Sunday, February 4, 2024

అప్పుడు కేసీఆర్‌ కాళ్లు మొక్కి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించి... Dr Gadala Srinivas Rao seeks Khammam Lok Sabha seat from Congress

 అప్పుడు కేసీఆర్‌ కాళ్లు మొక్కి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించి...


తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు (Gadala Srinivas Rao) అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన రాజకీయాల్లో తన జాతకాన్ని పరీక్షించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కొత్తగూడెం శాసనసభ (Kothagudem assembly seat) సీటును ఆశించి భంగపడ్డారు. అప్పట్లో ఆయన కేసీఆర్‌ (KCR) కాళ్లు మొక్కడం వివాదంగా మారింది. ఈ మాజీ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. లోకసభ టికెట్‌ కోసం ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ (Congress)ను ఆశ్రయించారు. 



తనకు ఖమ్మం (Khammam) లేదా సికింద్రాబాద్‌ (Secunderabad) లోకసభ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అనుచరులు ఈ దరఖాస్తును కాంగ్రెస్‌ పార్టీకి సమర్పించారు. ఖమ్మం సీటును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) సతీమణి నందిని (Nandini), సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వి. హనుమంతరావు ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Choudhary) కూడా ఖమ్మం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ స్థితిలో ఆయనకు కాంగ్రెస్‌ ఖమ్మం సీటు ఇస్తుందా అనేది అనుమానమే.

సర్వీసులో ఉంటూ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించడంపై శ్రీనివాస్‌ రావు అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధితో మాట్లాడారు. తాను ప్రజాజీవితంలో ఉండాలని ఎల్లవేళలా కోరుకున్నానని, అందువల్ల ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించానని ఆయన నిజాయితీగానే చెప్పుకున్నారు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు.

తన స్వస్థలం కొత్తగూడెం అని, ప్రస్తుతం సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి వచ్చే దోమలగుడాలో నివాసం ఉంటున్నానని ఆయన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో చెప్పారు. శ్రీనివాస్‌ రావు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. తనకు కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పారు. టికెట్‌ లభించకపోతే తిరిగి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు.  

-కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...