Tuesday, November 28, 2023

కేసీఆర్‌పై ఫైట్‌: బిజెపి చేసిన తప్పిదం ఇదీ.. - Fight against KCR: BJP strategical mistakes in Telangana

 కేసీఆర్‌పై ఫైట్‌: బిజెపి చేసిన తప్పిదం ఇదీ..



తెలంగాణలో ఒకప్పుడు బిజెపికి మంచి ఊపు వచ్చింది. బండి సంజయ్‌ (Bandi Sanajay)ని తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), బిఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Raoను ఎదుర్కునే ధీటైన ప్రతిపక్ష నాయకుడు దొరికాడనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. బండి సంజయ్‌ ఒక రకంగా కేసీఆర్‌ (KCR)కు ప్రత్యామ్నాయంగా కనిపించారు. బండి సంజయ్‌ ప్రదర్శించిన దూకుడు, చూపిన తెగువ తెలంగాణలో బిజెపికి ఒక ఊపును ఇచ్చింది. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించడం, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద యెత్తున సీట్లను సాధించడం కూడా కలిసి వచ్చింది. బిఆర్‌ఎస్‌కు బిజెపి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం నాటుకునే రాజకీయ వాతావరణం ఏర్పడిరది. అయితే, మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. దాంతో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి గాలి తగ్గుతూ వచ్చింది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పు మరింత బిజెపి పరిస్థితి దిగజార్చింది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela Rajender) ఫిర్యాదు వల్లనే బండి సంజయ్‌ని అగ్రనాయకత్వం మార్చిందనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, తాను అలా ఫిర్యాదు చేసే వ్యక్తిని కాదని, మామూలుగా బండి సంజయ్‌ని అధిష్టానం మార్చిందని, బండి సంజయ్‌ పదవీకాలం ముగిసిందని, తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ అధ్యక్షులు మారారని ఈటల రాజేందర్‌ ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలు చెప్పారు. బండి సంజయ్‌ స్థానంలో అగ్రనాయకత్వం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy)ని నియమించింది. అయితే, తనపై వ్యవహరించినట్లు పార్టీ నాయకులు వ్యవహరించకూడదని, కిషన్‌ రెడ్డిని పనిచేసుకోనివ్వాలని బండి సంజయ్‌ అన్నారు. దీన్ని బట్టి బండి సంజయ్‌ మీద కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయనే అభిప్రాయం బలపడిరది. ఈ పరిణామం తర్వాత బిజెపి తెలంగాణలో మరింతగా పడిపోయింది.

కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇది వాస్తవమని చెప్పలేం గానీ ఆ ప్రచారం పనిచేసినట్లే కనిపిస్తున్నది. దాంతో కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌లపై ఎంతగా విమర్శలు చేసినా పెద్దగా ప్రతిస్పందనలు రాలేదు. బండి సంజయ్‌కి లభించిన ఆదరణ కిషన్‌ రెడ్డికి లభించలేదు. ఇదే సమయంలో పిసిసి తెలంగాణ అధ్యక్షుడిగా అనుముల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) నియామకం కాంగ్రెస్‌కు ఒక ఊపునిచ్చింది. కేసీఆర్‌ వ్యతిరేక వైఖరి విషయంలో మొదటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్న రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష (PCC Telangana chief) పదవిని చేపట్టిన తర్వాత మరింతగా దూకుడు పెంచారు. ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ల నుంచి చెప్పుకోదగిన రీతిలో వ్యతిరేకత ఎదురైంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు రేవంత్‌ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించారు. దాన్ని రేవంత్‌ రెడ్డి తట్టుకుంటూనే తనదైన వర్గాన్ని పెంచకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆయనకు బాసటగా నిలించింది. సీనియర్‌ నాయకులను బుజ్జగించింది. నిజానికి, రేవంత్‌ రెడ్డికి కర్ణాటకకు చెందిన కెసీ వేణుగోపాల్‌, శివకుమార్‌ అండదండలున్నాయి. కర్ణాటకలో శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనతను దక్కించుకున్నారు. కర్ణాటక విజయం కాంగ్రెస్‌కు తెలంగాణలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ఊపును కూడా ఇచ్చింది.

కాంగ్రెస్‌ పార్టీ ఓ వైపు తన శక్తులను కూడగట్టుకుని కేసీఆర్‌ను ఎదుర్కునే శక్తిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే బిజెపి బలహీనపడుతూ వచ్చింది. దానికితోడు బిజెపి, బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే వాతావరణం కూడా ఏర్పడిరది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), అమిత్‌ షా (Amit Shah), జెపి నడ్డా వంటి దిగ్గజ నాయకులు తెలంగాణలో ప్రచారం నిర్వహించినప్పటికీ బిజెపి పుంజుకునే స్థితికి రాలేదు. ఢల్లీ లిక్కర్‌ కుంభకోణం Delhi liquor scam) కేసులో కేసీఆర్‌ కూతురు, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalavakuntla Kavitha) అరెస్టు కాకపోవడంతో బిజెపితో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారనే వాతావరణం ఏర్పడిరది. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొంత మంది నాయకులు బాహాటంగానే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

నిజానికి, స్థానిక నాయకత్వం తీరు ఎలా ఉన్నప్పటికీ బిజెపి అగ్రనాయకత్వానికి తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మిక ఉన్నట్లు లేదు. దానివల్ల తెలంగాణలో కేసీఆర్‌ (KCR) తిరిగి అధికారంలోకి రావడమే వారికి అవసరంగా మారింది. అది వచ్చే లోకసభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే లోకసభ  ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గణనీయమైన ప్రభావం చూపవచ్చు, బిజెపి కేంద్ర నాయకత్వానికి ఢల్లీ అధికారం ముఖ్యం. దాంతో అది కేసీఆర్‌ గెలుపునే కోరుకుందని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా కాంగ్రెస్‌కు అనుకూలించే వాతావరణం ఏర్పడిరది.

మరో వైపు, తెలంగాణ ముస్లిం సమాజం (Muslim society) బిజెపికి వ్యతిరేకంగా ఉంది. అయితే, ఆ ముస్లిం సమాజాన్ని మజ్లీస్‌ (MIM) అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ (Asaduddin Owaisi) తన పార్టీకి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కి అనుకూలంగా సమీకరిస్తారని భావించారు. కానీ ముస్లిం సమాజంలో కొంత మేరకు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రతిష్ట కూడా దిగజారింది. బిజెపికి అనుకూలంగానే ఆయన ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని పోటీకి దింపారని, దానివల్లనే బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఓ అంచనా, ప్రచారం ఉంది. దాంతో తెలంగాణలోని ముస్లిం సమాజం ఆయనను పూర్తిస్థాయిలో విశ్వసించే పరిస్థితి లేదు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి షాదీ ముబారక్‌ వంటి కొన్ని సంక్షేమ పథకాలు ముస్లింలకు అందుతున్నాయి. కానీ, రైతుబంధు (Rythu Bandhu) వంటి ప్రధానమైన పథకాలు వారికి అందుబాటులో లేవు. చెప్పాలంటే, మెజారిటీ ముస్లింలకు వ్యవసాయ భూములు లేవు. అది కూడా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు వ్యవహరించడానికి కారణమవుతున్నది. బిజెపి వల్ల ముస్లిం సమాజం ముప్పును కూడా పసిగడుతున్నది. బిజెపి బలం పుంజుకుంటే తమకు ప్రమాదమనే భావనతో ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇది కాంగ్రెస్‌కు మంచి అవకాశాన్ని ఇచ్చింది.

కేసీఆర్‌ను ఎదుర్కునే దమ్మున్న ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌ రెడ్డి బలంగా ముందుకు వచ్చారు. దాంతో రేవంత్‌ రెడ్డి ఒక రకంగా తిరుగులేని నాయకుడిగా అవతరించారనే చెప్పవచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...