Monday, March 4, 2024

మానవ సంబంధాలపై అలవి మాలిన ఆపేక్ష - forward on Sayed Gaffar's Kurbaani Telugu short stories

మానవ సంబంధాలపై అలవి మాలిన ఆపేక్ష


సయ్యద్‌ గఫార్‌ (Syed Gaffar)తో నా పరిచయం కొద్ది మాత్రమే. మరి ఎందుకో తన కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమని అడిగాడు. ఆయన కథలను గతంలో నేను చదివిన గుర్తు లేదు. అయినప్పటికీ బలవంతం మీద అంగీకరించాను. కథలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతూనే దానికి ఒప్పుకున్నాను. కథలు చదివిన తర్వాత నా అంగీకారం వల్ల అసంతృప్తి గురికావాల్సిన అవసరం లేదని అర్థమైంది. పైగా, సయ్యద్‌ గఫార్‌పై ఓ విధమైన అభిమానం కూడా ఏర్పడిరది. అందుకు కారణం ఆయన తన కథలకు ఎన్నుకున్న వస్తువులు, ఆ వస్తువులను నిర్వహించిన తీరు నాకు చాలా నచ్చింది. మొత్తంగా కథలన్నింటిలో మానవ సంబంధాల పట్ల ఓ ప్రేమపూరితమైన ఆపేక్ష ఉంది. అందులోనూ పేద కులాల మధ్య, మతాల మధ్య వున్న సంబంధాలు కళ్లకు కట్టినట్లున్నాయి. నా చిన్నతనంలో మా వూళ్లో చూసిన, అనుభవించిన అనుబంధాలు మరోసారి గుర్తుకు వచ్చి కళ్లు చెమ్మగిల్లాయి. 

సయ్యద్‌ గఫార్‌ నాకు పెద్దగా పరిచయం లేనంత మాత్రాన సాహిత్య ప్రపంచానికి కొత్తవాడేమీ కాదు. ఖుర్బానీ అనే ఈ కథ సంపుటిని పాఠకలోకానికి అందించడానికి ముందే ఆయన కవిగా ప్రసిద్ధుడు. ప్రసిద్ధుడు అని ఎందుకు అంటున్నానంటే ఆయన కవితా సంపుటికి జనన వాంగ్మూలం అనే పేరు పెట్టాడు. ఈ దేశంలో ముస్లింగా పుట్టినందువల్ల అదనంగా మోస్తున్న బరువును, అపనిందలను ఆయన ఆ కవిత్వంలో వ్యక్తీకరించాడు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పరిణామాలు అయోధ్యలో రామాలయ నిర్మాణం దాకా చోటు చేసుకున్నాయి. రాజకీయాలు కేవలం మతాన్ని ఆసరా చేసుకుని ముందుకు సాగుతున్న నేటి పరిస్థితుల్లో సయ్యద్‌ గఫార్‌ ఆవేదన నిత్యం మండుతున్న కొలిమిలాంటిది. 

కవిత్వంలో భావోద్వేగాలు ఉంటాయి. కథల్లో ఆ భావోద్వేగాలు కార్యకారణ సంబంధాలతో వ్యక్తమవుతాయి. ఆ ఎరుకతోనే రాసిన కథలు ఎక్కువగా ఖుర్బానీలో ఉన్నాయి. గఫార్‌ కథలు చదువుతుంటే మా ఊరిలో ముస్లిం కుటుంబాలతో ఉండే అనుబంధాలు, వారితో పంచుకున్న ఆప్యాయతలు కళ్ల ముందు మెదిలాయి. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో ఎంఎ తెలుగు సాహిత్యం చదువుతున్న రోజుల్లో ఠాగోర్‌ ఆడిటోరియం పార్కులో జరిగిన కొద్దిపాటి పరిచయానికే ఓ ముస్లిం కుటుంబ సభ్యులు మా పట్ల చూపి ఆప్యాయత గుర్తుకు వచ్చింది. ఇందిరా గాంధీ హత్య జరిగిన రోజున హాస్టల్‌ విద్యార్థుంతా టీవీకి అతుక్కుపోయి హాల్‌లో నించోవడానికి కూడా సందులేని పరిస్థితిలో నేనూ నా క్లాస్‌మేట్‌, వరుసకు సోదరుడు అయిన సోమిరెడ్డి రాజిరెడ్డి కలిసి వారాసిగుడా వీధుల్లో తిరుగుతున్నాం. ఆ స్థితిలో మమ్మల్ని చూసి ఆ కుటుంబం మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించి, మా చేత బిర్యానీ తినిపించి, ఆ తర్వాత పాన్లు కూడా కట్టించి ఇప్పించిన సంఘటన సజీవ దృశ్యంగా కదలాడిరది. వాళ్లు చూపిన ఆప్యాయతకు, మేం స్వీకరించిన విందుకు ఏ విధమైన మతం కూడా అడ్డురాలేదు. గఫార్‌ కథలు చదువుతుంటే మా ఊళ్లోని హకీం మామనే కాదు, మిత్రులు సలీం, ఖలీల్‌ ఇంకా ఎంతో మంది ఆప్యాయతానురాగాలు, వారితో పెనవేసుకుపోయిన బాంధవ్యాలు గుర్తుకు వచ్చాయి. ఆ పాఠశాల అటెండర్‌ షంషుద్దీన్‌, బషీరుద్దీన్‌ సార్‌ చూపిన ప్రేమానురాగాలు యాదికి వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి.

ఖుర్బానీ (Khurbaani) కథా సంపుటిలోని చాలా కథలు మతాలకు అతీతమైన మానవ సంబంధాలను చిత్రించాయి. శూద్రకులాలకు, ముస్లింలకు మధ్య ఉండే ఆప్యాయతలను, అనుబంధాలను వ్యక్తీకరించాయి. ముఖ్యంగా పేద కులాలకు, ముస్లిం కులాలకు మధ్య ఉండే అనురాగపూరితమైన పలకరింపులకు, పరస్పరం కష్టసుఖాలను పంచుకునే స్నేహపూర్వక సంబంధాలకు ఈ కథలు ప్రతీకగా నిలుస్తాయి. 

గఫార్‌ కథాసంపుటిలో ఖుర్బానీ కథ విశిష్టమైంది. శూద్ర కులాలతో ముస్లిం కుటుంబం అనుబంధాన్ని గుర్తు చేసే కథ ఇది. బక్రీద్‌ కోసం ఖుర్బానీ ఇవ్వడానికి డబ్బులు పోసి తెచ్చుకున్న యాటపోతును పక్కనుండే రాములమ్మ కుటుంబం కోసం తిరిగి ఇచ్చేసి ఆ డబ్బులను త్యాగం చేసిన బిలాల్‌ కుటుంబం కథ. దానికితోడు, యాటపోతును మల్లయ్య చాలా తెలివిగా అప్పుగా ఇచ్చినట్లు కాకుండా డబ్బులు ఇచ్చి బిలాల్‌ కుటుంబానికి తిరిగి ఇచ్చేసిన ఆప్యాయత. మతాలు వేరైనా, కులాలు వేరైనా అందరిలోనూ పారేది రక్తం ఒక్కటేనని చెప్పిన కథ ఖుర్బానీ. 

ఉల్టాబాజా మరో విశిష్టమైన కథ. ఉల్లాబాజా అంటే చావు డప్పు. మాదిగ గూడెంలోని మట్టిగాడు మరణిస్తే అగ్రకుల రాజకీయాలన్నీ ప్రవేశించి అంత్యక్రియలకు సహకరించని నేపథ్యంలో ఓ ముస్లిం కుటుంబం ముందుకు వచ్చి ధైర్యంగా చావుడప్పుతో అంత్యక్రియలు చేస్తుంది. ముస్లిం కుటుంబాలకు, దళిత కుటుంబాలకు మధ్య గల అనుబంధాన్ని తెలియజేసిన కథ ఇది. ముస్లింలు ఈ దేశం మూలవాసులేనని చెప్పే ఆత్మీయ చిత్రీకరణను ఈ కథ చెప్పుతుంది. 

రాజకీయాలు మతాన్ని ముందుకు తెచ్చి చిచ్చు పెట్టి ముస్లింలకు, దళితులకు లేదా శూద్రకులాలకు మధ్య విభేదాలు సృష్టిస్తే అవి నిలిచేవి కావని తెలియజేసిన కథ నషా. ముస్లిం, దళిత కుటుంబాలకు మధ్య ఉండే అనుబంధాన్ని ఆత్మీయంగా చిత్రించిన కథ ఇది. నిలిచేది మానవత్వం, మానవీయ బంధాలు మాత్రమేనని చెప్పిన కథ. ‘ఒకనాటి మాట కాదు’ కథ కూడా హిందూముస్లిం కుటుంబాల మధ్య ఉన్న అనురాగ బంధాలను తెలియజేసే కథ. మొత్తంగా ముస్లిం, శూద్రకులాల మధ్య ఉండే అనుబంధాన్ని, ఆప్యాయతను గఫార్‌ అద్భుతమైన శిల్పంతో చిత్రించారు. అయోధ్య సంఘటన నేపథ్యంలో గఫార్‌ కథలు మానవ సంబంధాలపై అలవి మాలిన ఆపేక్షను కురిపిస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే, మత రాజకీయాలు నగరాలూ పట్టణాలూ దాటి గ్రామాల్లోకి కూడా ప్రవేశిస్తున్న చారిత్రక సందర్భంలో అత్యవసరమైన సాహిత్యంగా గఫార్‌ కథలను చెప్పవచ్చు, ఈ స్థితిలో ఇటువంటి సాహిత్యం ఇంకా రావాల్సే ఉంది. 

ఇకపోతే,న ఇతర కథల వద్దకు వద్దాం. సమాజంలోని అట్టడుగువర్గాల జీవితాలను గఫార్‌ కథలుగా మలిచాడు. అటువంటి కథల్లో హంస, ప్రశ్నించే నీడ కథలు దేనికదే ప్రత్యేకమైంది. హంస కథలో వీధిలో ఖాళీ సీసాలు, చిత్తు ఏరుకునే అక్కాతముళ్లకు చదువుపై గల మమకారాన్ని, చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్షను తెలియజేస్తూ అవి సాకారం కావడానికి తోడ్పడే మనుషులు ముందుకు రావడంతో కథ ముగుస్తుంది. ఒక సానుకూలమైన ముగింపుతో కథ పూర్తవుతుంది. ప్రజల్లోని మానవీయ దృక్పథంపై గల ఆశను రచయిత చిత్రించాడు. ఇది రచయిత ఆకాంక్ష. కొన్ని సందర్భాల్లో అటువంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రశ్నించే నీడ కథలో ఆకలి దేనికైనా ప్రేరేపిస్తుందని, దాన్ని గొప్పవాళ్లమని భావించే వాళ్ల ఇతరేతర ఆకలిని తీరుస్తుందని, సమాజంలో ద్వంద్వ ప్రవృత్తి గలవారు ఉంటారని చెప్పిన కథ. ‘మరో ప్రేమ కావ్యం’ కథ సమాజంలోని అట్టడుగు వర్గాల్లోని ప్రేమబంధాలు ఆధిపత్య, సంపన్న వర్గాల మోసానికి గురవుతాయయో చెప్పుతుంది. గఫార్‌ బడుగు, బలహీన వర్గాలపై అనంతమైన ప్రేమతో రాసిన కథలు అవి.

ఇక, ‘బండి కదిలింది’ అనే కథ స్త్రీపురుష సంబంధాలను చిత్రించిన కథ. ఒక రకంగా స్త్రీపురుష సంబంంధాన్ని వినూత్నమైన దృక్పథంతో చెప్పాడు గఫార్‌. ‘రంగులవల’ కథ సినిమాలపై మక్కువతో ఆస్తులన్నీ కరగదీసుకున్న వ్యక్తి కథ. ఇటువంటి సంఘటనలు సమాజంలో తరుచుగా జరిగేవే. ‘కలవరింత’, ‘పరిష్కారం’, ‘మూడో నెల’ కథలు కొంత హాస్యస్పోరకమైనవి, సాధారణమైవి. అయితే, శిల్పరీత్యా మంచి కథలు.

మొత్తంగా గఫార్‌ కథలు ప్రస్తుత సమాజానికి అవసరమైనవి. ఎక్కడా వివక్షను కసితోనో, ఆగ్రహంతోనో రచయిత వ్యక్తం చేయలేదు. తాను తెర వెనక ఉండి పాత్రలు సజీవంగా సంచరిస్తూ తమ తమ జీవితాలను వ్యక్తీకరిస్తాయి. రచయిత జోక్యం లేకపోవడం, పాత్రలు కూడా ఈర్ష్యాద్వేషాలను, ఆగ్రహాలను వ్యక్తం చేయకపోవడం చూస్తాం. ఇటువంటి ప్రేమపూరితమైన కథలను రాసిన గఫార్‌ అభనందనీయడు. అయితే, రచనలో ఇంకాస్తా క్లుప్తత పాటిస్తే ఇంకా మంచి కథలు అయి ఉండేవి. ఈ పుస్తకంలోని కథలను చదివితే గఫార్‌ మానవీయ దృక్పథం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.


- కాసుల ప్రతాపరెడ్డి
(‘సయ్యద్‌ గఫార్‌ ‘ఖుర్బానీ’ కథల సంపుటికి రాసిన ముందుమాట)

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...