Wednesday, November 29, 2023

రేవంత్‌ రెడ్డి గెలిచారు: వైఎస్‌ షర్మిల తగ్గారు - Revanth Reddy issue: Why YS Sharmila supported Congress in Telangana

 రేవంత్‌ రెడ్డి గెలిచారు: వైఎస్‌ షర్మిల తగ్గారు


తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), బిఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao)పై అసమ్మతి గూడు కట్టుకని ఉందనే విషయం చాలా నెమ్మదిగా బయటపడుతూ వచ్చింది. కెసీఆర్‌ తన విధానాలను గానీ, చర్యలను గానీ సమీక్షించుకున్న దాఖలాలు లేవు. తాను చేసిందే న్యాయం, తాను చేసిందే సరైందనే పద్ధతిలో ఆయన కొనసాగినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గొంతు లేకుండా పోయింది. కేసీఆర్‌ (KCR) కాకపోతే ఆయన కుమారుడు, మంత్రి కెటీఆర్‌ మాట్లాడాల్సిందే తప్ప మరొకరు మాట్లాడడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితిలో ఆయన వ్యతిరేక శక్తులు ఒక్కటయ్యే అవసరం ఏర్పడిరది. 

తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయడానికి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌ టిపి)ని స్థాపించి తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. పాదయాత్ర చేశారు, ప్రజల్లో తిరిగారు. కానీ, అంతగా ఆమెకు ఆదరణ లభించలేదు. బిజెపి మద్దతుతోనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆమె వెనక ఉన్నారని అందరూ భావించారు. తెలంగాణలో ప్రతిపక్షాల ఓట్లు చీల్పడానికి ఆమె పనిముట్టుగా ఉపయోగపడతారని కూడా భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఓట్లకు ఆమె గండి కొడుతారని ఒక అంచనా ఉండేది. కానీ, పరిస్థితులు తారుమారయ్యాయి. 

క్షేత్రస్థాయి పరిస్థితులు తొలుత షర్మిలకు అర్థం కాలేదని అనుకోవాలి. క్రమంగా ఆమె పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు, పార్టీ విలీనానికి సిద్ధపడ్డారు. తనకు పాలేరు అసెంబ్లీ సీటు కావాలని పట్టుబట్టారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి. శివకుమార్‌ (Shivakumar) వైఎస్‌ఆర్‌ కుటుంబానికి సన్నిహితుడు. ఆయన ద్వారా ఆమె కాంగ్రెస్‌తో నెయ్యానికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పెద్దలు సోనియా గాంధీని, రాహుల్‌ గాంధీ (rahul Gandhi)ని కూడా కలిశారు. కానీ ఆమె ప్రయత్నాలు నెరవేరలేదు. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మరికొంత మంది షర్మిలను చేర్చుకోవాలని భావించారు. వైఎస్‌ఆర్‌ ద్వారానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాల్లో ఎదిగారు.

అయితే, వైఎస్‌ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే ప్రతిపాదనను, ఆమెకు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా వ్యతిరేకించారు. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి) (Telugu Desam, TDP)తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్న అనుభవాన్ని ఆయన కాంగ్రెస్‌ అధిష్టానానికి వివరించారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న మరుక్షణమే కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంటును రాజేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పెత్తందార్ల పాలన, చంద్రబాబు పాలన వస్తుందని అప్పటి టిఆర్‌ఎస్‌ (TRS) నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా తెలంగాణ తటస్థ మేధావులు కూడా ప్రచారం చేశారు. దాంతో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు దెబ్బ తిన్నాయి. వైఎస్‌ షర్మిలతో దోస్తీ కడితే ఎదురయ్యే ప్రమాదాన్ని అధిష్టానం గుర్తించి, ఆమె షరతులకు ఆంగీకరించలేదు.

చివరగా, ఆమె బేషరతుగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. పార్టీ అభ్యర్థులను పోటీకి దింపలేదు. తన కోరిక పాలేరు పోటీని నుంచి వెనక్కి తగ్గారు. షర్మిల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోను ఉపయోగపడవచ్చు. కానీ ఆమె పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు మేలు చేశారనే చెప్పవచ్చు.

ఇది ఎలా జరిగిందంటే, శివకుమార్‌, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌ ద్వారానే. తెలంగాణలో కాంగ్రెస్‌ (telangana Congress) పార్టీ గెలిస్తే షర్మిల రాజ్యసభ సభ్యురాలు అయ్యే అవకాశాలు లేకపోలేదు.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...