Thursday, December 7, 2023

ఇదేం తెలంగాణ సంప్రదాయం: ముఖం చాటేసిన కేసీఆర్‌ - KCR attitude towards Revanth Reddy deplored

ఇదేం తెలంగాణ సంప్రదాయం: ముఖం చాటేసిన కేసీఆర్‌


తెలంగాణ సంప్రదాయం గురించి, మర్యాదమన్ననల గురించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కె. చంద్రశేఖర రావు (K Chandrasekhar Rao) చాలా మాట్లాడుతుండేవారు. అయితే, ఆయనే దాన్ని పాటించకపోవడం విచిత్రమే కాదు, ఆయన అహంకారపూరిత వైఖరిని తెలియజేస్తున్నది. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌ (KCR) హుందాగా వ్యవహరించలేకపోయారు. కనీస మర్యాదను కూడా పాటించలేదు. ప్రజలకు ముఖం చాటేశారు. ఆయన కుమారుడు కెటీఆర్‌ (KTR) మాట్లాడారు. ఓటమిని అంగీకరిస్తూ ఆయన ఓ ప్రకటన చేశారు. కానీ కేసీఆర్‌ మాత్రం అత్యంత అమర్యాదకరంగా వ్యవహరించారు.



బీఆర్‌ఎస్‌ ఓడిపోయి, కాంగ్రెస్‌ విజయం సాధించగానే కేసీఆర్‌ తన రాజీనామా లేఖను దూత ద్వారా గవర్నర్‌ తమిళిసైకి పంపించారు. చివరగా గవర్నర్‌ను కలవాలనే మర్యాదను ఆయన పాటించలేకపోయారు. ఆ తర్వాత వెంటనే ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. పదేండ్ల పాటు తనకు అధికారం చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేయలేదు. విజయం సాధించిన కాంగ్రెస్‌కు నోటిమాటగానైనా శుభాకాంక్షలు తెలియజేయలేదు. బహుశా, రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మీసం మెలేసి, సవాల్‌ విసిరిన దృశ్యమే కేసీఆర్‌ మదిలో మెదిలి ఉంటుంది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఉంటే కేసీఆర్‌ గౌరవం ఇనుమడిరచి ఉండేది. ఆయన ఆ పని చేయకపోవడం వింతగానే ఉంది. ఫామ్‌హౌస్‌కు వచ్చినవారిని మాత్రం కేసీఆర్‌ కలుస్తున్నారు.

రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడం కేటీఆర్‌కు ఇష్టం లేనట్లు అనిపిస్తున్నది. ఏమైనా కేసీఆర్‌ వ్యవహరించిన తీరు మాత్రం తెలంగాణ ప్రజలను కూడా అవమానించడమే. ప్రజల తీర్పు పట్ల ఆయన కినుక వహించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి సహకరిస్తానని కూడా చెప్పారు. మోడీ మాదిరిగా హుందాతనాన్ని కేసీఆర్‌ ప్రదర్శించలేకపోయారు. కాంగ్రెస్‌ తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ మోడీ మర్యాద పాటించి గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. రేవంత్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సోదరభావం సాగుతుందని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. రేవంత్‌ రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, టిడీపి (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఎమ్యెల్యే బాలకృష్ణ (Balakrishna) కూడా రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

-  కాసుల ప్రతాపరెడ్డి 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...