Thursday, December 28, 2023

కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూత: తెలుపుపై నలుపు విజయం - Captain Vijaykanth no more: Dark Victory over white

 కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూత: తెలుపుపై నలుపు విజయం


తమిళ సినీ నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijaykanth) ఈ రోజు కన్నుమూశారు (Vijayakanth dead). అనారోగ్య సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఆయన చెన్నైలోని మియాట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కెప్టెన్‌ విజయకాంత్‌గా ప్రసిద్ధి పొందారు. ఆయన నటించిన వందో చిత్రం కెప్టెన్‌ ప్రభాకర్‌ (Captain Prbhakar) ఘన విజయం సాధించింది. దీంతో ఆప్పటి నుంచి అభిమానులు ఆయనను కెప్టెన్‌ విజయకాంత్‌గా పిలువడం ప్రారంభమైంది. తన 27 ఏళ్ల వయస్సులో సినీరంగంలోకి ప్రవేశించిన ఆయన మాస్‌ హీరోగా ఎదిగారు. 

Photo Courtesy: Thentamil

సినీ పరిశ్రమలో ఆయన విజయాన్ని తెలుపుపై నలుపు విజయంగా చెప్పవచ్చు. నలుపు రంగులో ఉండే విజయకాంత్‌ హీరోగా విశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. విజయకాంత్‌ను పవిత్ర హృదయుడైన నల్ల వజ్రంగా డికె ప్రెసిడెంట్‌ వీరమణి ప్రశంసించారు. ఆయనను గొప్ప మానవతావాదిగా కూడా అభివర్ణించారు. విజయకాంత్‌ 1979లో సినీరంగ ప్రవేశం చేశారు. 2015 వరకు అవిశ్రాంతంగా నటించారు. ఆయన మూడు షిప్టుల్లో పనిచేసేవారని చెబుతారు. విజయకాంత్‌ 150కి పైగా చిత్రాల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. దాదాపు 20 చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారు. 

విజయకాంత్‌ 1952 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగరుస్వామి. ఆయనకు భార్య ప్రేమలత (Premalatha), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లోకి డబ్‌ అయి విజయం సాధించాయి. శివప్పు మల్లి, జగిక్కొరు నీధి వంటి చిత్రాల్లో నటించారు. ఇందులో శివప్పు మల్లి ఎర్రమల్లెలు సినిమాకు రీమేక్‌. దాంతో ఆయనను పురట్చి కలైంగర్‌ అని అనడం కూడా ఉంది. పురట్చి కలైంగర్‌ అంటూ విప్లవ కళాకారుడు అని అర్థం. 

తమిళనాడు రాజకీయాల్లో కూడా విజయకాంత్‌ తన ముద్రను వేశారు. 2005లో డిఎండికె (DMDK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2006లోనూ 2011లోనూ ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 2016లో ఓటమి పాలయ్యారు. తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు. డిఎండికె స్థాపన ద్వారా ఆయన జయలలిత (Jayalalithaa), కరుణానిధి (Karuna Nidhi) వంటి రాజకీయ దిగ్గజాలకు సవాల్‌ విసిరారు. 2006లో ఆయన పార్టీ శాసనసభ ఎన్నికల్లో 8.38 శాతం ఓట్లను సాధించింది.

జయలలితకు విజయకాంత్‌తో సరైన సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆమె నాయకత్వంలోని అన్నాడియంకె డిఎండికె పార్టీతో 2011 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. శశికళ, తుగ్లక్‌ పత్రిక ఎడిటర్‌ చో రామస్వామి జయలలితను పొత్తుకు ఒప్పించారని అంటారు. ఆ ఎన్నికల్లో విజయకాంత్‌ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారింది. విజయకాంత్‌ నాయకత్వంలోని డిఎండికె పొత్తులో భాగంగా 41 సీట్లకు పోటీ చేయగా 29 స్థానాలు గెలిచింది. అన్నాడియంకె కూటమి విజయం సాధించింది. తద్వారా జయలలిత డిఎంకెను ఓడిరచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జయలలితకు, విజయకాంత్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్లాయి. విజయకాంత్‌ అన్నాడియంకెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీతో పొత్తు లేకుంటే అన్నాడియంకె అధికారంలోకి వచ్చి ఉండేది కాదని కూడా ఆయన అన్నారు. విజయకాంత్‌పై అన్నాడియంకె దాదాపు 40 పరువు నష్టం కేసులు వేసింది. వాటిని చివరకు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

విజయకాంత్‌ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. నిజానికి విజయకాంత్‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంతకు ముందు కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.

- కాసుల ప్రతాపరెడ్డి


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...