Wednesday, November 29, 2023

సినీ తారలు ఓటేసెదిక్కడే: వారి ఓట్లు ఎవరికి? - Chiranjeevi and other celebrities will vote in Jubilee Hills

 సినీ తారలు ఓటేసెదిక్కడే: వారి ఓట్లు ఎవరికి?


తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana assembly elections 2023) పోలింగ్‌ రేపు గురువారం జరగనుంది. రాష్ట్రవాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో మొత్తం 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి.  మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలోనూ గజ్వెల్‌లోనూ ఆయన పోటీకి దిగారు. కామారెడ్డి (Kamareddy)లో కేసీఆర్‌ ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. గజ్వెల్‌ (Gajwel)లో మాత్రం కష్టంగా బయటపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డిలోనూ కొడంగల్‌ లోనూ పోటీకి దిగారు. అలాగే. బిజెపి నేత ఈటల రాజేందర్‌ (Etela Rajender) హుజూరాబాద్‌లోనూ గజ్వెల్‌లోనూ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డికి, బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డికి మధ్య హోరాహోరీ పోరు ఉందని అంచనా. గజ్వెల్‌లో మాత్రం కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్య పోటీ జరుగుతున్నది. 

ఇదిలావుంటే, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చాలా మంది సినీతారలు ఓటేయనున్నారు. వారంతా జూబిలీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నట్లు అర్థమవుతున్నది. చాలా మంది ఆంధ్ర మూలాలున్నవారే. జూబిలీహిల్స్‌ (Jubilee hills) నియోజకవర్గంలో అనూహ్యంగా భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మొహమ్మద్‌ అజరుద్దీన్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్నారు. ఈ స్థితిలో సినీతారలు ఎవరికి ఓటేస్తారనే ఉత్సుకత నెలకొని ఉంది. 

జూబిలీహిల్స్‌ క్లబ్‌లో చిరంజీవి (Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తేజ (Ram Charan Tej), ఆయన సతీమణి ఉపాసన, హీరో నితిన్‌ ఓటేయనున్నారు. నితిన్‌ తెలంగాణకు చెందారు. రామ్‌చరణ్‌ తేజ గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్‌ నుంచి ఓటేయడానికి హైదరాబాద్‌ వచ్చారు. ఎఫ్‌ఎన్‌సిసిలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌, దగ్గుబాటి రానా (Daggubati Rana), సురేష్‌ బాబు, విశ్వక్‌ సేన్‌ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 

వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్‌లో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni), ఆయన సతీమణి అమల, ఆయన కుమారుడు నాగచైతన్య (Naga Chaitanya), మరో కుమారుడు అఖిల్‌ ఓటేస్తారు. రవితేజ మాత్రం ఎంపి, ఎమ్యెల్యే కాలనీలోని కేంద్రంలో ఓటేస్తారు, ప్రభాస్‌ (Prabhas), అనుష్క (Anushka), వెంకటేశ్‌, బ్రహ్మానందం మణికొండలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు.  అల్లరి నరేష్‌ జూబిలీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లోని ఆర్థిక సహకార సంస్థలో ఓటేస్తారు, జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR), ఆయన సతీమణి ప్రణతి ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూలులో ఓటేస్తారు. జూబిలీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ ఓటేస్తారు. దేవరకొండ సోదరులు తెలంగాణకు చెందినవారు.

రేపు గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. 35 వేల 655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 వేల మందికి పైగా పోలీసులు ఎన్నికల బందోబస్తులో ఉన్నారు. 375 కేంద్ర బలగాలు ఎన్నికల పర్యవేక్షణలో ఉన్నాయి. మొత్తం 4,400 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు హేమాహేమీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి, ముఖ్యమంత్రి కెసీఆర్‌తో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సిఎల్‌పి (CLP) నేత మల్లు భట్టివిక్రమార్కల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy) మాత్రం పోటీ చేయడం లేదు. బిజెపి ఎంపీలు అరవింద్‌, బండి సంజయ్‌ బరిలో ఉన్నారు. మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ భవిష్యత్తును కూడా ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. మొత్తంగా, బీఆర్‌ఎస్‌ (BRS) భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి. డిసెంబర్‌ 3వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...