Sunday, April 14, 2024

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

 చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం...


చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు (KT Rama Rao) వ్యవహారం చూస్తుంటే ఆ సామెత గుర్తుకు వస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కేటీఆర్ (KTR) వ్యవహారశైలి మారలేదు, ఆయనలోని అహంకారం తగ్గలేదు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఆయన తీరు మారలేదు. తెలంగాణ ప్రజలపై ఆయన తెలివితక్కువ వాళ్లు అనే ముద్ర వేశారు. ఈ వ్యాఖ్య చేయడంలో ఆయన ఆంధ్ర పెత్తందార్లను, రాజకీయ నాయకులను మించి ఆలోచన చేయలేకపోయారు. తెలంగాణపై అదే భావనతో ఆంధ్ర సంపన్నవర్గాలకు చెందినవారు పెత్తనం చేస్తూ వచ్చారు. దాన్ని వదిలించుకోవడానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టారు. తెలంగాణను తానే సాధించానని గొప్పలు చెబుకుంటున్న కేసీఆర్ ను ప్రజలు ఒక ఆలంబనగానే చేసుకున్నారు తప్ప ఒక్కడుగా ఆయన సాధించిందేమీ లేదు. అదీ కేసీఆర్ కలిసి వచ్చింది. 



తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ ను, కేటీఆర్ ను ఓపికతో తెలంగాణ ప్రజలు భరించారు. ఎందుకు భరించాల్సి వచ్చిందనేది వేరే చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు దఫాలు అధికారం చెలాయించిన కేసీఆర్ అనుసరించిన విధానాలు ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి, ఏ విధంగా నవ్వుల పాలు చేశాయనేది మరో చర్చ. వీటి లోతుల్లోకి వెళ్తే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ అన్నీ తానే అయి వ్యవహరించిన కేటీఆర్ నిర్వాకం కూడా పెద్ద చర్చనే. 

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఆశించింది వేరు కేసీఆర్ (KCR) చేసింది వేరనే విషయాన్ని కేటీఆర్ గ్రహించడానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుని వెళ్లడానికి కేసీఆర్ ఏ రోజు కూడా ప్రయత్నించలేదు. టీఆర్ఎస్ ను, ఆ తర్వాత బీఆర్ఎస్ ను ఫక్తు రాజకీయ పార్టీగానే నడిపారు. తెలంగాణ తత్వాన్నే కాదు, తెలంగాణ వాదాన్ని కూడా కేసీఆర్ వదిలేశారు. కేటీఆర్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

కేసీఆర్ చుట్టు అనాలో, కేటీఆర్ చుట్టు అనాలో తెలియదు గానీ వారి చుట్టూ ఆంధ్ర పెత్తందార్లు, ఆంధ్ర వ్యాపారవేత్తలు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర సినిమా ప్రముఖులు చేరారు. వారి ప్రయోజనాలే తెలంగాణ ప్రయోజనాలుగా నెరవేర్చారు. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో వారి పెత్తనమే నడిచింది. 

తెలంగాణ పునర్నిర్మాణం పేర ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ అంటే ఏమిటో తెలియనివారంతా అన్ని రంగాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. కానీ తెలంగాణ పునర్నిర్మాణం జరిగింది ఎక్కడ? తెలంగాణ ప్రజలు ఆశించిన కార్యాచరణ ఏది? చుట్టూ వందిమాగధులను చేర్చుకుని తదుపరి ముఖ్యమంత్రిని నేనే అంటూ బాకాలు ఊదించుకున్నారు. కేటీఆర్ కోటరీ గురించి విశ్లేషిస్తే అదో పెద్ద కథ అవుతుంది. అందువల్ల తెలంగాణలో రాష్ట్రం భ్రష్టు పట్టడంలో కేటీఆర్ పాత్ర అత్యంత ముఖ్యమైంది. 

తెలంగాణలో భూదందాలు జరిగిన తీరుపై అధ్యయనం చేస్తే అసలు గుట్టు అంతా బయటపడుతుంది. ధరణి (Dharani) పేరు మీద జరిగిన మోసాలు ఎన్నో, ఏ పాటివో, ఎటువంటివో కేటీఆర్ ఏనాడైనా ఆలోచించారా? లేదు. భూతల స్వర్గం చూపిస్తామని నమ్మించి తెలంగాణను గాలికి వదిలేసిన పాపం కేటీఆర్ ది కాదా? 

ఐదేళ్ల కేసీఆర్ పాలనను, ఐదేళ్ల కేటీఆర్ పాలనను చూసి ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు. ప్రజలు తమంత తాముగా ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోలేరు కాబట్టి ఉన్నదాంట్లో ప్రత్యామ్నాయన్ని చూసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు తెలివిగానే వ్యవహరించారు. పదేళ్ల పాటు తెలివితక్కువగా వ్యవహరించింది కేసీఆర్, కేటీఆర్. మొత్తం వారి నాయకత్వంలోని పార్టీకి ఆ తెలివితక్కువ తనాన్ని అంటగట్టడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే, ఎవరికీ రాష్ట్రంలో ఏ విధమైన హక్కులు లేవు. స్వేచ్ఛ లేదు. వారి మాటనే, వారి ఆచరణే తెలంగాణలో చెల్లుబాటు అయింది. 

- కాసుల ప్రతాపరెడ్డి


Sunday, March 17, 2024

కవిత అరెస్టు కేసీఆర్‌ రాజకీయాలకు ఊతం ఇస్తుందా? - Will kavitha arrest help KCR in Telangana Lok Sabha Election?

 కవిత అరెస్టు కేసీఆర్‌ రాజకీయాలకు ఊతం ఇస్తుందా?


Delhi మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను అరెస్టు చేయడం ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM), పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌ రెడ్డి (Anumula Revanth Reddy) అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elction 2024) ప్రయోజనం పొందడానికి కవితను అరెస్టు చేశారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ (BRS) అధ్యక్షుడు కేసీఆర్‌ (KCR), ప్రధాని మోడీ (Narendra Modi) కుమ్మక్కులో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఏ మేరకు బీఆర్‌ఎస్‌కు ఉపయోపడుతుంది, బీజేపీ (BJP)కి ప్రయోజనం కలుగుతుందా అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 



అప్పట్లో కవితను అరెస్టు చేయకపోవడం వల్లనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో Telangana Assembly Election) బీజేపీ తగిన స్థానాలను సాధించలేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య అవగాహనలో భాగంగానే కవిత అరెస్టు కాలేదని అంటూ వచ్చారు. అది కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికేనని రేవంత్‌ రెడ్డి స్వయంగా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలసి పనిచేస్తాయని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తూ వస్తోంది. ఆ విమర్శలకు చెక్‌ పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనేది బీజేపీ ఎత్తుగడగా చెబుతూ వస్తున్నారు. 

కవిత అరెస్టుపై ఆమె తండ్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ప్రధాని మోడీ కూడా స్పందించలేదు. రాజకీయ నాటకంలో భాగంగానే వారిద్దరూ మాట్లాడలేదని రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (G Kishan Reddy) మాత్రం కవిత అరెస్టుతో తమకు సంబంధం లేదని, ఈ విషయంపై పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసు కూడా కాదని అన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను వెనక్కి తోసి రెండో స్థానంలో నిలువాలనే వ్యూహాలతో బీజేపీ పనిచేస్తున్నది. ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే తెలంగాణలో ప్రధానంగా పోటీ ఉంటుందనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అందులో వాస్తవం ఉంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) రాష్ట్ర నాయకులకు సూచించారు. అయితే, కవిత అరెస్టు బీజేపీకి అనుకూలించే స్థితి లేదు. బీఆర్‌ఎస్‌ తప్పిదాల వల్లనే బీజేపీ బలం పుంజుకుంది తప్ప సొంత కృషి వల్ల కాదు. ఈ ఎన్నికల్లో కవిత అరెస్టు బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు లేవు. పైగా, ఎన్నికల వేళ ప్రతిపక్షాల మీద ఈడీ, సీబీఐ దాడులు జరగడం సర్వసాధారణమనే అభిప్రాయం కూడా ఉంది. బీజేపీ ఎత్తుగడలు తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరొకరికి తెలిసి వుండవు. అందువల్ల కూడా బీజేపీకి ఏ మాత్రం ప్రయోజనం కలిగే సంఘటన కాదు.

ఇక బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే, ఆ పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకోవడం అనేది సాధ్యం కాదు. కవిత అరెస్టు వల్ల బీఆర్‌ఎస్‌పై సానుభూతి పెరిగే అవకాశాలు ఏమీ లేవు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉండిరదని, వారిని మార్చకపోవడం వల్లనే తాము తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  ఓటమి పాలయ్యామని, తనపై ప్రజలకు అభిమానం ఉందని కేసీఆర్‌ చెప్పారు. కానీ అందులో నిజం లేదు. కేసీఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్‌, కవితల వ్యవహారశైలిపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అది ప్రధాన కారణం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత దానికి తోడైంది. 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తిరిగి పుంజుకుంటుందనేది ఉత్తి మాటనే. గత పదేళ్ల పరిణామాలపై ఆత్మశోధన చేసుకుంటే కేసీఆర్‌కు గానీ కేటీఆర్‌కు గానీ ఆ విషయం అర్థమవుతుంది. వారు ఆ దిశలో ఆలోచన చేయడం లేదనేది కేటీఆర్‌ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోంది. ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు. అదే అహంకారపూరితమైన వ్యవహారశైలిని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత.. ముగ్గురు కూడా తమ పక్కన ఎల్లవేళలా నిలిచే వ్యక్తులను చేరదీయలేదు. కప్పదాటు వ్యక్తులను చేరదీసి వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది పెద్ద లోపం. అందువల్ల కవిత అరెస్టు బీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందనే అభిప్రాయం నిర్హేతుకమైంది, అత్యాశతో కూడుకుంది. 

కవితను అరెస్టు చేయడం తప్పు అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో లేదు. చాలా ఆలస్యంగా అరెస్టు చేశారనే అభిప్రాయం మాత్రమే ప్రబలంగా ఉంది. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయనే భావన ఉంది. ఏమైనా, కవిత అరెస్టు రాజకీయ కోణంలో జరిగితే మాత్రం అది వృధా ప్రయాస మాత్రమే.

- కాసుల ప్రతాపరెడ్డి (Kasula Pratap Reddy)

Saturday, March 16, 2024

Delhi liquor scam: కథ నడిపిందంతా కల్వకుంట్ల కవితనే- Delhi excise policy scam: Main conspirator Kalvakuntla Kavitha

 Delhi లిక్కర్‌ స్కామ్‌: కథ నడిపిందంతా కల్వకుంట్ల కవితనే


Delhi మద్యం కుంభకోణాన్ని Delhi excise policy scam) నడిపిందంతా బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్‌ (KCR) తనయ కల్వకుంట్ల కవిత (kalvakuntla Kavithaనే అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) (ఈడి) తెలిపింది. కవిత రిమాండ్‌ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. సౌత్‌ లాబీ (South Lobby) పేరుతో లిక్కర్‌ స్కాంలో కవిత కీలకంగా వ్యవహరించారని తేల్చింది. Delhi మద్యం కుంభకోణంలో కీలక కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కూడా ఆమెనే అని చెప్పింది. 



కవిత కస్టడీ రిపోర్టు ప్రకారం.... ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadami party) (ఆప్‌)కి కవిత లిక్కర్‌ స్కామ్‌ ముడుపుల కింద వంద కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy)తో కలిసి ఆప్‌ నేతలతో కవిత కుట్ర చేశారు. కవితకు బినామీగా వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ఉన్నారు. రామచంద్ర పిళ్లై ద్వారా కవిత వ్యవహారమంతా నడిపించారు. ఆయనను డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్‌ కంపెనీలో కవిత వాటా పొందారు. 

ఇతరులతో కలిసి కవిత ఆప్‌ (AAP) నేతలకు వంద కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు. కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్‌లోని ఆధారాలను తొలగించారు. సౌత్‌ గ్రూప్‌లోని శరత్‌ చంద్రారెడ్డి మాగుట శ్రీనివాసులు రెడ్డి, మాగంట రాఘవరెడ్డిలతో కలిసి ఆప్‌ నేతలతో కవిత కుట్రలు పన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా కవిత రూ.30 కోట్లు ఢల్లీికి చేర్చారు. రూ.30 కోట్లు అభిషేక్‌ బోయినపల్లి హస్తినకు తీసుకుని వెళ్లాడు.

ఇదిలావుంటే, కోర్టు కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆమెను విచారించాలని, విచారణను వీడియోలో రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ నెల 23 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆమెను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.

కవితకు మరో షాక్‌ తగిలింది. ఆమె భర్త (Kavitha husband) అనిల్‌ (Anil), పీఆర్‌వో రాజేశ్‌ సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారంనాడు తమ విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఇప్పటికే వారి మొబైల్స్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో వాటిని స్వాధీనం చేసుకుంది. 

Friday, March 15, 2024

కవితను ఎందుకు అరెస్టు చేశారంటే... ఆర్డర్‌ ఇదీ... ED asst Director Joginder order on Kavitha arrest in Delhi liquor scam

 కవితను ఎందుకు అరెస్టు చేశారంటే... ఆర్డర్‌ ఇదీ...


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ (BRS MLC), కేసీఆర్‌ (KCR) కూతురు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఆమెను సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆమె అరెస్టు సమాచారాన్ని భర్తకు తెలియజేసినట్లు తెలిపారు. ఈడీ (ED) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగీందర్‌ (Joginder) పేరుతో ఈరెస్టు ఆర్డర్‌ను జారీ చేశారు. 



‘‘ఎమ్మెల్సీ కవిత.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ యాక్ట్‌) ` 2002 కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు నా వద్ద కారణాలు ఉన్నాయని ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న జోగీందర్‌ అనే నేను తెలియజేస్తున్నాను. మనీ ల్యాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 19లోని సబ్‌ సెక్షన్‌ (1) కింద నాకున్న అధికారాల మేరకు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తున్నానని తెలియజేస్తున్నాను. సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేశాం. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశాం’’ అని నోటీసులో వివరించారు.

ధైర్యం చెప్పిన కేటీఆర్‌

అరెస్టు చేసిన తర్వాత కవిత తన నివాసం వద్దకు వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కవిత అరెస్టు చేసిన సమయంలో అక్కడే ఉన్న సోదరుడు కేటీఆర్‌ (KTR) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నేనున్నా అన్నీ చూసుకుంటానని ఆయన ధైర్యం చెప్పారు. కవితను ఈడీ అధికారులు హస్తినకు తరలిస్తున్న సమయంలోనే కేటీఆర్‌ కూడా ఢల్లీికి బయలుదేరారు. 

కవిత స్పందన ఇదీ...

తన అరెస్టుపై కవిత స్పందించారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కుంటామని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని ఆమె కోరారు. కవిత అరెస్టును కార్యకర్తలు, అభిమానులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై లాఠీచార్జీ చేసి, రూట్‌ క్లియర్‌ చేసి ఆమెను శంషాబాద్‌ విమానాశ్రయానికి తరలించారు. 

అమిత్‌ అరోరా సమాచారంతోనే...

అమిత్‌ అరోరా (Amit Arora) ఇచ్చిన సమాచారంతోనే కవితను ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. Delhi మద్యం కేసు (Delhi liquor scam)లో సౌత్‌ లాబీపై అతను సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అతన్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రేపు (శనివారంనాడు) అమిత్‌ అరోరా సమక్షంలో కవితను విచారించే అవకాశం ఉంది. 

సౌత్‌ గ్రూప్‌ (South Group)లో కవిత కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సౌత్‌ గ్రూప్‌లో వాణిజ్యవేత్త శరత్‌ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy), ఆయన కుమారుడు రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. వీరిలో శరత్‌ రెడ్డి, రాఘవరెడ్డి అప్రూవర్స్‌గా మారారు. అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు ద్వారా సౌత్‌ గ్రూప్‌ వ్యవహారం నడిపినట్లు దర్యాప్తులో తేలింది.

కేసీఆర్‌కు భారీ షాక్‌: ఎన్నికల వేళ కవిత అరెస్టు: BRS MLC, KCR daughter Kalvakuntla Kavitha arrested in Delhi liquor scam

కేసీఆర్‌కు భారీ షాక్‌: ఎన్నికల వేళ కవిత అరెస్టు


లోక్‌సభ ఎన్నికల వేళ (Lok Sabha Elections 2024) బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు భారీ షాక్‌ తగిలింది. ఆయన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  (Enforcement Directorate) (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. Delhi మద్యం కుంభకోణం (Delhi liquor Scam) కేసులో ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఈడీ (ED) అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్న కారణంగా తాను హాజరు కాలేనని చెబుతూ వచ్చారు. 



సోదాల సమయంలో కవిత నివాసానికి మాజీ మంత్రులు హరీష్‌ రావు (Harish Rao), కేటీఆర్‌ (KTR) చేరుకున్నారు. కేటీఆర్‌ ఈడీ అధికారులతో వాదనకు దిగారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ట్రాన్సిట్‌ అరెస్టు వారంట్‌ లేకుండా కవితను ఎలా హస్తినకు తరలిస్తారని కూడా ఆయన అడిగారు. సుప్రీంకోర్టులో అండర్‌ టేకింగ్‌ ఇచ్చి కూడా అరెస్టు చేయడమేమిటని ఆయన వాదించారు. అయితే, అవేమీ పట్టించుకోకుండా కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి, Delhiకి తరలించే ఏర్పాట్లు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఓ వైపు మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహిస్తున్న సమయంలోనే కవిత అరెస్టు అయ్యారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కవిత ఉదంతంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు బీజేపీతో ఉన్న రహస్య అవగాహన కారణంగానే కవితను అరెస్టు చేయలేదని అప్పట్లో విమర్శించారు. ఆ కారణంతోనే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వంటివారు బీజేపీలో చేరలేదు.

Delhi మద్యం కుంభకోణంలో కవిత కీలక పాత్ర వహించారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఆమెను అరెస్టు చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన స్థితిలో కవిత అరెస్టు కావడం కేసీఆర్‌ పెద్ద దెబ్బనే. 

Monday, March 4, 2024

మానవ సంబంధాలపై అలవి మాలిన ఆపేక్ష - forward on Sayed Gaffar's Kurbaani Telugu short stories

మానవ సంబంధాలపై అలవి మాలిన ఆపేక్ష


సయ్యద్‌ గఫార్‌ (Syed Gaffar)తో నా పరిచయం కొద్ది మాత్రమే. మరి ఎందుకో తన కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమని అడిగాడు. ఆయన కథలను గతంలో నేను చదివిన గుర్తు లేదు. అయినప్పటికీ బలవంతం మీద అంగీకరించాను. కథలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతూనే దానికి ఒప్పుకున్నాను. కథలు చదివిన తర్వాత నా అంగీకారం వల్ల అసంతృప్తి గురికావాల్సిన అవసరం లేదని అర్థమైంది. పైగా, సయ్యద్‌ గఫార్‌పై ఓ విధమైన అభిమానం కూడా ఏర్పడిరది. అందుకు కారణం ఆయన తన కథలకు ఎన్నుకున్న వస్తువులు, ఆ వస్తువులను నిర్వహించిన తీరు నాకు చాలా నచ్చింది. మొత్తంగా కథలన్నింటిలో మానవ సంబంధాల పట్ల ఓ ప్రేమపూరితమైన ఆపేక్ష ఉంది. అందులోనూ పేద కులాల మధ్య, మతాల మధ్య వున్న సంబంధాలు కళ్లకు కట్టినట్లున్నాయి. నా చిన్నతనంలో మా వూళ్లో చూసిన, అనుభవించిన అనుబంధాలు మరోసారి గుర్తుకు వచ్చి కళ్లు చెమ్మగిల్లాయి. 

సయ్యద్‌ గఫార్‌ నాకు పెద్దగా పరిచయం లేనంత మాత్రాన సాహిత్య ప్రపంచానికి కొత్తవాడేమీ కాదు. ఖుర్బానీ అనే ఈ కథ సంపుటిని పాఠకలోకానికి అందించడానికి ముందే ఆయన కవిగా ప్రసిద్ధుడు. ప్రసిద్ధుడు అని ఎందుకు అంటున్నానంటే ఆయన కవితా సంపుటికి జనన వాంగ్మూలం అనే పేరు పెట్టాడు. ఈ దేశంలో ముస్లింగా పుట్టినందువల్ల అదనంగా మోస్తున్న బరువును, అపనిందలను ఆయన ఆ కవిత్వంలో వ్యక్తీకరించాడు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పరిణామాలు అయోధ్యలో రామాలయ నిర్మాణం దాకా చోటు చేసుకున్నాయి. రాజకీయాలు కేవలం మతాన్ని ఆసరా చేసుకుని ముందుకు సాగుతున్న నేటి పరిస్థితుల్లో సయ్యద్‌ గఫార్‌ ఆవేదన నిత్యం మండుతున్న కొలిమిలాంటిది. 

కవిత్వంలో భావోద్వేగాలు ఉంటాయి. కథల్లో ఆ భావోద్వేగాలు కార్యకారణ సంబంధాలతో వ్యక్తమవుతాయి. ఆ ఎరుకతోనే రాసిన కథలు ఎక్కువగా ఖుర్బానీలో ఉన్నాయి. గఫార్‌ కథలు చదువుతుంటే మా ఊరిలో ముస్లిం కుటుంబాలతో ఉండే అనుబంధాలు, వారితో పంచుకున్న ఆప్యాయతలు కళ్ల ముందు మెదిలాయి. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో ఎంఎ తెలుగు సాహిత్యం చదువుతున్న రోజుల్లో ఠాగోర్‌ ఆడిటోరియం పార్కులో జరిగిన కొద్దిపాటి పరిచయానికే ఓ ముస్లిం కుటుంబ సభ్యులు మా పట్ల చూపి ఆప్యాయత గుర్తుకు వచ్చింది. ఇందిరా గాంధీ హత్య జరిగిన రోజున హాస్టల్‌ విద్యార్థుంతా టీవీకి అతుక్కుపోయి హాల్‌లో నించోవడానికి కూడా సందులేని పరిస్థితిలో నేనూ నా క్లాస్‌మేట్‌, వరుసకు సోదరుడు అయిన సోమిరెడ్డి రాజిరెడ్డి కలిసి వారాసిగుడా వీధుల్లో తిరుగుతున్నాం. ఆ స్థితిలో మమ్మల్ని చూసి ఆ కుటుంబం మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించి, మా చేత బిర్యానీ తినిపించి, ఆ తర్వాత పాన్లు కూడా కట్టించి ఇప్పించిన సంఘటన సజీవ దృశ్యంగా కదలాడిరది. వాళ్లు చూపిన ఆప్యాయతకు, మేం స్వీకరించిన విందుకు ఏ విధమైన మతం కూడా అడ్డురాలేదు. గఫార్‌ కథలు చదువుతుంటే మా ఊళ్లోని హకీం మామనే కాదు, మిత్రులు సలీం, ఖలీల్‌ ఇంకా ఎంతో మంది ఆప్యాయతానురాగాలు, వారితో పెనవేసుకుపోయిన బాంధవ్యాలు గుర్తుకు వచ్చాయి. ఆ పాఠశాల అటెండర్‌ షంషుద్దీన్‌, బషీరుద్దీన్‌ సార్‌ చూపిన ప్రేమానురాగాలు యాదికి వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి.

ఖుర్బానీ (Khurbaani) కథా సంపుటిలోని చాలా కథలు మతాలకు అతీతమైన మానవ సంబంధాలను చిత్రించాయి. శూద్రకులాలకు, ముస్లింలకు మధ్య ఉండే ఆప్యాయతలను, అనుబంధాలను వ్యక్తీకరించాయి. ముఖ్యంగా పేద కులాలకు, ముస్లిం కులాలకు మధ్య ఉండే అనురాగపూరితమైన పలకరింపులకు, పరస్పరం కష్టసుఖాలను పంచుకునే స్నేహపూర్వక సంబంధాలకు ఈ కథలు ప్రతీకగా నిలుస్తాయి. 

గఫార్‌ కథాసంపుటిలో ఖుర్బానీ కథ విశిష్టమైంది. శూద్ర కులాలతో ముస్లిం కుటుంబం అనుబంధాన్ని గుర్తు చేసే కథ ఇది. బక్రీద్‌ కోసం ఖుర్బానీ ఇవ్వడానికి డబ్బులు పోసి తెచ్చుకున్న యాటపోతును పక్కనుండే రాములమ్మ కుటుంబం కోసం తిరిగి ఇచ్చేసి ఆ డబ్బులను త్యాగం చేసిన బిలాల్‌ కుటుంబం కథ. దానికితోడు, యాటపోతును మల్లయ్య చాలా తెలివిగా అప్పుగా ఇచ్చినట్లు కాకుండా డబ్బులు ఇచ్చి బిలాల్‌ కుటుంబానికి తిరిగి ఇచ్చేసిన ఆప్యాయత. మతాలు వేరైనా, కులాలు వేరైనా అందరిలోనూ పారేది రక్తం ఒక్కటేనని చెప్పిన కథ ఖుర్బానీ. 

ఉల్టాబాజా మరో విశిష్టమైన కథ. ఉల్లాబాజా అంటే చావు డప్పు. మాదిగ గూడెంలోని మట్టిగాడు మరణిస్తే అగ్రకుల రాజకీయాలన్నీ ప్రవేశించి అంత్యక్రియలకు సహకరించని నేపథ్యంలో ఓ ముస్లిం కుటుంబం ముందుకు వచ్చి ధైర్యంగా చావుడప్పుతో అంత్యక్రియలు చేస్తుంది. ముస్లిం కుటుంబాలకు, దళిత కుటుంబాలకు మధ్య గల అనుబంధాన్ని తెలియజేసిన కథ ఇది. ముస్లింలు ఈ దేశం మూలవాసులేనని చెప్పే ఆత్మీయ చిత్రీకరణను ఈ కథ చెప్పుతుంది. 

రాజకీయాలు మతాన్ని ముందుకు తెచ్చి చిచ్చు పెట్టి ముస్లింలకు, దళితులకు లేదా శూద్రకులాలకు మధ్య విభేదాలు సృష్టిస్తే అవి నిలిచేవి కావని తెలియజేసిన కథ నషా. ముస్లిం, దళిత కుటుంబాలకు మధ్య ఉండే అనుబంధాన్ని ఆత్మీయంగా చిత్రించిన కథ ఇది. నిలిచేది మానవత్వం, మానవీయ బంధాలు మాత్రమేనని చెప్పిన కథ. ‘ఒకనాటి మాట కాదు’ కథ కూడా హిందూముస్లిం కుటుంబాల మధ్య ఉన్న అనురాగ బంధాలను తెలియజేసే కథ. మొత్తంగా ముస్లిం, శూద్రకులాల మధ్య ఉండే అనుబంధాన్ని, ఆప్యాయతను గఫార్‌ అద్భుతమైన శిల్పంతో చిత్రించారు. అయోధ్య సంఘటన నేపథ్యంలో గఫార్‌ కథలు మానవ సంబంధాలపై అలవి మాలిన ఆపేక్షను కురిపిస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే, మత రాజకీయాలు నగరాలూ పట్టణాలూ దాటి గ్రామాల్లోకి కూడా ప్రవేశిస్తున్న చారిత్రక సందర్భంలో అత్యవసరమైన సాహిత్యంగా గఫార్‌ కథలను చెప్పవచ్చు, ఈ స్థితిలో ఇటువంటి సాహిత్యం ఇంకా రావాల్సే ఉంది. 

ఇకపోతే,న ఇతర కథల వద్దకు వద్దాం. సమాజంలోని అట్టడుగువర్గాల జీవితాలను గఫార్‌ కథలుగా మలిచాడు. అటువంటి కథల్లో హంస, ప్రశ్నించే నీడ కథలు దేనికదే ప్రత్యేకమైంది. హంస కథలో వీధిలో ఖాళీ సీసాలు, చిత్తు ఏరుకునే అక్కాతముళ్లకు చదువుపై గల మమకారాన్ని, చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్షను తెలియజేస్తూ అవి సాకారం కావడానికి తోడ్పడే మనుషులు ముందుకు రావడంతో కథ ముగుస్తుంది. ఒక సానుకూలమైన ముగింపుతో కథ పూర్తవుతుంది. ప్రజల్లోని మానవీయ దృక్పథంపై గల ఆశను రచయిత చిత్రించాడు. ఇది రచయిత ఆకాంక్ష. కొన్ని సందర్భాల్లో అటువంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రశ్నించే నీడ కథలో ఆకలి దేనికైనా ప్రేరేపిస్తుందని, దాన్ని గొప్పవాళ్లమని భావించే వాళ్ల ఇతరేతర ఆకలిని తీరుస్తుందని, సమాజంలో ద్వంద్వ ప్రవృత్తి గలవారు ఉంటారని చెప్పిన కథ. ‘మరో ప్రేమ కావ్యం’ కథ సమాజంలోని అట్టడుగు వర్గాల్లోని ప్రేమబంధాలు ఆధిపత్య, సంపన్న వర్గాల మోసానికి గురవుతాయయో చెప్పుతుంది. గఫార్‌ బడుగు, బలహీన వర్గాలపై అనంతమైన ప్రేమతో రాసిన కథలు అవి.

ఇక, ‘బండి కదిలింది’ అనే కథ స్త్రీపురుష సంబంధాలను చిత్రించిన కథ. ఒక రకంగా స్త్రీపురుష సంబంంధాన్ని వినూత్నమైన దృక్పథంతో చెప్పాడు గఫార్‌. ‘రంగులవల’ కథ సినిమాలపై మక్కువతో ఆస్తులన్నీ కరగదీసుకున్న వ్యక్తి కథ. ఇటువంటి సంఘటనలు సమాజంలో తరుచుగా జరిగేవే. ‘కలవరింత’, ‘పరిష్కారం’, ‘మూడో నెల’ కథలు కొంత హాస్యస్పోరకమైనవి, సాధారణమైవి. అయితే, శిల్పరీత్యా మంచి కథలు.

మొత్తంగా గఫార్‌ కథలు ప్రస్తుత సమాజానికి అవసరమైనవి. ఎక్కడా వివక్షను కసితోనో, ఆగ్రహంతోనో రచయిత వ్యక్తం చేయలేదు. తాను తెర వెనక ఉండి పాత్రలు సజీవంగా సంచరిస్తూ తమ తమ జీవితాలను వ్యక్తీకరిస్తాయి. రచయిత జోక్యం లేకపోవడం, పాత్రలు కూడా ఈర్ష్యాద్వేషాలను, ఆగ్రహాలను వ్యక్తం చేయకపోవడం చూస్తాం. ఇటువంటి ప్రేమపూరితమైన కథలను రాసిన గఫార్‌ అభనందనీయడు. అయితే, రచనలో ఇంకాస్తా క్లుప్తత పాటిస్తే ఇంకా మంచి కథలు అయి ఉండేవి. ఈ పుస్తకంలోని కథలను చదివితే గఫార్‌ మానవీయ దృక్పథం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.


- కాసుల ప్రతాపరెడ్డి
(‘సయ్యద్‌ గఫార్‌ ‘ఖుర్బానీ’ కథల సంపుటికి రాసిన ముందుమాట)

Thursday, February 22, 2024

చంద్రబాబుతో కాదు, యుద్ధం రామోజీరావు, జగన్‌లకు మధ్యనే... - AP Assembly Elections 2024: Ramoji fights with YS Jagan, not Chandrababu

 చంద్రబాబుతో కాదు, యుద్ధం రామోజీరావు, జగన్‌లకు మధ్యనే...


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024) కూడా జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలను పక్కన పెడితే ఏపీ శాసనసభ ఎన్నికలే ప్రధానం కానున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేస్తూ యుద్ధరంగంలోకి దిగారు. ఇప్పటికే పలు విడతలుగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించి మూడు సిద్ధం సభల్లో పాల్గొన్నారు. 




టీడీపీ, జనసేన కూటమి (TDP- Jana Sena alliance) బిజెపి (BJP)తో పొత్తు కోసం ఇంకా ఎదురు చూస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో చేరే విషయాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం తేల్చడం లేదు. ఒక రకంగా ప్రతిష్టంభన ఏర్పడిరది. బిజెపి తమతో కలిసి వస్తుందని చెప్పుతూ ఆ రెండు పార్టీలు కొద్ది సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ, వారు ఇంకా యుద్ధరంగంలోకి అడుగుపెట్టనట్లే లెక్క. యుద్ధరంగంలోకి దిగడానికి ఆ రెండు పార్టీలు ఇంకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన జనసేన, టీడీపి కలిసి తాడేపల్లిగూడెంలో నిర్వహించే సభతో యుద్ధరంగంలోకి దిగవచ్చు. 

అయితే, ఈసారి ఏపి ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఎన్నికలు టీడీపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)కి, వైఎస్‌ జగన్‌కు మధ్య జరుగుతున్నట్లు అనిపించడం లేదు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawn Kalyan) వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పుతున్నప్పటికీ, ఆ కూల్చే పనిని ఈనాడు (Eenadu) అధినేత రామోజీరావు (Ramoji rao) భుజాల మీదికి ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు, రామోజీరావుకు మధ్య జరుగుతున్న వార్‌ మాదిరిగా ఈ ఎన్నికల చిత్రం రూపుకడుతోంది. 

రామోజీరావు తెలుగుదేశం పార్టీ (Telugu Desam)కి అనుకూలంగా వ్యవహరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి మాదిరిగా ఆయన వ్యవహరించేవారు కాదు, ఇప్పటి మాదిరిగా తన ఈనాడు పత్రికను వాడలేదు. అందరికీ చెందిన పత్రిక లాగా ఈనాడు కనిపించేది. వార్తాకథనాల్లో లాజిక్‌ ఉండేది. తటస్థులు కూడా నమ్మడానికి వీలైన రీతిలో వార్తాకథనాలు ఉండేవి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు ఈనాడు దినపత్రిక అలా కనిపించడం లేదు. పూర్తిగా అన్నీ వదిలేసి జగన్‌ను ఓడిరచేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది. చంద్రబాబు కన్నా, పవన్‌ కల్యాణ్‌ కన్నా ఎక్కువగా ఎక్కువగా జగన్‌ను ఓడిరచే బాధ్యతను రామోజీరావు మోస్తున్నట్లు కనిపిస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం ఒక్కటో, రెండో వార్తాకథనాలను ఈనాడు దినపత్రిక ప్రచురిస్తున్నది. జగన్‌ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక వార్తాకథనాలను రాయడం సులభమే అవుతుంది. కానీ, ఆ వార్తాకథనాల్లో ఏ మాత్రం సత్యం ఉండడడం లేదని, వాస్తవాలను మరుగు పరిచి రామోజీరావు దుమ్మెత్తిపోస్తున్నారని, ఈనాడులో వచ్చేవన్నీ కట్టుకథలేనని వైఎస్‌ జగన్‌ వర్గం, వైసీపీ నాయకత్వం భావిస్తున్నది. అందుకు విరుగుడుగా సాక్షి మీడియా (Sakshi Media)ను వాడుతున్నారు.

ఫ్యాక్ట్‌ చెక్‌ (Fact Check) పేరు మీద ఈనాడు వార్తాకథనాలను ఖండిరచడమే పనిగా సాక్షి మీడియా పనిచేస్తున్నది. రామోజీరావు ఈనాడులో ప్రచురితమైన వార్తాకథనాలు ఎంత అబద్ధమో చెప్పుతూ సాక్షి దినపత్రిక వార్తాకథనాలను ప్రచురిస్తున్నది. అటు ఈనాడు వంత పాడుతున్న తెలుగుదేశం పార్టీ హార్డ్‌కోర్‌ భక్తులు ఎంత మంది ఉన్నారో, వైఎస్‌ జగన్‌ను బలపరిచే హార్డ్‌కోర్‌ భక్తులు అంతే ఉన్నారు. వారు తమకు నచ్చినదాన్ని చదువుతారు. వాటినే నమ్ముతారు. కానీ తటస్థులైన పాఠకుల సంగతి ఏమిటనేది ప్రశ్న. వాస్తవాలను వారు ఎక్కడ వెతుక్కోవాలనేది సమస్య. 

దాన్ని అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మనబడి నాడు.. నేడు (Mana Badi Nadu - Nedu) అనే పథకాన్ని ఉదాహరణగా తీసుకుందాం. రాష్ట్రంలోని పాఠశాలలను ప్రభుత్వం విడతలవారీగా ఆధునీకరిస్తూ, వాటిలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ఆ పథకం అమలు ఇంకా కొనసాగుతున్నది. ఓ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను వేసి ఈనాడు వార్తాకథనం రాసింది. పాఠశాలల దుస్థితి ఇలా ఉందనేది ఆ వార్తాకథనం సారాంశం. అయితే, పాఠశాలను పునరుద్ధరించే కార్యక్రమం అమలు కొనసాగుతున్నది. అందుకు గాను పిల్లలను బయట కూర్చోబెట్టి భవన నిర్మాణం జరుతున్నదని, దాన్ని పట్టించుకోకుండా ఈనాడు కావాలని అబద్ధం రాతలు రాసిందని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనం రాసింది. 

మరో తాజా సంఘటననే తీసుకుందాం... కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (katasani Rambhupal Reddy)పై ఈనాడు ఓ వార్తాకథనం ప్రచురించింది. వంద కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించారనేది ఆ వార్తాకథనం ముఖ్యాంశం. అయితే, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై ఈనాడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, రామోజీరావుకు సవాల్‌ కూడా విసిరారు. నిజానికి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఇచ్చిన సమాధానాన్ని ఈనాడు ప్రచురించాలి. లేదా తాను రాసిన వార్తాకథనం వాస్తవమే అయితే, ఆధారాలను చూపిస్తూ ఆయనకు జవాబు ఇవ్వాలి. ఆ పని ఈనాడు చేసిందా?

ఇదిలావుంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేవారు. అయితే, ఆయన హయాంలో ఈ పత్రికలు ఇంతగా యుద్ధం ప్రకటించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పత్రికలు రాసే వార్తాకథనాల్లో కొంత హేతుబద్ధత, లాజిక్‌ కనిపించేవి. కానీ, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాస్తున్న రాతల్లో అవి కూడా కనిపించడం లేదు. అంటే, పూర్తిగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పోరాటాన్ని అలా ఉంచి, సొంతంగా వైఎస్‌ జగన్‌ మీద ఆ పత్రికలు యుద్ధం ప్రకటించాయని చెప్పాలి. 

సాక్షి మీడియా రాక ముందు ఈనాడుకు తిరుగు ఉండేది కాదు. కానీ, సాక్షి వచ్చిన తర్వాత ఈనాడు ఏదో కొంత మేరకు కళ్లెం పడుతూ వస్తున్నది. సాక్షి మీడియా వైఎస్‌ జగన్‌ది కాబట్టి ఆయనకు, ఆయన పార్టీకి వంత పాడుతుందనే అభిప్రాయం ఉండడం సహజం. 

ఈనాడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ పత్రిక కాదు. దానివల్ల దానికి ఒకింత తటస్థ మీడియా అనే పేరు ఉంటూ వచ్చింది. వార్తాకథనాల్లో హేతుబద్ధత ఉంటుందనే అభిప్రాయం ఉంటూ వచ్చింది. కానీ, ఈ ఎన్నికల వేడి ప్రారంభమైన తర్వాత ఈనాడుకు ఆ విలువ నశించింది. పూర్తిగా చంద్రబాబు పత్రికగా మారిపోయింది. దీన్ని పాఠకులు గమనించకపోరు. అది బహుశా రామోజీరావుకు పట్టించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆయన వైఎస్‌ జగన్‌ను పరాజయం పాలు చేయడమే ముఖ్య కార్యక్రమంగా, తన బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి. ఈనాడు పూర్తిగా విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నది. పత్రిక పట్ల రామోజీరావు తన నిబద్ధతను వదిలేసినట్లు కనిపిస్తున్నారు. 

ఏమైనా, తెలుగు మీడియా అనేది ప్రస్తుతం రంగులు పులుముకుని, ఏదో ఒక పార్టీకి బాకాగా మారిపోయింది. అందువల్ల వాస్తవాలు ప్రజలకు చేరి వేసి, వారికి సరైన మార్గనిర్దేశం చేసే పరిస్థితిని కోల్పోయాయి. ప్రజలు వాస్తవాలను, సత్యాలను మరో చోట వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిరది. జగన్‌ ప్రభుత్వం బాగుందా, బాగా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. చంద్రబాబు, జనసేన కూటమిని గెలిపించాలా, వద్దా అనేది వారు తేల్చుకుంటారు. జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నామని భావించే ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారు. లేదంటే ప్రతిపక్షంవైపు మొగ్గు చూపుతారు. ఈ స్థితిలో రామోజీరావు ఈనాడు దినపత్రిక మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని వార్తాకథనాలను రాస్తున్నట్లు కనిపిస్తున్నది. వారి మద్దతును జగన్‌ కోల్పోయే పరిస్థితిని తీసుకురావాలనేది రామోజీ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు చంద్రబాబుకు, జగన్‌కు మధ్య జరగడం లేదని, రామోజీరావుకూ జగన్‌కూ మధ్య జరుగుతున్నవని అనిపిస్తున్నది. 

- కాసుల ప్రతాపరెడ్డి

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...