Sunday, December 10, 2023

కేసీఆర్‌ సకల రంగాల నిపుణుడు: ఈ సలహాదారుల సంత ఎందుకు?- Why KCR appointed so many advisors?

 కేసీఆర్‌ సకల రంగాల నిపుణుడు: ఈ సలహాదారుల సంత ఎందుకు?


తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వం ఏడుగురు సలహాదారుల నియమాకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర్‌ రావు (K Chandrasekhar Rao) ప్రభుత్వంలో సలహాదారుల (Government advisors) నియామకాలు పెద్ద యెత్తునే జరిగాయి. తనకు నమ్మకమైన, తనకు సహకరించిన పెద్దలను ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ వెళ్లారు. అయితే, వారి ప్రతిభను తక్కువ అంచనా వేయడం కాదు గానీ వారు ప్రభుత్వంలో ఏ విధమైన పాత్ర నిర్వహించారనేది ప్రశ్నార్థకమే. కేసీఆర్‌ వారి సేవలను వినియోగించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి.

కేసీఆర్‌ (KCR) దాదాపు 12 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నారు. వారిలో ఏడుగురి నియమాకాలన రద్దు చేస్తూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారు రాజీవ్‌ శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు). అనురాగ్‌ శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఎకే ఖాన్‌ (మైనారిటీ సంక్షేమం), జీఆర్‌ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్‌. శోభ (అటవీ సలహాదారు), సోమేష్‌ కుమార్‌ (Somesh Kumar) (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు). సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే రాజీనామా చేశారు. ఎన్నికలకు కాస్తా ముందు చెన్నమనేని రమేష్‌ను వ్యవసాయ సలహాదారుగా నియమించారు.



చెన్నమనేని రమేష్‌ (Chennamaneni Ramesh) నియామకాన్ని పరిశీలిస్తే మిగతా వారి నియామకాలు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. రమేష్‌ గతంలో వేములవాడ నుంచి బీఆర్‌ఎస్‌ శాసనసభ్యునిగా ఉన్నారు. పౌరసత్వం సమస్యతో ఆయన సతమవుతూ వచ్చారు. ఈ సమస్య కారణంగా ఆయనకు తిరిగి వేములవాడ నుంచి టికెట్‌ ఇవ్వలేదు. పౌరసత్వ సమస్య కారణంగా ఆయన వేములవాడ నుంచి పోటీ చేయలేకపోయారు. వేములవాడ బీఆర్‌ఎస్‌ టికెట్‌ వేరే నేతకు ఇచ్చే క్రమంలో చెన్నమనేని రమేష్‌ను కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మిగతా వారంతా దాదాపుగా పదవీ విరమణ చేయగానే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనవారే.

ఇక సోమేష్‌ కుమార్‌ విషయానికి వస్తే, హైకోర్టు తీర్పుతో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తనకు సముచిత స్థానం లభించలేదని ఆయన ఆవేదన చెందారు. దాంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆయనను కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సోమేష్‌ కుమార్‌పై గతంలో రేవంత్‌ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు సోమేష్‌ కుమార్‌ గండి కొట్టారని ఆరోపించారు, దరణి పోర్టల్‌ (Dharani Portal) రూపకల్పనలో సోమేష్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. వాస్తు సలహాదారును కూడా కేసీఆర్‌ నియమించుకున్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) సోదరుడు సుద్దాల సుధాకర్‌ తేజను కేసీఆర్‌ వాస్తు సలహాదారుగా నియమించారు. ఆయన పదవీకాలం ముగిసినట్లు తెలుస్తున్నది. 

సాంస్కృతిక సలహాదారుగా ఉన్న కెవీ రమణాచారి (KV Ramanachary) సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదైన శైలిని కనబరుస్తూ వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సాంస్కృతిక విధానాన్ని రూపుకల్పన చేయాల్సి ఉండిరది. అందుకు ప్రయత్నాలు జరిగిన సూచనలేవీ లేవు. 

ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైనవారిని తప్పు పట్టాల్సిన అవసరమేమీ లేదు. కానీ కేసీఆర్‌ వారి సేవలను ఏ మేరకు వాడుకున్నారనేది ప్రశ్న. వారిని ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే నిలబెట్టారనే విమర్శ ఉంది. ఉదాహరణకు మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కేసీఆర్‌ ఎస్‌కె జోషీ సలహాలు తీసుకున్నట్లు లేదు. అలాగే, నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కూడా ఆయన పాత్ర లేదని సమాచారం. మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఉన్న ఎకె ఖాన్‌ (AK Khan) రంజాన్‌, క్రిస్టమస్‌ పండుగల సందర్భాల్లో మాత్రమే కనిపించేవారు. ప్రభుత్వ సలహాదారులకు కేసీఆర్‌ ప్రభుత్వంలో అసలు ఏ విధమైన క్రియాశీలక పాత్ర లేదు. అయితే, కేసీఆర్‌ ఇంత మంది సలహాదారులను ఎందుకు నియమించుకున్నారనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. 

నిజానికి, కేసీఆర్‌ అన్ని రంగాలకు సంబంధించిన నిపుణుడిగా వ్యవహరించేవారు. అన్నీ తనకు తెలుసుననే విధంగా ఆయన వ్యవహారశైలి ఉంటూ వచ్చింది. అటువంటి సందర్భంలో విడిగా సలహాదారులు ఎందుకు అనేది ప్రశ్న. వారిని వినియోగించుకోలేనప్పుడు వారి అవసరం ఏమిటనేది కూడా ప్రశ్న. సీనియర్‌ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) సలహాదారుగా నియమించుకున్నారు. అక్కడ చేయడానికి పనేం లేదనే ఉద్దేశంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోని సలహాదారులు అలా రాజీనామాలు చేసిన సందర్భాలు  లేవు. ఏమైనా కేసీఆర్‌ ప్రభుత్వంలో సలహాదారు ప్రత్యేక సంత ఏర్పడిరది.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...