Monday, February 5, 2024

చంద్రబాబు చదరంగంలో పవన్‌ కల్యాణ్‌ పావు? - Chandrababu may ditch Pawn Kalyan in AP politics

 చంద్రబాబు చదరంగంలో పవన్‌ కల్యాణ్‌ పావు?


టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) రాజకీయ చదరంగంలో జనసేన (jana Sena అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పావు కాబోతున్నారా? పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) సంధించిన బహిరంగ లేఖ అవుననే సమాధానం ఇస్తోంది. చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను వాడుకుని రాజ్యాధికారం సంపాదించుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. జనసేన మద్దతు లేకుండా టీడీపీ విజయం సాధించలేదని 2019 ఎన్నికలు నిరూపిస్తున్నాయని ఆయన అంటున్నారు. కాపు (Kapu)లకు రాజ్యాధికారం కావాలంటే సీట్ల సర్దుబాటులో జనసేనకు తగినన్ని సీట్లు కేటాయించే విధంగా పట్టుబట్టాల్సిందే అనేది ఆయన అభిమతం. అంతకన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనేది ఆయన అభిప్రాయం.



జనసేనకు 30 సీట్లు కేటాయించినట్లు, 27 సీట్లు కేటాయించినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఈ వార్తలకు జనసేన నుంచి ఏ విధమైన ఖండన కూడా లేదు. దీంతో అందుకు పవన్‌ కల్యాణ్‌ సమ్మతించినట్లు ప్రజలు అర్థం చేసుకునే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో వాటా పంచుకోవాలంటే జనసేన 40 నుంచి 60 సీట్ల మధ్య పోటీ చేయాల్సి ఉంటుందని, కనీసం 50 సీట్లను కేటాయించే విధంగా చూసుకోవాలని హరిరామ జోగయ్య అన్నారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు రాజ్యాధికారం అప్పగించడానికి కాదని ఆయన అన్నారు. సీట్లు తక్కువ ఇచ్చినా రెండున్నరేళ్ల పాటు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రిగా ఉంటారని చంద్రబాబు చేత ప్రకటన చేయించగలరా అని ఆయన ప్రశ్నించారు. హరిరామ జోగయ్య నేరుగా ఈ ప్రశ్నను పవన్‌ కల్యాణ్‌కు సంధించారు. 

గతంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చాయనే విశ్లేషణ ఈ సందర్బంలో జరుగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు (సిపిఐ, సిపిఎం) ఇప్పుడు ఒక్క సీటు కోసం, రెండు సీట్ల కోసం బేరసారాలు నడిపే స్థితికి చేరుకున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బిజెపి కూడా బలహీనపడిరది. ఇప్పుడు జనసేనతో టీడీపీ పొత్తు (Janasena - TDP alliance) పెట్టుకుంది. అయితే, సీట్ల పంపకం (Seat Sharing) వద్ద చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌కు అంగీకరించే పరిస్థితి లేదు.


 

ఒక వేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే జనసేనను తొక్కేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు షరతులకు అంగీకరించి టీడీపీని అధికారంలోకి తెస్తే జనసేన తన గొంతు కోయించుకోవడానికి కత్తి ఇచ్చినట్లేనని అంటున్నారు. కాగా, బిజెపిని కూటమిలోకి తేవాల్సిన బాధ్యతను కూడా చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ మీదనే పెట్టినట్లు తెలుస్తోంది. బిజెపి కూటమిలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

తాజా పరిణామాల పట్ల పవన్‌ కల్యాణ్‌ను బలపరుస్తున్న ఒక వర్గం కాపులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు హరిరామ జోగయ్య లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య చర్చలు జరిగినప్పటికీ సీట్ల పంపకం ఒక కొలిక్కి రాలేదు. జనసేనకు ఏయే సీట్లు కేటాయించాలనే విషయంపై స్పష్టత రాలేదు. చివరి నిమిషంలో చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను తప్పించుకోలేని పరిస్థితిలో పడేసే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు కేటాయించిన సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే సీట్ల సర్దుబాటులో జాప్యం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏకపక్షంగా ప్రకటించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA)లో కొనసాగుతూనే ఆయన టీడీపితో పొత్తును కొనసాగిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందని బిజెపి నాయకులు  ఓ వైపు ప్రకటిస్తున్నారు. బిజెపి, జనసేన పొత్తు వచ్చే ఎన్నికల్లో ఎలా కొనసాగుతుందనేది చెప్పలేని పరిస్థితి. మొత్తంగా పవన్‌ కల్యాణ్‌ అపరిక్వమైన రాజకీయాలను నడుపుతున్నారా అనే సందేహం కలుగుతోంది.

-కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...