Monday, November 27, 2023

ప్రభావశీలత కోల్పోయిన కేసీఆర్‌ మేధావులు - Telangana intellectuals with KCR lost credibility

ప్రభావశీలత కోల్పోయిన కేసీఆర్‌ మేధావులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనకు, తన పార్టీకి సహకరించిన మేధావులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (K. Chandrasekhar Rao) నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చారు. తమ తమ రంగాల్లో వీరు ఉద్యమ కాలంలో క్రౌడ్‌ పుల్లర్స్‌గా పనిచేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని రంగాలకు చెందిన మేధావులు, ప్రభావశీలురు (Telangana influencers) పనిచేశారు. అయితే, తనకు అత్యంత సన్నిహితులైనవారికి మాత్రమే ఆయన పదవులు ఇచ్చారు. వారు ఉద్యమ కాలంలో మాదిరిగానే తనకు మద్దతుగా ఆయా రంగాలకు చెందినవారిని సమీకరిస్తారని ఆయన భావించి ఉండవచ్చు కానీ అది సాధ్యం కావడం లేదని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. 

తన పార్టీకి, తనకు కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో, నిబద్దతతో పనిచేసిన ప్రభావశీలురను ఆయన వదిలేశారు. తమను కూడా కేసీఆర్‌ (KCR) గుర్తిస్తారని, ఏదో ఒక రకమైన గౌరవ స్థాయి కల్పిస్తారని ఈ పదేళ్ల కాలం వారు వేచి చూశారనే చెప్పాలి. కానీ అది జరగలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోని అస్తవ్యస్త విధానాల వల్ల ఈ రంగం కూడా ప్రగతిపథాన సాగలేకపోయాయి. ఒకరకంగా అన్ని సంస్థలను కేసీఆర్‌ గాలికి వదిలేశారు. అలాగే పదవులైతే ఇచ్చారు గానీ వారు సక్రమంగా పనిచేయడానికి తగిన అవకాశాలు కల్పించలేదు.

కేసీఆర్‌ వైఖరి వల్ల పదవులు పొందిన తెలంగాణ ప్రభావశీలురు తమ స్థాయి, మర్యాదను, ప్రతిష్టను కోల్పోతూ వచ్చారు. తమ తమ వ్యవస్థల కిందికి వచ్చే వర్గాలకు వారు ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయారు. అలా తమ వ్యక్తిగత ప్రతిష్టను కోల్పోయినవారిలో టిఎస్‌పిఎస్సీ (TSPSC) మాజీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani), తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ప్రకాశ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న (Gorati Venkanna), ఇంకా కొంత మంది ఉన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఒక విడత పనిచేసిన నందిని సిధారెడ్డి మాత్రం ఆ జాబితా నుంచి చాలా త్వరగా బయటపడ్డారు. టిఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి నియమితులైనప్పుడు యువతరం పెద్దపెట్టున హర్షించింది. అయితే, టిఎస్‌పిఎస్సీ నియామకాలు ఎప్పటికప్పుడు ఆగిపోతుండడంతో గత పదేళ్ల కాలంలో పోస్టుల భర్తీ కాలేదు. దాంతో చక్రపాణి ప్రతిష్ట దెబ్బ తిన్నది. సోషల్‌ మీడియాలో బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా పెడుతున్న పోస్టులపై వ్యక్తమవుతున్న నిరసన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తాయి. 

ఇక తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌కు జర్నలిస్టులకు స్థలాలు కేటాయించే విధి ఏ మేరకు ఉందో, అది ఆయన పరిధిలోకి వస్తుందో రాదో తెలియదు. కానీ అల్లం నారాయణపై  జర్నలిస్టుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయం కూడా బలంగా నాటుకుపోయింది.  ఇవి ఉదాహరణలు మాత్రమే. వారు పనిచేయలేని ఓ నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ తీరు వల్ల వెల్లిపోయారు. అది వారి తప్పు కూడా కాదు. ఆ భారాన్ని మాత్రం మోయాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ మీద, బీఆర్‌ఎస్‌ మీద వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

కాగా, బి. నరసింగరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె. శ్రీనివాస్‌, సురేంద్రరాజు ప్రభుత్వ పదవులకు దూరంగా ఉన్నారు. అయితే, ఇటీవలి కాలం దాకా అంటే, గత ఎన్నికల వరకు కూడా కేసీఆర్‌ పట్ల, అప్పటి టిఆర్‌ఎస్‌ పట్ల సానుకూలవైఖరితోనూ ఉన్నట్లు భావించవచ్చు. కానీ ప్రస్తుత ఎన్నికల నాటికి వారు కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు భావించవచ్చు. ఇది వ్యక్తిగతమైంది కాదు, తెలంగాణ సంభవించిన పరిణామాల పట్ల, కేసీఆర్‌ వైఖరి పట్ల అసంతృప్తి మాత్రమే. ఈ ఎన్నికల్లో వారిలాంటి వ్యతిరేకతే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. అది ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సిందే.


` కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...