Tuesday, November 28, 2023

రైతుబంధు: ఎదురుతిరిగిన కేసీఆర్‌ వ్యూహం- Rythu Bandhu: KCR strategy in Telangana failed

 రైతుబంధు: ఎదురుతిరిగిన కేసీఆర్‌ వ్యూహం


తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), బిఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao)ది మొదటి నుంచీ భిన్నమైన ఆలోచన. ఆయనది వ్యూహరచనలోనూ ఆలోచనలోనూ మిగతా రాజకీయ నాయకులకు భిన్నమైన వ్యక్తిత్వం. బహుశా, ఆయన అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిలా కనిపిస్తున్నది. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తాను చేసిన పొరపాట్లు ఏమిటో అర్థం కావచ్చు. కానీ ఆయనకు అటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. తెలంగాణ సమాజం కోసం ఏమి చేయాలనే విషయాన్ని ఆయనే ఆలోచించి ఆచరణలో పెట్టారు. మరొకరి మాట ఆయన విన్నట్లు లేదు. ప్రజలు తనను అనుసరించాలే తప్ప ప్రశ్నించకూడదనే తత్వం కూడా ఆయనలో ఇమిడి ఉన్నట్లు అనిపిస్తున్నది. తెలంగాణ వచ్చే వరక ఒక రకంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకంగానూ ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ఆయన అందరి మాటా విన్నట్లు కనిపించారు. నిపుణులు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకుని వాటిని ప్రజల ముందు పెట్టి, వారిని ఒప్పించడంలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను ఆ ప్రక్రియకు స్వస్తి చెప్పారు. మరొకరి మాట వినడం ఆపేశారు. అంతా తానే అయి వ్యవహరించారు.

నిజానికి, ఏ రంగం ప్రజల ఆకాంక్షలను, కోరికలను ఆయన పట్టించుకోలేదని అర్థమవుతున్నది. ఉచితాలను గణనీయంగా పెంచారు. వాటి వల్ల ప్రజలంతా ఎల్లవేళలా తన వైపు ఉంటారని ఆయన భావించి ఉండవచ్చు. నిజానికి, ఆ ఉచితాలే ఆయనను ఈ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) గెలిపిస్తాయని భావించేవారు కూడా ఉన్నారు. కానీ, పరిస్థితి ఎదురు తిరిగినట్లు సంకేతాలు అందుతున్నాయి. బిఆర్‌ఎస్‌ ఈసారి అధికారం కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దే. ఆయనే ఈ ఓటమి బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. గెలుపు కీర్తిని రెండుసార్లు ఆయనే అనుభవించారు. కేసీఆర్‌ను మించిన ఎన్నికల వ్యూహకర్త లేరని కూడా అనిపించుకున్నారు. అయితే, ఈసారి ఆయన వ్యూహాలేవీ ఫలించేట్లు లేవు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత చోటు చేసుకుంది. చాలా వర్గాలు ఆయనకు దూరమయ్యాయి. యువత, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, చేనేత కార్మికులు.. ఇలా ఒక్కో వర్గమే ఆయనకు దూరమవుతూ వచ్చినట్లు తెలిసిపోతూనే ఉన్నది.

ముందు చెప్పినట్లు కేసీఆర్‌ (KCR) ఆలోచన తెలంగాణ విషయంలో భిన్నమైందే. తెలంగాణలో ఓ బలమైన సంపన్న వర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావించినట్లు అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్రలో ఆయన బలమైన వర్గమే నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నది. ఆ వర్గం రెండుగా చీలి వుండవచ్చు గాక, అటు వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందుకు రెడ్డి సామాజిక వర్గం నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ, మరో వైపు కమ్మ సామాజిక వర్గం నాయకత్వంలోని తెలుగుదేశం (TDP). అధికారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ రెండు మాత్రమే అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి. దీన్ని గమనించిన కేసీఆర్‌ తెలంగాణలో తనదైన సంపన్న వర్గాన్ని తయారు చేసి, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. అందులో ప్రధానమైన అంశం రైతుబంధు. ఈ పథకాన్ని యజమానులకు మాత్రమే వర్తింపజేస్తూ కౌలురైతులను పక్కన పెట్టేశారు. రైతుబంధు (Rythu Bandhu) పథకం ద్వారా పేద రైతులకు మాత్రమే సంపన్నవర్గానికి చెందిన రైతులకు కూడా పెట్టుబడి పేరున నగదు ముడుతూ వచ్చింది. ఇందులో అధిక మొత్తం సంపన్నవర్గాలకు చేరుతూ వస్తున్నది. భూమి సాగు చేసినా చేయకున్నా ఈ పథకం వర్తిస్తుంది. దాదాపు 40 శాతానికి పైగా రైతుబంధు సొమ్ము ధనికులకు, ఎన్నారైలకు అందుతుందనేది ఓ అంచనా. 

రైతుబంధు పథకం అమలు కారణంగా తెలంగాణలో ఓ విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. చాలా మంది తన వద్ద నిలువ ఉన్న నగదు ద్వారా మరింత సంపాదించడానికి వివిధ మార్గాలను ఇంతకు ముందు వెతుక్కునేవారు. వడ్డీలకు తిప్పడం, అర్బన్‌ ఏరియాలో ఇళ్లూ లేదా వాణిజ్య సముదాయాలు కొని కిరాయికి ఇవ్వడం, ఇంకా వివిధ రకాల వ్యవహారాలు నడపేవారు. అయితే, రైతుబంధు అమలులోకి రాగానే భూములు కొనడం ప్రారంభించారు, అదీ వ్యవసాయ భూములు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనడం సాగించారు. దీనివల్ల రైతుబంధు డబ్బులు రావడమే కాకుండా స్థిరాస్తి ఉండిపోతుంది. ధనికవర్గానికి ఇదొక మంచి అవకాశంగా కనిపించింది. ఈ వర్గాన్ని వివిధ రంగాల్లో పెంచాలనేది కేసీఆర్‌ ఆలోచనగా కనిపిస్తున్నది. ఆ వర్గం తన వెంట ఉంటుందని, ప్రజలను ప్రభావితం చేస్తుందని, దానివల్ల తన అధికారం సుస్థిరం అవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. కానీ, ఇది కూడా వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. చిన్నరైతులు తమకు రైతుబంధు అమలు కావడంతో సంతోషంగా ఉన్నప్పటికీ, వ్యవసాయం చేయని సంపన్న రైతులను ఆ పథకం నుంచి మినహాయించాలని భావిస్తున్నారు. కౌలు రైతులు ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. 

వివిధ వర్గాలను విస్మరించడం వల్ల, సంపన్నవర్గానికి మాత్రమే అండగా నిలుస్తుండడం వల్ల కేసీఆర్‌ ఈసారి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి కేసీఆర్‌ సిద్ధపడాల్సే ఉంది.


- కాసుల ప్రతాపరెడ్డి 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...