Thursday, January 4, 2024

వైఎస్సార్‌ వారసత్వం హస్తగతం: వైఎస్‌ జగన్‌తో షర్మిల డైరెక్ట్‌ ఫైట్‌ - YS Sharmila may take AP CM YS Jagan and Chandrababu

 వైఎస్సార్‌ వారసత్వం హస్తగతం: వైఎస్‌ జగన్‌తో షర్మిల డైరెక్ట్‌ ఫైట్‌


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), తన సోదరుడు వైఎస్‌ జగన్‌ (YS Jagan)తో వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్లే. ఆమె తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. పూర్తి స్థాయి కాంగ్రెస్‌ నాయకురాలుగా మారిపోయారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఎఐసిసి (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసత్వం పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ చేతిలోకి వచ్చినట్లే, వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌ నాయకుడే ఆయినప్పటికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దాన్ని సొంతం చేసుకున్నారు. అయితే, రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్సార్‌ భావించారని, అందుకు తన వంతు కృషి చేస్తానని షర్మిల చెప్పారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారసత్వాన్ని సొంతం చేసుకున్నట్లే భావించాలి. లేదంటే, జగన్‌తో వైఎస్‌ వారసత్వం కోసం జగన్‌తో సమరం సాగిస్తుంది.



కాగా, వైఎస్‌ షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ (AP Congress) సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. అందుకు షర్మిల కూడా సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలే కాదు, అండమాన్‌ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని షర్మిల మీడియాతో అన్నారు. దీన్ని బట్టి ఆమె ఆంధ్రప్రదేశ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించడానికి పూర్తి అవకాశాలున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తద్వారా ఆమె వైఎస్‌ జగన్‌ను నేరుగా ఢీకొట్టడానికి సిద్ధపడినట్లు భావించాల్సి ఉంటుంది. అతి పెద్ద సెక్యులర్‌ పార్టీలో చేరినందుకు తాను సంతోషంగా ఉందని కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఆమె అన్నారు. 

షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024), లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కొద్ది నెలల్లోనే షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తారని అనుకోవచ్చు. వైఎస్‌ జగన్‌ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో కొత్తవారికి టికెట్లు ఇచ్చేందుకు వ్యూహరచన చేశారు. దానివల్ల పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వైసిపి నుంచి పోటీ చేసే అవకాశాలు లేకుండా పోతాయి. వారితో పాటు మరికొంత మంది వైసిపి (YCP) నాయకులు, కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌లోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన దారిలో మరింత నడిచే అవకాశాలను కొట్టిపారేయలేం. దానివల్ల వైసిపి ఓట్లకు కాంగ్రెస్‌ గండి కొట్టే అవకాశాలున్నాయి. 

నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపికి కూడా షర్మిల వల్ల చిక్కులు ఏర్పడవచ్చు. వైసిపి అసమ్మతి నాయకులు టిడిపి (TDP)లో చేరే అవకాశాలు తగ్గిపోతాయి. షర్మిల రాకతో కాంగ్రెస్‌ ఒక శక్తిగా మారే అవకాశాలు ఉండడంతో వారు టిడిపి వైపో, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) వైపో, బిజెపి వైపో చూడకపోవచ్చు.



వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. బిజెపితో పవన్‌ కల్యాణ్‌ పొత్తులో ఉన్నారు. ఆ విషయాన్ని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandheswari) స్వయంగా చెప్పారు. దాంతో బిజెపి కూడా టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. కాగా, తాజాగా బిజెపి ఎంపీ సిఎం రమేష్‌ (CM Ramesh) చెప్పిన మాటలు కూడా అందుకు అవకాశాలున్నట్లు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అంటూనే ఎపిలో బిజెపి కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని జగన్‌ చెప్పారు. దాన్నిబట్టి టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఎదుర్కుంటాయని భావించవచ్చు.

సిఎం రమేష్‌ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు. ఆయన విమానంలోనే ఇటీవల ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishore) నారా లోకేష్‌ (Nara Lokesh)తో కలిసి విజయవాడ వచ్చారు. ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబును కలిసి మాట్లాడారు. దానివల్ల టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయని అనుకోవచ్చు. అయితే, ఈ కూటమికి కాంగ్రెస్‌ నుంచి కూడా చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం కూడా ఉంది. రాయలసీమలో టిడిపి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీని ఏపిలో అధికారంలోకి తేవడం సాధ్యం కాకవచ్చు. కానీ, షర్మిల ఇటు వైఎస్‌ జగన్‌కు, అటు చంద్రబాబుకు సవాల్‌ విసిరే అవకాశాలున్నాయి. 

షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల వైఎస్‌ జగన్‌ మాత్రమే  కాకుండా చంద్రబాబు కూడా అప్రమత్తం కావాల్సిన రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొంటున్నాయి.

- కాసుల ప్రతాపరెడ్డి 


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...