Friday, December 15, 2023

కేసీఆర్‌కు చేదు అనుభవం: వైఎస్‌ జగన్‌ సీరియస్‌ కసరత్తు - YS Jagan takes corrective measures after KCR failure

 కేసీఆర్‌కు చేదు అనుభవం: వైఎస్‌ జగన్‌ సీరియస్‌ కసరత్తు


కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (Andhra Pradesh assembly Elections 2023)కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) అనుభవాన్ని దృష్టిలో పెట్టుకని ఆయన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించినట్లు అర్థమవుతున్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana assembly election results 2023) కేసీఆర్‌ చేసిన పొరపాటు తాను చేయకూడదని జగన్‌ అనుకుంటున్నట్లు అర్థమవుతున్నది. పనితీరు బాగాలేని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను మార్చేందుకు వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు.



తెలంగాణలో దాదాపు 40 మంది సిట్టింగ్‌ ఎమ్యెల్యేల పనితీరు బాగా లేదని, వారిని మారిస్తే విజయావకాశాలు మెరుగుపడుతాయని కేసీఆర్‌ తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలినట్లు చెబుతారు. అయితే, కేసీఆర్‌ అందుకు సిద్ధపడలేదు. అతి విశ్వాసంతో వెళ్లారు. బీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణాల్లో అది ఒకటి. సిట్టింగ్‌లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచి ఉండేదనే వాదన బలంగానే ఉంది. సిట్టింగులను మార్చి కొత్తవారికి టికెట్లు ఇచ్చిన చోట్ల బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి (Palla Rejeswar Reddy), స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి విజయం సాధించడాన్ని ఉదాహరణగా చూపవచ్చు.

పొరుగు రాష్ట్రం పరిణామాలతో తమకు సంబంధం లేదని, రాష్ట్రంలోని 175 సీట్లను గెలుచుకునే లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని వైసీపి నేత సుబ్బారెడ్డి అన్నారు. కొన్ని చోట్ల సిట్టింగు ఎమ్యెల్యేలను మార్చక తప్పదని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గం టికెట్‌ను గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy)కి టికెట్‌ నిరాకరిస్తున్నారు. ఆ దిశలో నియోజకవర్గాల ఇంచార్జీలను జగన్‌ మారుస్తున్నారు. గాజువాక (Gajuwaka)లో నియోజకవర్గం ఇంచార్జీని మార్చారు. దీన్ని బట్టి ఎమ్యెల్యే నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కదని అర్థమవుతున్నది. గత ఎన్నికల్లో ఆయన జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై విజయం సాధించారు. గాజువాక ఇంచార్జీగా ఆయన కుమారుడు దేవన్‌ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. దేవన్‌ రెడ్డి స్థానంలో కొత్త ఇంచార్జీని నియమించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన దేవన్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించింది. దాంతో వెనక్కి తగ్గారు. ఆయనకు ఏ విధమైన హామీలు ఇచ్చారనేది తెలియదు.

ఇప్పటికే దాదాపు 11 నియోజకవర్గాల ఇంచార్జీలను వైసీపి నాయకత్వం మార్చింది. మరిన్ని నియోజకవర్గాల ఇంచార్జీలను కూడా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. దాదాపు 65 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వైసీపి నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అభ్యర్థుల మార్పు ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్నికలు సమీపించిన తర్వాత సాధారణంగా ఫిరాయింపులు ఉంటాయి. తెలుగుదేశం (TDP), జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. టిడిపి, జనసేన పొత్తు కనీసం పదేళ్ల పాటు కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జగన్‌ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పదేళ్లు పడుతుందని ఆయన అన్నారు. టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడకపోయినా తాను సీట్ల సర్దుబాటులో టిడిపి ఇబ్బంది లేకుండా చూస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. 

అధికారికంగా బిజెపి (BJP)తో టిడిపి పొత్తు లేకపోయినప్పటికీ మూడు పార్టీలు ఓ కూటమిగానే జగన్‌ను ఎదుర్కుంటాయని అర్థమవుతున్నది. జనసేన, టిడిపి మధ్య అధికారికంగా పొత్తు ఉంది. బిజెపిని తన దారిలోకి తేవడానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి (daggubati Purandheswari) నియామకం అందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. 

- కాసుల ప్రతాపరెడ్డి 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...