Thursday, January 18, 2024

మరోసారి గురి తప్పిన కేటీఆర్‌: దానికి బాధ్యులెవరో... - KTR blames Revanth Reddy Govt KCR failure

 మరోసారి గురి తప్పిన కేటీఆర్‌: దానికి బాధ్యులెవరో...


బీఆర్‌ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు (KT Rama Rao) గురి మరోసారి తప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. చేయాలి కూడా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీల అమలుపై, కాంగ్రెస్‌ చేసిన ఎన్నికల వాగ్దానాల అమలుపై ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలోనే ఆయన చాలా తొందరపడుతున్నారనుకుంటే, తమ తప్పులను ఆయనే స్వయంగా బయట వేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.



తాజాగా కేటీఆర్‌ (KTR) సర్పంచ్‌లకు చెల్లించే జీతాల బకాయిలపై ప్రభుత్వానికి ఓ డిమాండ్‌ పెట్టారు. నాలుగేళ్లుగా ఉన్న బకాయిలను చెల్లించాలని, వాటిని చెల్లించకపోతే పోరాటం చేస్తానని ఆయన అన్నారు. కేటీఆర్‌ ప్రకటనకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి. నాలుగేళ్లుగా సర్పంచ్‌లకు సొమ్ములు చెల్లించకుండా కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రశ్న. ఎనుమల రేవంత్‌ రెడ్డి (revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులవుతున్నది ఆయనకు తెలియదా? కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లకు బాకీ పడ్డారా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. అత్యంత ధనిక రాష్ట్రం అని చెబుకున్న కేసీఆర్‌ సర్పంచ్‌లకు ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లించడంలో ఎందుకు విఫలమయ్యారనేది మరో ప్రశ్న.

నిజమే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు, పడిన బకాయిలకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనేది నిరంతరాయ ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆటంకం లేకుండా కొనసాగే విషయం. సర్పంచ్‌ల బాకీలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిందే. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్దుకుంటున్నది. ఆ మాట అలా ఉంచితే, తాము చేసిన తప్పులకు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమనే పద్ధతిలో కేటీఆర్‌ మాట్లాడడం తన అనుభవరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమే. 

కేటీఆర్‌ తీరును రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర చైర్మన్‌ రాచమల్ల సిద్ధేశ్వర్‌ తప్పు పట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంత మంది సర్పంచ్‌లు ఆస్తులు అమ్ముకున్నారని, కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. దీనికి కేటీఆర్‌ ఏం సమాధానం చెప్తారు?

-కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...