమని అనుకోవడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు.


బిజెపి వ్యతిరేక వైఖరి లేదా శత్రు వైఖరిలోని కేసీఆర్‌ ఆంతర్యం బయటపడుతున్న కొద్దీ ఆయన మిత్రుడు అసదుద్దీన్‌ వైఖరి పట్ల అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. చివరగా వారిద్దరు కూడా కొన్ని వర్గాలకు దూరమయ్యారు. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చినందువల్ల తెలంగాణ ప్రజల సెంటిమెంటు దెబ్బ తినడమే కాకుండా బిజెపికి కేసీఆర్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడడం అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపుతుందని చెప్పడంలో సందేహం లేదు.


-కాసుల ప్రతాపరెడ్డి 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...