Thursday, December 7, 2023

మార్పు ప్రారంభమైంది: కంచెలు తొలిగాయి - Revanth Reddy as CM: Change begins in Telangana

 మార్పు ప్రారంభమైంది: కంచెలు తొలిగాయి


ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మార్పు ప్రారంభమైంది. కంచెలు ఒక్కొటొక్కటే తొలుగుతున్నాయి. ప్రగతిభవన్‌ ఇనుపకంచెలను బద్దలు కొట్టారు. దానికి జోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా నామకరణం చేశారు. సచివాలయం లోనికి వెళ్లడానికి కూడా మార్గం సుగమమైంది. జర్నలిస్టులను కూడా లోనికి అనుమతించని విధానం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు స్వేచ్ఛగా సచివాలయానికి వెళ్లడానికి వీలు ఏర్పడిరది. ఎప్పుడో గానీ ముఖ్యమంత్రి సచివాలయంలోకి అడుగు పెట్టేవారు కాదు, ఇప్పుడు పాలన సచివాలయం నుంచే జరగనుంది.



ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము పాలకులం కాదు, సేవకులమని ప్రకటించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు నీరజకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇదంతా జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క (Seethakka), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌ బాబు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. హోం శాఖను ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, మున్సిపల్‌ శాఖను కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy)కి, ఆర్థిక శాఖను శ్రీధర్‌ బాబుకు, నీటిపారుదల శాఖను పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి, మహిళా సంక్షేమ శాఖను కొండా సురేఖకు, రెవెన్యూ శాఖను భట్టి విక్రమార్కకు, వైద్య ఆరోగ్య శాఖను దామోదర రాజనరసింహకు, పౌర సరఫరాల శాఖను జూపల్లి కృష్ణా రావుకు, బీసీ సంక్షేమ శాఖను పొన్నం ప్రభాకర్‌కు, గిరిజన సంక్షేమ శాఖను సీతక్కకు, రోడ్లు భవనాల శాఖను తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించారు.

రేవంత్‌ రెడ్డి చాలా వేగంగా మార్పునకు శ్రీకారం చుట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపు ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ (Praja Darbar) నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ప్రజలు తమ అభిప్రాయాలను అక్కడ తెలియజేయడానికి వీలు కల్పించారు. ప్రజలకు ఈ రోజు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఆయన అన్నారు. తన తొలి ప్రసంగంలో తన పాలన ఎలా ఉండబోతుందనే సూచన ఇచ్చారు.



ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుపకంచెలను గ్యాస్‌ కట్టర్లతో తొలగించారు. రోడ్డు పక్కన ఉన్న షెడ్డును, గ్రిల్స్‌ను తొలగించారు. ప్రజాస్వామ్యబద్దమైన పాలన ఉంటుందని చెప్పడానికి దీన్ని సంకేతంగా తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధారణ ప్రజానీకం సరే, మంత్రులకూ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండేవారు కాదు. ఎవరైనా కలుసుకోవాలంటే సాధ్యమయ్యేది కాదు. విన్నపాలు చేసుకోవడానికి ప్రభుత్వంలో ఒక మార్గమంటూ లేకుండాపోయింది. తాను చేసేదే చేస్తా, చెప్పేదే చెప్తా అనే పద్ధతిలో వ్యవహరిస్తూ వచ్చారు. గడీల పాలనగా కేసీఆర్‌ పాలన పేరు పొందింది. దాన్ని బద్దలు కొడుతానని రేవంత్‌ రెడ్డి చెబుతూ వచ్చారు. అదే పని ఆయన చేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతున్నది. 

రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌, ఎఐసీసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు హాజరయ్యారు. ఇంటలిజెన్స్‌ ఐజీగా బి. శశిధర్‌ రెడ్డి నియమితులయ్యారు. సిఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియమితులయ్యారు.

- కాసుల ప్రతాపరెడ్డి


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...