Sunday, February 11, 2024

కేసీఆర్‌ రైతు బంధు నిర్వాకం ఇదీ... అసలేం జరిగింది? - KCR Rythu Bandhu failed to help real farmers

 కేసీఆర్‌ రైతు బంధు నిర్వాకం ఇదీ... అసలేం జరిగింది?


బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కే. చంద్రశేఖర్‌ రావు (K Chandrasekhar Rao) అమలు చేసిన రైతు బంధు (Rythu Bandhu) పథకం సంపన్నవర్గాలకు మేలు చేసింది. పది శాతం మంది వ్యక్తులకు 45 శాతం రైతు బంధులు నిధులు అందించిన కేసీఆర్‌ KCR) ఏ రైతు ప్రయోజనం ఆశించి దాన్ని అమలు చేశారనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు. బీడు భూములకు, ఫామ్‌ హౌస్‌లకు, కొండలకూ గుట్టలకూ కేసీఆర్‌ రైతు బంధు నిధులను విడుదల చేశారు. ప్రాజెక్టు కాలువలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు కూడా రైతుబంధు అమలైంది. పేరుకేమో సాగు పెట్టుబడి. సాగు చేయని భూములకు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు కూడా పెట్టుబడి కింద నిధులను అందించారు. దీనివల్ల జరిగిన అనర్థం చాలానే ఉంది. 



బడా వ్యాపారులు, సంపన్నులు వ్యాపారాల్లోనూ, ఇతరేతర రంగాల్లోనూ పెట్టుబడులను పెట్టడం మానుకుని భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టారు. దానివల్ల స్థిరాస్తికి స్థిరాస్తి ఉండిపోతుంది, పడావు పెట్టినా కూడా రైతు బంధు అనాయసంగా డబ్బులు వస్తాయి. దీంతో పల్లెల్లో పెద్ద యెత్తున భూముల క్రయవిక్రయాలు జరిగాయి. భూముల రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి. దీంతో మామూలు వ్యక్తులు భూములు కొనుక్కోలేని స్థితికి దిగజారే పరిస్థితి వచ్చింది. ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగి సమాజం విధ్వంసం అయ్యేందుకు పునాదులు పడ్డాయి.

వందలాది ఎకరాలను కొద్ది మంది వ్యక్తులు ఎలా తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారనేది ప్రశ్న. భూసంస్కరణల చట్టం (Land reforms act) పరిధిలోకి రాకుండా వారు చేసిన మాయ ఏమిటి? భూసంస్కరణల చట్టాన్ని తుంగలో తొక్కారా? అది అసలు అమలులో ఉందా? భూసంస్కరణల చట్టంలో ఫామ్‌హౌస్‌ల వంటి కొన్నింటికి మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులున్న భూములు వ్యవసాయ భూముల కిందికి రావు. మరి రైతుబంధు పథకం వారికి ఎలా అమలైందనేది ప్రశ్న. భూసంస్కరణల చట్టం రద్దయిందా, అమలులో ఉందా అనేది తెలియదు. 

ఆ విషయాన్ని పక్కనపెడితే... గత వర్షాకాలం లెక్కల ప్రకారం... 68.99 లక్షల మంది చేతుల్లో ఉన్న 1.52 కోట్ల ఎకరాల భూమికి రైతుబంధు నిధులు అందాయి. రైతుబంధు పథకం కింద ప్రయోజనం పొందినవారిలో ఎకరం భూమి లోపు భూమి ఉన్నవారు 22.55 లక్షల మంది రైతులు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది రైతులు. దాదాపుగా కోటి ఎకరాల భూమి వీరి చేతుల్లో ఉంది. అంటే, గుంట నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 90.36 శాతం మంది. ఐదు ఎకరాలకు పైబడి భూమి ఉన్నవారు 6.65 శాతం మంది. వీరి చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరికే రైతు బంధు పథకం కింద దాదాపు 45 శాతం నిధులు వెళ్తున్నాయి. 

సాగు చేయని భూములకు ఎన్ని నిధులు వెళ్తున్నాయో తెలుసుకోవచ్చు. ధరణి పోర్టల్‌ (Dharani Portal) ప్రకారమే... 151 ఎకరాలు వ్యవసాయ భూముల ఖాతాలో ఉన్నాయి. ఇందులో 132 లక్షల ఎకరాలు సాగులో సాగులో ఉన్నాయి. 19 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యంగా లేని భూములు. ఇలా చూస్తే సాగుకు యోగ్యంగా లేని భూములకు పెట్టుబడి సాయం ఏమిటనేది ప్రశ్న. ఈ లెక్కన రైతుబంధు పథకం కింద  ఎన్ని నిధులు ప్రయోజనరహితంగా కొంత మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు.

గుట్టలకూ కొండలకూ రైతుబంధు (దాన్నే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) అంటోంది) ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సాధారణంగా అన్నట్లే ఉంది గానీ రైతుబంధు ఎలా దుర్వినియోగమైందనే విషయాన్ని ఆయన వ్యంగ్యంగా చెప్పారని అనుకోవచ్చు. సెలబ్రిటీలను, బడా రైతులను, తదితరులను మినహాయించి చిన్న, సన్నకారు రైతులకు, సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించగలిగితే అది తెలంగాణ సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.  

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...