Thursday, December 7, 2023

అవమానాలు మోయలేదీ తెలంగాణ: అందుకే కేసీఆర్‌కు పరాభవం - Telangana results revenge for KCR Insults

 అవమానాలు మోయలేదీ తెలంగాణ: అందుకే కేసీఆర్‌కు పరాభవం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం (Telangana Movement)లో ప్రధానాంశం ఆత్మగౌరవం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తామంతా ఆత్మగౌరవంతో జీవిస్తామని ప్రజలు ఆశించారు. ఇది సామాన్య ప్రజానీకానికి మాత్రమే కాదు, కేసీఆర్‌ (KCR) పార్టీ బీఆర్‌ఎస్‌ (BRS) నేతల ఆత్మగౌరవం కూడా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరులో కొన్ని అహంభావ లక్షణాలున్నా ప్రజలు సర్దుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రదర్శించిన అహంభావం ఎదురు తిరిగింది. తమకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా చాటుకున్నారు. అదే ప్రధానంగా కేసీఆర్‌ను దెబ్బ తీసింది. 

తెలంగాణ ఉద్యమంలో తొలిసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భువనగిరి ప్రాంతంలో ఎంపిటీసి, జడ్‌పిటీసి ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ చాలా సీట్లు గెలుచుకుంది. అలా గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న మేధావులను, ప్రభావశీలురను కూడా అవమానించారు. ఈ విషయంపై బియ్యాల జనార్దన్‌ రావు (Biyyala Janardhan Rao) ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పటి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం తలకెక్కి ప్రజలను ఆవమానించడం ప్రారంభించారు, వారిని వేధించడం మొదలు పెట్టారు. క్షేత్ర పరిశోధన చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.



తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌ కూడా అదే పంథా అనుసరించారు. ఆయన తనయుడు కేటీఆర్‌ (KTR) ఏమీ తీసిపోలేదు. బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఇదే అయింది. మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి అందుకే పార్టీని వీడారు. తన పట్ల కేటీఆర్‌ అనుసరించిన వైఖరికి ఆయన తీవ్రమైన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే, కొండా విశ్వేశ్వర రెడ్డి (Konda Visweshwar Reddy)తో ఏమవుతుందిలే అని కేసీఆర్‌కు గానీ కేటీఆర్‌కు గానీ అనుకుని ఉండవచ్చు. కానీ, అది పెరిగి పెరిగి పెద్దదై ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపించింది.

కామారెడ్డి (Kamareddy) నుంచి బిజెపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) అన్న మాటలను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు ఆయన బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. వెంకటరమణారెడ్డి ఎవరో తెలియదన్నట్లుగా కేటీఆర్‌ ఆయనెవరో ఉన్నాడు కదా అనే పద్ధతిలో మాట్లాడారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వెంకటరమణారెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌ జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా చేస్తానని చెప్పారు. వెంకటరమణా రెడ్డి అదే చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిరచారు.

సీనియర్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswar Rao) ఉదంతాలను కూడా గుర్తు చేసుకోవాలి. వారు బీఆర్‌ఎస్‌ నుంచి ఎందుకు వెళ్లిపోయారనే విషయాన్ని గమనిస్తే అది స్పష్టంగానే అర్థమవుతుంది. కేవలం ఆత్మగౌరవం కోసం వారు పార్టీని వీడారు. తుమ్మల నాగేశ్వర రావు పట్ల కేసీఆర్‌, పొంగులేటి పట్ల కేటీఆర్‌ వ్యవహరించిన తీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ను చావుదెబ్బ తీసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాలుగైదు సీట్లలో ప్రభావం చూపగలరని తెలిసినా కేటీఆర్‌ ఆయనను అవమానించారు. 

తెలంగాణ ప్రజలకు తాము తప్ప మరో గతిలేదనే పద్ధతిలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు (KCR Family) వ్యవహరించారు. నాయకులను, మేధావులను, కళాకారులను ఒక్కరొక్కరినే వారు దూరం చేసుకున్నారు. చివరకు ప్రజలను కూడా దూరం చేసుకున్నారు. ఇది కేసీఆర్‌, కేటీఆర్‌లకు మాత్రమే వర్తించదు, వారి ప్రాపకంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరి ప్రాపకంతో స్థానిక ప్రజా ప్రతినిధులు అహంకారపూరితంగా, అందరినీ దూరం చేసుకుంటూ వెళ్లారు. దాని ఫలితాన్ని అనుభవించారు. 

పెద్దగా ఆర్భాటాలు చేయని, అహంకార ప్రదర్శన చేయని బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ప్రజలు తిరిగి గెలిపించారు. దీన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. 

-కాసుల ప్రతాపరెడ్డి

3 comments:

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...