Monday, December 18, 2023

కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల: ఏపి రాజకీయాల్లోకి అడుగు, వైఎస్‌ జగన్‌ టార్గెట్‌? - YS Sharmila may challenge YS Jagan in AP assembly elections from Congress

 కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల: ఏపి రాజకీయాల్లోకి అడుగు, వైఎస్‌ జగన్‌ టార్గెట్‌?


వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్‌ జగన్‌ (YS Jagan) సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. వచ్చే ఏడాది జనవరిలో ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని అంటున్నారు. కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) ఆమె కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు నగరాల్లో జరిగే ప్రచార సభల్లో ఆమె పాల్గొంటారని చెబుతున్నారు. విశాఖపట్నం (Viasakhapatnam), విజయవాడ (Vijayawada) నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఆమెతో పాటు ప్రియాంక గాంధీ (priyanka Gandhi) కూడా ఈ సభల్లో పాలు పంచుకుంటారు. 



తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతుగా వైఎస్‌ షర్మిల పోటీ నుంచి తప్పుకున్నారు. పాలేరు నుంచి ఆమె శాసనసభకు పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాల కారణంగా ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు (Telangana Assembly Elections 2023) ముగిసి, తమ ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్‌ పెద్దలు షర్మిలతో చర్చలను పునరుద్ధరించారు. ఏపి ఎన్నికల ప్రచార సభల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను షర్మిల ఎదుర్కుంటారా చూడాలి. ఆయన ప్రభుత్వంపై ఆమె ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరమైన విషయం. 

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే సంభవించే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తుడిచిపెట్టుకుని పోయింది. పార్టీకి జవజీవాలు పోసే నాయకులు లేకుండా పోయారు. కాంగ్రెస్‌ స్థానాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆక్రమించి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీకి విజయం చేకూర్చి పెట్టడానికి వైఎస్‌ జగన్‌ అన్ని హంగులూ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

వచ్చే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపి (TDP), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం చర్చలు కూడా సాగుతున్నాయి. ఆదివారంనాడు చంద్రబాబు నాయుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలతో బిజెపి (BJP) కలిసి వస్తుందా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటివరకైతే కాంగ్రెస్‌ పార్టీ ఊసులోనే లేదు. కానీ, షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) వేలు పెడితే మాత్రం పరిస్థితులు మారుతాయి. కాంగ్రెస్‌ పార్టీ చర్చలోకి వస్తుంది. కాంగ్రెస్‌ నాయకుల్లోనూ శ్రేణుల్లోనూ ఉత్సాహం చోటు చేసుకుంటుంది. 

ఆంధ్ర ప్రాంతంలోని రెండు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొనడానికి సిద్ధపడినట్లు తెలిసింది. రాయలసీమ (Rayalaseema)లో కూడా ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పెద్దలు ఆమెను అడుగుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె అందుకు నిరాకరిస్తున్నారు. రాయలసీమలో తన సోదరుడు వైఎస్‌ జగన్‌కు నష్టం చేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల ప్రవేశం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం చేస్తుందనేది ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురిగా వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తన పాత్ర నిర్వహిస్తారు. దాని వల్ల వైఎస్‌ జగన్‌కు ఏ మేరకు నష్టం జరుగుతుందనేది చూడాల్సిందే. కాగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జనసేన, టిడిపి కూటమిని దెబ్బ తీస్తుందా అనేది కూడా చూడాల్సిందే. రాయలసీమ ప్రాంతం జగన్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆమె రాయలసీమలో రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేరు. దానివల్ల కాంగ్రెస్‌లోకి ఆమె రావడం ద్వారా ప్రతిపక్షాల ఓట్లు చీల్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఏమైనా ఆ విషయాలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేం.

ఇకపోతే, వైఎస్‌ షర్మిలను ఎఐసిసి (AICC) ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయి. ఆమెను పార్లమెంటుకు పంపించాలని కూడా కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం సీటు నుంచి ఆమెను పోటీ దించాలా, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలా అనే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- కాసుల ప్రతాపరెడ్డి


No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...