Sunday, March 17, 2024

కవిత అరెస్టు కేసీఆర్‌ రాజకీయాలకు ఊతం ఇస్తుందా? - Will kavitha arrest help KCR in Telangana Lok Sabha Election?

 కవిత అరెస్టు కేసీఆర్‌ రాజకీయాలకు ఊతం ఇస్తుందా?


Delhi మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను అరెస్టు చేయడం ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elction 2024) ప్రయోజనం పొందడానికి కవితను అరెస్టు చేశారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ (BRS) అధ్యక్షుడు కేసీఆర్‌ (KCR), ప్రధాని మోడీ (Narendra Modi) కుమ్మక్కులో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఏ మేరకు బీఆర్‌ఎస్‌కు ఉపయోపడుతుంది, బీజేపీ (BJP)కి ప్రయోజనం కలుగుతుందా అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 



అప్పట్లో కవితను అరెస్టు చేయకపోవడం వల్లనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో Telangana Assembly Election) బీజేపీ తగిన స్థానాలను సాధించలేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య అవగాహనలో భాగంగానే కవిత అరెస్టు కాలేదని అంటూ వచ్చారు. అది కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికేనని రేవంత్‌ రెడ్డి స్వయంగా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలసి పనిచేస్తాయని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తూ వస్తోంది. ఆ విమర్శలకు చెక్‌ పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనేది బీజేపీ ఎత్తుగడగా చెబుతూ వస్తున్నారు. 

కవిత అరెస్టుపై ఆమె తండ్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ప్రధాని మోడీ కూడా స్పందించలేదు. రాజకీయ నాటకంలో భాగంగానే వారిద్దరూ మాట్లాడలేదని రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (G Kishan Reddy) మాత్రం కవిత అరెస్టుతో తమకు సంబంధం లేదని, ఈ విషయంపై పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసు కూడా కాదని అన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను వెనక్కి తోసి రెండో స్థానంలో నిలువాలనే వ్యూహాలతో బీజేపీ పనిచేస్తున్నది. ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే తెలంగాణలో ప్రధానంగా పోటీ ఉంటుందనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అందులో వాస్తవం ఉంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) రాష్ట్ర నాయకులకు సూచించారు. అయితే, కవిత అరెస్టు బీజేపీకి అనుకూలించే స్థితి లేదు. బీఆర్‌ఎస్‌ తప్పిదాల వల్లనే బీజేపీ బలం పుంజుకుంది తప్ప సొంత కృషి వల్ల కాదు. ఈ ఎన్నికల్లో కవిత అరెస్టు బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు లేవు. పైగా, ఎన్నికల వేళ ప్రతిపక్షాల మీద ఈడీ, సీబీఐ దాడులు జరగడం సర్వసాధారణమనే అభిప్రాయం కూడా ఉంది. బీజేపీ ఎత్తుగడలు తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరొకరికి తెలిసి వుండవు. అందువల్ల కూడా బీజేపీకి ఏ మాత్రం ప్రయోజనం కలిగే సంఘటన కాదు.

ఇక బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే, ఆ పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకోవడం అనేది సాధ్యం కాదు. కవిత అరెస్టు వల్ల బీఆర్‌ఎస్‌పై సానుభూతి పెరిగే అవకాశాలు ఏమీ లేవు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉండిరదని, వారిని మార్చకపోవడం వల్లనే తాము తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  ఓటమి పాలయ్యామని, తనపై ప్రజలకు అభిమానం ఉందని కేసీఆర్‌ చెప్పారు. కానీ అందులో నిజం లేదు. కేసీఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్‌, కవితల వ్యవహారశైలిపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అది ప్రధాన కారణం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత దానికి తోడైంది. 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తిరిగి పుంజుకుంటుందనేది ఉత్తి మాటనే. గత పదేళ్ల పరిణామాలపై ఆత్మశోధన చేసుకుంటే కేసీఆర్‌కు గానీ కేటీఆర్‌కు గానీ ఆ విషయం అర్థమవుతుంది. వారు ఆ దిశలో ఆలోచన చేయడం లేదనేది కేటీఆర్‌ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోంది. ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు. అదే అహంకారపూరితమైన వ్యవహారశైలిని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత.. ముగ్గురు కూడా తమ పక్కన ఎల్లవేళలా నిలిచే వ్యక్తులను చేరదీయలేదు. కప్పదాటు వ్యక్తులను చేరదీసి వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది పెద్ద లోపం. అందువల్ల కవిత అరెస్టు బీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందనే అభిప్రాయం నిర్హేతుకమైంది, అత్యాశతో కూడుకుంది. 

కవితను అరెస్టు చేయడం తప్పు అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో లేదు. చాలా ఆలస్యంగా అరెస్టు చేశారనే అభిప్రాయం మాత్రమే ప్రబలంగా ఉంది. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయనే భావన ఉంది. ఏమైనా, కవిత అరెస్టు రాజకీయ కోణంలో జరిగితే మాత్రం అది వృధా ప్రయాస మాత్రమే.

- కాసుల ప్రతాపరెడ్డి (Kasula Pratap Reddy)

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...