Thursday, November 30, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కోదండరామ్‌ చేసిన పని: Kodandaram played a key role in Telangana

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కోదండరామ్‌ చేసిన పని 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ జనసమితి (Telangana Jana Samithi) అధ్యక్షుడు కోదండరామ్‌ (Kodandaram) కీలకమైన భూమికనే పోషించారు. ఆయన కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మద్దతును ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం కూడా నిర్వహించారు. అంతకుమించి ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్నారు. సీట్ల బేరానికి దిగలేదు. ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ గద్దె దించడమే లక్ష్యంగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలోకి దిగారు. తెలంగాణ జెఎసిలో (Telangana JAC) కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కోదండరామ్‌ దాదాపుగా కేసీఆర్‌కు సమాన స్థాయిలో ఎదిగారు. ఆయన పాత్ర కూడా ఆ మేరకు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అప్పుడప్పుడు పొరపొచ్చాలు వచ్చినప్పటికీ కేసీఆర్‌ను బలపరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ కోదండరామ్‌ను దూరం పెడుతూ వచ్చారు. కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ అనుచరుడిగా కాకుండా కొంత స్వతంత్రంగా వ్యవహరించారు. అది కేసీఆర్‌కు నచ్చలేదు. ఆయన వెంట నడిచిన శ్రేణులను కేసీఆర్‌ తన వైపు తిప్పుకుంటూ వచ్చారు. తద్వారా సైన్యం లేని సేనాధిపతిగా ఆయనను తయారు చేయాలనే సంకల్పంలో కేసీఆర్‌ చాలా వరకు కృతకృత్యులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్‌ నిరాశ చెంది, కార్యాచరణ నుంచి విరామం తీసుకున్న ప్రతిసారీ కోదండరామ్‌ ఉద్యమాన్ని లేపడానికి కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చారు. ఆయన చేపట్టిన సాగరహారం (Sagara Haram) కార్యక్రమం అందుకు ఒక ఉదాహరణ. ఆయన చేపట్టిన సాగరహారం కార్యమ్రానికి తెలంగాణ ప్రజలు పెద్దయెత్తున హాజరయ్యారు. కొంత విధ్వంసం కూడా జరిగింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ మీద ఉన్న కొన్ని ఆంధ్రుల విగ్రహాలను ఉద్యమకారులు ధ్వంసం చేశారు కూడా. 

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన తెలంగాణ ప్రజల కోసం ఉద్యమాలు కూడా చేపట్టారు. ఒక సందర్భంలో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు కూడా. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే పనిని పెట్టుకుంది. తనకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలను కేసీఆర్‌ ఏ మాత్రం సహించలేదు. కోదండరామ్‌ తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. వివిధ వర్గాల అసంతృప్తికి ప్రభుత్వం నుంచి స్పందనను ఆశించారు. కానీ అటువైపు నుంచి ఏ విధమైన సానుకూల స్పందన కనిపించలేదు. అప్పటి టిఆర్‌ఎస్‌ (TRS)కు ఇప్పటి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆయన వివిధ ఎన్నికల్లో పోటీకి కూడా దిగారు.

రేవంత్‌ రెడ్డి (revanth Reddy) పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ చురుగ్గా పనిచేయడం సాగించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి తగిన వ్యూహాన్ని కూడా రచించింది. ఈ తరుణంలో కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయన సీట్ల కోసం బేరాలు పెట్టకుండా పోటీ నుంచే విరమించుకున్నారు. తన పార్టీ తరఫున అభ్యర్థులను కూడా దించలేదు.

కోదండరామ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం విశ్వాసంలోకి తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఆయనకు తగిన స్థానం కల్పించడానికి కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ముందుకు రావచ్చు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే మాత్రం ఆయనకు సముచిత స్థానం లభిస్తుందనే భావిస్తున్నారు.

పౌర హక్కుల సంఘంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్‌ ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాలు పంచుకున్నట్లు ఆయన చెబుతుంటారు.


- కాసుల ప్రతాపరెడ్డి


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...