Sunday, January 21, 2024

క్లియర్‌: వైఎస్‌ జగన్‌నూ టార్గెట్‌ చేసిన సోదరి షర్మిల - YS Sharmila targets not only Chandrababu and YS Jagan Also

క్లియర్‌: వైఎస్‌ జగన్‌నూ టార్గెట్‌ చేసిన సోదరి షర్మిల


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) అయిన తన సోదరుడు వైఎస్‌ జగన్‌ (YS jagan) పట్ల వైఎస్‌ షర్మిల (YS Sharmiala) వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతూ వచ్చింది. నేటితో అంటే జగనవరి 21వ తేదీ ప్రసంగంతో ఆ విషయం తేటతెల్లమైంది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu)నే కాదు, జగన్‌ను ఆమె టార్గెట్‌ చేయడానికి సిద్ధపడ్దారని అర్థమవుతున్నది. వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ పిసిసి (AP PCC) అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆమె జగన్‌పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ముందు కూడా ఆమె జగన్‌ను ఉపేక్షించబోరని నేటి ప్రసంగంతో అర్థమవుతున్నది.



గత ఐదేళ్లుగా వైసిపి (YCP) అధికారంలో ఉందని, అంతకు ముందు ఐదేళ్లు టిడిపి (TDP) అధికారంలో ఉందని, ఈ పదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే సమాధానం లేదని షర్మిల అన్నారు. రాష్ట్రం ఏర్పడిననాటికి లక్ష కోట్ల అప్పులున్నాయని, చంద్రబాబు తన పాలనతో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే జగన్‌ రెడ్డి (Jagan Reddy) మూడు మూడు లక్షల కోట్లు చేశారని, ఇప్పుడు ఏపి మీద పది లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ఆమె అన్నారు.

పదేళ్లు గడిచినా రాష్ట్రానికి రాజధాని ఉందా అని ప్రశ్నిస్తూ రాజధానిని కట్టడానికి డబ్బులు కూడా లేవని అన్నారు. ఒక్క మెట్రో అయినా ఉందా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి పది పెద్ద పరిశ్రమలు కూడా రాలేదని ఆమె తప్పు పట్టారు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఆమె విమర్శించారు. దళితులపై దాడులు వందకు వంద శాతం పెరిగాయని ఆమె అన్నారు. ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియాలు దోచుకోవడం దాచుకోవడమేనని ఆమె అన్నారు.



ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేశారని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారైన నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Category Status) రాకపోవడానికి చంద్రబాబు, జగన్‌ కారణమని ఆమె అన్నారు. రాజధాని అంటే చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని ఆమె అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నాడని, ఒక్క రాజధాని కూడా లేదని అన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasekhar Reddy) మరణం తర్వాత పోలవరం (polavaram) ముందుకు కదలలేదని, బిజెపితో దోస్తీ కోసం చంద్రబాబు, జగన్‌ తాకట్టు పెట్టారని అన్నారు. ఎంపీలు బిజెపి తొత్తులుగా మారారని, బిజెపి ఏం చెప్తే ఎంపీలు దంగిరెద్దుల్లా తలలూపుతారని ఆమె వ్యాఖ్యానించారు.జగన్‌ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్‌ మీద మాట్లాడలేదని ఆమె అన్నారు. వైసిపీ, టిడిపి బిజెపికి మద్దతు ఇచ్చాయని అన్నారు. వైసిపికి, టిడిపికి ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు.

- కాసుల ప్రతాపరెడ్డి


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...