Wednesday, December 20, 2023

చంద్రబాబు, కేసీఆర్‌ ఒక్కటే: అందుకే వారిద్దరికీ అదే చేదు అనుభవం - KCR, Chandrababu same to same in Telangana and AP

 చంద్రబాబు, కేసీఆర్‌ ఒక్కటే: అందుకే వారిద్దరికీ అదే చేదు అనుభవం


తెలంగాణ రాష్ట్రంలో (Telangana state) కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ (BRS) ఓటమి పాలు కావడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని టిడిపి (TDP) పరాజయం పాలు కావడానికి కారణం ఒక్కటే అనిపిస్తుంది. వారిద్దరి పాలనలో ఉన్న సారూప్యత ఉంది. వారి రాజకీయ వ్యక్తిత్వంలోనూ సారూప్యత ఉంది. బీఆర్‌ఎస్‌, టిడిపి రెండు కూడా ప్రాంతీయ పార్టీలే. రాష్ట్ర విభజన తర్వాత టిడిపిని చంద్రబాబు జాతీయ పార్టీగా చెప్పిన్పటికీ అది ప్రాంతీయ పార్టీగానే పరిగణనలోకి వస్తుంది. తెలంగాణలో కూడా టిడిపి ఉంది కాబట్టి పేరుకు అది జాతీయ పార్టీ అవుతుంది. కానీ, దానికి ప్రాంతీయ పార్టీ లక్షణాలు పోలేదు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి ప్రాధాన్యంతో నడుస్తాయి. టిడిపిలో చంద్రబాబు చెప్పిందే శిలా శాసనం. బీఆర్‌ఎస్‌ సంగతి చెప్పాల్సిన పని లేదు. అది కేసీఆర్‌ కనుసన్నల్లోనే నడుస్తుంది. పార్టీ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఈ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్లు పైకి కనిపిస్తుంది. అది నేతిబీర కాయలో నేయి వంటిదే. 



ఈ పరిస్థితిలో జయాపజయాలకు కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణలో రెండు విడతలు కేసీఆర్‌ అధికారంలో ఉన్నారు. చంద్రబాబు మాత్రం ఒకే విడత అధికారంలో ఉన్నారు. దానికి కారణాలున్నాయి. తెలంగాణలో రెండో విడత ఎన్నికల్లో కేసీఆర్‌ విజయం సాధించడానికి పరోక్షంగా చంద్రబాబు సహకరించారు. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని టిడిపితో పొత్తు పెట్టుకోవడం అప్పటి టీఆర్‌ఎస్‌కు, ఇప్పటి బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. తెలంగాణ సెంటిమెంటు (Telangana sentiment)ను కేసీఆర్‌ బలంగా ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబే తెలంగాణలోనూ పాలన చేస్తారని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించడం, చంద్రబాబు ఆధిపత్యం పట్ల తెలంగాణ ప్రజలకు వ్యతిరేక ఉండడం వంటి అంశాల కారణంగా బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చంద్రబాబుతో కలిసి ఉండకపోతే అప్పుడే కాంగ్రెస్‌ బొటాబొటీ మెజారిటీతోనైనా కాంగ్రెస్‌ గెలిచి ఉండేదని అప్పట్లో అంచనాలు సాగాయి. 

చంద్రబాబు రెండో విడత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండిరది. వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ టిడిపికి బలమైన పోటీ ఇచ్చే స్థితిలో ఉంది. తెలంగాణ విడిపోయిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేదు. దాంతో పాటు మరిన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగుంటుందని అక్కడి ప్రజలు భావించారు. దానికి రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయి. బిజెపి (BJP), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నాయకత్వంలోని జనసేన (Jana Sena) టిడిపికి మద్దతు ప్రకటించాయి. పైగా జనసేన పోటీ కూడా చేయలేదు. ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ (Narendra Modi), పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీకి అప్పటికే దేశంలో సానుకూల వాతావరణం ఏర్పడి ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కూడా ప్రజలు భావించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని, దానివల్ల హైదరాబాద్‌ (Hyderabad)ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలు జరుగుతుందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు భావించారు. దాంతో ప్రజలు టిడిపీ వైపు మొగ్గు చూపారు.

అయితే, ఐదేళ్ల కాలంలోనే చంద్రబాబు పాలన ఏమిటో తేలిపోయింది. అమరావతి (Amaravati) రాజధాని పేర జరిగిన వ్యవహారాలు బెడిసికొట్టాయి. పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణం పెద్దగా ముందుకు సాగలేదు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు ఒక నిర్మాణాత్మకమైన మేలును ప్రజల ముందు పెట్టలేకపోయారు. ఆ రెండిరటిలో ఏది ఒక్కటయినా టిడిపి పట్ల సానుకూలత ఏర్పడి ఉండేది. పైగా, వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు కొత్త ఆశలు కల్పించారు. రెండో సారి ఎన్నికల్లో జనసేన, బిజెపి చంద్రబాబుతో కలిసి రాలేదు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాననే విధంగా చంద్రబాబు సందడి చేశారు. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తో వేదికలను పంచుకున్నారు. అది బెడిసికొట్టింది. చంద్రబాబు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. చంద్రబాబు ఏకపక్ష ధోరణి, వైఎస్‌ జగన్‌ మీద చేసిన వ్యక్తిగత దూషణ తప్ప రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు కొత్తగా ఆశలు కల్పించలేకపోయారు. శాసనసభలో అప్పుడు టిడిపి వ్యవహరించిన తీరు కూడా వ్యతిరేకంగానే పనిచేసింది. 

కేసీఆర్‌ విషయానికి వస్తే, ఉద్యమ నాయకుడు అధికారంలో ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నేరువేరుతాయని తెలంగాణ ప్రజలు విశ్వసించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ఆచరణలో సాధ్యం కాని హామీలు కూడా ఉన్నాయి. అధికారం చేపట్టిన కొత్తలో చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరించారు. వివిధ వర్గాలకు నగదు రూపేణా మేలు చేసే విధంగా వ్యవహరించారు. వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. నిపుణుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ తానే అన్నీ అయి వ్యవహరించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అన్నీ తానే అయి వ్యవహరించారు. ప్రగతి భవన్‌, సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్ర నిర్మాణానికి ఇవ్వలేకపోయారు. ప్రజలకు వివిధ పథకాల పేరు మీద నగదు పంపిణీ చేస్తే చాలు, తన వద్ద పడి ఉంటారని ఆయన భావించారు.

రాష్ట్రాన్ని నిర్మించడం పోయి పునర్నిర్మాణం పేరు ఎత్తుకున్నారు. ఈ విషయంలో ఆయన రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం పునర్నిర్మాణానికి ఇవ్వలేదు. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసే వ్యూహాలను పన్ని అమలు చేస్తూ వచ్చారు. తన వ్యూహంలో భాగంగా టిడిపిని తుడిచిపెట్టేశారు. తర్వాత మిగిలింది కాంగ్రెస్‌ ఒక్కటే. రెండుసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను తుడిచిపెట్టే ప్రయత్నాలు చేశారు. అందులో కొంత మేరకు ఆయన విజయం సాధించినట్లే కనిపించారు. కానీ, కాంగ్రెస్‌లాంటి పార్టీ, అదీ జాతీయ పార్టీని తుడిచిపెట్టడం సాధ్యం కాదనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు. బిజెపిని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టాలని చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. దానికి కారణాలున్నాయి. దాన్ని మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.

ఇక, నిరంకుశత్వం, అణచివేత, ఏకపక్ష ధోరణి తెలంగాణవ్యాప్తంగా అమలవుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకులను, వ్యక్తులను కూడా ఆయన ఏమీ కాకుండా చేసే పనికి ఒడిగట్టారు. కోదండరామ్‌ (Kodandaram) పట్ల ఆయన వ్యవహరించిన తీరు అందుకు ఉదాహరణ.  నిరసనలను సహించలేదు. ధర్నాచౌక్‌కు నామరూపాలు లేకుండా చేశారు. ప్రజల గొంతును వినే వారే ప్రభుత్వంలో కరువయ్యారు. మంత్రులపై, శాసనసభ్యులపై నియంత్రణ లేదు. వారికి కేసీఆర్‌ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, వారిని నియంత్రించలేదు. దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా భూముల వ్యవహారం వారు వ్యవహరించిన తీరు స్థానికంగా బీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకతకు కారణమైంది. ఇసుక తవ్వకాల వంటి చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాలంటే, ప్రజలను గాలికి వదిలేశారు.

రెండోసారి పాలనలో కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ (KTR) ఆధిపత్యంలోకి వచ్చారు. కేసీఆర్‌ చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కేటీఆర్‌ ప్రాబల్యంలోకి వచ్చారు. అనుభవరాహిత్యం, ఆధిపత్య ధోరణి వంటి లక్షణాలతో కేటీఆర్‌ వ్యవహరించారు. పార్టీ నాయకుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు అందుకు ఉదాహరణ. కొండా విశ్వేశ్వర రెడ్డితో మొదలు పెట్టి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వరకు వారిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎంత ఆధిపత్య ధోరణితో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్‌ను సానుకూలం చేసుకుంటే చాలు, తాము ఏమైనా చేయవచ్చునని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు భావించి స్థానికంగా విచ్చలవిడిగా వ్యవహరించారు. 

ఇక మంత్రులకు గొంతు లేకుండా పోయింది, తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా మంత్రులకు లేదు. ఏదైనా కేటీఆర్‌ నుంచి రావాల్సిందే. హైదరాబాద్‌లో వరదలు (Hyderabad floods) వస్తే అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ మాత్రమే ఏదైనా ప్రకటించాల్సిన పరిస్థితి. వారే ఏదైనా చేయాలి. ప్రజలకు అనేకన్నా, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులకు ప్రభుత్వం అందుబాటులో లేకుండా పోయింది. తమ గోడును వినిపించుకునే నాథుడే రాష్ట్రంలో లేకుండా పోయాడు. 

చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ఈసారి గెలుస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. కానీ బీఆర్‌ఎస్‌ ఆశలు మాత్రం నెరవేరవని కచ్చితంగానే చెప్పలేం. కేసీఆర్‌ మరో ఆరు నెలల్లోనో, ఏడాదిలోనో తిరిగి అధికారంలోకి వస్తారని ప్రచారం చేస్తున్న బ్యాచ్‌ ఒక్కటి ఉంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని నమ్మిన బ్యాచ్‌ ఒక్కటి ఉంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ఆ బ్యాచ్‌ అదే నమ్మకంతో వ్యవహరించింది. బీఆర్‌ఎస్‌ ఈ ఐదేళ్ల లోపే తిరిగి అధికారంలోకి వస్తుందనేది కల్ల మాత్రమే. ఒకవేళ్ల పరిస్థితులు ఏర్పడినా బిజెపి దానికి అడ్డం పడే రాజకీయాలు మాత్రమే నడుస్తాయి.

నోట్‌: చంద్రబాబుకు కేసీఆర్‌కు ఒక్క తేడా మాత్రం ఉంది. చంద్రబాబు ఇతరుల సలహాలు తీసుకుంటారు. కేసీఆర్‌కు అది కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇచ్చే, సూచనలు చేసే పెద్దలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అది కూడా ఏమీ ఆశించకుండా. వారిని కూడా కేసీఆర్‌ పట్టించుకోలేదు.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...