Saturday, January 6, 2024

వైఎస్‌ జగన్‌కు షర్మిల భయం: చంద్రబాబుపై సాక్షి కథనాలు ఇవీ... - YS Jagan fears of YS Sharmila, sakshi daily indicates

 వైఎస్‌ జగన్‌కు షర్మిల భయం: చంద్రబాబుపై సాక్షి కథనాలు ఇవీ...


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆమె కాంగ్రెస్‌లో చేరడం వైఎస్‌ జగన్‌కు మింగుడు పడడం లేదు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు నిర్వహించవచ్చుననే ప్రచారం బలంగానే సాగుతున్నది. షర్మిల ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చునని, షర్మిలను కూడా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఇటీవల అన్నారు. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల తమ పార్టీ ఓట్లు చీలుతాయనే వాదనను వైసిపి ఎమ్మెల్యే కొడాలి (Kodali Nani) నాని ఖండిరచారు. ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో చేరడం వల్ల టిడిపి ఓట్లు చీలాయా అని ఆయన ప్రశ్నించారు. అయితే, పైకి ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ షర్మిల భయం మాత్రం వైసిపిని పట్టుకుందని చెప్పవచ్చు. 



అదలా వుంటే, వైసిపి అధికార పత్రిక సాక్షి (Sakshi daily)లో షర్మిలకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రారంభమయ్యాయి. అయితే, నేరుగా షర్మిలపై విమర్శలు చేయకుండా కాంగ్రెస్‌, టిడిపి (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)ని తప్పు పడుతూ వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ (Kommineni Srinivas Rao) ఓ భారీ రాజకీయ వ్యాసం రాశారు. ఆయన కథనం ప్రకారం... వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ కుట్రలు చేస్తున్నది, అందుకు చంద్రబాబు సహకరిస్తున్నారు. అదే సమయంలో ఓ తెలుగు మీడియా యజమానిని కూడా ఆయన ఇందులోకి లాగారు. షర్మిల, ఆమె భర్త అనిల్‌ కుమార్‌ ఓ మీడియా యజమాని ట్రాప్‌లో పడ్డారని చెప్పారు. ఆయన పేరు చెప్పకపోయినప్పటికీ సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ జగన్‌ కుటుంబంలో అంతర్గత కలహాల నుంచి షర్మిల రాజకీయ ప్రయాణం వరకు మొదటి నుంచీ ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక (Andhrajyothi daily)లోనే వార్తాకథనాలు వస్తున్నాయి. షర్మిలను ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారని కూడా వార్త వచ్చింది. అది చాలా వరకు నిజం కావచ్చు కూడా. అది నిజం కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను ముందు తీసుకుని వెళ్లే మరో బాధ్యత కూడా అప్పగించవచ్చు. బిటెక్‌ రవి BTech Ravi), అనిల్‌ మధ్య విమానంలో మంతనాలు కూడా చంద్రబాబు కుట్రలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ రోజు అంటే జనవరి 6వ తేదీన సాక్షిలో మరో వార్తాకథనం ప్రచురితమైంది. చంద్రబాబుపై నేరుగా ఈ వార్తాకథనంలో విమర్శలు ఎక్కుపెట్టారు. సాక్షి దినపత్రిక వార్తాకథనం ప్రకారం... సిఎం రమేష్‌ను (CM Ramesh), సుజనా చౌదరిని బిజెపిలోకి పంపించి చంద్రబాబు తన అవినీతి కార్యకలాపాల నుంచి తప్పించుకనే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలను తన కుట్రలో భాగంగానే చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపించారని సాక్షి కథనం వ్యాఖ్యానించింది. 

సాక్షి వార్తాకథనం సారాంశం ఇదీ... షర్మిలకు సిఎం రమేష్‌ ప్రత్యేక విమానాన్ని సమకూర్చారు. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ని చంద్రబాబు కాంగ్రెస్‌లోకి వంపించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్‌తో చంద్రబాబు సంబంధాలు మరింత బలపడ్డాయి. షర్మిలకు ప్రత్యేక విమానాన్ని సమకూర్చడమే కాకుండా బిటెక్‌ రవిని రంగంలోకి దింపారు. 

సాక్షి వార్తాకథనంలో మరో వ్యాఖ్య కూడా ఉంది.. తన సామాజిక వర్గానికి చెందిన సునీల్‌ Suneel Kanugole)ను కాంగ్రెస్‌ తన వ్యూహకర్తగా ఎంచుకోవడం వెనక కూడా చంద్రబాబు పాత్ర ఉందనేది ఆ వ్యాఖ్య. ఆ వ్యాఖ్యకు మరో చిన్న ట్విస్ట్‌ కూడా ఇచ్చింది. సునీల్‌ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవాడనేది ఆ ట్విస్ట్‌.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో షర్మిల ప్రభావం పెద్దగా ఉండదని అంటూ మరో వైపు ఆమె పాత్రను తగ్గించే ప్రయత్నాలు కూడా వైసిపి నుంచి నడుస్తున్నాయి. వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, జగన్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్‌ ఎవరు సారథ్యం వహించినా చేసేదేమీ లేదనే విధంగా వైసిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తం మీద, షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వైఎస్‌ జగన్‌ను ఇరకాటంలో పెట్టినట్లే భావించాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ షర్మిలపై వైసిపీ ప్రత్యక్ష విమర్శలు పెరుగుతూ రావచ్చు. ఏమైనా ఇప్పటికి మాత్రం వైఎస్‌ షర్మిల ప్రభావం ద్రవరూపంలోనే ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...