Thursday, January 25, 2024

రాజధాని: దశాబ్దాలుగా తెగని ఆంధ్ర సమస్య - AP Capital issue as Assembly election agenda

 రాజధాని: దశాబ్దాలుగా తెగని ఆంధ్ర సమస్య


ఆంధ్ర రాజకీయ నాయకుల దూరదృష్టి లోపం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన (Andhra Pradesh bifurcation) తర్వాత ముఖమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన టీడిపి (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అమరావతి (amaravati) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింగపూర్‌ తరహాలో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాలన నిర్వహణకు తాత్కాలిక నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. అయితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణం పెద్దగా ముందుకు కదలలేదు.



ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) మూడు రాజధానుల (Three capitals) విధానాన్ని ముందుకు తెచ్చారు. అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాలకు అధికారాన్ని వికేంద్రీకరిస్తానని చెప్పారు. విశాఖ (Viskha)కు రాజధానిని తరలించే ప్రక్రియ కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. తిరిగి ఎన్నికలు సమీపించాయి. రాజధాని సమస్య మాత్రం తీరలేదు. తాను అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. ఆయనకు టిడిపి మిత్రపక్షం జనసేన (jana Sena) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మద్దతు పలుకుతున్నారు. 

మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని సమస్య వెంటాడుతూనే ఉంది. అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. మద్రాసు (Madras)ను తమకు ఇవ్వాలని పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వంటి వారు డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు వెతకడంలో విఫలమయ్యారు. చివరకు కర్నూలు తాత్కాలిక రాజధానిగా 1953 అక్టోబర్‌ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిరది. అప్పుడు కర్నూలు (Kurnool)లో రాజధానికి ఉండాల్సిన హుంగులేవీ లేవు. ఆ తర్వాత 1956 నవంబర్‌ 1వ తేదీన తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిరది. దాంతో అప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం దానికి రాజధానిగా ఆయాచితంగానే లభించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ కాలం సీమాంధ్ర నాయకులు, ముఖ్యంగా రాయలసీమ నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారెవరు కూడా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupathi) వంటి నగరాలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్‌ (Hyderabad)లోనే ఇతర ప్రాంతాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడా బ్యాపారాలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకున్నారు. 1969 ఉద్యమం తర్వాతనైనా వాళ్లు కళ్లు తెరవలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా విడిపోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, హైదరాబాద్‌ తమకు కాకుండా పోతుందని వారు అనుకోలేదు. వారి అంచనాలకు విరుద్దంగా, వారి ప్రయత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలిసిన తర్వాత కూడా సీమాంధ్ర నాయకులు తమకు హైదరాబాద్‌ కావాలనే పట్టుదలతోనే వ్యవహరించారు. హైదరాబాద్‌ తమకు కావాలంటూ పట్టుబట్టారు. చివరకు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగానైనా చేయించాలని ప్రయత్నాలు సాగించారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఏర్పడడం సాధ్యం కాదని, అందుకు తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని వారు గ్రహించలేకపోయారు.

చివరకు రాష్ట్రం చీలిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఆ తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండేలా రాష్ట్ర విభజన జరిగింది. అయితే, ఈలోగానే చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ, దాన్ని అభివృద్ధి చేయడానికి 33 వేల ఎకరాల భూమి సేకరించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమరావతిని నామమాత్రం చేస్తూ మూడు రాజధానుల విధానాన్ని ముందుకు తెచ్చింది. అమరావతిని సచివాలయ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి జగన్‌ ప్రయత్నాలు సాగించారు. అయితే, కోర్టు కేసుల కారణంగా ఆ ప్రయత్నాలు ముందు సాగలేదు. 

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఇక కొద్ది నెలలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడానికి ఎన్నో రోజులు లేవు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్య తీరేట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజధాని సమస్య కూడా ఎన్నికల ఎజెండాగా మారింది.

- కాసుల ప్రతాపరెడ్డి


 


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...