Monday, January 29, 2024

వైఎస్‌ షర్మిలతో పాత కాపులు కలిసి వస్తారా? - Will seniors will work with YS Sharmila?

వైఎస్‌ షర్మిలతో పాత కాపులు కలిసి వస్తారా?


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పార్టీకి ఊపిరి పోయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) హయాంలో చురుగ్గా వ్యవహరిస్తూ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్న సీనియర్‌ నేతలను కలుస్తూ, వారి మద్దతు పొందడానికి మాత్రమే కాకుండా వారిని పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రా రెడ్డి (DL Ravindra Reddy)ని కలిశారు. ఆయన గతంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచారు. రాష్ట్ర విభజన జరిగి, వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలం పుంజుకున్న తర్వాత రాజకీయాల నుంచి వెనక్కి తగ్గారు. ఆయన షర్మిలతో కలిసి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. కాంగ్రెస్‌లో పని చేయడానికి ఆయన ఏ మాత్రం ఉత్సుకత చూపుతారనేది కూడా చెప్పలేం. 



అంతకు ముందు వైఎస్‌ షర్మిల మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ (Undavalli Arun Kumar)ను కలిశారు. ఆయన కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించడానికి అంత ఇష్టం చూపుతున్న సూచనలు కనిపించడం లేదు. తాను రాజకీయాల నుంచి స్వచ్ఛంద విరమణ చేశానని ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి తన ఇంటికి వచ్చి షర్మిల పలకరించారని ఆయన అన్నారు.

తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మిత్రుడు దుట్టా రామచందర్‌ రావు (Dutta Ramachandar Rao)ను కూడా ఆమె ఇటీవల కలిశారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌ (Congress)లో చేరుతారని షర్మిల ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపంచడం లేదు. షర్మిలతో భేటీపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన వైసిపిలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల దుట్టా కాంగ్రెస్‌లో చేరే సమయం దగ్గరలో ఉందని అన్నారని చెప్పవచ్చు. అయితే, దుట్టా ఆలోచన మరో విధంగా ఉన్నట్లు అనిపిస్తున్నది.

తాము 40 ఏళ్ల నుంచి రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చామని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని ఆయన అన్నారు. ఏ పార్టీ అనేది సమయాన్ని బట్టి ఆలోచిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ కొనసాగడం లేదని, డాక్టర్‌గా తన వృద్ధి ధర్మం పాటిస్తున్నానని చెప్పారు. మరో మాట కూడా అన్నారు. మున్ముందు రాజకీయాల్లో ఉండే అవకాశాలు తక్కువ అని, తన వరకు ప్రాక్టీస్‌ చేసుకుంటానని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్‌లో చేరే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల వెంట ప్రస్తుతం తులసిరెడ్డి, రఘువీరారెడ్డి వంటి కొంత మంది సీనియర్లు ఉన్నారు. వీరు చురుగ్గా పని చేసే అవకాశాలున్నాయి. కానీ వారి సాయంతో షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోయగలరా అనేది అనుమానమే.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...