Tuesday, December 12, 2023

కేసీఆర్‌ తప్పుల్లో ఇదొకటి: టిఎస్‌పిఎస్‌సీ చైర్మన్‌ రాజీనామాలో ట్విస్ట్‌ - KCR failure in TSPSC exams, Janardhan Reddy resigned

 కేసీఆర్‌ తప్పుల్లో ఇదొకటి: టిఎస్‌పిఎస్‌సీ చైర్మన్‌ రాజీనామాలో ట్విస్ట్‌


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రధానంగా మూడు అంశాలపై జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆ మూడు అంశాలను ప్రధానం చేసుకుని, ఈ రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఉద్యమం ఎగిసిపడిరది. నీళ్లు, నిధుల మాట అలా ఉంచితే, నియామకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. తెలంగాణ నిరుద్యోగ యువత ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి) నియామకాలపై పెద్దగా ఆశ పెట్టుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఆ ఆశలను గల్లంతు చేసింది. టిఎస్‌పిఎస్‌సీ (TSPSC) పరీక్షల నిర్వహణకు సిద్ధపడి నోటిఫికేషన్లు జారీ చేసి తర్వాత ఏదో ఒక అవాంతరం వచ్చి పడిరది. పరీక్షల నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి వ్యవహరించిన తీరును తప్పు పడుతూ కొందరు కోర్టుకు ఎక్కడం, పరీక్షలు వాయిదా పడుతూ రావడం ఆనవాయితీగా వచ్చింది. చివరకు ప్రశ్న పత్రాల లీకేజీ (TSPSC question papers leakage) వ్వవహారం పెద్ద దెబ్బ వేసింది.



లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులకు టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఉద్యోగాలు (Jobs) కల్పించడం అసాధ్యమని, వాటిపైనే యువత ఆశలు పెట్టుకోవడం సరి కాదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తూ వచ్చాయి. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పదేళ్ల కాలంలో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు (TSPSC exams) కొన్నయినా సక్రమంగా నిర్వహించి వుంటే ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత ఏర్పడి ఉండేది కాదనే ఇంగితాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించింది. ప్రైవేట్‌ రంగంలో యువతకు ఏ విధమైన ఉద్యోగావకాశాలు కల్పించారనే విషయంపై స్పష్టత లేదు. కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ అధికారం కోల్పోవడానికి యువతలో పేరుకుపోయిన నిరాశ కూడా ఓ కారణం. తమ కాంగ్రెస్‌ పార్టీ విజయం వెనుక 30 లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల ఉందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. 

ఆ కారణంగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) టిఎస్‌పిఎస్‌సీ ప్రక్షాళణపై దృష్టి పెట్టారు. టిఎస్‌పిఎస్‌సీపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను రీషెడ్యూల చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ (Job Calender)కు అనుగుణంగా వాటిని ప్రభుత్వం షెడ్యూల్‌ చేయనుంది. రేవంత్‌ రెడ్డి సమీక్షకు పూనుకోవడానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ బి. జనార్దన్‌ రెడ్డి (B Janardhan Reddy) రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదించలేదు. ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యులెవరో తేల్చే వరకు రాజీనామాను ఆమోదించేది లేదని ఆమె తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఆమె సంబంధిత శాఖకు ఓ లేఖ కూడా రాశారు. నిజానికి బి. జనార్దన్‌ రెడ్డికి మంచి పేరు ఉంది. కానీ, ఆయన హయాంలో ప్రశ్న పత్రాల లీకేజీ జరగడం విచిత్రంగానే ఉంది.

గ్రూప్‌`1 ప్రిలిమనరీ (Group-1 preliminary), అసిస్టెంట్‌ ఇంజనీంర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. దాంతో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఈ కేసులో వంద మందికిపైగా అరెస్టయ్యారు. ఒక చైన్‌లాగా లీకయిన ప్రశ్న పత్రాలు ఒకరి నుంచి ఒకరికి అమ్ముడవుతూ వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌ `1 ప్రిలిమనరీ పరీక్ష కూడా రద్దయింది. పరీక్ష నిర్వహణలో ఘోరమైన వైఫల్యం కారణంగా ఆ పరీక్షన తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. 

ప్రశ్న పత్రాల లీకేజీలో ప్రభుత్వ బాధ్యత ఉండదనే వాదన వినిపించింది. అది టిఎస్‌పిఎస్‌సీ వైఫల్యమే తప్ప ప్రభుత్వ వైఫల్యం కాదనేది ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన వాదన. అందులోని సాంకేతిక అంశం ఏమైనప్పటికీ ప్రభుత్వం మీదనే దాని ప్రభావం పడుతుందనే కనీస విషయాన్ని కూడా పట్టించుకోలేదు. పదేళ్ల కాలంలో ఆ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వ నిస్సహాయత స్పష్టంగానే కనబడుతున్నది. ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్‌ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పట్టించుకోలేదు. దాని ఫలితం బీఆర్‌ఎస్‌ అనుభవించింది.


- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...