Wednesday, November 29, 2023

కేసీఆర్‌ వ్యవహారశైలి కొంప ముంచుతుందా? - KCR working style may hit BRS in Telanganna Assembly elections 2023

 

కేసీఆర్‌ వ్యవహారశైలి కొంప ముంచుతుందా


తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కే. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao) మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ జాతిపితగా పిలిపించుకోవడం ఆయన అత్యంత ఇష్టమైన విషయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన వల్ల మాత్రమే సాధ్యమైందని, ఇతరేతర శక్తుల పాత్ర గానీ, ఇతర పార్టీల ప్రమేయం ఉందని గానీ ఆయన విశ్వసించరు. విశ్వసించడం మాట అటుంచితే ఎవరైనా కాంగ్రెస్‌ పాత్రనో, బిజెపి పాత్రనో ఉందని అంటే వారి మీద ఆయన తీవ్రమైన ఆగ్రహం కూడా వస్తుంది. తెలంగాణలోని వివిధ శక్తుల, వ్యక్తుల పాత్ర ఉందని మాట కూడా ఆయన చెవిన సోకకూడదు. జాతిపిత అని పదేపదే ప్రశంసిస్తూ వ్యాసాలు రాసినవారికి, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినవారికి ఆయన సముచిత స్థానాలు కల్పించారు. బీఆర్‌ఎస్‌ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ తనను పొగడుతూ వ్యాసపరంపరలు గుప్పించినవారికి ఆయన పదవులు ఇచ్చారు. అర్షతలు, అనర్హతలు ఆయన ఆలోచించలేదు. తనను ప్రశంసించడమే అర్హతగా భావించారు. దానివల్ల వివిధ సంస్థలు నిర్వీర్యమయ్యాయి. 

తెలంగాణలో తాను తప్ప అంతా మిథ్య అనేది కేసీఆర్‌ (KCR) విశ్వాసంగా కూడా మనం చెప్పవచ్చు. బీఆర్‌ఎస్‌కు చెందినవారు ఎన్నికల్లో గెలిస్తే అది తన వల్ల మాత్రమే తప్ప అభ్యర్థుల కృషి, శ్రమల వల్ల కాదు. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో అంతా తానై వ్యవహరించారు. మంత్రులకు, శాసనసభ్యులకు నోరు లేదు. మంత్రులు తమకు సంబంధించిన శాఖల గురించి కూడా మాట్లాడకూడదు. ఆ శాఖలను చూసుకునే బాధ్యత వారికి ఏ మాత్రం లేదు. వాటిని తాను పర్యవేక్షించాలి లేదా తన తనయుడు కేటీఆర్‌ చూసుకోవాలి. తనకు ఇష్టమైతే తప్ప ఆయన మంత్రులను, శాసనసభ్యులను కలవరు. తాను పిలిస్తే రావాల్సిందే తప్ప తమ సమస్యలను చెప్పుకోవడానికి వారు వచ్చినా ప్రగతిభవన్‌ గేట్లు తెరుచుకోవు. ఇది బహిరంగ రహస్యమే. 

వివిధ రంగాలకు చెందినవారికి నగదు రూపేణా ప్రయోజనం చేకూరిస్తే చాలునని ఆయన అనుకున్నారు. అందుకే దళిత బంధు (Dalith Bandhu), రైతుబంధు (Rythu Bandhu), షాదీ ముబారక్‌ (Shadi Mubarak) వంటి పలు సంక్షేమ పథకాలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. పచ్చిగా చెప్పాలంటే, ఓట్లను ముందుగానే కొనుక్కోవడం. అయితే, వివిధ వ్యవస్థల ద్వారా ప్రజలు తమంత తాముగా జీవితాలను బాగుపరుచుకోవడానికి ఆయన అవకాశం కల్పించలేదు. అటువంటి సంస్థలను నిర్వీర్యం చేశారు. తెలంగాణలోని వ్యవస్థలన్నీ దాదాపుగా ధ్వంసమయ్యాయి. దళితులకు దళితబంధు అనే నగదు లబ్ధి కల్పించేకన్నా తాను హామీ ఇచ్చినట్లుగా మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే, స్థిరాస్తి ఉండేది. దానికి రైతుబంధు కూడా వచ్చి ఉండేది. అటువంటి నిర్మాణాత్మకమైన పనులను ఆయన చేపట్టలేదు.

ప్రజల గొంతును వినిపించడానికి ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం లేకుండా పోయింది. మేధోవర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఆయనకు దూరమయ్యారు. రాజకీయాలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పని మీద లేదా తన వ్యతిరేక ఓటును చీల్చే పని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకు గాను, చిన్నా చితక పార్టీలను రంగం మీదికి తెచ్చారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను చీల్చే పని పెట్టుకున్నారు. తొలుత ఆయన టిడీపీ (TDP)ని నామరూపాలు లేకుండా చేశారు. కానీ, ఆ పార్టీ నుంచి వచ్చిన పచ్చి తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. ఒక రకంగా బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ టిడీపి అనే అభిప్రాయం ఏర్పడిరది.

ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేయాలని భావించారు. తనకు అవసరం లేకున్నా కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని (CLPని) చీల్చి 12 మంది శాసనసభ్యులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నిజానికి ఆయన ఆ ఎమ్మెల్యేల అవసరం కూడా లేదు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 88 స్థానాలు గెలుచుకుంది. స్ధిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి ఆ సంఖ్య చాలు. కానీ కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి ఆయన 12 మంది ఎమ్యెల్యేలను తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి వంటివారికి మంత్రి పదవులు ఇచ్చారు. 

ప్రస్తుత ఎన్నికల్లో కూడా తన వైఖరి విజయం, తన సంక్షేమ పథకాలు విజయం సాధించి పెడతాయని ఆయన విశ్వసించారని అనుకోవాలి. అయితే, ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తయన కుమారుడు కెటీఆర్‌ (KTR) ఆధిపత్యం పెరిగింది. కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఆయన ముద్ర వేయించుకున్నారు. బహుశా, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏం జరుగుతుందనే విషయం కేసీఆర్‌కు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు కూడా. కేటీఆర్‌ చుట్టూ ఉన్న బృందం సర్వత్రా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. 

క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది కూడా కేసీఆర్‌కు అవగాహన ఉండి ఉండదు. ఎమ్యెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు భూమిని కేంద్రంగా చేసుకుని సంపాదన మార్గంలో పడ్డారు. భూవివాదాల్లో తలదూర్చడం, కావాలంటే భూవివాదాలు సృష్టించడం వంటి పనులకు పాల్పడుతూ వచ్చారు. సంపాదన తప్ప మరో వ్యవహారం వారు చేపట్టిన దాఖలాలు కూడా లేవు. గ్రామీణ స్థాయిలో మద్యం వినియోగం పెరిగింది. యువతకు పనిలేకపోవడం, అయాచితంగా డబ్బులు రావడం, సెటిల్‌మెంట్లకు వైన్‌ షాపులే కేంద్రాలు కావడమనేది చూడవచ్చు.

తెలంగాణ శాసనసభ  ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) బీఆర్‌ఎస్‌ అపజయం పాలవుతుందని ఇప్పుడే నిర్ధారించలేం కానీ గాలి మాత్రం బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వీస్తున్నది. బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోతే బాధ్యత కేసీఆర్‌ది మాత్రమే తప్ప వేరెవరిదీ కాదు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మంత్రులు, శాసనసభ్యుల పాత్ర శూన్యం. వారు చేసిన పనులకు, వారి మీది వ్యతిరేకతకు కూడా కేసీఆర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

1 comment:

  1. వ్యతిరేకత ఉన్నమాట నిజమే అయినా, తెలంగాణకు ఆయన స్థాయికి సరితూగేలా అభివృద్ధి కార్యక్రమాలపై చిత్తశుద్ధి గల మరో నాయకుడు ప్రజలకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్తికి బిఫార్మ్ తోపాటు 40 లక్షల చెక్కులు ఇచ్చినట్టు కూడా వార్త చదివాం. అంటే, దేనికైనా తననే బాధ్యతగా చేసుకున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ!

    ReplyDelete

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...