Tuesday, December 12, 2023

ఆర్కే పట్ల వైఎస్‌ జగన్‌ తీరు: చంద్రబాబు మాటలను గుర్తు చేసుకోవాల్సిందే- RK is insulted, Chandrababu words relevant

ఆర్కే పట్ల వైఎస్‌ జగన్‌ తీరు: చంద్రబాబు మాటలను గుర్తు చేసుకోవాల్సిందే


తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్‌ జగన్‌ (YS Jagan) కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. టిడిపి (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)పై పోటీ చేసి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినవాడు. అత్యంత సాధారణ జీవితం గడిపేవాడు. ఇప్పటికీ వ్యవసాయం చేసేవాడు. మంచి పేరున్నవాడు. ఆయనే ఆర్కే (RK)గా పిలుచుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డి Alla Ramakrishna Reddy). ఆయనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎందుకు శీతకన్ను వేశారనే ఆశ్చర్యపరిచే విషయమే. 

చంద్రబాబు (Chandrababu Naidu)కు వ్యతిరేకంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిత్యం పోరాడుతూ వచ్చారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు, సదావర్తి భూములు తదితర విషయాలపై చంద్రబాబుపై కేసులు వేశారు. అమరావతి అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారాలపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఆ కేసును తెలంగాణ ఎసిబీ నుంచి తప్పించి సిబిఐకి అప్పగించాలని కూడా ఆర్కే కేసు వేశారు. ఆయన వేసిన కేసులు, చేసిన ఫిర్యాదుల కారణంగానే చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. వాటిని ఆధారం చేసుకునే చంద్రబాబుపై కేసులు పెట్టి, జైలుకు పంపించారు. అంతగా సహకరించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని జగన్‌ పక్కన పెట్టడమేమిటనే ప్రశ్న ఉదయిస్తున్నది.



రెండు దఫాలు ఎమ్యెల్యేగా పనిచేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైఎస్‌ జగన్‌ పొగ పెట్టారని అంటున్నారు. పొమ్మనలేక పొగపెట్టడమేనని కూడా భావించవచ్చు. మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసిపిలో ఓ వ్యతిరేక వర్గం తయారైంది. గంజి చిరంజీవి Ganji Chiranjeevi)కి ప్రాధాన్యం పెరిగింది. టిడిపిలో ఉన్న గంజి చిరంజీవిని వైసిపిలోకి తెచ్చింది కూడా ఆర్కేనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత గంజి చిరంజీవి వైసిపిలో చేరారు. మంగళగిరి నుంచి తానే పోటీ చేస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు కూడా. ఆయనను మంగళగిరి పార్టీ ఇంచార్జీగా నియమించారు. ఆప్కో చైర్మన్‌ కూడా ఆయనే. ఆర్కేను సంప్రదించకుండా వేమారెడ్డిని మంగళగిరి ` తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ పరిణామాలతో ఆర్కే తీవ్రంగా కలత చెందారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. 

ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2019లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్‌ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో కూడా ఆయనను జగన్‌ పక్కన పెట్టారు. సామాజిక సమీకరణాల్లో ఆర్కేకు మంత్రి పదవి ఇవ్వడం కుదరలేదని పార్టీ నాయకులు ఇప్పుడు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం, ముఖ్యంగా జగన్‌ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర అసంతృప్తికి గురైన ఆర్కే గడప గడపకు సమీక్షా కార్యక్రమాలకు హాజరు కాలేదు. తన కుమారుడి వివాహానికి ఆర్కే జగన్‌ను ఆహ్వానించలేదు. దీన్నిబట్టి ఆర్కే ఎంతగా కలత చెందారో అర్థం చేసుకోవచ్చు. 

ఆర్కేను జగన్‌ పక్కన పెట్టడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna ReddY), పార్టీ ఎంపి అయోధ్యారెడ్డి సమర్థిస్తున్నారు. మంగళగిరి (Mangalagiri) సీటు బీసీలకు, ముఖ్యంగా పద్మశాలీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అయోధ్యారెడ్డి (Ayodhya Reddy) చెప్పారు. ఆళ్లకు సముచిత స్థానం కల్పిస్తామని సజ్జల చెప్పారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి పోటీకి దించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. మంగళగిరిలో పద్మశాలీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. గంజి చిరంజీవిని ఎంపిక చేయడం వెనక ప్రధాన కారణం అదేనని చెప్పవచ్చు. 

అయితే, పార్టీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆళ్లతో మాట్లాడాల్సి ఉండిరది. ఆయనతో ఎవరైనా మాట్లాడారా, ఆయనకు నచ్చజెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేశారా, ఆయనకు పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ కల్పించే స్థానంపై హామీ ఇచ్చారా తెలియదు. జగన్‌ చాలా విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడుతారు. అందువల్లనే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పట్ల ఏకపక్షంగా వ్యవహరించారని భావించవచ్చు. కానీ రాజకీయాల్లో ఇటువంటి వ్యవహారాలు దెబ్బ తీస్తాయి. తెలంగాణ కేసీఆర్‌ ఎదుర్కున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. జగన్‌కు కూడా ఆ పరిస్థితి వస్తుందా, రాదా అనేది ఇప్పుడే అంచనా వేయలేం. ఆయితే, చంద్రబాబు మాటలను మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అహంకారంతో వెళ్తే తెలంగాణలో ఏమైందో చూశామని ఆయన అన్నారు.

- కాసుల ప్రతాపరెడ్డి

1 comment:

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...