Thursday, December 14, 2023

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు ఇదే... Telangana CM Revanth Reddy's team

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు ఇదే...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) తన కార్యాలయంలో సమర్థులైన అధికారులను నియమించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వి. శేషాద్రి (V. Seshadri) కార్యదర్శిగా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో చేరారు. తన కార్యాలయంలో మరింత మంది అధికారులను నియమించుకునేందుకు రేవంత్‌ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. రెండు, మూడు రోజుల్లో సిఎంఓలో చేరే అధికారులు ఖరారయ్యే అవకాశం ఉంది. 



శేషాద్రికి జనవరిలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. క్యాడర్‌, సీనియారిటీ సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు ప్రమోషన్‌ ఇవ్వనున్నారు. 2003 బ్యాచ్‌ ఆఫీసర్‌ లోకేష్‌ కుమార్‌ (Lokesh Kumar)ను సిఎంఓలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమకు సమాచారం ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది. ప్రస్తుతం ఆయన భారత ఎన్నికల కమీషన్‌ (ECI))లో అదనపు సిఈవోగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో నాలుగేళ్ల పాటు జిహెచ్‌ఎంసి (GHMC) కమీషనర్‌గా పనిచేశారు. 

2010 బ్యాచ్‌ ఆఫీసర్‌ ఆమ్రపాలి (Amrapali) ని కూడా రేవంత్‌ రెడ్డి సిఎంవోలో నియమించుకునే అవకాశం ఉంది. ఆమె అక్టోబర్‌ వరకు ప్రధాని కార్యాలయం (పిఎంవో)లో డిప్యూటీ సెక్రటరిగా పనిచేశారు. మూడేళ్ల పాటు కేంద్రంలో డిప్యూటేషన్‌ మీద పనిచేసిన తర్వాత ఆమె తెలంగాణకు వచ్చేశారు. ఆమె ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఆమె సిఎంఓలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మల్టీజోన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సహనవాజ్‌ను రేవంత్‌ రెడ్డి తన కార్యదర్శిగా నియమించుకున్నారు. గతంలో ఆయన మైనారిటీ సంక్షేమ శాఖ కమీషనర్‌గా పనిచేశారు. మూడేళ్లకు పైగా వక్ఫ్‌ బోర్డు (Wakf Board) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. వక్ఫ్‌ బోర్డు అస్తులను పరిరక్షించడానికి ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. సిఇవోగా ఆయనను తొలగిస్తూ, కొత్త సిఈవోను నియమిస్తూ వక్ఫ్‌ బోర్డు తీర్మానం చేసింది.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం... బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను కూడా రేవంత్‌ రెడ్డి తన జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోడ్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ దానకిశోర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖకు వెళ్లే అవకాశం ఉంది. 1992 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి సంజయ్‌ జాజు ఐటి, పరిశ్రమల శాఖలో జయేష్‌ రంజన్‌ స్థానంలో నియమితులయ్యే అవకాశం ఉంది. 

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...