Thursday, February 1, 2024

రేవంత్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ: కేసీఆర్‌ అప్రమత్తం, పరోక్ష హెచ్చరిక - BRS chief KCR warns MLAs indirectly

రేవంత్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ: కేసీఆర్‌ అప్రమత్తం, పరోక్ష హెచ్చరిక


కొంత మంది పార్టీ ఎమ్యెల్యేలు ఆ మధ్య ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy)తో భేటీ కావడంతో బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandra sekhar Rao) అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. ఆయన గురువారంనాడు (ఫిబ్రవరి 1వ తేదీన) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతోనూ పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. తుంటి గాయానికి చికిత్స పొందిన కేసీఆర్‌ (KCR) పూర్తిగా కోలుకున్నారు. తాను కోలుకున్న తర్వాత జరిగిన సమావేశంలో ఆయన ఎమ్యెల్యేలకు పరోక్ష హెచ్చరిక చేశారు. ఎమ్యెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది.



కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. మంచి ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్నవారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని, అయితే వాటిని ప్రజల సమక్షంలోనే ఇవ్వాలని ఆయన చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. లోకసభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు సిద్ధం కావాలని ఆయన చెప్పారు.

తాను చురుగ్గా లేకపోతే పార్టీ ఎమ్యెల్యేలు, నాయకులు ఇతర పార్టీలకు వెళ్లే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన నేరుగా ముందుకు వచ్చినట్లు కనిపిస్తున్నది. కొద్ది నెలల్లో లోకసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాల్సిన అనివార్యత ఉంది. లోకసభ ఎన్నికల్లో డీలా పడిపోతే పార్టీ ఉనికికే ప్రమాదం వాటిల్లవచ్చు. పార్టీ నిర్మాణం కింది స్థాయి నుంచి క్రమపద్దతిలోనూ సమర్థంగానూ జరగలేదు. ప్రజలు తమను తప్ప మరొకరిని ఎంచుకోరని గట్టిగా విశ్వసిస్తున్న సమయంలో శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. దాంతో కేసీఆర్‌ నమ్మకం సడలింది. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజెపి (BJP) బీఆర్‌ఎస్‌ను వెనక్కి తోసే అవకాశం ఉందనే అంచనాలు కూడా సాగుతున్నాయి. జాతీయ స్థాయి అంశాలపై ఆధారపడి ఆ ఎన్నికలు జరుగుతాయి. అయోధ్య (Ayodhya)లో రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గ్రాఫ్‌ పెరిగిందని భావిస్తున్నారు. దానివల్ల లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్యనే ప్రధానమైన పోటీ ఉండవచ్చు. ఆ పరిస్థితి రాకూడదంటే కేసీఆర్‌ మరింతగా జాగ్రత్తలు తీసుకుని, పార్టీ నాయకులకూ కార్యకర్తలకూ భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ రంగం మీదికి వచ్చారని అంటున్నారు. ఏమైనా వచ్చే లోకసభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అగ్నిపరీక్షనే.

- కాసుల ప్రతాపరెడ్డి 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...