Sunday, January 21, 2024

వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆత్మ మంత్రాంగం: వైఎస్‌ షర్మిల యాక్షన్‌ - KVP Ramachandar Rao will backbone for YS Sharmila politics in AP

 వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆత్మ మంత్రాంగం: వైఎస్‌ షర్మిల యాక్షన్‌


కేవీపీ రామచందర్‌ రావు (KVP Ramachandar Rao)ను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) ఆత్మగా చెబుతుంటారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్ల పాటు ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటూ వచ్చారు. రాజకీయంగా ఆయన క్రియారహితుడు అయ్యారని అందరూ అనుకున్నారు. కానీ, కాంగ్రెస్‌కు జీవం పోయడానికి ఆయన మంత్రాంగం నడుపుతూనే ఉన్నారని ఇటీవలి పరిణామాన్ని బట్టి అర్థమవుతున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ పిసిసి (AP PCC President) అధ్యక్షుడిగా ఉంటూ వచ్చిన గిడుగు రుద్రరాజు (Gidugu Rudra raju) కేవీపి రామచందర్‌ రావుకు సన్నిహితుడు. 

తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టబోతున్నారు. షర్మిలకు మార్గం సుగమం చేయడానికి పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి ముందు జనవరి 20 తేదీన షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయ (Idupulapaya)కు వెళ్లిన ఆమెతో కేవీపి రామచందర్‌ రావు కూడా ప్రయాణం చేశారు. అంటే, వెనక నుంచి కాంగ్రెస్‌ పార్టీని కేవీపి రామచందర్‌ రావు నడపబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.



వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా చురుగ్గా వ్యవహరించనున్నారనేది దీన్నిబట్టి అర్థమవుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరిపోస్తారా అనేది వేచి చూడాలి. ఆమె పిసిసి అధ్యక్షురాలిగా నియమితులవుతారనే విషయం ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచే కొంత కదలిక ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దెబ్బ తీయడానికే కాంగ్రెస్‌ ఆమెను ఏపి రాజకీయాల్లోకి దించారనే అభిప్రాయం వైసిపి నుంచి వినిపిస్తున్నది. కానీ, ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా టిడిపి - జనసేన కూటమి (TDP - Jana Sena alliance)ని దెబ్బ తీసే అవకాశం కూడా ఉంది. 

ఆమె ప్రభావం ఏపి రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది, ఏ పార్టీలకు ఆమె ప్రమాదం కాగలరనేది కొద్ది కాలంలోనే తెలుస్తుంది. కాంగ్రెస్‌ మాత్రం ఎపిలో తిరిగి పుంజుకోవాలనే ప్రయత్నంలో ఉంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని షర్మిల సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతారనేది స్పష్టం. ఆయితే, తన అన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పట్ల ఆమె వైఖరి ఎలా ఉంటుందనేది, ఆయనపై ఆమె విమర్శలు గుప్పిస్తారా అనే ప్రశ్నలకు కొద్ది రోజుల్లో సమాధానాలు దొరుకుతాయి.

- కాసుల ప్రతాపరెడ్డి






No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...