Wednesday, December 6, 2023

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు ఇవీ... Reasons behind selecting Revanth Reddy as Telangana CM

 ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు ఇవీ...


తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు అంటే 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM)గా రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేయడం వెనుక పలు ఆసక్తిరమైన అంశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన కన్నా సీనియర్లు, వయస్సులో ఆయన పెద్దవాళ్లు పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ రేవంత్‌ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సిఎల్‌పి నేతగా రేవంత్‌ రెడ్డి ఎంపికైనట్లు ప్రకటన చేసిన సందర్భంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ (KC Venugopal) ఓ మాట అన్నారు. రేవంత్‌ రెడ్డిని డైనమిక్‌ లీడర్‌గా అభివర్ణించారు. ఆయన కన్నా పార్టీలో సీనియర్లు, వయస్సులో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అది ప్రధాన కారణం. 



నిజానికి, 2014లోనే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సి ఉండిరదనేది రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఇతర సీనియర్‌ నాయకులు అనుకుంటున్నారు. ఈ స్థితిలో రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వచ్చి, తెలంగాణ పిసిసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఓ ఊపును తీసుకుని వచ్చారు. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం వెనక 2024లో జరిగే లోకసభ ఎన్నికలను Lok Sabha Elections 2024) దృష్టిలో పెట్టుకోవడం ఉంది.

నిజానికి రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ధైర్యంతో కూడుకున్న పనే. రేవంత్‌ రెడ్డి 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2021లో పిసీసీ అధ్యక్షుడయ్యారు. ఇలా చూస్తే పార్టీలో ఆయన జూనియర్‌. అయితే, పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన దూకుడు ప్రదర్శించారు. అంతే కాకుండా సీనియర్లతో వ్యవహరించిన తీరు కూడా ప్రశంసణీయంగా ఉంది. సీనియర్లతో ఆయన తన సంబంధాలను మెరుగుపరుచుకుంటూ వచ్చారు. నిజానికి, దాదాపు 8 నెలల క్రితమే ఆయన ఈ పని ప్రారంభించారు. 

ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకుని వచ్చిన విషయంలో ఆయన చూపిన చొరవ, ప్రదర్శించిన దూకుడు పార్టీకి కలిసి వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి హనుమంతరావు బిజెపిలోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ, దానికి బ్రేకులు పడిన వెంటనే రేవంత్‌ రెడ్డి చురుగ్గా వ్యవహరించారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడంతో కాంగ్రెస్‌ అంచనాలు పెరిగాయి. కాంగ్రెస్‌ పట్ల ఓ సానుకూల వాతావరణం ఏర్పడిరది. 

బీఆర్‌ఎస్‌ నేత మైనంపల్లి హనుమంతరావును పార్టీలోకి తేవడం కూడా రేవంత్‌ రెడ్డి నాయకత్వ లక్షణాన్ని బయటపెట్టింది. తన కుమారుడు రోహిత్‌ రావుకు, తనకు కూడా అసెంబ్లీ స్థానాలు కావాలని మైనంపల్లి పెట్టిన డిమాండ్‌కు అంగీకరించడమే కాకుండా అందుకు అధిష్టానాన్ని ఒప్పించారు. అయితే మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయినప్పటికీ ఆయన కుమారుడు విజయం సాధించారు. అదే వేరే విషయం. మైనంపల్లి హనుమంతరావు రావడం కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చింది. 

కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత పలు ఊహాగానాలు చెలరేగాయి. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం దక్కదనే ప్రచారం సాగింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy), మల్లుభట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌ బాబు వంటి సీనియర్లు ఆయనకు అడ్డం పడుతారని భావించారు. దానివల్ల కాంగ్రెస్‌ అంటే ప్రజల్లో వ్యతిరేక భావన ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ వ్యవహారం అంతా అందుకు భిన్నంగా జరిగింది.

హైదరాబాదులో ఎల్లా హోటల్‌లో ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. డికె శివకుమార్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. 20 నుంచి 25 మంది రేవంత్‌ రెడ్డి పేరు సూచించినట్లు తెలుస్తున్నది. మరో 15 నుంచి 20 మంది అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. నలుగురైదుగురు మాత్రమే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, భట్టికి మద్దతు పలికారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో డికె శివకుమార్‌ అధిష్టానానికి ఓ నివేదిక సమర్పించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, మల్లుభట్టి విక్రమార్కను హస్తినకు పలిపించుకుని మాట్లాడారు. వారికి నచ్చ జెప్పారు. దళిత ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించాలనే వాదనకు బలం ఉన్నప్పటికీ అంతగా దూకుడు చూపలేని, చొరవ ప్రదర్శింలేని ఆయనకు అవకాశం ఇవ్వడం అధిష్టానానికి ఇష్టం లేదు. అలాగే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా. ఆయన చాలాకాలం పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, ఆయన పార్టీ శ్రేణులను కదలించడంలో, వారికి విశ్వాసం కలుగజేయడంలో విఫలమయ్యారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు వంటి సీనియర్లకు తగిన గౌరవం ఉండేలా రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తారనే ప్రాతిపదికను అధిష్టానం తయారు చేసింది. వారికి ఆ నమ్మకం కలిగించింది. ప్రభుత్వం వన్‌ మ్యాన్‌ షో కాదని, జట్టుగా ముందుకు సాగుతుందని కేసీ వేణుగోపాల్‌ చెప్పడంలోని ఆంతర్యం అదే. ఏమైనా రేవంత్‌ రెడ్డికి అన్నీ కలిసి రావడమే కాకుండా గమ్యం చేరుకోవగానికి పట్టుదలతో పనిచేశారు. పార్టీలో ఎవరినీ నొప్పించకుండా వ్యవహరించారు. తగిన బలాన్ని పార్టీకి సమకూర్చి పెట్టారు.

- కాసుల ప్రతాపరెడ్డి

1 comment:

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...